సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఫ్యాక్షనిస్టుగా, మాజీ నక్సలైటుగా జిల్లాలో దశాబ్దకాలం పాటు పరిటాల రవి రాజకీయాలను శాసించారు. ఆయన మరణానంతరం టీడీపీ గడ్డు కాలం ఎదుర్కొంటోంది.
సొంత పార్టీలోనే గ్రూపులు, అధిష్టానం ఆడుతున్న డ్రామాలు వెరసి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ భవిష్యత్‌కు ప్రతిబంధకాలయ్యాయి. మరోవైపు తల్లీ కొడుకుల మధ్యే ఎన్నికల్లో పోటీ ఎవరు చేయాలనే మీమాంస వీరిని ఇరకాటంలో పెడుతోంది.
పరిటాల కుటుంబం ప్రభ తగ్గింది
పరిటాల రవి మరణానంతరం ఆయన భార్య పరిటాల సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉండి కూడా ఆమె ఎలాంటి అభివృద్ధీ చేయకపోవడంతో జిల్లాలో క్రమంగా పరిటాల కుటుంబ పరపతి తగ్గింది.
పరిటాల శ్రీరామ్ వ్యవహారశైలి కూడా జనానికి ఆ కుటుంబాన్ని దూరం చేసింది. 2019లో సునీత పోటీ చేయకుండా పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. దీంతో జిల్లాలో పరిటాల ప్రభ పూర్తిగా మసకబారింది.
ప్రభావం లేదని గుర్తించిన అధిష్టానం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబ ప్రభావం ఏమాత్రమూ లేదనడానికి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరే కారణం. ‘మీ కుటుంబానికి ఒక్కటే సీటు.. ఇష్టమైతే రండి లేదంటే పోండి’ అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు.
దీంతో రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని భావించిన సునీత, శ్రీరామ్‌ల ఆశలు అడియాసలయ్యాయి. మరోవైపు సునీత ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఒక్క టికెట్ అయితే సరిపోతుందని చంద్రబాబు తన అనుకూల మీడియాలో లీకులు ఇప్పించారు. అధిష్టానం దెబ్బతో తల్లీ తనయులు కుదలేయ్యారు.
పోటీలో తల్లా.. కొడుకా?
రానున్న ఎన్నికల్లో ఎవరు పోటీయాలనే దానిపై తల్లీకొడుకు తేల్చుకోలేక పోతున్నారు. 2019లో పోటీచేసి ఓడిపోయిన శ్రీరామ్.. మళ్లీ తనకే టికెట్ కావాలని తల్లిమీద ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. కొడుకై తే ఓడిపోతాడని, తానే పోటీ చేస్తానని సునీత భావిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్‌కు టికెట్ ఇవ్వకపోతే ఒప్పుకోడు.. ఇస్తే ఓడిపోయే పరిస్థితులున్నాయి. దీంతో సునీత తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, పైగా రాప్తాడులో గతంలోలాగా కేడర్ సహకరించే పరిస్థితి లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
గ్రూపులు వెంటాడుతున్నాయి
పరిటాల కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువయ్యారు. ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇక పయ్యావుల కేశవ్‌కు పరిటాల కుటుంబంతో పొసగదు. ప్రభాకర్ చౌదరికి అస్సలే పడదు. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చెప్పుకుంటూ వెళితే ఏ ఒక్క నాయకుడూ పరిటాల కుటుంబంతో అనుకూలంగా లేకపోవడం కూడా వీరికి మైనస్‌గా మారింది. పరిటాల పతనమే తమ లక్ష్యమంటూ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment