సామాజిక సాధికార బస్సు యాత్రలో నాయకులు.. నియోజకవర్గ స్థాయిలో ఉరవకొండలో నిర్వహించిన సాధికార యాత్రకు తరలివచ్చిన అశేష జనవాహిని
అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కల్పించిన సముచిత స్థానాన్ని తెలియజేసేందుకు చేపట్టిన ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ జైత్రయాత్రలా సాగుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్రకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.
సభా వేదిక ఏర్పాటుచేసిన పాత బస్టాండ్ ప్రాంతమంతా జన సంద్రమైంది. నియోజకవర్గ నలుమూలల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు తరలివచ్చి బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుందని వక్తలు పేర్కొనడంతో పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు.
ఆత్మగౌరవం నిలబెట్టిన వైఎస్సార్‌సీపీకి అండగా ఉందాం: హఫీజ్‌ఖాన్
ఓట్ల కోసం రాజకీయాలు చేసే వాళ్లు వద్దని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆత్మగౌరవం నిలబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ పిలుపునిచ్చారు. 2014 ఎన్నికలకు ముందు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పేద వర్గాలను వంచించారన్నారు. ఆయన హయాంలో కనీసం ఆరు హామీలు కచ్చితంగా అమలు జరిగాయని ఎవరైనా నిరూపిస్తే లక్ష రూపాయలు బహుమానం ఇస్తానన్నారు.
పేద వర్గాలను ఎప్పుడూ బానిసలుగా చూసిన చంద్రబాబుకు, ఆ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న జగనన్నకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. జగనన్న అవసరం మనకు ఉందని, ఆయన్ను ఎప్పటికీ మరచిపోవద్దని హఫీజ్‌ఖాన్ చెప్పారు.
మోసగాళ్ల వైపు చూడొద్దు: తలారి రంగయ్య
రా.. కదలిరా అంటూ తెలుగుదేశం పార్టీ పిలుపునిస్తోందని, అయితే.. ఇప్పటికే వచ్చి తాము (బడుగు, బలహీనవర్గాలు) ఇక్కడ కూర్చున్నామని, ఇంకెవరు వస్తారు.. ఎక్కడికి కదులుతారు అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఎద్దేవా చేశారు. మోసగాళ్ల వైపు చూడొద్దని, సింహం లాంటి జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ మొదలుకుని స్థానిక సంస్థల వరకు జగనన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని ఆయన గుర్తుచేశారు. కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా ఆయా వర్గాల అభివృద్ధికి బాటలు వేసిన జగనన్నను ఎలా మరచిపోగలమన్నారు.
బలమైన వర్గాలుగా మార్చిన ఘనత జగన్‌దే : మాజీమంత్రి శంకరనారాయణ
రాష్ట్రంలో బలహీన వర్గాలను బలమైన వర్గాలుగా మార్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని మాజీమంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఏ ముఖ్యమంత్రీ సామాజిక సాధికారతకు కృషిచేయలేదన్నారు. 70 శాతం బలహీన వర్గాల వారే పదవుల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని విమర్శించారు.
సాధికారత కోసం జగన్ తపన : వై.విశ్వేశ్వరరెడ్డి
అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల సాధికారత కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరితపించారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఆయా వర్గాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. పెత్తందారుల వద్ద చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితి నుంచి ఆత్మగౌరవంగా నిలబడే స్థాయికి తెచ్చారని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో పేదలు, పెత్తందారుల మధ్య పోటీ ఉంటుందని, పేద వర్గాలే గెలుస్తాయని విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తంచేశారు.
ఈనాడు ఫొటోగ్రాఫర్‌కు జనం మందలింపు..
ఇక ఉరవకొండలో ఆదివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభ ముగిసిన తర్వాత ఖాళీ కుర్చీల ఫొటోలు తీస్తున్న ఈనాడు ఫొటోగ్రాఫర్‌ను జనం మందలించారు. ఈ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అయితే.. సభ ముగిసి జనం వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఖాళీగా కన్పించిన కుర్చీలను ఈనాడు ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీస్తుండగా అక్కడున్న కొందరు దీనిని గమనించారు. సభ ముగిసిపోయిన తర్వాత ఎందుకు ఫొటోలు తీస్తున్నావంటూ ప్రశ్నించారు. ఇందుకు అతను దురుసుగా ప్రవర్తించడంతో జనం మందలించారు. దుష్ప్రచారం చేసేందుకు ఇలాంటి కుయుక్తులు మంచివి కాదని హితవు పలికారు. దీంతో ఫొటోగ్రాఫర్ అక్కడి నుంచి జారుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment