అధికార పార్టీలో కుమ్ములాటలు | group politics in rapthadu consistuency | Sakshi
Sakshi News home page

అధికార పార్టీలో కుమ్ములాటలు

Published Wed, May 3 2017 11:36 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

group politics in rapthadu consistuency

కనగానపల్లి (రాప్తాడు) : అధికార తెలుగుదేశం పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య గ్రూపు తగాదాలు, కుమ్ములాటలు రోజూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గం రాప్తాడులో ఇవి మరింత ఎక్కువగా ఉన్నాయి. నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో టీడీపీ మండల నూతన కమిటీలను ఏర్పాటు చేసేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రతి మండలం, గ్రామంలో రెండు, మూడు గ్రూపులుగా విడిపోయిన పార్టీ నాయకులు ఈ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నిక చేయలేకపోతున్నారు. దీంతో పాటు పార్టీ కమిటీల ఎంపికలో కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మండల ఇన్‌చార్జ్‌ల అభిప్రాయాలకే విలువ ఇస్తుండటంతో చాలా చోట్ల నాయకులు, కార్యకర్తల్లో అసమ్మతి నెలకొంటోంది.

        రాప్తాడులో ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్‌కు చెక్‌ పెట్టేందుకు టీడీపీ మండల ఇన్‌చార్జ్‌ మురళీ ఎంపీపీ అసమ్మతి వర్గానికి చెందిన వారికి మండల కన్వీనర్‌ పదవిని కట్టబెట్టారని తెలుస్తోంది.   దీంతో ఎంపీపీతో పాటు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు దీనిపై అసమ్మతిగా ఉన్నారు. అలాగే మండలంలోని హంపాపురం, గొందిరెడ్డిపల్లి, రాప్తాడు, హంపాపురం, మారూరు గ్రామాల్లో టీడీపీ గ్రూపు రాజకీయాలు ఎక్కువగా నడుస్తున్నాయి. దీంతో టీడీపీ మండల కమిటీని నియమించటంలో పార్టీ నాయకులు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. కనగానపల్లి మండలంలో మాజీ ఎంíపీపీ రాజేంద్రను పదవి నుంచి తొలగించినపుడు కురుబ సామాజిక వర్గంలో టీడీపీపై నెలకొన్న అసమ్మతిని పోగొట్టుకునేందుకు ప్రస్తుతం అదే సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీ జోగి అంజనేయులకు మండల కన్వీనర్‌ పదవిని కట్టబెట్టారు. అయితే అదే సామాజిక వర్గంతో పాటు మిగిలిన ఎస్సీ, బీసీ వర్గాల్లోని చాలా మంది నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికే తిరిగి పార్టీ పదవిని కట్టబెట్టటంపై పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఇక మండల కమిటీ ఎంపిక కోసం గత రెండు రోజులుగా మండల కేంద్రం కనగానపల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశాలు జరుపుతున్నారు. కాని పార్టీ నాయకుల మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాలతో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేయలేకపోయారు.

మండల తెలుగు యువత అధ్యక్షుని ఎంపిక చేయలేక గతంలో ఉన్న మనోహర్‌నే కొనసాగిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. ఇక మండల కేంద్రం కనగానపల్లితో పాటు ముక్తాపురం, ముత్తువకుంట్ల, తగరకుంట, తూంచర్ల, వేపకుంట, భానుకోట గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. ఆత్మకూరు మండలంలో టీడీపీ మండల మాజీ కన్వీనర్‌ కృష్ణమోహన్, వడ్డిపల్లి సర్పంచ్‌ నారాయణస్వామి రెండు వర్గాలుగా ఉన్నారు. ఈ సమయంలో సర్పంచ్‌ వర్గానికి చెందిన వడ్డిపల్లి సూర్యనారాయణకు ప్రస్తుతం కన్వీనర్‌ పదవి ఇవ్వటంతో మాజీ కన్వీనర్‌ వర్గం దీనిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మండలంలోని పలుచోట్ల అధికార పార్టీ నాయకుల కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. చెన్నేకొత్తపల్లి మండలంలో ఓటు బ్యాంకు కోసం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కన్వీనర్‌ పదవిని ఇవ్వటంతో బీసీ, ఎస్సీలతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక మంత్రి సొంత మండలమైన రామగిరిలో కూడా టీడీపీ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేయటంలో టీడీపీ నాయకులు విఫలమైనట్లు తెలిసింది.

గ్రూపు రాజకీయాలతో అధికారుల ఇక్కట్లు :
అధికార పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలతో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలలో లబ్దిదారుల ఎంపిక నుంచి కాంట్రాక్టు పనుల వరకు అన్ని అధికార పార్టీ నాయకులు చెప్పినట్లే జరుగుతున్నాయి. కాని టీడీపీలో నెలకొన్న వర్గ రాజకీయాలతో అధికారులు ఎవరి పనిచేయాలన్నా ఇబ్బంది పడుతున్నారు. కనగానపల్లిలో సామాజిక పింఛన్ల జాబితా తయారీ విషయంలో తమ వారి పేర్లు తొలగించారని ఎంపీపీ పద్మగీత భర్త ముకుందనాయుడు అధికారులపై దాడి చేసిన విషయం తెల్సిందే. ఇక వేపకుంటలో ఒక జాతర సందర్భంగా టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే, దాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసుల జీపులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు వేశారు. ఈ విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తున్న గ్రూపు రాజకీయాలతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడటంతో పాటు శాంతి భద్రతలు కూడా లోపిస్తున్నాయని పలువురు ప్రభుత్వ అధికారులు వాపోతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement