తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్‌లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరి
మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్‌లో..
3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్‌లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలు
రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణ
సిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్‌తో వైఎస్సార్‌సీపీలో జోష్
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్సార్ సర్కిల్‌లో ఆదివారం ఉ.10 గంటలకు నిర్వహించే బహిరంగసభతో ఈ ప్రచార భేరి మోగించనున్నారు.
అనంతరం.. మ.12.30కు తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్‌లో నిర్వహించే బహిరంగసభలోనూ.. అలాగే, మ.3 గంటలకు నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో జరిగే సభలోనూ సీఎం జగన్ పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్వహించిన సిద్ధం సభలకు జనం సునామీలా పోటెత్తారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభలుగా నిలిచాయి.
రేపటి ప్రచారం ఇలా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 29న (సోమవారం) అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన షెడ్యూల్ విడుదల చేశారు. 29 ఉ.10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో.. అదేరోజు మ.12.30కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో.. సా.3.00 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరు సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారన్నారు.
కూటమి కకావికలు...
మరోవైపు.. టీడీపీ–జనసేన–బీజేపీ మూడు పార్టీలు కూటమిగా జట్టుకట్టాక తాడేపల్లిగూడెం, చిలకలూరిపేటలో నిర్వహించిన సభలతోపాటు చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారానికి జనస్పందన కన్పించకపోవడంతో కూటమి శ్రేణులు డీలాపడ్డాయి. 2014 ఇదే కూటమి ఎడాపెడా హామీలిచ్చేసి, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మోసంపై ఇప్పటికీ ప్రజలు రగిలిపోతున్నారు. 2019 ఎన్నికల్లో విడిపోయి మళ్లీ ఇప్పుడు మరోసారి జనసేన, బీజేపీతో టీడీపీ జట్టుకట్టడాన్ని పచ్చి అవకాశవాదంగా ప్రజలు పరిగణిస్తున్నారని.. అందుకే కూటమి సభలకు జనం మొహం చాటేస్తున్నారని రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. ఇది కూటమి శ్రేణులను కకావికలం చేస్తోంది.
వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నయాజోష్..
ఇక సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. బస్సుయాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ ఎన్నికల మలివిడత ప్రచారానికి శ్రీకారం చుడుతుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నయాజోష్ నెలకొంది.
ఉప్పొంగుతున్న అభిమాన సంద్రం..
ఎన్నికల తొలివిడత ప్రచారంలో భాగంగా గతనెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నుంచి సీఎం జగన్ ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 23 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో 2,188 కిలోమీటర్ల దూరం సాగి, ఈనెల 24న శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద ముగిసింది. ఈ యాత్రకు జనం తండోపతండాలుగా పోటెత్తడంతో నైతిక స్థైర్యం దెబ్బతిన్న కూటమి శ్రేణులు కుదేలయ్యాయి. బస్సుయాత్రలో మండుటెండైనా.. అర్థరాత్రయినా అభిమాన సంద్రం ఉప్పొంగింది.
ఇక ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడం.. సుపరిపాలన అందించడం ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలమైన నమ్మకాన్ని బస్సుయాత్ర ప్రతిబింబించిదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో పాదయాత్ర తరహాలో ఇప్పుడు బస్సుయాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా సీఎం జగన్ మార్చేశారని తేల్చిచెబుతున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని జాతీయ, ప్రతిష్టాత్మక పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన 20కి పైగా సర్వేలు తేల్చిచెప్పడమే అందుకు తార్కాణం.
Comments
Please login to add a commentAdd a comment