సాక్షి, అమరావతి: సీట్ల కేటాయింపు తర్వాత టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడటంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. అలక పాన్పు ఎక్కిన నేతలను పిలిచి సర్దిచెబుతున్నారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో సీనియర్ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజా, గంటా శ్రీనివాసరావు, పీలా గోవింద సత్యనారాయణ, బొడ్డు వెంకట రమణలతో విడివిడిగా చర్చలు జరిపారు.
► తొలి జాబితాలో సీటు దక్కని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు మరోసారి సూచించారు. తనను ఓడిపోయే చోటకు ఎందుకు పంపుతున్నారని గంటా ప్రశ్నించడంతో గెలుస్తావంటూ ఒప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. గంటా ఇందుకు ససేమిరా అంటూ భీమిలి లేదా విశాఖ జిల్లాలో ఏదైనా సీటు ఇవ్వాలని కోరారు. జి.మాడుగుల, చోడవరం స్థానాలకు తన పేరు పరిశీలించాలని కోరినట్లు తెలిసింది.
► మైలవరం సీటు తనకే ఇవ్వాలని దేవినేని ఉమామహేశ్వరరావు కోరగా ఆ సీటు వసంత కృష్ణప్రసాద్‌కి ఇస్తున్నానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయం చూస్తానని దేవినేనికి సర్దిచెప్పారు. ఆయన పేరును పెనమలూరుకు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
► తెనాలిని జనసేనకు కేటాయించడంతో సీటు గల్లంతైన మాజీ మంత్రి ఆలపాటి రాజాతో చంద్రబాబు మంతనాలు జరిపారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆయన్ను బుజ్జగించినట్లు తెలిసింది. అయితే గుంటూరు జిల్లాలో ఏదైనా సీటు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.
► తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సీటును ఆశిస్తున్న బొడ్డు వెంకట రమణకు భవిష్యత్తులో న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన అసంతృప్తితో నిష్క్రమించారు.
అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందుకు నచ్చజెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. భవిష్యత్తులో అవకాశం ఇస్తానని పేర్కొనగా గోవింద్ అసంతృప్తిగా వెళ్లిపోయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment