సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ పాక్షిక మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏ హామీలైతే ఆచరణ సాధ్యం కావని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారో వాటినే ఇప్పుడు కేసీఆర్ కాపీ కొట్టారని గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క హామిని కూడా పూర్తి చేయని కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. అందుకనే ఏడాదికాలంగా కాంగ్రెస్ ప్రకటిస్తున్న అంశాలనే కేసీఆర్ మేనిఫెస్టోగా ప్రకటించారనీ, అంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా అని ఎద్దేవా చేశారు. (టీఆర్‌ఎస్ పాక్షిక మేనిఫెస్టో ఇదే)
తమ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలనే కేసీఆర్ ప్రకటించడం కాంగ్రెస్ విజయాన్ని ఒప్పుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఎన్ని అమలు చేసింది చెప్పకుండా కేసీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టారని చురకలంటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు భృతి ఇస్తామంటే.. ‘ఎలా సాధ్యం, యువత మొత్తం నిరుద్యోగులుగా మారిపోతారని టీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. కానీ ఇప్పుడు మా మాటలే మక్కీకి మక్కీ దించారు. నిరుద్యోగ భృతి 3016/- అని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావ అని కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలే స్పష్టం చేస్తున్నాయి’ అని ఉత్తమ్ నిప్పులు చెరిగారు.
రైతు ఋణాలను ఏకకాలంలో మాఫీ చేయని కేసీఆర్.. ధరల స్థిరీకరణ నిధి గురించి మాట్లాడుతున్నాడు. కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి ఈ పనులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని 2లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడని విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment