rapthadu consistuency
-
మాటల్లేవ్.. ఇది చేతల ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం
వేలాదిగా తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు జై జగన్ నినాదాలతో హోరెత్తిన సభ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని వివరించిన నేతలు అనంతపురం జిల్లా రాప్తాడులో సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వేలాదిగా తరలి వచ్చి..విజయయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, నేతలు మాట్లాడుతూ.. ‘బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు అణిచివేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయి పట్టుకుని అభివృద్ధి పథం వైపు నడిపించారు. ఆయన తెచ్చిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటా వెలుగులు నిండాయి’ అని చెప్పారు. రాప్తాడు సాధికార మహోత్సవం అపూర్వం సాక్షి,అమరావతి/రాప్తాడు రూరల్: ఫ్యాక్షన్‌ను తోసిరాజని అనంతపురం జిల్లా రాప్తాడులో సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. రాయలసీమ ప్రాంతంలో కీలక నియోజకవర్గం అయిన రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల ఆదరాభిమానాలతో సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం అపూర్వ రీతిలో ఉత్సవంలా సాగింది. వేలాదిగా తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ ప్రజలు విజయయాత్ర చేశారు. ముఖ్యంగా మహిళలు కూడా పెద్దసంఖ్యలో తరలిరావడం విశేషం. సీఎం వైఎస్ జగన్ పాలనలో తమకు లభించిన ప్రాధాన్యతను, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సభకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు పోటెత్తారు. సీఎం జగన్ నామస్మరణతో సభా ప్రాంగణం మార్మోగింది. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు వివరించినప్పుడు ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగనే గెలవాలి .. జగనే కావాలి’ అంటూ ఒకే గళమై నినదించారు. దేశ చరిత్రలో ఒకే ఒక్కడు : కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ దేశ చరిత్రలో సామాజిక న్యాయం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ చెప్పారు. సీఎం జగన్ అణగారిన వర్గాలకు అండగా నిలిచి, వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారని తెలిపారు. ఆయన తీసుకొచ్చిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటా వెలుగులు నిండాయన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ఎంత మేలు జరిగిందనేది ఇక్కడికి వచ్చిన జనాలే సాక్ష్యమన్నారు. మీ ఇంటికి మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి.. లేదంటే వద్దని ధైర్యంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలను మరింతగా అణచివేసిన నాయకుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు పార్టీకే గ్యారంటీ లేదు కానీ ప్రజలకు ష్యూరిటీ ఇస్తాడట అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నతంగా బతుకుతున్నారు: మంత్రి మేరుగు ‘మంత్రివర్గంలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్ పర్సన్ ఈ వర్గాల వారే. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్లోనూ ఈ వర్గాలకే ప్రాధాన్యం. నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకే పెద్ద పీట. ఏ సంక్షేమ పథకం తీసుకున్నా లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సీఎం వైఎస్ జగన్ పాలనలో ఈ వర్గాలు ఉన్నతంగా బతుకుతున్నాయి. ఇదే అసలైన సామాజిక సాధికారత’ అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. చంద్రబాబు హయాంలో అవహేళనకు, హింసకు గురైన ఈ వర్గాలు ఇప్పుడు తలెత్తుకొని తిరుగుతున్నాయని వివరించారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోక కత్తిరిస్తా, బీసీలు జడ్జీలుగా పనికి రారంటూ రకరకాలుగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. బాబు మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధ హక్కులన్నీ కాల రాశారన్నారు. అన్ని వర్గాలను ఆదరించి, ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యం: ఎంపీ నందిగం సురేష్ జగనన్న సీఎం అయ్యాక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యం నడుస్తోందని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ప్రతి కులానికీ దన్నుగా నిలిచారని తెలిపారు. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలు, పార్టీ పదవుల్లో 75 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించారని, సీఎం వైఎస్ జగన్ దేవుడు పంపిన వ్యక్తి అని అన్నారు. మనల్ని ఆదుకున్న జగనన్నకు అండగా ఉందామని పిలుపునిచ్చారు. నేడు రాయదుర్గంలో బస్సు యాత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు సాధించిన అభివృద్ధిని, సాధికారతను వివరించేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్రంలో విజయవంతంగా సాగుతోంది. సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడులో యాత్ర అద్భుత రీతిలో జరిగింది. మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. -
‘అడ్డంకులెన్నొచ్చినా ఏపీలో సంక్షేమం ఆగలేదు’
సాక్షి,అనంతపురం:ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అనంతరపురం జిల్లా రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో మంత్రులు మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు డిపాజిట్లు కూడా దక్కలేదని, బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్‌కు రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను నమ్మే స్థితిలో జనం లేరన్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ‘టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. తన ముగ్గురు భార్యలకు పవన్ కళ్యాణ్ గ్యారెంటీ ఇస్తారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఆశాకిరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే సామాజిక న్యాయం సాధ్యం అయింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పట్టం కట్టి మళ్లీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి’ అని పిలుపునిచ్చారు. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ ‘తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్లు కూడా రాలేదు’ అని సురేష్ గుర్తు చేశారు. ‘ఇచ్చిన హామీలను ఏనాడూ చంద్రబాబు అమలు చేయలేదు. జగన్ పాలనలో 99 శాతం హామీలు నెరవేరాయి. పేదల సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. టీడీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం ఉండేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ముఠా కక్షలు అంతమయ్యాయి’ అని సురేష్ తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ‘తెలంగాణ ఎన్నికల్లో ఓటమి భయంతో చంద్రబాబు పోటీ చేయలేదు. పోటీ చేసిన పవన్ కళ్యాణ్‌కు డిపాజిట్లు కూడా రాలేదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు నాయుడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అత్యధికంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే’ అని ఎంపీ మాధవ్ కొనియాడారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ ‘ఎస్సీ ఎస్టీ బీసీలను కులవృత్తులకే పరిమితం చేయాలని చంద్రబాబు నాయుడు కుట్రలు చేశారు. సీఎం జగన్ పాలనలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం లభించింది’ అని తెలిపారు. ఈ బస్సు యాత్రలో ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, శంకర్ నారాయణ, డాక్టర్ తిప్పేస్వామి, అనంతవెంకటరామిరెడ్డి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీలు నందిగాం సురేష్, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, జెడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, డీసీసీబీ చైర్మన్ లిఖిత, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి..అందులో కోటి 30 లక్షల మంది ప్రయాణం.. -
పరిటాల సునీత మహానటి.. సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు
సాక్షి, అనంతపురం: ‘మా ఓర్పు, సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. మేము తింటున్నదీ ఉప్పూ కారమే. మీకు నిజంగా ధైర్యం ఉంటే మా ఇంటి వద్దకు వచ్చి వెళ్లండి. అప్పుడు మీకు అర్థమవుతుంద’ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్పుగా ఉన్నామే గానీ ఏనాడూ సహనం కోల్పోలేదన్నారు. ఇప్పుడు కిరాయి హంతకులతో తమ అమ్మను తిట్టించినా ఓర్పుగానే ఉన్నామన్నారు. అలాగని తమ సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. పరిటాల శ్రీరామ్ తమపై అసత్య ఆరోపణలు చేయడంతో పాటు గడప గడపకు కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఎవరైనా దాడి చేస్తే తమకు సంబంధం లేదంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారన్నారు. అయినప్పటికీ తాము సహనం కోల్పోలేదన్నారు. భాష తప్పే.. భావం కరెక్ట్ చంద్రబాబు విషయంలో తమ అన్న తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి వాడిన భాష తప్పే కానీ.. ఆయన భావం కరెక్ట్ అని ప్రకా‹Ùరెడ్డి స్పష్టం చేశారు. తమ్ముడికి జరగరానిది ఏదైనా జరుగుతుందనే బాధతోనే అలా మాట్లాడారని పేర్కొన్నారు. తమ రాజకీయ చరిత్రలో ఏనాడూ దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎంతో ఓర్పు, సహనంతో ప్రజల వద్దకు వెళ్తున్నామే తప్ప నీచ రాజకీయాలకు పాల్పడలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమపై కక్ష సాధింపుతో ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆస్తులు నష్టపోయామని, చివరికి తమపై అక్రమ కేసులు బనాయించినా ఓర్పు, సహనంతో ఉన్నామని గుర్తు చేశారు. ఆనాడు హత్యాకాండకు పాల్పడ్డారు.. పరిటాల రవీంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎన్నో హత్యలు చేయించారన్నారు. అలాగే పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు కూడా హత్యా రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. పరిటాల సునీత మహానటి అని ఎద్దేవా చేశారు. ఆమె నటన వెనుక చంద్రబాబు పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే రాప్తాడు నియోజకవర్గంలో పది చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభల్లో టీడీపీ చేసిన హత్యాకాండ, అరాచకాలు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జాకీ పరిశ్రమ విషయంలో దు్రష్పచారాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు హితవు చెప్పారు. ఆ పరిశ్రమ టీడీపీ హయాంలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. లేని జాకీపైన పదేపదే మాట్లాడుతున్నారని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, జెడ్పీటీసీ సభ్యుడు జూటూరు చంద్రకుమార్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
ఆరోజు ఏమయ్యావు రామకృష్ణా?!.. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు
సాక్షి, రాప్తాడురూరల్: ‘రాప్తాడు సమీపంలో ఏర్పాటు కావాల్సిన జాకీ కంపెనీ (పేజ్ ఇండస్ట్రీస్) యాజమాన్యం గుడ్‌విల్ ఇవ్వని కారణంగా పనులకు అంతరాయం కల్పిస్తూ వచ్చారు. దీంతో ఆ పరిశ్రమ కాస్తా తమిళనాడులోని సేలానికి తరలిపోయిందంటూ 2018 డిసెంబరు 26న సాక్షి పత్రికలో కథనం వచ్చింది. మరి ఆరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోజు గాడిద పళ్లు తోముతున్నాడా’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన అనంతపురం మండలం ఆలమూరు జగనన్న హౌసింగ్ లేఅవుట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ‘కళ్లున్న కబోదులైన చంద్రబాబు, రామకృష్ణ, సోము వీర్రాజుకు వాస్తవాలు మాట్లాడితే రుచించదు. దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లు చంద్రబాటు ట్వీట్లు చేస్తున్నారు. కనీసం పునాదిరాళ్లకు కూడా నోచుకోని ఒక కాగితం కంపెనీకి ఆరోజు వందకోట్లు విలువైన భూములు కేటాయించి గొప్పగా ప్రచారం కల్పించారు. నిర్మాణం జరగకుండానే అది వెళ్లిపోతే రామకృష్ణ ఎందుకు మాట్లాడలేదు? 1994లో నిన్ను (రామకృష్ణ) అనంతపురం ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తర్వాత నిన్ను నువ్వు అమ్మేసుకున్నావ్. పరిటాల కుటుంబానికి రాసిచ్చేశావు. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు. ఈ జిల్లాకు నీ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండా నన్ను ఏవిధంగా విమర్శిస్తావ్. పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పది మందిని వెంటేసుకుని వచ్చి డ్రామా నడిపి పోతావా? సోము వీర్రాజు కూడా నా గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. ఈనాడు పత్రిక రాసిందల్లా నిజాలని భావించడం తగదు. అది లూటీ ఇండస్ట్రీస్ పేజ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. జార్ఖండ్, చత్తీస్ఘడ్, ఒడిశా రాష్ట్రాల్లో భూముల కోసం ప్రయత్నించింది. పెట్టుబడులు పెడతామని అనేక రాష్ట్రాలకు వెళ్లిన సంస్థ ఎక్కడా పెట్టింది లేదు. పై మూడు రాష్ట్రాల్లో వాటి జీఎస్టీ నంబర్లు కూడా రద్దయ్యాయి. అంటే అక్కడ వ్యాపారాల్లేవు. కానీ రాప్తాడు అడ్రెస్‌తో ఉన్న ఆ సంస్థ జీఎస్టీ మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఆరోజుల్లో వంద కోట్ల విలులైన భూములు కేవలం మూడు కోట్ల రూపాయలకు కంపెనీకి కేటాయించడంతో తప్పుమంత్రి ముడుపులు ఆశించారు. ఈ క్రమంలోనే కాంపౌండ్ నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆపేశారు. భూములు ఇచ్చింది మీరు..లంచం అడిగింది మీరు..ఎగ్గొట్టి పోయింది పేజ్ ఇండ స్ట్రీస్. మరి ఇందులోకి మేము ఎక్కడి నుంచి వచ్చాం? పేజ్ ఇండస్ట్రీస్‌ను రమ్మని పిలవండి. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విధంగా లక్షా 50 వేల చదరపు అడుగుల ఫ్యాక్టరీని నేను నిర్మించి ఇస్తా. అప్పటికీ వారు రాకపోతే ఏమనుకోవాలి? వారు రాకపోయినా వేరే సంస్థలైతే కచ్చితంగా తీసుకొస్తాం. ఇప్పటికే దాదాపు 20 సంస్థల ప్రతినిధులతో మాట్లాడాం. డిపాజిట్లు రావని తెలిసీ పరారీ మంత్రం రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తెలిసే పరిటాల కుటుంబం పరారీ మంత్రం పఠిస్తోంది. ధర్మవరం, పెనుకొండ సీట్లు అడుగుతోంది. కానీ చంద్రబాబు ఆ సీట్లను ఇప్పటికే అమ్మేసుకున్నారు. మీరు రాప్తాడులోనే పోరాడాలి. ఇక్కడ మీరు గెలవాలంటే నన్నైనా చంపాలి లేదంటే క్యారెక్టర్‌నైనా చంపాలి. అందులో భాగంగానే ఇప్పుడు నా క్యారెక్టర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. పరిటాల కుటుంబం రాజ్యమేలినప్పుడు ఈ ప్రాంత ప్రజలు కరువుతో వేలాదిమంది వలసలు వెళ్లారు. ఈ రోజు చెరువుల నిండా నీళ్లున్నాయి. పేరూరు డ్యాం పొంగి పొర్లుతోంది. ఆయకట్టు కళకళలాడుతోంది. 27 వేల ఇళ్లను మంజూరు చేయించా. పది వేలమంది పాడి మహిళా రైతుల కోసం తోపుదుర్తి సహకార డెయిరీ నిర్మిస్తున్నా. రైతులకు ఉచితంగా ఆరు వేల బోర్లు వేయిస్తున్నాం. ఇది చూసే పరిటాల సునీత కళ్లల్లో కన్నీరు. రైతుల పేరుతో పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉంద’ని అన్నారు. సమావేశంలో రాప్తాడు మార్కెట్ యార్డు చైర్మన్ బెడదూరి గోపాల్‌రెడ్డి, అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, ఏడీసీసీ బ్యాంకు డైరెక్టర్ జనార్దన్‌రెడ్డి, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ కేవీ రమణ, నాయకులు ఆది, చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
Thopudurthi Prakash Reddy: శ్రీరామ్.. నోరు జాగ్రత్త
సాక్షి, అనంతపురం: ‘నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసులపై నోరుపారేసుకోవద్దు. ఎన్నో ఏళ్లు నేరాలు చేస్తూ చట్టానికి చిక్కకుండా తిరిగిన ఎందరినో పోలీసులు కటకటాలపాలు చేశారు. జాగ్రత్తగా మసలుకో.. లేకుంటే నీకూ అదే గతి పడుతుంది’ అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌కు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. రామగిరి పోలీసులపై శ్రీరామ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా దౌర్జన్యం, రౌడీయిజంతో ప్రజలను భయపెట్టి నిర్మించుకున్న చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిందన్నారు. చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పార్టీ లేదు బొక్కా లేదు అని అచ్చెన్నాయుడు చెప్పినట్టు టీడీపీ చరిత్ర కూడా మసకబారిపోయిందన్నారు. అధికారంలోకి వచ్చేస్తాం.. ఏమైనా చేసేస్తాం అనే కలలు కనడం మాని.. వాస్తవంలోకి రావాలన్నారు. రామగిరి పోలీసులపై ‘కొడకల్లారా’ అంటూ అనుచితంగా మాట్లాడిన శ్రీరామ్‌ను పోలీసులు కూడా తిరిగి మాట్లాడితే.. అంతటి అవమానకరం మరొకటి ఉండదని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. పరిటాల కుటుంబ నియంతృత్వ, పెత్తందారీ పోకడలు చరిత్రలో కలిసిపోయాయని, ప్రస్తుతం రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లిలో పోలీసులు నీతి, నిజాయితీతో పని చేస్తున్నారని ప్రశంసించారు. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంత ప్రజల బానిస సంకెళ్లు తెగిపోయాయన్నారు. మీ వద్ద ఉన్న రౌడీషీటర్లు, హంతకులు, దౌర్జన్యపరుల ఆటలు ఇకపై సాగబోవన్నారు. పరిటాల సునీత తమ్ముడిపై కూడా రౌడీషీట్ ఓపెన్ చేసి పలక పట్టించిన పోలీసులు ఉన్నారన్నారు. జాగ్రత్తగా మసలుకోకుంటే నీకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘పోలీసులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న నీవు గన్మెన్లు లేకుండా తిరుగు.. అప్పుడు తెలుస్తుంది దమ్ము, ధైర్యం ఎంత ఉందో’ అని అన్నారు. ‘మా ప్రభుత్వం వచ్చిన తరువాత మీకు గన్మెన్లను పెంచాం, మేము రక్షించుకునే ప్రాణాలు కనుక మిమ్మలను స్వేచ్ఛగా తిరగనిస్తున్నాం. అది తెలుసుకొని మసులుకో శ్రీరామ్. మీరు చరిత్ర డప్పు కొట్టుకోవడం కాదు... మిమ్మల్ని ఎవ్వరూ లెక్క చేయరు తెలుసుకో’ అని అన్నారు. మీరేం చేశారు.. మేమేం చేశామో తెలుసుకుంటాం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చెప్పారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తాము బిజీగా ఉన్నామని.. త్వరలోనే మీ ఊరికి కూడా వస్తామని.. అక్కడ మీరు ఏమి చేశారు.. మా ప్రభుత్వం ఏమి చేసింది.. ఏమి చేస్తోందో ప్రజల ద్వారానే తెలుసుకుంటామన్నారు. 2019 ఎన్నికల్లో 26వేల ఓట్ల తేడాతో ప్రజలు మిమ్మల్ని ఓడించినా ఆత్మావలోకనం చేసుకోలేకపోతున్నారని శ్రీరామ్‌ను ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా టీడీపీ మద్దతుదారులు చతికిలపడ్డారని గుర్తు చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో విషయంలో ఎస్పీ ప్రెస్‌మీట్ పెట్టి స్పష్టత ఇచ్చినా దిగజారుడు విమర్శలు చేయడం తగదన్నారు. రాబోవు రోజుల్లో టమాట రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పరిశ్రమలకు వేలాది ఎకరాలు కేటాయించి అభివృద్ధికి దోహదపడతామన్నారు. విలేకరుల సమావేశంలో అనంతపురం జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, రాప్తాడు మార్కెట్ యార్డు చైర్మన్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాప్తాడును కోనసీమగా మారుస్తాం
హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను పారించి రాప్తాడు నియోజకవర్గాన్ని కోనసీమగా మారుస్తామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన పేరూరు డ్యాంను సందర్శించి గంగ పూజ నిర్వహించారు. ఇదే సమయంలో ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష ఎకరాలకు సాగునీటిని అందించడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సాక్షి, అనంతపురం: హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను పారించి రాప్తాడు నియోజకవర్గాన్ని కోనసీమగా మారుస్తామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. తొలిసారిగా హంద్రీనీవా కాలువ నుంచి పేరూరు డ్యాంకు కృష్ణా జలాలు వచ్చిన సందర్భంగా శనివారం రామగిరి మండలంలోని పేరూరు అప్పర్ పెన్నార్ ప్రాజెక్టును ఎమ్మెల్యే సందర్శించారు. గంగపూజ అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత వచ్చిన పాలకులు అలసత్వం ప్రదర్శించారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహానేత ఇచ్చిన హామీ మేరకు హంద్రీనీవా కాలువ ద్వారా మడకశిర బ్రాంచి కెనాల్ నుంచి పేరూరు డ్యాంకు నీరందించేందుకు జీఓ తీసుకొచ్చారన్నారు. కేవలం రూ.కోటిన్నర ఖర్చుతో పేరూరు డ్యాంకు నీరు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులను దోచుకునేందుకు మాజీ మంత్రి పరిటాల సునీత రూ.804 కోట్లతో జీఓ తీసుకొచ్చిందని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కృష్ణా జలాల ద్వారా 10 వేల ఎకరాల ఆయకట్టుకు ప్రత్యక్షంగా, 40 వేల ఎకరాలకు పరోక్షంగా సాగు నీరందుతున్నారు. నియోకవర్గ పరిధిలో హంద్రీనీవా కింద మరో నాలుగు రిజర్వాయర్లు నిర్మిస్తామని, వీటి ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందించి సస్యశ్యామలం చేసి తీరుతామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ నాగేశ్వర రెడ్డి, నాయకులు క్రిష్ణారెడ్డి, వెంకటరాముడు, పసుపుల ఆది, వెంకటేష్, అమరనాథరెడ్డి, గోపాల్‌రెడ్డి, నరసింహారెడ్డి, మీనుగ నాగరాజు, నాగముని, గోవిందురెడ్డి, బాలపోతన్న, తదితరులు పాల్గొన్నారు. చదవండి: భరత్ అనే నేను.. -
రాప్తాడు రాజు ఎవరో
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గం.. అనంతపురంలోని 14 నియోజకవర్గాల్లో ఇది ప్రత్యేకం. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటికే రెండు ఎన్నికలు జరిగాయి. మూడో సార్వత్రిక ఎన్నికల కోసం రాజకీయపార్టీలు సిద్ధమయ్యాయి. అయితే వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే ఇక్కడ ప్రధాన పోటీ నెలకొంది. మంత్రి పరిటాల సునీత ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో సునీత స్థానంలో ఆమె తనయుడు పరిటాల శ్రీరాం బరిలో నిలిచారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పోటీలో ఉన్నారు. తన రాజకీయ ఆరంగేట్రం, నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికలో 1707 ఓట్ల స్వల్వ తేడాతో ఓడిపోయిన ప్రకాశ్‌రెడ్డి ఈ దఫా ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే సంకల్పంతో దూసుకుపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత, కుటుంబ పాలనపై ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లో వచ్చిన తిరుగుబాటు నేపథ్యంలో వారసుడిగా పరిటాల శ్రీరాంకు ఈ ఎన్నిక సవాల్‌గా మారింది. దీంతో ‘రాప్తాడు’ ఫలితంపై ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. నియోజకవర్గ స్వరూపం రాప్తాడు మండలం 2009కు ముందు అనం తపురం నియోజకవర్గ పరిధిలో ఉండేది. అప్పటి వరకూ పరిటాల కుటుంబ పెనుకొండ నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహించేంది. 2005లో పరిటాల రవీంద్ర హత్య తర్వాత జరిగిన ఉప ఎన్ని కల్లో సునీత రాజకీయ ఆరంగేట్రం చేశారు. సునీత సొంత మండలం రామగిరితో పాటు అప్పటి వర కూ పెనుకొండ పరిధిలో ఉన్న చెన్నేకొత్తపల్లి, కనగా నపల్లి మండలాలు రాప్తాడు నియోజకవర్గం లోకి చేరాయి. ఆత్మకూరుతో పాటు అనంతపురం రూరల్ మండలం కూడా ఈ నియోజవకర్గంలోకి చేర్చారు. పోటాపోటీ 2009లో నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికలో సునీతపై కాంగ్రెస్ పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బరిలోకి దిగారు. కేవలం 1707ఓట్ల తేడాతో ప్రకాశ్ ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో కూడా స్వల్ప తేడాతో ఓటమి చెందారు. మూడో సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పరిటాల కుమారుడు శ్రీరాం ఈ దఫా పోటీలో నిలిచారు. వైఎస్సార్సీపీ తరఫున మాత్రం తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు. సామంతుల పాలన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడాలేని విధంగా గత 58 నెలలు ఈ నియోజకవర్గంలో ‘సామంతులపాలన’ నడిచింది. సునీత తమ్ముళ్లు మురళీ రాప్తాడు, బాలాజీ ఆత్మకూరుకు, సునీత చిన్నాన్న ఎల్ నారాయణచౌదరికి చెన్నేకొత్తపల్లి, కనగాపల్లికి నెట్టెం వెంకటేశ్, అనంతపురం రూరల్‌కు పరిటాల మహేంద్ర, రామగిరికి రామ్మూరి ్తనాయుడులను ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలతో పాటు ప్రజలచేత ఎన్నికైన ఎంపీపీ, జెడ్పీటీసీలకు ఈ నియోజకవర్గంలో నిర్ణయాధికారాలు లేవు. ఏ మండలంలో ఏ అభివృ ద్ధి కార్యక్రమం, ప్రారంభోత్సవం, సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేయాలన్నా ‘సామంతుల’ నిర్ణయమే ఫైనల్! ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి విస్మరణ పాతికేళ్లుగా పరిటాల కుటుంబాన్ని ప్రజలు ఆదరించారు. 2014లో మంత్రిగా సునీతకు అవకాశం దక్కింది. దీంతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని ఆశపడ్డారు. అయితే ఐదేళ్లలో ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు. దాదులూరులో గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పుతామని తొలిబడ్జెట్‌లో ప్రకటించారు. ఇప్పటి వరకూ అతీగతీ లేదు. సునీత సొంతమండలం రామగిరిలో బంగారు గనులు గతంలో పరిటాల రవీంద్ర వైఖరితోనే మూతపడ్డాయి. వీటికి పూర్వవైభవం తెస్తామన్నారు. పట్టించుకోలేదు. రాప్తాడు సమీపంలో జాకీ ఫ్యాక్టరీ మంజూరైంది. లంచాల దెబ్బతో దీనికి బ్రేక్ పడింది. చివరకు నియోజకవర్గ రైతులకు సాగునీళ్లు ఇచ్చే ఆలోచన కూడా చేయలేదు. పేరూరు ప్రాజెక్టుకు తక్కువ ఖర్చుతో , తక్కువ సమయంలో నీళ్లిచ్చేమార్గం ఉన్నా ఆదిశగా ఆలోచించలేదు. ఆర్థికప్రయోజనాలే ధ్యేయంగా కొత్తగా కాలవను తవ్వుతున్నారు. ఐదేళ్లలో ఎకరా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే పారిశ్రామిక, వ్యవసాయఅభివృద్ధితో పాటు ఐదేళ్లలో ఫలాని పని చేశాం అని చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు. ఇదే వారిపై ప్రజల్లో వ్యతిరేకత స్థాయిని పెంచింది. సాగునీరే ప్రకాశ్ ప్రధాన అస్త్రం మరోవైపు ప్రకాశ్ విభిన్నశైలిలో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ‘ఇన్నేళ్లు పరిటాల కుటుంబాన్ని చూశారు. ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి చూడాలి’ అని అభ్యర్థిస్తున్నారు. జగన్ సీఎం అయితే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. పాదయాత్రలో జగన్ కూడా ఈ విషయంపై హామీ ఇచ్చారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్న ప్రాంతం కావడంతో అంతా వైఎస్సార్సీపీకి జైకొడుతున్నారు. ఈ పరిణామాలతో పరిటాల కుటుంబం ఈ దఫా ఎన్నికల్లో సునీతను కాకుండా శ్రీరామ్‌ను బరిలోకి దించుతోంది. సునీత అయితే ఓటమి తప్పదని, శ్రీరాం అయితే కొత్తముఖం కావడంతో వ్యతిరేకత స్థాయి తగ్గుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ప్రకాశ్‌మాత్రం ఐదేళ్లపాలన శ్రీరాం కనుసన్నల్లోనే సాగిందని, ఈ దఫా పరిటాల కోటపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామనే ధీమాతో ఉన్నారు. టీడీపీని వీడిన నేతలు తెలుగు దేశం అరాచకాలు తట్టుకోలేక నియోజకవర్గంలో చాలా మంది పార్టీని వీడారు. పరిటాల రవీంద్రకు ముఖ్య అనుచరుడిగా ఉన్న వేపకుంట రాజన్న టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్ టీడీపీకి పూర్తి దూరంగా ఉన్నారు. ఐడీసీ చైర్మన్ నల్లపురెడ్డి ఇటీవలే తన పదవికి, టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. ఇక సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు గ్రామ, మండల స్థాయి నాయకులు భారీగా పరిటాల కుటుంబాన్ని వదిలి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ పరిణామాలన్నీ వారిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయి. ఐదేళ్లుగా హత్యలు... దౌర్జన్యాలు ఐదేళ్లలో వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలను హతమార్చారు. 2015 ఏప్రిల్ 29న రాప్తాడు మండలం వైఎస్సార్సీపీ మాజీ కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డిని తహశీల్దార్ ఆఫీసులో కిరాతకంగా నరికిచంపారు. 2018 మార్చి 30న కందుకూరులో శివారెడ్డిని నరికిచంపారు. ఇవి కాకుండా వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన భౌతికదాడులకు లెక్కేలేదు. ఇవి కూడా సునీతపై మైనస్‌గా మారింది. -
ప్రచార ఆర్భాటం
- మంత్రులు దేవినేని, పరిటాల హడావుడి - శిలాఫలకాలకే ప్రారంభోత్సవాలు - గతంలో చేసిన పనులకు మళ్లీ కొత్తగా రిబ్బన్కట్లు - విస్తుపోయి చూసిన జనం కనగానపల్లి : ఎన్నికల్లో అపద్ధపు హామీలు గుప్పించి అధికారంలోకొచ్చిన టీడీపీ నేతలు ..అభివృద్ధి పనులు చేపట్టడంలోనూ అంతా మాయ చేశారు. గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా ప్రారంభిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. పనులు నిర్మాణ దశలోనే ఉన్నా..శిలాఫలాలు ప్రారంభించి ఆర్భాటం చేశారు. ఆదివారం కనగానపల్లి మండలంలోని చంద్రాశ్చర్ల గ్రామంలో రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వరరావు, అధికార యంత్రాంగం చేసిన హంగామానే ఇందుకు నిదర్శనంగా మారింది. ఓ వైపు అభివృద్ధి పనులు మధ్యలోనే ఉన్నా..ఆర్భాటంగా శిలాఫలకాలకు ప్రారంభోత్సవాలు చేసి నవ్వులపాలయ్యారు. పాతవాటికే ప్రారంభోత్సవాలు మండలంలోఅభివృద్ధి పనులకు రూ.మూడు కోట్లు పైగా ఖర్చు చేసినట్లు అధికార పార్టీ నేతలు ఢంకా మోగించారు గానీ దాదులూరు, కుర్లపల్లి, చంద్రశ్చర్ల గ్రామాలకు మంజూరైన నాలుగు అంగన్వాడీ భవనాల్లో ఏ ఒక్కటి ఇంకా నిర్మాణం పూర్తికాలేదు. చంద్రాశ్చర్లలో ఏడాది క్రితం వేసిన సిమెంట్ రోడ్లు, ఆరు నెలల క్రితమే మొదలైన వాటర్ప్లాంట్లనే మంత్రులు ఆదివారం కొత్తగా ప్రారంభించటం చూచి స్థానికులు ఆశ్చర్యపోయారు. చంద్రాశ్చర్లలో బోరుబావుల్లో నీరు అడుగంటి పోయి తాగునీరు కూడా దొరక్క స్థానికులు ఇబ్బందులు పడుతుంటే ..ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హంద్రీనీవా నీటివల్ల ఈ ప్రాంతంలోని బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉన్నాయని, వ్యవసాయ పొలాలలు కళకళలాడుతున్నాయని చెప్పడం విని రైతులు ముక్కున వేలేసుకున్నారు. ఎంపీ నిమ్మలను నిలదీసిన అధికార పార్టీ నేత సమావేశం చివరిలో వచ్చిన ఎంపీ నిమ్మల కిష్టప్ప స్థానిక సమస్యలను గురించి మాట్లాడకుండా ఢిల్లీలో జరిగే రాజకీయాలు గురించి ఊదరగొడతూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై అనవసరమైన విమర్శలు గుప్పించారు. ఈ సమయంలోనే అధికార పార్టీకి చెందిన సహకార సొసైటీ ఇన్చార్జ్ కుర్లపల్లి రాజప్ప మాట్లాడుతూ.. మూడేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ గ్రామానికి ఒక్క సిమెంట్ రోడ్డు కూడా మంజూరు చేయించలేదని ఎంపీని నిలదీశారు. దీంతో అక్కడున్న టీడీపీ నాయకులు, అధికారులు ఒక్కసారిగా కంగుతుని, సీసీ రోడ్లకు రూ.10 లక్షలు మంజూరు చేయిస్తామని ఎంపీ చేత చెప్పించారు. ఇక దాదులూరు పంచాయతీలో ఒకే రోజు రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తున్నామని వారం రోజుల నుంచి ప్రచారం చేస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి సరైన స్పందన లేదు. దీంతో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులే అవాక్కయ్యారు. కార్యక్రమంలో జేసీ రమామణి, ఆర్డీఓ బాలనాయక్, ఎంపీపీ పద్మగీత, తహసీల్దార్ సుధామణి, ఎంపీడీఓ కుళ్లాయిస్వామి, స్థానిక సర్పంచ్ రామసుబ్బయ్య, పలు శాఖల అధికారులు, పలు గ్రామాల సర్పంచ్‌లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అధికార పార్టీలో కుమ్ములాటలు
కనగానపల్లి (రాప్తాడు) : అధికార తెలుగుదేశం పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య గ్రూపు తగాదాలు, కుమ్ములాటలు రోజూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గం రాప్తాడులో ఇవి మరింత ఎక్కువగా ఉన్నాయి. నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో టీడీపీ మండల నూతన కమిటీలను ఏర్పాటు చేసేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రతి మండలం, గ్రామంలో రెండు, మూడు గ్రూపులుగా విడిపోయిన పార్టీ నాయకులు ఈ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నిక చేయలేకపోతున్నారు. దీంతో పాటు పార్టీ కమిటీల ఎంపికలో కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మండల ఇన్‌చార్జ్‌ల అభిప్రాయాలకే విలువ ఇస్తుండటంతో చాలా చోట్ల నాయకులు, కార్యకర్తల్లో అసమ్మతి నెలకొంటోంది. రాప్తాడులో ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్‌కు చెక్ పెట్టేందుకు టీడీపీ మండల ఇన్చార్జ్ మురళీ ఎంపీపీ అసమ్మతి వర్గానికి చెందిన వారికి మండల కన్వీనర్ పదవిని కట్టబెట్టారని తెలుస్తోంది. దీంతో ఎంపీపీతో పాటు పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు దీనిపై అసమ్మతిగా ఉన్నారు. అలాగే మండలంలోని హంపాపురం, గొందిరెడ్డిపల్లి, రాప్తాడు, హంపాపురం, మారూరు గ్రామాల్లో టీడీపీ గ్రూపు రాజకీయాలు ఎక్కువగా నడుస్తున్నాయి. దీంతో టీడీపీ మండల కమిటీని నియమించటంలో పార్టీ నాయకులు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. కనగానపల్లి మండలంలో మాజీ ఎంíపీపీ రాజేంద్రను పదవి నుంచి తొలగించినపుడు కురుబ సామాజిక వర్గంలో టీడీపీపై నెలకొన్న అసమ్మతిని పోగొట్టుకునేందుకు ప్రస్తుతం అదే సామాజిక వర్గానికి చెందిన ఎంపీటీసీ జోగి అంజనేయులకు మండల కన్వీనర్ పదవిని కట్టబెట్టారు. అయితే అదే సామాజిక వర్గంతో పాటు మిగిలిన ఎస్సీ, బీసీ వర్గాల్లోని చాలా మంది నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికే తిరిగి పార్టీ పదవిని కట్టబెట్టటంపై పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఇక మండల కమిటీ ఎంపిక కోసం గత రెండు రోజులుగా మండల కేంద్రం కనగానపల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశాలు జరుపుతున్నారు. కాని పార్టీ నాయకుల మధ్య నెలకొన్న గ్రూపు రాజకీయాలతో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేయలేకపోయారు. మండల తెలుగు యువత అధ్యక్షుని ఎంపిక చేయలేక గతంలో ఉన్న మనోహర్‌నే కొనసాగిస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. ఇక మండల కేంద్రం కనగానపల్లితో పాటు ముక్తాపురం, ముత్తువకుంట్ల, తగరకుంట, తూంచర్ల, వేపకుంట, భానుకోట గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. ఆత్మకూరు మండలంలో టీడీపీ మండల మాజీ కన్వీనర్ కృష్ణమోహన్, వడ్డిపల్లి సర్పంచ్ నారాయణస్వామి రెండు వర్గాలుగా ఉన్నారు. ఈ సమయంలో సర్పంచ్ వర్గానికి చెందిన వడ్డిపల్లి సూర్యనారాయణకు ప్రస్తుతం కన్వీనర్ పదవి ఇవ్వటంతో మాజీ కన్వీనర్ వర్గం దీనిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మండలంలోని పలుచోట్ల అధికార పార్టీ నాయకుల కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. చెన్నేకొత్తపల్లి మండలంలో ఓటు బ్యాంకు కోసం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కన్వీనర్ పదవిని ఇవ్వటంతో బీసీ, ఎస్సీలతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక మంత్రి సొంత మండలమైన రామగిరిలో కూడా టీడీపీ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేయటంలో టీడీపీ నాయకులు విఫలమైనట్లు తెలిసింది. గ్రూపు రాజకీయాలతో అధికారుల ఇక్కట్లు : అధికార పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలతో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పథకాలలో లబ్దిదారుల ఎంపిక నుంచి కాంట్రాక్టు పనుల వరకు అన్ని అధికార పార్టీ నాయకులు చెప్పినట్లే జరుగుతున్నాయి. కాని టీడీపీలో నెలకొన్న వర్గ రాజకీయాలతో అధికారులు ఎవరి పనిచేయాలన్నా ఇబ్బంది పడుతున్నారు. కనగానపల్లిలో సామాజిక పింఛన్ల జాబితా తయారీ విషయంలో తమ వారి పేర్లు తొలగించారని ఎంపీపీ పద్మగీత భర్త ముకుందనాయుడు అధికారులపై దాడి చేసిన విషయం తెల్సిందే. ఇక వేపకుంటలో ఒక జాతర సందర్భంగా టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే, దాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసుల జీపులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు వేశారు. ఈ విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తున్న గ్రూపు రాజకీయాలతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడటంతో పాటు శాంతి భద్రతలు కూడా లోపిస్తున్నాయని పలువురు ప్రభుత్వ అధికారులు వాపోతున్నారు.