సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త క్యాండిడేట్ల కోసం టీడీపీ వెదుకులాట ప్రారంభించింది. ఓట్లను డబ్బుతోనైనా కొని గెలవాలని నిర్ణయించుకుని దండిగా డబ్బున్నవారికోసం వలవేస్తోంది. కాంట్రాక్టర్లు, రియల్టర్లు వంటి వారిని బరిలోకి దింపాలని చూస్తోంది. అనంతపురం జిల్లాలో కొత్త అభ్యర్థులను తీసుకొచ్చేందుకు కొందరు సీనియర్ నాయకులను రంగంలోకి దింపింది. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితులు సామాన్య కార్యకర్తలకు, నాయకులకు శరాఘాతంగా మారాయి. గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సీఎం రమేష్, సుజనా చౌదరి, కనకమేడల, టీజీ వెంకటేష్ వంటి బడావ్యాపారులకు సీట్లిచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వ్యూహం అనుసరించబోతున్నట్టు తాజా పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బడా కాంట్రాక్టర్‌ను దించాలని యోచిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా అక్కడ పార్టీకి పనిచేస్తున్న వారిని ఈసారి పక్కన పెట్టొచ్చని విశ్వసనీయంగా తెలిసింది. గుంతకల్లు నియోజకవర్గంలో ఇప్పటివరకూ పనిచేసిన అభ్యర్థులను కాదని, ఒక సీఐ స్థాయి పోలీసు అధికారిని నిలిపేందుకు పావులు కదుపుతున్నారు.
రాప్తాడు నియోజకవర్గంలో రెండుసార్లు పరిటాల సునీత పోటీ చేశారు. ఇప్పుడు బాగా డబ్బున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని తెరమీదకు వచ్చారు. ఈయన పేరు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈయనకు టికెటిస్తే రూ.50 కోట్లయినా ఖర్చు చేయగలరని చంద్రబాబు విశ్వసిస్తున్నట్లు సమాచారం. ఈసారి రాయదుర్గం టికెట్ కాల్వ శ్రీనివాసులుకు ఇవ్వకుండా దీపక్‌రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
అగ్రకులాల చేతిలో రిజర్వుడు స్థానాలు
మడకశిర, శింగనమల రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థుల ఖరారు మొత్తం ఆర్థిక బలమున్న అగ్రకులాల చేతుల్లోకి వెళ్లింది. పార్టీకి పనిచేసిన వాళ్లకు కాకుండా డబ్బున్న వాళ్లు ఎవరికి చెబితే వారికే దక్కే అవకాశం ఉంది. అందుకే ఇప్పటివరకూ శింగనమలకు బండారు శ్రావణి, మడకశిరకు ఈరన్న పేర్లను ఖరారు చేయకుండా నాన్చుతున్నారు. రూ.10 కోట్లయినా ఖర్చు చేయగలిగే వాళ్లకే ఇక్కడ టికెట్లు ఇవ్వాలనేది బాబు యోచన. మిగిలిన స్థానాల్లోనూ ఆర్థిక బలమున్న అభ్యర్థులనే ఎంపిక చేయాలని కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment