సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత జానారెడ్డితో బీసీ సంఘం నేత, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మహా కూటమికి బీసీ సంఘాల మద్దతుపై ఇరువురు నేతలు చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఇదివరకే బీసీ సంఘం ప్రతినిధులు తమను కలిసి పలు విజ్ఞప్తులు చేశారని.. బీసీల న్యాయమైన డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని తెలిపారు.
తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేరుస్తామని జానారెడ్డి పేర్కొన్నారు. కూటమి సీట్ల సర్దుబాటుపై వారంలో స్పష్టత వస్తుందని, త్వరలో తెలంగాణలో జరుగునున్న రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కేసీఆర్ కాఫీ కోట్టారని.. తమ ప్రకటనలకు బడ్జెట్ సరిపోదన్న కేసీఆర్ ఇప్పుడేం సమాధానం చెప్తురని ప్రశ్నించారు.
బీసీలకు 90 శాతం సబ్సిడీ..
జానారెడ్డితో భేటీలో భాగంగా బీసీలకు మెజార్టీ సీట్లు ఇవ్వాలని కోరినట్లు బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్, 90శాతం సబ్సిడీతో బీసీలకు రుణాలు వంటి అంశాలపై వారితో చర్చించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యోగ నోటిషికేషన్లు ఇవ్వాలని.. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలని కాంగ్రెస్ పార్టీని కోరినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment