Raptadu Assembly Constituency
-
పరిటాల ఫ్యామిలీకి గడ్డు కాలం
తెలుగుదేశంలో వ్యక్తులను బట్టి న్యాయ సూత్రాలు మారిపోతున్నాయి. ఒకొక్క కుటుంబానికి ఒక్కో రూల్ అన్నట్లుగా పార్టీ నడుస్తోంది. తమకు నచ్చితే ఒక విధంగా లేకుంటే ఇంకోవిధంగా రూల్స్ మార్చేసే చంద్రబాబు ఇప్పుడు పరిటాల కుటుంబాన్ని మెల్లగా డైల్యూట్ చేస్తున్నారు. ఒకనాడు అనంతపురంతోబాటు రాయలసీమలో అధికభాగాన్ని ప్రభావితం చేసిన పరిటాల కుటుంబం ఇప్పుడు ఉనికికోసం పోరాడుతోంది. గతంలో పెనుగొండ నుంచి గెలిచిన పరిటాల రవి మంత్రిగా పని చేశారు. జిల్లావ్యాప్తంగానే కాకుండా రాయలసీమ, కోస్తాలో సైతం హవా వెలగబెట్టారు. అయన మరణం తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన సునీత సైతం టీడీపీలో మంత్రిగా చేసారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం సునీతతోబాటు కుమారుడు శ్రీరామ్‌కు రెండు టిక్కెట్స్ అడుగుతోంది. కానీ దీనికి చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ ఇస్తామని, రెండేసి ఇవ్వలేమని, ఇది రాష్ట్రవ్యాప్త పాలసీ అని చెబుతున్నారు. కానీ లోకేష్, చంద్రబాబు, బాలయ్యబాబు మాత్రం ఒకే ఫ్యామిలీ నుంచి ఉండొచ్చా అనే ప్రశ్నలు పరిటాల క్యాంప్ నుంచి వినిపిస్తున్నాయి. ఇక లోకేష్, చంద్రబాబు మాత్రం రెండేసి చోట్ల పోటీ చేస్తారని అంటున్నారు. చంద్రబాబు కుప్పం నుంచి.. లోకేష్ మంగళగిరి నుంచి.. బాలకృష్ణ హిందూపురం నుంచి.. బాల కృష్ణ చిన్న అల్లుడు భరత్.. విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాకానీ మాకు మాత్రం రాప్తాడు, ధర్మవరం రెండు సీట్లు ఇవ్వరా అని పరిటాల కుటుంబం ఆవేదన చెందుతోంది. మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తుండగా టెక్కలి నుంచి అయన బాబాయ్ అచ్చెన్నాయుడు బరిలో ఉన్నారు. మరి వాళ్ళు మాత్రం ఒకే కుటుంబం కాదా అని పరిటాల కుటుంబం అడుగుతోంది. రాప్తాడు నుంచి పరిటాల రవి సతీమణి సునీత.. కుమారుడు శ్రీరామ్ ఆశిస్తున్నారు కానీ రాప్తాడు వరకూ ఒకే చేసిన చంద్రబాబు ధర్మవరం టిక్కెట్ మాత్రం ఇచ్చేదిలేదని అంటూ అక్కడ వరదాపురం సూరి వైపు మొగ్గు చూపుతున్నారు. యువతకు 40 సీట్లు ఇస్తానని మహానాడులో భారీగా హామీ అయితే ఇచ్చారు కానీ అమల్లోకి వచ్చేసరికి మాత్రం ఆ మాటలను గాలికి వదిలేస్తున్నారు. ఇదిలా ఉండగా ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య యేళ్ళనాటి వైరం ఉంది. దీంతోబాటు పయ్యావుల కేశవ్, ప్రభాకర్ చౌదరి కూడా పరిటాలను ధర్మవరం రానివ్వడం లేదు. వాళ్ళు అవకాశం వస్తే పరిటాల కుటుంబాన్ని ఓడించడానికి చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా జిల్లాలో మూలమూలనా వ్యతిరేకత మూటగట్టుకుని శత్రువులను పెంచుకుంటూ వెళ్లిన పరిటాల కుటుంబాన్ని ఆదరించేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో రాప్తాడుతో సరిపెట్టేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. - సిమ్మాదిరప్పన్న -
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. తక్షణమే ఆర్థిక సహాయం!
అనంతపురం, ఫిబ్రవరి 19: "రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లాలోని రాప్తాడు పర్యటనలో భాగంగా రాప్తాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజల నుండి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించారు. వెంటనే ప్రభుత్వం తరపున బాధితులకు సాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. గౌతమికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఇద్దరు బాధితులకు చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు." 1. అనంతపురం నగరంలోని కమలానగర్‌కు చెందిన పర్లపాటి సుజాత మాట్లాడుతూ.. తన భర్త చనిపోయాడని, తన ఇద్దరు పిల్లలు, తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితురాలు పర్లపాటి సుజాతకు 2 లక్షల రూపాయల చెక్‌ను జిల్లా కలెక్టర్ అందజేశారు. అలాగే సుజాతకు ఇంటి పట్టా ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని, పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 2. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్‌కు చెందిన రాచూరి ఝాన్సీ మాట్లాడుతూ.. తాను వికలాంగురాలినని, తనుకు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితురాలు రాచూరి ఝాన్సీకి 1 లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి అందజేశారు. బాధితురాలికి ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకోవాలని బాధితులకు సూచించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ సమస్యను చెప్పుకున్న వెంటనే తమను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.కిరణ్‌కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో తగ్గుతున్న ప్రాధాన్యం.. పెరుగుతున్న ప్రత్యర్ధులు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఫ్యాక్షనిస్టుగా, మాజీ నక్సలైటుగా జిల్లాలో దశాబ్దకాలం పాటు పరిటాల రవి రాజకీయాలను శాసించారు. ఆయన మరణానంతరం టీడీపీ గడ్డు కాలం ఎదుర్కొంటోంది. సొంత పార్టీలోనే గ్రూపులు, అధిష్టానం ఆడుతున్న డ్రామాలు వెరసి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్‌కు ప్రతిబంధకాలయ్యాయి. మరోవైపు తల్లీ కొడుకుల మధ్యే ఎన్నికల్లో పోటీ ఎవరు చేయాలనే మీమాంస వీరిని ఇరకాటంలో పెడుతోంది. పరిటాల కుటుంబం ప్రభ తగ్గింది పరిటాల రవి మరణానంతరం ఆయన భార్య పరిటాల సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉండి కూడా ఆమె ఎలాంటి అభివృద్ధీ చేయకపోవడంతో జిల్లాలో క్రమంగా పరిటాల కుటుంబ పరపతి తగ్గింది. పరిటాల శ్రీరామ్ వ్యవహారశైలి కూడా జనానికి ఆ కుటుంబాన్ని దూరం చేసింది. 2019లో సునీత పోటీ చేయకుండా పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో జిల్లాలో పరిటాల ప్రభ పూర్తిగా మసకబారింది. ప్రభావం లేదని గుర్తించిన అధిష్టానం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబ ప్రభావం ఏమాత్రమూ లేదనడానికి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరే కారణం. ‘మీ కుటుంబానికి ఒక్కటే సీటు.. ఇష్టమైతే రండి లేదంటే పోండి’ అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దీంతో రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని భావించిన సునీత, శ్రీరామ్‌ల ఆశలు అడియాసలయ్యాయి. మరోవైపు సునీత ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఒక్క టికెట్ అయితే సరిపోతుందని చంద్రబాబు తన అనుకూల మీడియాలో లీకులు ఇప్పించారు. అధిష్టానం దెబ్బతో తల్లీ తనయులు కుదలేయ్యారు. పోటీలో తల్లా.. కొడుకా? రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీయాలనే దానిపై తల్లీకొడుకు తేల్చుకోలేక పోతున్నారు. 2019లో పోటీచేసి ఓడిపోయిన శ్రీరామ్.. మళ్లీ తనకే టికెట్ కావాలని తల్లిమీద ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. కొడుకై తే ఓడిపోతాడని, తానే పోటీ చేస్తానని సునీత భావిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్‌కు టికెట్ ఇవ్వకపోతే ఒప్పుకోడు.. ఇస్తే ఓడిపోయే పరిస్థితులున్నాయి. దీంతో సునీత తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, పైగా రాప్తాడులో గతంలోలాగా కేడర్ సహకరించే పరిస్థితి లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు. గ్రూపులు వెంటాడుతున్నాయి పరిటాల కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువయ్యారు. ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక పయ్యావుల కేశవ్‌కు పరిటాల కుటుంబంతో పొసగదు. ప్రభాకర్ చౌదరికి అస్సలే పడదు. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చెప్పుకుంటూ వెళితే ఏ ఒక్క నాయకుడూ పరిటాల కుటుంబంతో అనుకూలంగా లేకపోవడం కూడా వీరికి మైనస్‌గా మారింది. పరిటాల పతనమే తమ లక్ష్యమంటూ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు. -
Anantapur: పరిటాల సునీతకు గట్టి షాక్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తమ కుటుంబానికి రెండుచోట్ల ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నట్టు ప్రచారం చేసుకున్న పరిటాల సునీతకు గట్టి షాక్ తగిలింది. 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి గెలిచిన సునీత 2019లో ఓటమి పాలైన విషయం విదితమే. నాలుగోసారి కూడా రాప్తాడు నుంచి టీడీపీ తరఫున సునీత పోటీ చేస్తారని భావిస్తూ వచ్చిన ఆమె అనుచరుల్లో ధీమా సన్నగిల్లుతోంది. రోజుకో సమీకరణంతో టికెట్ ఎక్కడిస్తారో నమ్మకం లేకుండాపోయింది. మొన్నటివరకు రాప్తాడుతోపాటు ధర్మవరం టికెట్ తమకే అని పరిటాల కుటుంబం చెప్పుకుంది. ఇప్పుడు అందులో ఒక టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సి వస్తుండటంతో కలవరం మొదలైంది. రాప్తాడు నుంచి తెరపైకి రియల్టర్ అనంతపురం జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీకి దిగుతున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ సీటు కోసం ఆయన భారీ మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చేందుకు అధిష్టానంతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ నెల 18 లేదా 19న ఆయన పార్టీ అధిష్టానాన్ని కలవనున్నట్టు చెబుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో బంధువర్గం ఉండటంతోపాటు బాగా డబ్బు ఖర్చు చేయగలిగిన సామర్థ్యం ఉండటంతో అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాప్తాడు ఇవ్వకపోతే ధర్మవరం? రాప్తాడు నియోజకవర్గంలో సునీతకు టికెట్ ఇవ్వని పక్షంలో ధర్మవరం పంపించాలనే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనకు ధర్మవరం టికెట్ కావాలని సునీత కుమారుడు శ్రీరామ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తాజా పరిణామాలతో శ్రీరామ్‌కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా.. తల్లి సునీతకు ధర్మవరం టికెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. రాప్తాడులో సునీతకు అనుకూల పరిస్థితులు లేవని, కొత్త అభ్యర్థి అయితే బావుంటుందని కూడా ఆలోచిస్తున్నారు. సునీతకు నియోజకవర్గంలో అనుకూలంగా లేదనే ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మొదలుపెట్టింది. సూరిని తీసుకుంటే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు ఎక్కడున్నా తగవులు పెట్టి తన్నుకునేలా చేస్తారనే విమర్శ ఉంది. ధర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరికే టికెట్ ఇవ్వాలని ఆలోచిసూ్తనే సునీతకు కూడా ఇస్తామని లీకులిస్తున్నారు. ఒకవేళ ధర్మవరం నియోజకవర్గానికి సూరిని నియమిస్తే సునీతను పెనుకొండకైనా పంపించాలని మరో వాదన వినిపిస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి చంద్రబాబు జపం చేసే పరిటాల సునీతకు స్థానచలనం చేస్తే ఏళ్ల తరబడి నమ్మకంతో ఉన్న మన పరిస్థితి ఏమిటన్న ఆందోళన కేడర్‌లో మొదలైంది. కొంప ముంచుతున్న నాన్చుడు ధోరణి చంద్రబాబు చివరివరకూ నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఎక్కడ ఏ అభ్యర్థో తేల్చకపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం గందరగోళంగా ఉంది. 2019లో చంద్రబాబును నమ్ముకుని రూ.కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు కూడా ఆయన్ని నమ్ముకుంటే మునుగుతామో తేలుతామో అర్థం కావడం లేదని సీనియర్ నాయకులు వాపోయారు. -
‘స్టాంప్ పేపర్‌పై సంతకం పెడుతున్నా.. దమ్ముంటే నా సవాల్ స్వీకరించండి’
సాక్షి, అనంతపురం: తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పరిటాల సునీత జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కొడిమి జగనన్న కాలనీలో కార్మికులను కిడ్నాప్ చేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి.. అనంతపురం ఆర్అండ్బి అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాప్తాడు నియోజకవర్గం కొడిమి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కోసం శాన్వి - లోటస్ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని ఆయన వివరించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేలా తాను చర్యలు తీసుకున్నానని చెప్పారు. శాన్వి సంస్థ నుంచి 55 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్న లోటస్ సంస్థ ప్రతినిధులు పనులు చేయకుండా వెళ్లిపోయారని తెలిపారు. శాన్వి సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కలకత్తా కార్మికులను అదుపులోకి తీసుకున్నారని.. దీనిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, సీపీఐ నేత రామకృష్ణ, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారని.. 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయని.. తనకు 50 కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని ఆయన మీడియా ఎదుట వంద రూపాయల స్టాంప్ పేపర్ పై సంతకం చేసి సవాల్ విసిరారు. -
డబ్బుకు బాబు దాసోహం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త క్యాండిడేట్ల కోసం టీడీపీ వెదుకులాట ప్రారంభించింది. ఓట్లను డబ్బుతోనైనా కొని గెలవాలని నిర్ణయించుకుని దండిగా డబ్బున్నవారికోసం వలవేస్తోంది. కాంట్రాక్టర్లు, రియల్టర్లు వంటి వారిని బరిలోకి దింపాలని చూస్తోంది. అనంతపురం జిల్లాలో కొత్త అభ్యర్థులను తీసుకొచ్చేందుకు కొందరు సీనియర్ నాయకులను రంగంలోకి దింపింది. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితులు సామాన్య కార్యకర్తలకు, నాయకులకు శరాఘాతంగా మారాయి. గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సీఎం రమేష్, సుజనా చౌదరి, కనకమేడల, టీజీ వెంకటేష్ వంటి బడావ్యాపారులకు సీట్లిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహం అనుసరించబోతున్నట్టు తాజా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బడా కాంట్రాక్టర్‌ను దించాలని యోచిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా అక్కడ పార్టీకి పనిచేస్తున్న వారిని ఈసారి పక్కన పెట్టొచ్చని విశ్వసనీయంగా తెలిసింది. గుంతకల్లు నియోజకవర్గంలో ఇప్పటివరకూ పనిచేసిన అభ్యర్థులను కాదని, ఒక సీఐ స్థాయి పోలీసు అధికారిని నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో రెండుసార్లు పరిటాల సునీత పోటీ చేశారు. ఇప్పుడు బాగా డబ్బున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని తెరమీదకు వచ్చారు. ఈయన పేరు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈయనకు టికెటిస్తే రూ.50 కోట్లయినా ఖర్చు చేయగలరని చంద్రబాబు విశ్వసిస్తున్నట్లు సమాచారం. ఈసారి రాయదుర్గం టికెట్ కాల్వ శ్రీనివాసులుకు ఇవ్వకుండా దీపక్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అగ్రకులాల చేతిలో రిజర్వుడు స్థానాలు మడకశిర, శింగనమల రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు మొత్తం ఆర్థిక బలమున్న అగ్రకులాల చేతుల్లోకి వెళ్లింది. పార్టీకి పనిచేసిన వాళ్లకు కాకుండా డబ్బున్న వాళ్లు ఎవరికి చెబితే వారికే దక్కే అవకాశం ఉంది. అందుకే ఇప్పటివరకూ శింగనమలకు బండారు శ్రావణి, మడకశిరకు ఈరన్న పేర్లను ఖరారు చేయకుండా నాన్చుతున్నారు. రూ.10 కోట్లయినా ఖర్చు చేయగలిగే వాళ్లకే ఇక్కడ టికెట్లు ఇవ్వాలనేది బాబు యోచన. మిగిలిన స్థానాల్లోనూ ఆర్థిక బలమున్న అభ్యర్థులనే ఎంపిక చేయాలని కసరత్తు చేస్తున్నారు.