పల్నాడు, సాక్షి: చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు చెబుతారని.. అధికారంలోకి వచ్చాక మాయలు, మోసాలే ఉంటాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం ఉదయం చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
.. ఇది గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిగా ఏర్పడ్డారు. ఈ ఫాంప్లెట్ మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి.. ముఖ్యహామీలంటూ ప్రతి ఇంటికీ పంపించారు. నేను ఇవాళ అడుగుతున్నాను. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?
చంద్రబాబు విఫల హామీలు
మొదటిది.. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా?. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాల్లో.. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?. మూడో ముఖ్యమైన హామీ.. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. రూ.25 వేల కథ దేవుడెరుగు.. కనీసం ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో వేశారా?..
ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా అన్నారు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు. చంద్రబాబు హయాంలో చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నారు , చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు. సింగపూరుకు మించి అభివృద్ధి అన్నారు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు?.. జరిగిందా?
మరి నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మొచ్చా? అక్కా నమ్ముతారా? అన్నా నమ్ముతారా? చెల్లి నమ్ముతారా? మరి ఆలోచన చేయమని అడుగుతున్నాను. మళ్లీ ఇదే ముగ్గురూ కూటమిగా ఏర్పడ్డారు. కూటమిగా ఏర్పడి ఏమంటున్నారు? ఇవాళ మళ్లీ కొత్త మేనిఫెస్టో అంట, సూపర్ సిక్స్ అంట.. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా?.. ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.
చంద్రబాబు పెట్టే ప్రలోభాలకు లొంగిపోవద్దు. ఈ ఐదు సంవత్సరాల మీ బిడ్డ పాలనలో క్యాలెండర్ ఇచ్చి మరీ.. ఏ నెలలో అమ్మ ఒడి, చేయూత అని ఫలానా నెలలో ఫలానా ఇస్తామని చెప్పి మరీ మేలు చేశాడు. పొరపాటును చంద్రబాబు ప్రలోభాలకు మోసపోయి.. ఇంటికి జరుగుతున్న మంచిని పొగొట్టుకోవద్దు.
వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే రావాలన్నా.. నొక్కిన బటన్ డబ్బులు మళ్లీ నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాలో పడాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.
ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి. వైఎస్సార్‌సీపీ తరఫున ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావటి మనోహర్ నాయుడు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ కుమార్ యాదవ్‌లను గెలిపించాలని సీఎం జగన్ చిలకలూరిపేట ప్రజలను కోరుతూ ప్రసంగం ముగించారు.
సెల్ఫీతో సీఎం జగన్ సందడి
చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం ముగించుకుని కైకలూరు బయల్దేరిన సమయంలో కొందరు అభిమానులు సీఎం జగన్‌తో సెల్ఫీ కోరారు. తన ప్రచార రథం దిగి కిందకు వచ్చిన ఆయన.. వాళ్లతో సరదాగా సెల్ఫీ దిగారు. ఆపై అశేష జనవాహిని నడుమ సీఎం జగన్ ప్రచార రథం నెమ్మదిగా ముందుకు సాగింది.
Comments
Please login to add a commentAdd a comment