అనంతపురం, సాక్షి: అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతుండడంతో.. నియోజకవర్గంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటన అనంతరం చెలరేగిన హింస నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారక్కడ.
ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు నిన్న(మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన. ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో తాడిపత్రి అంతటా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలతో పాటు రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోం శాఖలకు సైతం ఫిర్యాదులు పంపారు. ఈ సందర్భంగా జేసీపై కే. పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు.
‘‘నా హత్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్ర పన్నారు, నన్ను చంపి తాడిపత్రి లో రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేయాలని జేసీ భావిస్తున్నారు. 2006లో మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి హత్య చేయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతా. త్వరలో తాడిపత్రి కి వెళ్లి వైఎస్సార్ సీపీ శ్రేణులకు అండగా ఉంటా అని అన్నారాయన.
వంద మంది టీడీపీ గుండాలొచ్చారు
దాడి ఘటనపై తాడిపత్రి వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి సాక్షితో మాట్లాడారు. ‘‘జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చంపేందుకు స్కెచ్ వేశారు. నా ఇంటిపై వంద మంది టీడీపీ గూండాలు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి, నా ఇంటికి నిప్పు పెట్టారు. తలుపులు పగులగొట్టి నన్ను చంపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. నాకు లైసెన్స్ తుపాకీ ఉంది.. అయినప్పటికీ కాల్పులు జరపలేదు. ప్రాణ రక్షణ కోసమే తుపాకీ చేతిలో పట్టుకున్నాను. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాకు గన్ మెన్ తొలగించారు అని అన్నారాయన. మురళి భార్య రమా మాట్లాడుతూ.. ఇలా దాడి జరగడం రెండోసారి అని చెప్పారామె.
‘‘టీడీపీ గూండాలు మా ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. గంటసేపు బెడ్ రూం లో దాక్కుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాక్కున్నాం. మా ఇంటిపై దాడి టీడీపీ నేతలు దాడి చేస్తే... నా భర్త కందిగోపుల మురళి పై అక్రమ కేసులా?. ఇదెక్కడి న్యాయం?’’
:::మురళి భార్య రమాదేవి
Comments
Please login to add a commentAdd a comment