సాక్షి, తాడేపల్లి: జేసీ కుటుంబం అరాచకాలపై తాడిపత్రి వైఎస్సార్‌సీపీ నేత కందిగోపుల మురళి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం జేసీ వర్గీయులు తమ ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారని ధ్వజమ్తెతారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాయలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వీడియో తీస్తుంటే మావాళ్ల ఫోన్లను లాక్కున్నారంటూ.. దాడి ఘటనను ఆయన వివరించారు.
‘‘మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాల్ చేస్తే ఆయన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాను. కారులో వెళ్తుంటే నాపై దాడి చేసేందుకు జేసీ మనుషులు వచ్చారు. నేను భయపడి వెనక్కి వచ్చేశాను. కాసేపటికే వారంతా మా ఇంటి మీదకు వచ్చారు. వందల మంది వచ్చి దాడులు చేశారు. ఇనుప తలుపులను సైతం పగులకొట్టి లోపలకు వచ్చారు. మారణాయుధాలు చేతపట్టుకుని వచ్చి దాడి చేశారు. తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. ఫోన్లు చేసిన పోలీసులు రాలేదు. పదేపదే ఫోన్లు చేస్తే 45 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు’’ అని మురళి చెప్పారు.
‘‘నాకు గన్ లైసెన్స్ ఉన్నా ఫైరింగ్ చేయలేదు. గతంలో కూడా ఒకసారి మా ఇంటిపై దాడి చేసి లూఠీ చేశారు. బంగారం దోచుకుపోయారు. ఇరవై ఏళ్ల తర్వాత జేసీ కుటుంబాన్ని ఓడించాం. మళ్లీ ఓడిస్తాం. ఏం ఉన్నా రాజకీయంగా పోరాడతాం. జేసీ కుటుంబం ఇలా ఇళ్లపై దాడులకు దిగటం మంచిది కాదు. రాయలసీమలో ఐదేళ్లుగా శాంతిభద్రతలు బాగున్నాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.’’ అని మురళి పేర్కొన్నారు.
15 ఏళ్లుగా నాకు గన్ లైసెన్స్ ఉంది. గొడవ అంతా అయిపోయిన తర్వాతే గన్ తీసుకుని బయటకు వచ్చాను. అయితే నేనే టీడీపీ వారిపై దాడి చేసినట్లుగా కేసులు పెట్టారు. చిన్నపిల్లలు, ఆడవారిపై జేసీ కుటుంబం దాడులు చేయడమేంటి?. జేసీ ప్రభాకరరెడ్డి చేసే రాజకీయాలు ఇవేనా?. చంద్రబాబూ.. జేసీ కుటుంబాన్ని అదుపులో పెట్టండి. ఒక విలేకరిని నేను బెదిరించినట్టుగా అక్రమ కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులకు దిగొద్దు’’ అని మురళి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment