సాక్షి, అనంతపురం: ‘మా ఓర్పు, సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. మేము తింటున్నదీ ఉప్పూ కారమే. మీకు నిజంగా ధైర్యం ఉంటే మా ఇంటి వద్దకు వచ్చి వెళ్లండి. అప్పుడు మీకు అర్థమవుతుంద’ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్పుగా ఉన్నామే గానీ ఏనాడూ సహనం కోల్పోలేదన్నారు. ఇప్పుడు కిరాయి హంతకులతో తమ అమ్మను తిట్టించినా ఓర్పుగానే ఉన్నామన్నారు. అలాగని తమ సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. పరిటాల శ్రీరామ్ తమపై అసత్య ఆరోపణలు చేయడంతో పాటు గడప గడపకు కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఎవరైనా దాడి చేస్తే తమకు సంబంధం లేదంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారన్నారు. అయినప్పటికీ తాము సహనం కోల్పోలేదన్నారు.
భాష తప్పే.. భావం కరెక్ట్
చంద్రబాబు విషయంలో తమ అన్న తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి వాడిన భాష తప్పే కానీ.. ఆయన భావం కరెక్ట్ అని ప్రకా‹Ùరెడ్డి స్పష్టం చేశారు. తమ్ముడికి జరగరానిది ఏదైనా జరుగుతుందనే బాధతోనే అలా మాట్లాడారని పేర్కొన్నారు. తమ రాజకీయ చరిత్రలో ఏనాడూ దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎంతో ఓర్పు, సహనంతో ప్రజల వద్దకు వెళ్తున్నామే తప్ప నీచ రాజకీయాలకు పాల్పడలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమపై కక్ష సాధింపుతో ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆస్తులు నష్టపోయామని, చివరికి తమపై అక్రమ కేసులు బనాయించినా ఓర్పు, సహనంతో ఉన్నామని గుర్తు చేశారు.
ఆనాడు హత్యాకాండకు పాల్పడ్డారు..
పరిటాల రవీంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎన్నో హత్యలు చేయించారన్నారు. అలాగే పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు కూడా హత్యా రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. పరిటాల సునీత మహానటి అని ఎద్దేవా చేశారు. ఆమె నటన వెనుక చంద్రబాబు పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే రాప్తాడు నియోజకవర్గంలో పది చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభల్లో టీడీపీ చేసిన హత్యాకాండ, అరాచకాలు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జాకీ పరిశ్రమ విషయంలో దు్రష్పచారాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు హితవు చెప్పారు. ఆ పరిశ్రమ టీడీపీ హయాంలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. లేని జాకీపైన పదేపదే మాట్లాడుతున్నారని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, జెడ్పీటీసీ సభ్యుడు జూటూరు చంద్రకుమార్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment