చేతులు కలిపి సంఘీభావం ప్రకటిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు
వేలాదిగా తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు జై జగన్ నినాదాలతో హోరెత్తిన సభ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని వివరించిన నేతలు అనంతపురం జిల్లా రాప్తాడులో సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వేలాదిగా తరలి వచ్చి..విజయయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, నేతలు మాట్లాడుతూ.. ‘బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు అణిచివేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేయి పట్టుకుని అభివృద్ధి పథం వైపు నడిపించారు. ఆయన తెచ్చిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటా వెలుగులు నిండాయి’ అని చెప్పారు.
రాప్తాడు సాధికార మహోత్సవం అపూర్వం
సాక్షి,అమరావతి/రాప్తాడు రూరల్: ఫ్యాక్షన్‌ను తోసిరాజని అనంతపురం జిల్లా రాప్తాడులో సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. రాయలసీమ ప్రాంతంలో కీలక నియోజకవర్గం అయిన రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల ఆదరాభిమానాలతో సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం అపూర్వ రీతిలో ఉత్సవంలా సాగింది. వేలాదిగా తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ ప్రజలు విజయయాత్ర చేశారు. ముఖ్యంగా మహిళలు కూడా పెద్దసంఖ్యలో తరలిరావడం విశేషం.
సీఎం వైఎస్ జగన్ పాలనలో తమకు లభించిన ప్రాధాన్యతను, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సభకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు పోటెత్తారు. సీఎం జగన్ నామస్మరణతో సభా ప్రాంగణం మార్మోగింది. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు వివరించినప్పుడు ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగనే గెలవాలి .. జగనే కావాలి’ అంటూ ఒకే గళమై నినదించారు.
దేశ చరిత్రలో ఒకే ఒక్కడు : కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్
దేశ చరిత్రలో సామాజిక న్యాయం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ చెప్పారు. సీఎం జగన్ అణగారిన వర్గాలకు అండగా నిలిచి, వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారని తెలిపారు. ఆయన తీసుకొచ్చిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటా వెలుగులు నిండాయన్నారు.
సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ఎంత మేలు జరిగిందనేది ఇక్కడికి వచ్చిన జనాలే సాక్ష్యమన్నారు. మీ ఇంటికి మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి.. లేదంటే వద్దని ధైర్యంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలను మరింతగా అణచివేసిన నాయకుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు పార్టీకే గ్యారంటీ లేదు కానీ ప్రజలకు ష్యూరిటీ ఇస్తాడట అని వ్యాఖ్యానించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నతంగా బతుకుతున్నారు: మంత్రి మేరుగు
‘మంత్రివర్గంలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్ పర్సన్ ఈ వర్గాల వారే. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్లోనూ ఈ వర్గాలకే ప్రాధాన్యం. నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకే పెద్ద పీట. ఏ సంక్షేమ పథకం తీసుకున్నా లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సీఎం వైఎస్ జగన్ పాలనలో ఈ వర్గాలు ఉన్నతంగా బతుకుతున్నాయి.
ఇదే అసలైన సామాజిక సాధికారత’ అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. చంద్రబాబు హయాంలో అవహేళనకు, హింసకు గురైన ఈ వర్గాలు ఇప్పుడు తలెత్తుకొని తిరుగుతున్నాయని వివరించారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోక కత్తిరిస్తా, బీసీలు జడ్జీలుగా పనికి రారంటూ రకరకాలుగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. బాబు మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధ హక్కులన్నీ కాల రాశారన్నారు. అన్ని వర్గాలను ఆదరించి, ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యం: ఎంపీ నందిగం సురేష్
జగనన్న సీఎం అయ్యాక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యం నడుస్తోందని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ప్రతి కులానికీ దన్నుగా నిలిచారని తెలిపారు. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలు, పార్టీ పదవుల్లో 75 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించారని, సీఎం వైఎస్ జగన్ దేవుడు పంపిన వ్యక్తి అని అన్నారు. మనల్ని ఆదుకున్న జగనన్నకు అండగా ఉందామని పిలుపునిచ్చారు.
నేడు రాయదుర్గంలో బస్సు యాత్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు సాధించిన అభివృద్ధిని, సాధికారతను వివరించేందుకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్రంలో విజయవంతంగా సాగుతోంది. సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడులో యాత్ర అద్భుత రీతిలో జరిగింది. మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment