పుట్టిన 27 ఏళ్లకు అబ్బాయిగా తేలిన అమ్మాయి
వైద్య పరీక్షల్లో పురుషుడేనని తేల్చిన వైద్యులు
జన్యుపరమైన సమస్యవల్లేనని వెల్లడి
దుబ్బాక: ఆ దంపతులకు తొలి సంతానంగా పండంటి ఆడబిడ్డ పుట్టింది. సాక్షాత్తూ లక్ష్మీదేవే ఇంటికి వచ్చిందని ఆ జంట మురిసిపోయింది. కావ్యశ్రీ అని చక్కని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొన్నారు. కూతురిని పాఠశాలకు, కళాశాలకు పంపి చక్కగా చదివించారు. కానీ, కావ్యశ్రీ వయసు పెరుగుతున్నాకొద్ది ఆమె శరీరంలో మార్పులు రావటం మొదలైంది. యుక్త వయసు వచ్చేసరికి అబ్బాయిలా గడ్డం, మీసాలు వచ్చాయి. మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ, 26 ఏళ్ల వయసు వచ్చేనాటికి ఆమె.. అతడిలా మారటం స్పష్టంగా తెలిసిపోయింది. ఆరోగ్య పరంగా కూడా కావ్యశ్రీ ఇబ్బందులు ఎదుర్కొన్నది. కంగారుపడిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా, కావ్యశ్రీ ఆడపిల్ల కాదని.. మగపిల్లాడని డాక్టర్లు తేల్చారు. దీంతో 27 ఏళ్ల వయసులో కావ్యశ్రీ కాస్తా.. కార్తికేయగా మారాడు. సిద్దిపేట జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది.
అనారోగ్యంతో బయటపడిన నిజం..
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన దొంతగౌని రమేశ్, మంజుల మొదటి సంతానం కావ్యశ్రీ 1996 అక్టోబర్ 30న జన్మించింది. కావ్యశ్రీకి 2018 నుంచి శరీరంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మగవారిలాగా గడ్డం, మీసాలు పెరగడం ప్రారంభమైంది. విపరీతమైన కడుపు నొప్పి, ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో తల్లిదండ్రులు రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో వైద్యులను సంప్రదించారు.
వారు ప్రత్యేక వైద్య నిపుణులను కలవాలని సూచించటంతో రెండు నెలల క్రితం బెంగళూరుకు చెందిన డాక్టర్లను కలిశారు. అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో నమ్మ లేని నిజాలు బయట పడ్డాయి. కావ్యశ్రీకి కడుపు కింది భాగంలో పురుషుల మాదిరిగా వృషణాలు ముడుచుకుని ఉండడంతోపాటు, 2.5 ఇంచుల అంగం బయటకు రావడం గమనించారు. ముడుచుకున్న వృషణాలను శస్త్ర చికిత్స చేసి సరి చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఛాతీ భాగం సైతం అబ్బాయిదేనని, అధిక కొవ్వు కారణంగా ఎత్తుగా కనపడిందని తేల్చారు.
ఇలా ఛాతీ ఎత్తుగా పెరగడాన్ని గైనాకో మాస్టియో అంటారని వైద్యులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కావ్యశ్రీ అని పిలుచుకున్న తమ సంతానానికి కార్తికేయ అని పేరు మార్చామని తల్లిదండ్రులు తెలిపారు. మూడు వారాల క్రితం ఆధార్ కార్డులో సైతం కార్తికేయగా పేరు మారి్పంచారు. కావ్యశ్రీ విద్యార్హతల సర్టిఫికేట్లలో సైతం పేరు మార్చాల్సి ఉంది. 2014 నుంచే కార్తికేయ బైక్, కారు సైతం నడుపుతున్నాడు. ప్రస్తుతం కార్తికేయ ఫ్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
అబ్బాయిగా జీవించటం ఆనందంగా ఉంది
నాకు టీనేజ్ వచ్చేసరికి అబ్బాయిలాగా గడ్డం, మీసాలు రావడం మొదలైంది. డాక్టర్లను సంప్రదించగా అసంకల్పిత రోమాలు అని చెప్పారు. కడుపు నొప్పి తరచుగా వస్తుండడంతో హైదరాబాద్‌లో నిపుణులను కలిశాం. దీంతో నాకు అసలు విషయం తెలిసింది. ఇప్పుడు అబ్బాయిగా జీవించడం నాకెంతో ఆనందంగా ఉంది.
–దొంతగౌని కార్తికేయ
జన్యు లోపాల వల్లే..
కార్తికేయ విషయంలో క్రోమోజోమ్‌ల లోపంతో ఇలా జరిగింది. కొన్ని క్రోమోజోమ్‌లు ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల వృషణాలు చిన్నగా పెరిగాయి. వృషణాలు కొంత భాగం కడుపులో ముడుచుకొని ఉండటాన్ని గుర్తించాం. తదుపరి వైద్య పరీక్షలకు నిపుణులను సంప్రదించాలని సూచించాం. అతడు అమ్మాయి కాదు అబ్బాయే. టెస్టిక్యులర్ ఫెమినైజేషన్ సిండ్రోమ్ కారణంగా బయటకు అమ్మాయిలా కనిపించినా అంతర్గతంగా మొత్తం పురుష లక్షణాలే ఉన్నాయి. ఇది చాలా అరుదైన లక్షణం.
–డాక్టర్ హేమారాజ్ సింగ్, సర్జన్, దుబ్బాక ఆస్పత్రి సూపరింటెండెంట్
కార్తికేయను అబ్బాయిలాగే గుర్తించండి
నా కొడుకులో జన్యు మార్పుల వల్ల మేము ఇన్నాళ్లు అమ్మాయిగా భ్రమపడ్డాం. యుక్త వయస్సు వచ్చేసరికి వాడికి గడ్డం, మీసాలు రావడం గమనించాం. ఈ క్రమంలో కడుపు నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించాం. అమ్మాయి కాదని అబ్బాయి అని నిర్థారించారు. సమాజం తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా అబ్బాయిని అబ్బాయిలాగే గుర్తించండి.
–మంజుల–రమేష్ గౌడ్, కార్తికేయ తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment