
సాక్షి, శ్రీ సత్యసాయి: కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నారనే అహంతో వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. తాజాగా సత్యసాయి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల హల్‌చల్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతల దారుణాలపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల ప్రకారం.. సత్యసాయి జిల్లాలోని రామగిరిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయుల తాజాగా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు విప్ జారీ చేసేందుకు వెళ్లిన లాయర్ కురుబ నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు రామాంజనేయులు, హరిలపై దాడి చేశారు. ఈ క్రమంలోనే పరిటాల వర్గీయులు.. వాహనం ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా.. అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు తప్ప.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
ఇక, రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్సార్‌సీపీ-8, టీడీపీ-1 ఒక్క స్థానంలో విజయం సాధించగా.. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో దాడులు, దౌర్జన్యంతో ఎంపీపీ పదవి కైవసం చేసుకోవాలని టీడీపీ కుట్రలు పన్నుతోంది. ఇందులో భాగంగానే టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు.