సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలోని బీజేపీని, ఇటు రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని నిలబడాలంటే ఉద్యమాల ద్వారానే ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు రైతు పోరుబాటను చేపట్టనుంది. ముఖ్యంగా రుణమాఫీ జరగని అన్నదాతలు, ధరణి పోర్టల్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులు, పోడు భూములు సాగుచేసుకుంటూ హక్కుల కోసం పోరాడే ఆదివాసీ, గిరిజనులను లక్ష్యంగా చేసుకుని క్షేత్రస్థాయిలో మద్దతును, సానుభూతిని పొందాలని భావి స్తోంది.
మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఆందోళనలను నిర్వహించేందుకు జిల్లాల వారీగా ఇన్‌చార్జులను నియమించింది. మండల స్థాయిలో ఈనెల 24న జరిగే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు నవంబర్ 30న నియోజకవర్గస్థాయి నిరసనలు, డిసెంబర్ 5న జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమాలను భారీగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ రైతు పక్షాన ఉద్యమించి కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతు అంశాలను పట్టించుకుంటుందని, టీఆర్‌ఎస్, బీజేపీలు ఎన్నికల సమయంలోనే రైతులకు తాయిలాలు ప్రకటిస్తాయని చెప్పే ప్రయత్నం చేస్తోంది. రైతుల పక్షాన ఆందోళనలు ముగిసిన తర్వాత బీసీల సమస్యలపై ఉద్యమించే ప్రణాళికలను కూడా కాంగ్రెస్ పెద్దలు సిద్ధం చేస్తున్నారు.
ఆందోళనల కోసం జిల్లాల వారీ ఇన్‌చార్జులు వీరే..
మహేశ్‌కుమార్‌గౌడ్ (ఆదిలాబాద్), కె. ప్రేంసాగర్‌రావు (మంచిర్యాల), ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (నిర్మల్), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), జీవన్‌రెడ్డి (జగిత్యాల), జి. నిరంజన్ (పెద్దపల్లి), వి. హనుమంతరావు (సిరిసిల్ల), పి. సుదర్శన్‌రెడ్డి (నిజామాబాద్), షబ్బీర్‌అలీ, సురేశ్ షెట్కార్ ( కామారెడ్డి), సిరిసిల్ల రాజయ్య (వరంగల్), కొండా సురేఖ (హన్మకొండ), డి. శ్రీధర్‌బాబు (భూపాలపల్లి), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), టి. జగ్గారెడ్డి (సంగారెడ్డి), దామోదర రాజనర్సింహ (మెదక్), జె. గీతారెడ్డి (సిద్దిపేట).
Comments
Please login to add a commentAdd a comment