కాంగ్రెస్‌లో లొల్లి
►పొన్నాల సమక్షంలోనే బాహాబాహీ
►ఫ్లెక్సీలో ఫొటో పెట్టలేదంటూ ఫారూక్ వర్గం రచ్చ
►వేదికపైనే ఫారూక్, జానారెడ్డి వాగ్వాదం
►దుబ్బాకలో కార్యకర్తల సమావేశం రసాభాస
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/దుబ్బాక రూరల్: జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు మరోమారు భగ్గుమన్నాయి. అయితే ఈసారి దుబ్బాక వేదిక కావడం గమనార్హం. ఐక్యంగా ఉండి అభ్యర్థిని గెలిపించుకుని, సోనియమ్మకు బహుమతిగా ఇద్దామంటూనే సీనియర్ నేతలు వాగ్వాదానికి దిగటం.. కార్యకర్తలు కూడా రెచ్చిపోవడం విస్మయానికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర పరిశీలకుడు కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలోనే కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు దుర్భాషలాడుతూ బాహాబాహీకి దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. గొడవకు కారణమైన బిజ్జ సత్తయ్య అనే కార్యకర్తను సమావేశం నుంచి బయటకు పంపాలని మాజీ మంత్రి జానారెడ్డి పోలీసులను ఆదేశించడంతో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ వేదిక మీదనే జానారెడ్డితో గొడవపడ్డారు.
వీరి గొడవను చూస్తూ పొన్నాల లక్ష్మయ్య మిన్నకుండిపోవడం గమనార్హం. వివరాలలోకి వెళ్తే.. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంతో సోమవారం దుబ్బాకలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. స్థానిక నీలకంఠ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఈ సమావేశం వద్ద కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకుల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్ ఫొటో, పేరు లేకపోవడంతో ఆయన వర్గం నాయకులైన బిజ్జ సత్తయ్యతో పాటు మరికొంత మంది సీనియర్లతో వాగ్వాదానికి దిగారు. వెంటనే ఫ్లెక్సీని తొలగించాలని డిమాండ్ చేశారు.
ఫారూక్ హుస్సేన్ ఫొటోను పెట్టకుండా అవమానపరిచారంటూ బిజ్జ సత్తయ్య సీనియర్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఐక్యత అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో సమావేశం వేదిక రసాభాసగా మారింది. నాయకుల ఎదుటే సమావేశంలో గొడవ జరగడం విశేషం. గొడవ చేస్తున్న ఫారూక్ హుస్సేన్ వర్గాన్ని సమావేశం నుంచి బయటకు పంపాలని మాజీ మంత్రి జానారెడ్డి పోలీసులను కోరారు.
దీంతో పోలీసులు కల్పించుకుని బిజ్జ సత్తయ్యను సమావేశం నుండి బయటకు తీసుకుపోయవారు. కేవలం తన వర్గం వారిని మాత్రమే బయటి పంపడంపై ఎమ్మెల్సీ ఫారూఖ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా ఆయన జానారెడ్డి వద్దకు వెళ్లి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేయగా, జానారెడ్డి తీవ్రంగానే స్పందించారు, దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది చూసి కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. పోలీసుల రంగప్రవేశంతో ఇరు వర్గాలు శాంతించాయి.