ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమిని వీడుతున్న ముఖ్య నేతలు
తాడేపల్లిగూడెంలో ఈలి నాని టీడీపీకి గుడ్‌బై
ఆయన దారిలోనే నూజివీడు మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య
ఇటీవలే టీడీపీని వీడిన ఎన్‌ఆర్‌ఐ గోపాల్ యాదవ్
చేగొండి సూర్యప్రకాశ్, నౌడు వెంకటరమణలు జనసేనకు రాం రాం.. తాజాగా జనసేనకు రాజీనామా చేసిన ముమ్మిడివరం నేత పితాని
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేనలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆయా పార్టీల అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలకు మనస్తాపం చెందిన నాయకులంతా వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. ఆయా పార్టీల్లో ఎన్నాళ్లుగానో ఉంటూ కోట్లు ఖర్చుచేసి పార్టీ పటిష్టత కోసం పనిచేసినా టిక్కెట్ దక్కకపోవడం, అవమానాలకు గురికావడంతో కూటమిని వీడుతున్నారు. జనసేన, టీడీపీలో డబ్బులే ప్రామాణికంగా తీసుకుని టిక్కెట్లు కేటాయించడంపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు(నాని)కు తెలుగుదేశం పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం, పైగా ఆయన్ను అవమానించేలా వ్యవహరించడంతో ఆయన ఆ పార్టీని వీడారు.
నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగిన మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య టికెట్ విషయంలో తనకు అన్యాయం చేయడంతో ఆయన కూడా టీడీపీనుంచి బయటకు వచ్చారు. అవసరానికి తనను వాడుకుని కోట్లాదిరూపాయల ఆస్తులు పార్టీకోసం వెచ్చించిన తనకు చివరి నిమిషంలో ఎంపీ టికెట్ నిరాకరించడంతో ఎన్‌ఆర్‌ఐ గొరుముచ్చు గోపాల్‌యాదవ్ టీడీపీని వీడారు.
ఇక జనసేన పార్టీకోసం అహర్నిశలు కృషి చేసి... పార్టీ పురోభివృద్ధికి కృషి చేసినప్పటికీ తమను పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలు అవలంబిస్తుండటంతో చేగొండి సూర్యప్రకాశ్, నౌడు వెంకటరమణ ఆ పార్టీకి రాంరాం చెప్పారు. కాంగ్రెస్ విధానాలు నచ్చకపోవడంతో శెట్టి గురునాథం ఆ పార్టీని వీడారు. తాజాగా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన జనసేన నేత పితాని బాలకృష్ణ కూడా శెట్టిబలిజలకు ప్రాధాన్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీనుంచి బయటకు వచ్చారు. వారంతా వైఎస్సార్‌సీపీలో చేరేందుకు క్యూ కట్టారు.
ప్రధానంగా తాడేపల్లిగూడెం, ఆచంట, ఉంగుటూరు, నూజివీడు, చింతలపూడి, పోలవరంలో ముఖ్య నేతలు ఇవే కారణాలతో నేరుగా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఇక నియోజకవర్గ స్థాయిలో అయితే నిత్యం పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతున్నారు. బీసీలకు పట్టం కట్టడం, గడచిన ఐదేళ్లలో సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరడంతో పార్టీకి ఆకర్షితులై పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి.
ఈలి నానితో మొదలై..
తాడేపల్లిగూడెం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈలి వెంకట మధుసూదనరావు(నాని) ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. నియోజకవర్గంలో ఈలి కుటుంబానికి మంచి పేరుంది. ఆయన తండ్రి ఈలి ఆంజనేయులు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఆయన భార్య వరలక్ష్మి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆంజనేయులు ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.
నాని 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక పర్యాయం పనిచేశారు. రాజకీయంగా నియోజకవర్గంలో మంచి పేరుంది. 2019లో టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సుదీర్ఘ నేపథ్యం ఉన్నప్పటికీ పార్టీ అవమానకర రీతిలో వ్యవహరించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.
♦ నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య 2009లో ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఆ పార్టీ టికెట్ విషయంలో పరాభవం చెందడంతో
వైఎస్సార్‌సీపీలో చేరారు.
♦ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తనయుడు చేగొండి సూర్యప్రకాష్ జనసేన పార్టీలో ఆచంట ఇన్చార్జిగా పనిచేశారు. పార్టీలో ప్రాధాన్యం లేకపోవడం, ఇతర కారణాలతో జనసేనను వీడి ఫ్యాన్ గూటికి చేరారు.
♦ ఉంగుటూరులో జెడ్పీటీసీగా రాజకీయం ప్రస్థానం ప్రారంభించిన నౌడు వెంకటరమణ 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తరువాత రాజకీయంగా అక్కడ ప్రాధాన్యమివ్వకపోవడంతో ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరారు.
♦ జంగారెడ్డిగూడెంలో బలమైన కాంగ్రెస్ నేతగా గుర్తింపు ఉన్న జెట్టి గురునాథం పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారు. ఆయన కూడా కాంగ్రెస్ విధానాలు నచ్చక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరారు.
టీడీపీలో అవమానాలు ఎదుర్కొన్న గోపాల్
టీడీపీ ఎంపీ టిక్కెట్ ఆశావహి, ఎన్‌ఆర్‌ఐ గొరుముచ్చు గోపాల్‌యాదవ్‌కు టీడీపీలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. సింగపూర్‌లో వ్యాపారం చేసుకుంటున్న ఆయన్ను పిలిచి మరీ టిక్కెట్ నీదే, ఖర్చుకు వెనుకాడకుండా పనిచేయమని చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ చెప్పడంతో ఏడాది నుంచి ఏలూరు పార్లమెంట్ సీటు లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా పనిచేశారు.
యువగళం మొదలుకొని, చంద్రబాబు బహిరంగ సభల వరకు అనేక కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఖర్చుచేశారు. చివరికి హ్యాండ్ ఇచ్చి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్‌కు టిక్కెట్ ఇచ్చారు. మనస్తాపానికి గురైన గోపాల్ యాదవ్ వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎన్నికల వేళ కీలక నేతల రాకతో వైఎస్సార్‌సీపీ కేడర్‌లో కొత్త జోష్ నెలకొంది.
టికెట్లు అమ్ముకున్న పవన్: పితాని
ముమ్మిడివరం: జనసేన పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ కలసి టికెట్లు అమ్ముకున్నారని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి పితాని బాలకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో సానబోయిన మల్లికార్జునరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీకోసం కోట్లాదిరూపాయల ఆస్తిని అమ్ముకున్న తనకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సామాజిక న్యాయం కోసం పార్టీని ఏర్పాటు చేశానని చెప్పి, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఏ ఒక్కరికీ టికెట్ ఇవ్వకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని వాపోయారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శనివారం చేరనున్నట్టు ప్రకటించారు. కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల అభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నాదెండ్ల మనోహర్ వల్లే జనసేన పార్టీ సర్వనాశనం అయిందన్నారు.
సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ముమ్మిడివరంలో పొన్నాడ సతీ‹Ùకుమార్‌తో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీచేస్తున్న బీసీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని పితాని తెలిపారు. జనసేన పార్టీ అభ్యర్థులను ఓడించడమే తన ధ్యేయమని చెప్పారు. కాకినాడ మాజీ మేయర్ సరోజ కూడా నాదెండ్ల తీరుపై మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment