పెనుకొండ టీడీపీలో ముసలం.. | Group Politics Increased In TDP Across Penukonda Constituency | Sakshi
Sakshi News home page

పెనుకొండ టీడీపీలో ముసలం..

Published Thu, Jan 5 2023 9:30 AM | Last Updated on Thu, Jan 5 2023 2:51 PM

Group Politics Increased In TDP Across Penukonda Constituency - Sakshi

సాక్షి, పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. కురుబ కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ సవిత, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప వరుస కార్యక్రమాలతో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రాబోవు ఎన్నికల్లో గెలుపు మాట అటుంచితే పార్టీ టికెట్‌ పార్థుడికి దక్కడం కష్టమేనన్న వాదన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.  

సవిత ధీమా 
రాబోవు ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువతకు ప్రాధాన్యతనిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో కురుబ కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ సవితలో ఆశలు రేకెత్తాయి. దీంతో పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేశారు. రాబోవు ఎన్నికల్లో పార్టీ టికెట్‌ తనకేనంటూ ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన ఆమె.. ఇతర జిల్లాల్లోనూ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ఇమేజ్‌ను పెంచుకునే చర్యలు ముమ్మరం చేశారు.  

కలిసొచ్చిన రాజకీయ శత్రువు.. 
మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం సవితకు కలిసొచ్చింది. పార్థుడిని ఎలాగైనా దెబ్బ తీయాలన్న కసి నిమ్మలలో వ్యక్తమవుతోంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బీకే ప్రతి సమావేశంలోనూ నిమ్మలను అవమానపరుస్తూ వచ్చారు. దీంతో పార్థుడి ఓటమే లక్ష్యంగా కిష్టప్ప తన రాజకీయ అస్త్రాలను ఎక్కు పెట్టారు. ఈ క్రమంలో సవితకు కిష్టప్ప మద్దతు ఇస్తున్నట్లుగా పార్టీ శ్రేణులు బాహటంగానే పేర్కొంటున్నాయి. దీనికి తోడు తన కుమారులు అంబరీష్‌, శిరీష్‌లో ఎవరో ఒకరికి పార్టీ టికెట్‌ దక్కించుకునేందుకు కిష్టప్ప పావులు కదుపుతున్నారు.

పుట్టపర్తి లేక పెనుకొండ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి కుమారులను బరిలో దించేందుకు కిష్టప్ప ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఎలాగైనా తన భార్యకు పార్టీ టికెట్‌ దక్కించుకునేందుకు సవిత భర్త వెంకటేశ్వర చౌదరి పెద్ద ఎత్తున లాబీయింగ్‌ మొదలు పెట్టారు. కానీ బీకే మాత్రం అధిష్టానానికి తనపైనే ఎంతో గురి   ఉందని, ప్రజల్లోనూ తనకే పట్టు ఉందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ధీమాతోనే పార్టీలో ఏ ఒక్కరినీ ఆయన ఖాతరు చేయడం లేదు.  

ఎడమొహం.. పెడమొహం.. 
పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. బీకే పార్థసారథి ఓ కార్యక్రమాన్ని చేపడితే దానికి ప్రతిగా సవిత మరో కార్యక్రమానికి పిలుపునిస్తోంది. దీంతో నిన్నామొన్నటి వరకూ బీకే వెంట నడిచిన పలువురు ముఖ్య నాయకులు సవితమ్మ గ్రూపులోకి చేరారు. ఇక ఏదైనా కార్యక్రమంలో ఇరు వర్గాలు ఎదురుపడ్డా.. ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నాయి. అంతటితో ఆగకుండా దూషణల పర్వానికి తెర తీస్తున్నాయి.  

ఇటీవల పెనుకొండలోని బోయగేరిలో పార్థుడి నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమం ఇందుకు అద్దం పడుతోంది. తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు ఆ కార్యక్రమంలో పాల్గొనరాదంటూ పార్థుడి ముఖ్య అనుచరుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాడు. ఇది వర్గ పోరుకు మరింత ఆజ్యం పోసింది.  

పోటాపోటీగా కార్యాలయాలు.. 
పెనుకొండలో టీడీపీ నాయకులు రెండు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. తన స్వగృహంలోనే పార్థుడు కార్యాలయం నిర్వహిస్తుండగా.. ప్రతిగా ఎన్టీఆర్‌ సర్కిల్‌లో సవితమ్మ చేత మరో కార్యాలయాన్ని ఆమె వర్గీయులు ఏర్పాటు చేయించారు. అంతటితో ఆగకుండా పోటాపోటీగా కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ కిందిస్థాయి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం ఉండడంతో ముగ్గురు నాయకుల మధ్య తీవ్ర విభేధాలు చంద్రబాబు, లోకేష్‌ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. 

చదవండి: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే కేతిరెడ్డి )

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement