(ఫైల్ ఫొటో)
ఒకటే టిక్కెట్.. అది కూడా ఎక్కడో ?
తెలుగుదేశంలో వ్యక్తులను బట్టి న్యాయ సూత్రాలు మారిపోతున్నాయి. ఒకొక్క కుటుంబానికి ఒక్కో రూల్ అన్నట్లుగా పార్టీ నడుస్తోంది. తమకు నచ్చితే ఒక విధంగా లేకుంటే ఇంకోవిధంగా రూల్స్ మార్చేసే చంద్రబాబు ఇప్పుడు పరిటాల కుటుంబాన్ని మెల్లగా డైల్యూట్ చేస్తున్నారు. ఒకనాడు అనంతపురంతోబాటు రాయలసీమలో అధికభాగాన్ని ప్రభావితం చేసిన పరిటాల కుటుంబం ఇప్పుడు ఉనికికోసం పోరాడుతోంది.
గతంలో పెనుగొండ నుంచి గెలిచిన పరిటాల రవి మంత్రిగా పని చేశారు. జిల్లావ్యాప్తంగానే కాకుండా రాయలసీమ, కోస్తాలో సైతం హవా వెలగబెట్టారు. అయన మరణం తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన సునీత సైతం టీడీపీలో మంత్రిగా చేసారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం సునీతతోబాటు కుమారుడు శ్రీరామ్కు రెండు టిక్కెట్స్ అడుగుతోంది. కానీ దీనికి చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ ఇస్తామని, రెండేసి ఇవ్వలేమని, ఇది రాష్ట్రవ్యాప్త పాలసీ అని చెబుతున్నారు. కానీ లోకేష్, చంద్రబాబు, బాలయ్యబాబు మాత్రం ఒకే ఫ్యామిలీ నుంచి ఉండొచ్చా అనే ప్రశ్నలు పరిటాల క్యాంప్ నుంచి వినిపిస్తున్నాయి.
ఇక లోకేష్, చంద్రబాబు మాత్రం రెండేసి చోట్ల పోటీ చేస్తారని అంటున్నారు. చంద్రబాబు కుప్పం నుంచి.. లోకేష్ మంగళగిరి నుంచి.. బాలకృష్ణ హిందూపురం నుంచి.. బాల కృష్ణ చిన్న అల్లుడు భరత్.. విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాకానీ మాకు మాత్రం రాప్తాడు, ధర్మవరం రెండు సీట్లు ఇవ్వరా అని పరిటాల కుటుంబం ఆవేదన చెందుతోంది.
మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తుండగా టెక్కలి నుంచి అయన బాబాయ్ అచ్చెన్నాయుడు బరిలో ఉన్నారు. మరి వాళ్ళు మాత్రం ఒకే కుటుంబం కాదా అని పరిటాల కుటుంబం అడుగుతోంది. రాప్తాడు నుంచి పరిటాల రవి సతీమణి సునీత.. కుమారుడు శ్రీరామ్ ఆశిస్తున్నారు కానీ రాప్తాడు వరకూ ఒకే చేసిన చంద్రబాబు ధర్మవరం టిక్కెట్ మాత్రం ఇచ్చేదిలేదని అంటూ అక్కడ వరదాపురం సూరి వైపు మొగ్గు చూపుతున్నారు. యువతకు 40 సీట్లు ఇస్తానని మహానాడులో భారీగా హామీ అయితే ఇచ్చారు కానీ అమల్లోకి వచ్చేసరికి మాత్రం ఆ మాటలను గాలికి వదిలేస్తున్నారు.
ఇదిలా ఉండగా ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య యేళ్ళనాటి వైరం ఉంది. దీంతోబాటు పయ్యావుల కేశవ్, ప్రభాకర్ చౌదరి కూడా పరిటాలను ధర్మవరం రానివ్వడం లేదు. వాళ్ళు అవకాశం వస్తే పరిటాల కుటుంబాన్ని ఓడించడానికి చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా జిల్లాలో మూలమూలనా వ్యతిరేకత మూటగట్టుకుని శత్రువులను పెంచుకుంటూ వెళ్లిన పరిటాల కుటుంబాన్ని ఆదరించేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో రాప్తాడుతో సరిపెట్టేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment