సాక్షి ప్రతినిధి, అనంతపురం: తమ కుటుంబానికి రెండుచోట్ల ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నట్టు ప్రచారం చేసుకున్న పరిటాల సునీతకు గట్టి షాక్ తగిలింది. 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి గెలిచిన సునీత 2019లో ఓటమి పాలైన విషయం విదితమే. నాలుగోసారి కూడా రాప్తాడు నుంచి టీడీపీ తరఫున సునీత పోటీ చేస్తారని భావిస్తూ వచ్చిన ఆమె అనుచరుల్లో ధీమా సన్నగిల్లుతోంది. రోజుకో సమీకరణంతో టికెట్ ఎక్కడిస్తారో నమ్మకం లేకుండాపోయింది. మొన్నటివరకు రాప్తాడుతోపాటు ధర్మవరం టికెట్ తమకే అని పరిటాల కుటుంబం చెప్పుకుంది. ఇప్పుడు అందులో ఒక టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సి వస్తుండటంతో కలవరం మొదలైంది.
రాప్తాడు నుంచి తెరపైకి రియల్టర్
అనంతపురం జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీకి దిగుతున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ సీటు కోసం ఆయన భారీ మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చేందుకు అధిష్టానంతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ నెల 18 లేదా 19న ఆయన పార్టీ అధిష్టానాన్ని కలవనున్నట్టు చెబుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో బంధువర్గం ఉండటంతోపాటు బాగా డబ్బు ఖర్చు చేయగలిగిన సామర్థ్యం ఉండటంతో అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
రాప్తాడు ఇవ్వకపోతే ధర్మవరం?
రాప్తాడు నియోజకవర్గంలో సునీతకు టికెట్ ఇవ్వని పక్షంలో ధర్మవరం పంపించాలనే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనకు ధర్మవరం టికెట్ కావాలని సునీత కుమారుడు శ్రీరామ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తాజా పరిణామాలతో శ్రీరామ్‌కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా.. తల్లి సునీతకు ధర్మవరం టికెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. రాప్తాడులో సునీతకు అనుకూల పరిస్థితులు లేవని, కొత్త అభ్యర్థి అయితే బావుంటుందని కూడా ఆలోచిస్తున్నారు. సునీతకు నియోజకవర్గంలో అనుకూలంగా లేదనే ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మొదలుపెట్టింది.
సూరిని తీసుకుంటే పరిస్థితి ఏమిటి?
చంద్రబాబు ఎక్కడున్నా తగవులు పెట్టి తన్నుకునేలా చేస్తారనే విమర్శ ఉంది. ధర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరికే టికెట్ ఇవ్వాలని ఆలోచిసూ్తనే సునీతకు కూడా ఇస్తామని లీకులిస్తున్నారు. ఒకవేళ ధర్మవరం నియోజకవర్గానికి సూరిని నియమిస్తే సునీతను పెనుకొండకైనా పంపించాలని మరో వాదన వినిపిస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి చంద్రబాబు జపం చేసే పరిటాల సునీతకు స్థానచలనం చేస్తే ఏళ్ల తరబడి నమ్మకంతో ఉన్న మన పరిస్థితి ఏమిటన్న ఆందోళన కేడర్‌లో మొదలైంది.
కొంప ముంచుతున్న నాన్చుడు ధోరణి
చంద్రబాబు చివరివరకూ నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఎక్కడ ఏ అభ్యర్థో తేల్చకపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం గందరగోళంగా ఉంది. 2019లో చంద్రబాబును నమ్ముకుని రూ.కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు కూడా ఆయన్ని నమ్ముకుంటే మునుగుతామో తేలుతామో అర్థం కావడం లేదని సీనియర్ నాయకులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment