కర్నూలు, సాక్షి: గతంలో ఎన్నడూ చూడని విప్లవాత్మక మార్పులు ఈ 59 నెలల పాలన కాలంలోనే జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం వైఎస్సార్ సర్కిల్‌లోని ఎస్పీ కాంప్లెక్స్ రోడ్‌లో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ప్రచార భేరిలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
కర్నూలు.. సిద్ధమేనా?. ఇంతటి ఎండలో మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య ఇక్కడకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమాభిమానాలకు మీ బిడ్డ, మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు.
కేవలం నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదల్చుకున్నా. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయేవి ఈ ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు.. మళ్లీ మోసపోటమే. ప్రతీ ఒక్కరూ ఈ విషయం గుర్తు పెట్టుకోండి. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే.. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలకు అర్థం.
మంచి చేసిన మనందరి ప్రభుత్వం ఒకవైపు. గత చరిత్రను మారుస్తూ.. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ.. 99 శాతం హామీలు అమలు చేసింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల పాలనలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. ఇదే 59 నెలల కాలంలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్ల రూపాయిలు బటన్ నొక్కడం...నేరుగా నా అక్కచెల్లమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ అయ్యింది. అదీ ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా. గతంలో ఎప్పుడూ జరగని గొప్ప మార్పులివి.
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన, ఎనిమిదో తరగతి నుంచే పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, ఐబీ దాకా ప్రయాణం, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?.
పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా చూసారా?. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు అందులో 20 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం.. మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా జరిగిందా?.
రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను.
రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను. రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే.. ఇవన్నీ గతంలో చూశారా?
స్వయం ఉపాధికి అండగా, తోడుగా.. ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ జగనన్న తోడు చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. గతంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా?..
పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. పేదవాడికి ఆరోగ్య ఆసరా.. మొట్టమొదటిసారిగా పేదవాడి కోసం గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. జల్లెడ పడుతూ ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.
ఏకంగా 600 రకాల సేవలు అందించే గ్రామ సచివాలయం. 60-70 ఇళ్లకు ఒక వలంటీర్. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను. నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్‌లో దిశ యాప్. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా?.. ఎప్పుడైనా జరిగిందా? కేవలం 59 నెలల కాలంలో.. దేవుడి దయతో, మీ చల్లని ఆశీస్సులతో మీ బిడ్డ చేశాడు.
మాట్లాడితే 14 ఏళ్లు పాలించానని.. మూడు సార్లు సీఎం చేశానని చంద్రబాబు అంటారు. మరి ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి, సంక్షేమ పథకం అయినా గుర్తుకు వస్తుందా? అని కర్నూలు అశేష జనవాహిని నడుమ సీఎం జగన్ ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment