టీడీపీ తుదిజాబితాపై కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాలలు
అనంతపురంలో పార్టీ కార్యాలయానికి నిప్పు
గుంతకల్లు కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం
చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టిన కార్యకర్తలు
గుమ్మనూరు జయరాం టికెట్‌పై చెలరేగిన నిరసనలు
సత్యవేడులో ఆదిమూలం మాకొద్దంటూ ర్యాలీ
చీపురుపల్లి టీడీపీలో ‘కళ’కలం
అనపర్తిపై ఫలించని ‘దేశం’ రాయబారం
తంబళ్లపల్లెలో ఆవిర్భావ దినోత్సవానికి వర్గపోరు
రాజంపేటలో ఎగిసిపడిన అసంతృప్తి జ్వాలలు
బద్వేలు టీడీపీ అభ్యర్థికే బీజేపీ సీటంటూ ఆగ్రహం
‘గంటా’కు రూ. కోట్లున్నాయని టికెట్ ఇచ్చారంటూ ధ్వజం
సాక్షి, నెట్‌వర్క్: విపక్ష కూటమిలో ఏర్పడిన టికెట్ల ముసలం చల్లారేలా కన్పించడం లేదు. టికెట్ల కేటాయింపులో న్యాయం జరగలేదని ఎక్కడికక్కడ తెలుగు తమ్ముళ్లు నిరసనలు, ర్యాలీలతో రోడ్డెక్కుతున్నారు.టీడీపీ ఆఖరి జాబితాపై పార్టీలో అసంతృప్తి వెల్లువెత్తింది. అభ్యర్థులను మార్చాలంటూ ప్లెక్సీలు చించుతూ కరపత్రాలు తగలబెట్టారు. నెల రోజుల క్రితం గుమ్మనూరు జయరాంను చంద్రబాబు, లోకేశ్ తిట్టని తిట్టు లేదు. ఇప్పుడు ఆయనకే అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు.
అనంతపురం అర్బన్ స్థానంలో సీనియర్ నేత ప్రభాకర్ చౌదరిని కాదని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో గుంతకల్లు, అనంతపురం నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. జయరాంకు టికెట్ కేటాయించినట్లు ప్రకటించగానే జితేందర్‌గౌడ్ వర్గీయులు ఆగ్రహించి పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ జయరాంకు పార్టీ అమ్ముడు పోయిందంటూ నినాదాలు చేశారు.
అనంతపురం అర్బన్‌లో తన పేరు లేకపోవడంతో ప్రభాకర్ చౌదరి తన అనుచరులతో స్థానిక రామ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్‌ను బయటపడేసి కార్యకర్తలతో నిప్పు పెట్టించారు. ఫర్నీచర్ మొత్తం మంటల్లో కాలిబూడిదైంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. ఫ్లెక్సీలు, ఫొటోలు, కరపత్రాలు మంటల్లో కాలిపోయాయి.
చంద్రబాబు ఫ్లెక్సీలు, కరపత్రాలకు నిప్పు
పాడేరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా కిల్లు రమేష్ నాయుడును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి టికెట్ రాకపోవడంతో ఆమె అనుచరులు శుక్రవారం రాత్రి చంద్రబాబు ఫొటోలతో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు, కరపత్రాలకు నిప్పంటించారు. రమేష్‌నాయుడుకు సహకరించేది లేదని అధిష్టానాన్ని హెచ్చరించారు. పాడేరు టికెట్ సీనియర్ నేత ఎంవీవీ ప్రసాద్‌కు కేటాయించకపోవడంపై శుక్రవారం కొయ్యూరులో టీడీపీ శ్రేణుల ఆందోళన చేపట్టారు. టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టారు.
సత్యవేడు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం మాకొద్దంటూ అసమ్మతి నాయకులు శుక్రవారం ఎన్‌ఆర్‌ఐ రమే‹Ùబాబు నేతృత్వంలో తిరుపతిలో సమావేశమయ్యారు. ఆదిమూలంకు సహకరించబోమని, ఇప్పటికైనా కొత్త అభ్యర్థిని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. చీపురుపల్లి టికెట్‌ను కిమిడి కళా వెంకటరావుకు కేటాయించడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తన పదవులకు రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఎంతో కష్టపడి పని చేసిన తనను కాదని వేరే ఎవరినో తెచ్చి పెట్టాల్సిన పనేముందని ప్రశ్నించారు.
భవిష్యత్ కార్యాచరణ రెండు రోజుల్లో వెల్లడిస్తానన్నారు. నాగార్జున వెంటే మండల నాయకులు రాజీనామాల బాటలో నడిచారు. నాగార్జున నివాసం వద్ద చంద్రబాబు ఫొటోలతో ఉన్న కరపత్రాలను దహనం చేశారు. అనంతరం మూడు మండలాల నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని మూడు రోడ్ల జంక్షన్‌కు చేరుకుని విజయనగరం–రాజాం ప్రధాన రహదారిపై చంద్రబాబు ఫొటోలతో ఉన్న కరపత్రాలను తగలబెట్టి వ్యతిరేక నినాదాలు చేశారు.
నెల్లిమర్లలో గరంగరం
‘టీడీపీలో సొమ్ము ఉన్నవాళ్లకే సీట్లు ఇస్తారా? ఇదెక్కడి న్యాయం? నాలుగేళ్లు ఇంట్లో కూర్చొన్న గంటా శ్రీనివాసరావుకు రూ. కోట్లు ఉన్నాయని భీమిలి టికెట్ ఇచ్చారు. ప్రతి రోజూ పార్టీ కోసం కష్టపడిన నాలాంటి వాళ్లను పక్కనబెట్టారు’ అని విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం మండలం పోలిపల్లిలో సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు.
నెల్లిమర్ల టికెట్ తనకేనని అరచేతిలో వైకుంఠం చూపించిన పార్టీ అధిష్టానానికి బుద్ధి చెప్పాలని, స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సిందేనని వారంతా బంగార్రాజుకు మద్దతు పలికారు. నెల్లిమర్ల టికెట్ జనసేనకు ఇచ్చేశారని, న్యాయం చేయాలని అడిగితే భీమిలి పంపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. తీరా ఇప్పుడు ఆ భీమిలి సీటు గంటా శ్రీనివాసరావుకు ఇచ్చేశారని, విజయనగరం లోక్‌సభ టికెట్ నాన్‌లోకల్ వ్యక్తి కలిశెట్టి అప్పలనాయుడికి కట్టబెట్టారని బాధపడ్డారు.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మొదట నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించి తర్వాత టికెట్ బీజేపీకి కట్టబెట్టడంతో నాలుగు రోజులుగా తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నారు. ఏకంగా ఆ పార్టీ జెండాలను, కరపత్రాలను తగులబెట్టి అధినేత తీరుపై ఆగ్రహావేశాలతో మండిపడ్డారు. అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న నల్లమిల్లిని బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానం రాయబారానికి దిగినా చర్చలు సఫలం కాలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నల్లమిల్లి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మూడు పార్టీలు.. మూడు దారులు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీలో అసంతృప్తులు, వర్గపోరు ముదిరింది. శుక్రవారం నియోజకవర్గంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గంతోపాటు సీనియర్ నేతలు కన్నెత్తి చూడలేదు. మరోవైపు నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ జనసేన పొత్తు జాడ కనిపించడం లేదు. ప్రచార కరపత్రాలు, బ్యానర్లలో జనసేన నాయకులు పేర్లు, ఫోటోలు లేకపోవడంపై బి.కొత్తకోట మండలం గట్టులో జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకులు టీడీపీ నేతలను నిలదీశారు. కరపత్రాలను చింపేశారు.
రాయచోటికి చెందిన మాజీ జెడ్పిటీసీ సుగవాసి బాలసుబ్రమణ్యంను రాజంపేట టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేయడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. సుగవాసి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. టీడీపీ కరపత్రాలను కాల్చివేశారు. క్లస్టర్ ఇన్‌చార్జితో సహా పదిమంది బూత్ కన్వినర్లు పార్టీకి రాజీనామా చేశారు. బత్యాల చంగల్రాయుడును రాజంపేట టీడీపీ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు కుట్రలో బీజేపీ పడిందని బీజేపీ నాయకులు పనతల సురేష్ ఆరోపించారు. టీడీపీ అభ్యర్ధిగా ఉన్న రోశన్నకు బీజేపీ కండువాను కప్పి ఆయనకు సీటును కేటాయించడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. అసలు రోశన్నకు బీజేపీలో సభ్వత్వమే లేదన్నారు. ఏ అర్హతతో రోశన్నకు టికెట్ కేటాయించారని మండిపడ్డారు.
గంటాకు సహకరించబోం..జనసేన నేతలు, వీరమహిళలు
‘జనసేన ఆవిర్భావం నుంచి నిరంతరం కష్టపడ్డాం. డబ్బు వృథా చేసుకున్నాం. భీమిలి నియోజకవర్గంలో జనసేనపార్టీ బలోపేతానికి ఎంతగానో కష్టపడితే నేడు టీడీపీ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం ఏంటని భీమిలి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ పంచకర్ల సందీప్‌ను జనసేన నాయకులు, వీరమహిళలు ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం ఎండాడ పార్టీ కార్యాలయంలో సందీప్ సమావేశం ఏర్పాటు చేశారు.
పార్టీ కోసం తాను కష్టపడి ప్రభు త్వంపై ఎన్నో పోరాటాలు చేశానని అయితే పార్టీ ఆదేశానుసారం ఉమ్మడి అభ్యర్థిగా గంటాను ప్రకటించారని సందీప్ చెప్పగా ఒక్కసారిగా జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. భీమిలి టికెట్ జనసేనకేనని ఎదురుచూశామని, టీడీపీకి ఎలా కేటాయి స్తారని, పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడిన మా భవిష్యత్తు ఏంటని నిలదీశారు. టీడీపీ అభ్యర్థి గంటాకు తాము మద్దతు ఇవ్వబోమ ని స్పష్టం చేశారు.
గంటా ఎక్కడి వాడు. ఎప్పు డు ఏ నియోజకవర్గంలో ఉంటాడో తెలియదు. ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో తెలీ దు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో కూడా తెలియదు. అలాంటి వ్యక్తికి తాము ఎలా మద్దతు ప్రకటించాలని ప్రశ్నించారు. గంటాకు మద్దతు ప్రకటించలేమని వారు తేల్చి చెప్పేశారు. మూడు రోజులు సమయం ఇస్తున్నామని, అభ్యర్థిని మార్చకుంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment