తన్నుకున్న తమ్ముళ్లు
నందివాడ : మండలంలో తెలుగుతమ్ముళ్ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సర్పంచ్‌ను పార్టీలోకి చేర్చుకునే విషయంపై రెండు వర్గాలవారు గొడవకు దిగారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఎదుటే దుర్భాషలాడుకుంటూ ముష్టిఘాతాలకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు... మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కాకరాల సురేష్, పార్టీ మండల అధ్యక్షుడు ఆరెకపూడి రామశాస్త్రులు వర్గాల మధ్య ఎంతోకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకటరాఘవాపురం గ్రామ సర్పంచ్ మోరుగుమాల సత్యనారాయణమ్మ, కుదరవల్లి పీఏసీఎస్ ఉపాధ్యక్షుడు వర్రి రంగారావును టీడీపీలో చేర్చుకునేందుకు బుధవారం ముహూర్తం నిర్ణయించారు.
వెంకటరాఘవాపురం గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. గద్దె అనూరాధ, టీడీపీ గుడివాడ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు, గుడివాడకు చెందిన మరికొందరు నేతలు గ్రామానికి వస్తున్నట్లు ఉదయం స్థానికంగా ప్రచారం చేశారు. దీంతో టీడీపీ సీనియర్ నాయకుడు, ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకరాల సురేష్ తన అనుచరులతో వచ్చి జెడ్పీ చైర్‌పర్సన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. గ్రామంలో ఉన్న తమకు చెప్పకుండా కొత్తవారిని చేర్చుకోవడం ఏమిటని జెడ్పీ చైర్‌పర్సన్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే కాన్వాయ్‌ను అడ్డుకోవడం ఏమిటని సురేష్‌పై రావి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. పరస్పరం బూతులు తిట్టుకున్నారు. అంతటితో అగకుండా రావి చేయిచేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాలవారు పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు వచ్చి కాకరాల సురేష్ వర్గీయులను చెదరగొట్టారు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన సురేష్ వర్గీయులు రావి డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు చైర్‌పర్సన్ అనూరాధ శంకుస్థాపన చేశారు. అంగన్‌వాడీ భవనం వద్ద సర్పంచ్ మోరుగుమాల సత్యనారాయణమ్మ, ఆమె కుమారుడు మోరుగుమాల లక్ష్మణరావు, కుదరవల్లి పీఎసీఎస్ అధ్యక్షుడు వర్రి రంగరావు తదితరులను టీడీపీలో చేర్చుకున్నారు.
తప్పుకున్న పిన్నమనేని వర్గీయులు