సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏమాత్రం నమ్మకం లేని ఆ పార్టీ సీనియర్ నేతలు ‘సెల్ఫ్ షో’లకు దిగుతున్నారు. ఏదో సాకుతో తీవ్రస్థాయిలో హడావుడి చేస్తేగాని తమకు టికెట్ దక్కేట్టు లేదన్న అనుమానాలతో భావోద్వేగాల ముసుగేస్తున్నారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటామంటూ నానా హంగామాతో రక్తి కట్టించేందుకు యత్నిస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో ప్రధానంగా బాబు సామాజిక వర్గానికే చెందిన వివిధ జిల్లాల సీనియర్ నేతలు ఉండటం గమనార్హం.
వైఎస్సార్సీపీపై ఒంటరిగా పోటీచేసి ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవలేమనే నిర్ధారణకు వచ్చిన బాబు జనసేనతో సహా కలిసొచ్చే ఏ పార్టీనైనా కలుపుకుని ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికొచ్చి పావులు కదుపుతున్నది బహిరంగ రహస్యమే. మరోవైపు బాబు, లోకేశ్ పలు నియోజకవర్గాలలో వేర్వేరుగా మద్దతిస్తూ నేతల మధ్య పోటీ పెంచుతున్నారనే చర్చ పార్టీలో జరుగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో తమకు సీటు నిరాకరిస్తారేమోననే అనుమానాలతో ఎవరికివారు వ్యక్తిగత వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్, పులివర్తి నాని, యరç³తినేని శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నారు.
ఆలపాటి అలక..
గుంటూరు జిల్లా తెనాలి సీటును జనసేనకు కేటాయిస్తారని, సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారనే ప్రచారం విస్తతంగా జరుగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి ఓటమిపాలైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తనకే టికెట్ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. తెనాలిలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలపాటికే టికెట్ ఇవ్వాలని, లేదంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు చేసుకుంటామని ఆయన అనుయాయులు వేదికనెక్కి గందరగోళం చేశారు.
ఆరేడు శాతం ఓట్లు కూడా లేని మనోహర్‌కు సీటివ్వాలని కోరడమేంటని నిలదీశారు. మీటింగ్ హాల్ బుక్ చేసింది, సమావేశానికి వెళ్లమని పురమాయించింది, పెట్రోల్ డ్రామాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎవరనేది టీడీపీ అధిష్ఠానం గుర్తించి సెల్ఫ్‌షోలు చాలించాలని తీవ్రస్థాయిలో హెచ్చరించడంతో ఆలపాటి వర్గం మౌనం దాల్చక తప్పలేదని స్వపక్షీయులు అంటున్నారు.
పులివర్తి ఆందోళన
చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి టీడీపీ ఇన్‌చార్జిగా పులివర్తి నాని వ్యవహరిస్తున్నారు. నానికి టికెట్ ఇవ్వవద్దని అదే నియోజకవర్గానికి చెందిన గల్లా అరుణకుమారి కుటుంబం అడ్డుకుంటోంది. మరో సామాజికవర్గానికి చెందిన రియల్టర్ పేరు బాబు పరిశీలనలో ఉందని తెలియడంతో టికెట్ దక్కించుకునే ఎత్తుగడలో పులివర్తి తనదైన శైలిలో డ్రామాకు తెరతీశారని పరిశీలకులు అంటున్నారు. ఓటర్ల చేర్పులు, తొలగింపుల్లో అక్రమాలు జరిగాయంటూ ఈనెల 8న తిరుపతి ఆర్డీవో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగిన నాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ నానా హంగామా చేశారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన చంద్రబాబు నానిని పరామర్శించారు కూడా.
యరపతినేని ఎత్తుగడ
పల్నాడు జిల్లా గురజాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎత్తుగడ మరోవిధంగా ఉందని ఆ పార్టీ నాయకుల్లోనే చర్చ జరగుతోంది. సీటు దక్కుతుందో.. లేదోనన్న అనుమానంతో యరపతినేని పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. వైఎస్సాఆర్‌సీపీ వారే ఇలా చేయించారని ఆయన ధ్వజమెత్తారు. వాస్తవంగా తప్పుడు ట్రోల్ చేయించింది ఎవరనేది అధిష్ఠానానికి బాగా తెలుసని టీడీపీలోని నాయకులే అంటున్నారు.
బాబును నమ్మిబాగుపడినోడు లేడు
విజయవాడ ఎంపీ కేశినేని నాని సొంత సోదరుల మధ్య రాజకీయ వివాదం రేపింది, సీటు అంశంలో వారివురిని తగాదా వరకు తీసుకెళ్లింది, పార్టీలోని ఇతర నాయకుల చేత ఎంపీని తిట్టించింది ఎవరనేది అందరికీ తెలిసిందేనని పరిశీలకులు అంటున్నారు. బాబును నమ్మి బాగుపడినోడు లేడనేది స్వపక్షీయుల మాట. ఈ విషయం ముఖ్యంగా ఆయన సామాజికవర్గానికి చెందిన సన్నిహిత సీనియర్లకు బాగా తెలుసని గుర్తుచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment