కూటమిలో కుతకుత | Sakshi
Sakshi News home page

కూటమిలో కుతకుత

Published Mon, Apr 1 2024 4:17 AM

A unity not seen anywhere in the state among the leaders - Sakshi

రాష్ట్రంలో ఎక్కడా నేతల మధ్య కనిపించని ఐక్యత    

క్షేత్రస్థాయిలో నాయకుల అసంతృప్తి ప్రకంపనలు

అభ్యర్థులకు సహకరించేందుకు అసంతృప్తులు ససేమిరా

జగ్గయ్యపేటలో తాతయ్యకు టికెట్‌పై మండిపడుతున్న కేడర్‌

అధిష్టానంపై అసంతృప్తితో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా రాజీనామా

పాడేరులో అభ్యర్థి ఎంపికపై శ్రేణుల వ్యతిరేకత

అనంతపురం అర్బన్‌లో టీడీపీ రెబల్‌గా పోటీ చేయనున్నట్టు ప్రభాకర చౌదరి వెల్లడి

రంపచోడవరంలో మిరియాల శిరీషకు తమ్ముళ్ల నుంచి నిరసన సెగ

నందిగామ అభ్యర్థి తంగిరాల సౌమ్యను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

గుంతకల్లులో గుమ్మనూరుపై దేశం శ్రేణుల గుర్రు

మార్కాపురంలో టీడీపీ, బీజేపీల మధ్య ఫ్లెక్సీల చిచ్చు

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటిపై జనసేన నాయకుల ఆగ్రహం

అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై స్వపార్టీలోనే నిరసన

సాక్షి నెట్‌వర్క్‌: క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటలు చల్లారడం లేదు. టికెట్‌ ఆశించి భంగపడినవారు అక్కడి అభ్యర్థులకు సహకరించడానికి ససేమిరా అంటున్నారు. టికెట్‌ దక్కించుకున్నవారితో నేరుగా వాదులాటకు దిగుతు­న్నారు. కొందరు నాయకులు అభ్యర్థిత్వాల ఎంపి­కకు నిరసనగా రాజీనామా చేస్తుండగా... మరికొందరు ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచేందుకు సన్నా­హాలు చేసుకుంటున్నారు.

మరికొన్ని చోట్ల ప్రచారా­న్ని అడ్డుకుంటున్నారు. తమకు నచ్చని వ్యక్తులకు అధిష్టానం టికెట్‌ ఖరారు చేయ­డంతో వారిని ఎలా­గైనా ఓడించాలనే పట్టుదలతో పావులు కదుపుతు­న్నారు. జరుగుతున్న పరిణామా­లు కూటమి నేత­లకు శిరోభారంగా మారుతు­న్నాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఆయా అభ్యర్థులకు ఎదురుగాలి తప్పదని శ్రేణులు ఖరాకండీగా చెబుతున్నాయి. జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ము­లాటలు తారస్థాయికి చేరాయి.

అక్కడ గత ఎన్ని­కల్లో ఓడిపోయిన శ్రీరాం రాజగోపాల్‌ (తాతయ్య)కు టికెట్‌ ఇవ్వడాన్ని మాజీమంత్రి నెట్టెం రఘురాం, బీఆర్కే చానల్‌ యజమాని, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతి­నిధి బొల్లా రామకృష్ణ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గంలో సుమారు 40 వేల ఓటుబ్యాంకు కలిగిన కమ్మ సామాజికవర్గానికి గడచిన నాలుగు పర్యాయాల నుంచి టికెట్‌ కేటాయించకుండా అవమానిస్తోందని ఆ సామాజికవర్గ నేతలు మండిపడుతున్నారు. 

పాడేరు అసెంబ్లీ టికెట్‌పై కొనసాగుతున్న టీడీపీ నిరసన
పాడేరు అసెంబ్లీ టీడీపీ టికెట్‌ కిల్లు రమేష్‌నాయుడుకు కేటాయించడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసన కొనసాగిస్తున్నారు. జీసీసీ మాజీ చైర్మన్‌ ఎం.వి.ఎస్‌.ప్రసాద్‌కు టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కొయ్యూరులో ఆదివారం ఆ పార్టీ నేతలు పార్టీ జెండాలతో నిరసన తెలిపారు. రెండు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న ప్రసాద్‌కు అన్యాయం చేయడం తగదని అధిష్టానం నిర్ణయంపై మండిపడ్డారు. రమేష్‌ నాయుడు ఎవరో కనీసం కార్యకర్తలకు కూడా తెలియదని, అలాంటి వ్యక్తికి సీటు ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు ప్రభాకర్‌ చౌదరి నిర్ణయం
అనంతపురం అర్బన్‌ నుంచి అభిమానులు కోరితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సిద్ధమని టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి వెల్లడించారు. ఆదివారం ఆయన అనంతపురంలోని కమ్మభవన్‌లో పార్టీ కార్యకర్తలు, తన వర్గీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్కడ టీడీపీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ను ఎంపిక చేయడం సరికాదన్నారు. ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడి ఆస్తులు కోల్పోయానని, కేసుల్లో ఇరుక్కున్నానని, అయినా అధిష్టానం తన శ్రమను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని మిరియాల శిరీషా దేవిని తక్షణమే మార్చాలని రాజవొమ్మంగి మండలంలోని 19 పంచాయతీలకు చెందిన టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం రాజవొమ్మంగిలో వారు సమావేశమై అభ్యర్థిని మార్చకుంటే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. 
ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ కూటమి అభ్యర్థి తం­గిరాల సౌమ్య వీరులపాడు మండలం పెద్దా­పు­రం గ్రామంలో ఆదివారం రాత్రి ‘మన పల్లెకు మన సౌమ్య’ కార్యక్రమం ముగించుకుని వస్తుండగా కార్యకర్తలు అడ్డగించారు. గ్రామంలో నిర్వ­హించే కార్యక్రమాలకు పార్టీ అధ్యక్షుడికి సమా­చారం ఇవ్వకపోవడంపై మహిళలు మండిపడ్డారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ టీడీపీ టికెట్‌ గుమ్మనూరు జయరామ్‌కు కేటాయించడాన్ని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌.జితేంద్రగౌడ్‌ తప్పు పట్టారు. 
గుంతకల్లులోని తన కార్యాలయంలో పార్టీ క్లస్టర్, బూత్‌ ఇన్‌చార్జులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో అధినేత పునరాలోచన చేయకపోతే దేనికైనా సిద్ధంగా ఉండాలని తన వర్గీయులకు పిలుపునిచ్చారు. 

టీడీపీ, బీజేపీ మధ్య ఫ్లెక్సీల రగడ
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం నిర్వహించిన చంద్రబాబు ప్రజాగళం యాత్ర సభ టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చుపెట్టింది. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటో లేకపోవడంపై ఆ పార్టీ బీజేవై­ఎం రాష్ట్ర ఐటీ సెల్‌ కన్వీనర్‌ జి.వి.రెడ్డి, టీడీపీ నేత­లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా కిసాన్‌­మోర్చా ఇన్‌చార్జి కె.వి.రమణారావు కూడా టీడీపీ నేతల తీరును ఎండగట్టారు. పేరుకే కూట­మిలో ఉన్నప్పటికీ తమకు ఏమాత్రం టీడీపీ నాయకులు విలువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 అరకు ఎంపీ టిక్కెట్‌ ఆర్థిక నేరస్తురాలైన కొత్త­పల్లి గీతకు ఎలా ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్య­క్షు­రాలు పురంధేశ్వరిపై ఆ పార్టీ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు నిమ్మక జయరాజ్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గీత నిజమైన ఎస్టీ కాదని కూడా చెప్పారు. 
అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ జనసేన కార్యకర్తలను విస్మరిస్తున్నారని పార్టీ అద్దంకి మండల కార్యదర్శి సాధు వెంకటేష్‌ అన్నారు. ఆదివారం ఆయన విలేకర్లతో మా­ట్లా­డుతూ సంతమాగులూరు మండలంలో ఎన్ని­కల ప్రచారంలో ఉద్దేశ పూర్వకంగానే జనసైని­కులను దూరం పెడుతున్నారని ఆరోపించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement