గుంటూరు, సాక్షి: లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా.. పవన్ కల్యాణ్ సినిమాలోని డైలాగ్ ఇది. కానీ, రియల్‌లైఫ్‌లో పవన్‌కు ఆ పంచ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రుచిచూపించన్నారా?. ఎన్నికల ప్రచారంలో ఇవాళ ఆఖరు తేదీ కాగా.. వైఎస్సార్‌సీపీ తరఫున చివరి ప్రచార సభను పిఠాపురంతోనే ముగించబోతున్నారు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్.
ఒకవైపు ఓట్ల కోసం కూటమి నేతల పరుగులు.. మరోవైపు 59 నెలల పాలన, జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూనే ప్రత్యర్థులపై పంచ్‌లతో సాగిన సీఎం జగన్ ప్రసంగాలు.. అన్నీ.. అన్నీ.. ఇవాళ్టి సాయంత్రంతో బంద్ కానున్నాయి. ఆ వెంటనే ఏపీలో సైలెంట్ పీరియడ్ మొదలుకానుంది. అయితే ఈ ఎన్నికల ప్రచారం సీఎం జగన్ దూకుడుతో.. ప్రత్యర్థి పార్టీలు ఏమాత్రం పోటీ పడలేకపోయాయన్నది వాస్తవం. ఇక సంక్షేమ పాలనతో దేశ రాజకీయాల్లోనే ట్రెండ్ సెట్టర్‌గా మారిన సీఎం జగన్.. ప్రచారంలోనూ కొత్త ఒరవడి సృష్టించారు.
కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి ఏపీలో ఎన్నికల ప్రచారం కొనసాగింది. అందుకు ప్రధాన కారణం.. సీఎం జగన్. ఎన్నికల కోసం పార్టీని ముందు నుంచే ‘సిద్ధం’ చేస్తూ వచ్చిన ఆయన.. 44 రోజుల్లో ఏకంగా 118 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి రికార్డు సృష్టించారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఆఖరికి ప్రచార సభలతో జనంలోకి వెళ్లి.. అపూర్వ స్పందన దక్కించుకున్నారు.
ప్రచార వేదికలపై ర్యాంప్ వాక్.. ఏ రాజకీయ నాయకుడి నుంచైనా ఊహించగలమా?. ఈ చర్యతో తన ప్రత్యేకతను చాటుకోవడం మాత్రమే కాదు.. ప్రత్యర్థులు, పచ్చ మీడియా ఎంతగా విషం చిమ్మిన ప్రజలకు ఎప్పుడూ తాను దగ్గరేనని చాటి చెప్పారు. తన సభలకు వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలతో ప్రసంగాలను మొదలుపెట్టి.. తనకు ఓటేస్తే పథకాల కొనసాగింపు, అదే చంద్రబాబుని నమ్మి ఓటేస్తే ఏం జరుగుతుందో గతాన్ని గుర్తు చేస్తూ మరి ఏపీ ప్రజలకు వివరించారాయన.
బాబుకి ఓటేస్తే.. చంద్రముఖి నిద్రలేచి లక లక అంటూ ప్రజల రక్తం తాగుతుంది
బాబుని నమ్మితే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే
జగన్‌కు ఓటేస్తే పథకాల కొసాగింపు.. ఇంటింటా అభివృద్ధి
అదే పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే.. పథకాల ముగింపు, మళ్లీ మోసపోవడమే
మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి
59 నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులు, బడుల మొదలు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అక్కచెల్లెమ్మలకు, అవ్వతాతలకు, అన్ని వర్గాలకు చేకూరిన లబ్ధిని వివరిస్తూ.. డీబీటీ ద్వారా బటన్‌నొక్కి నేరుగా 2 లక్షల 70వేల కోట్ల రూపాయలను ఎలాంటి సంక్షేమానికి ఖర్చు చేశారో వివరిస్తూ వచ్చారు. ‘‘మీ ఇంట మంచి జరిగితేనే నాకు అండగా ఉండాలని.. ఆలోచనతో ఓటు వేయాలి’’ అని కోరిన ఏకైక నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్నారు.
ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు పేదల తలరాతను మారుస్తాయని, పేదల మీద జగన్‌కు ఉన్నంత ప్రేమ మరెవ్వరికీ ఉండబోదని, పేద లబ్ధిదారులే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించుకుని.. వాళ్ల ద్వారానే జరిగిన సంక్షేమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని చెరిపేసి.. పవిత్రంగా భావిస్తూ 99 శాతం హామీల్ని అమలు చేయడం, ఇప్పుడూ ఆ మేనిఫెస్టోను ఇంటింటికి పంపించి ఆశీర్వదించడమని అడగడం.. అదే మేనిఫెస్టోతో 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది పూస గుచ్చినట్లు వివరించారాయన. సంక్షేమం కొనసాగాలన్నా.. వలంటీర్లు పెన్షన్లు అందించాలన్నా.. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని కోరారు. 175 సీట్లకు 175 అసెంబ్లీ సీట్లు, 25 కి 25 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా.. తగ్గేదేలే అంటూ ఎన్నికల కార్యాచరణ అమలు చేశారాయన.
విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచార భేరిలో దుమ్ము రేపిన సీఎం జగన్.. చివరి 12రోజుల్లో 34 సభల్లో పాల్గొని వైఎస్సార్‌సీపీ కేడర్‌లో ఫుల్ జోష్ నింపారు. ముఖ్యంగా.. కూటమి పార్టీల్లోని కీలక నేతల నియోజకవర్గాల్లో ఆయన ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడం గమనార్హం. అదే సమయంలో ప్రత్యర్థుల పేర్లను ప్రస్తావించకుండానే సాగిన ఆయన ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ సీఎం జగన్ చివరి మూడు ప్రచార సభలపై ఆసక్తి నెలకొంది. తొలుత చిలకలూరిపేట, కైకలూరు, ఆపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయబోయే పిఠాపురంలో జరగబోయే ప్రచార సభతో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో ఆ ఆఖరి ప్రచార సభలో సీఎం జగన్ ఎలాంటి పంచులు పేలుస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment