Genetic problems
-
27 ఏళ్ల దాకా అమ్మాయే..ఇపుడు అబ్బాయి!
దుబ్బాక: ఆ దంపతులకు తొలి సంతానంగా పండంటి ఆడబిడ్డ పుట్టింది. సాక్షాత్తూ లక్ష్మీదేవే ఇంటికి వచ్చిందని ఆ జంట మురిసిపోయింది. కావ్యశ్రీ అని చక్కని పేరుపెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొన్నారు. కూతురిని పాఠశాలకు, కళాశాలకు పంపి చక్కగా చదివించారు. కానీ, కావ్యశ్రీ వయసు పెరుగుతున్నాకొద్ది ఆమె శరీరంలో మార్పులు రావటం మొదలైంది. యుక్త వయసు వచ్చేసరికి అబ్బాయిలా గడ్డం, మీసాలు వచ్చాయి. మొదట పెద్దగా పట్టించుకోలేదు. కానీ, 26 ఏళ్ల వయసు వచ్చేనాటికి ఆమె.. అతడిలా మారటం స్పష్టంగా తెలిసిపోయింది. ఆరోగ్య పరంగా కూడా కావ్యశ్రీ ఇబ్బందులు ఎదుర్కొన్నది. కంగారుపడిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా, కావ్యశ్రీ ఆడపిల్ల కాదని.. మగపిల్లాడని డాక్టర్లు తేల్చారు. దీంతో 27 ఏళ్ల వయసులో కావ్యశ్రీ కాస్తా.. కార్తికేయగా మారాడు. సిద్దిపేట జిల్లాలో ఈ అరుదైన ఘటన జరిగింది. అనారోగ్యంతో బయటపడిన నిజం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన దొంతగౌని రమేశ్, మంజుల మొదటి సంతానం కావ్యశ్రీ 1996 అక్టోబర్ 30న జన్మించింది. కావ్యశ్రీకి 2018 నుంచి శరీరంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మగవారిలాగా గడ్డం, మీసాలు పెరగడం ప్రారంభమైంది. విపరీతమైన కడుపు నొప్పి, ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో తల్లిదండ్రులు రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో వైద్యులను సంప్రదించారు. వారు ప్రత్యేక వైద్య నిపుణులను కలవాలని సూచించటంతో రెండు నెలల క్రితం బెంగళూరుకు చెందిన డాక్టర్లను కలిశారు. అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో నమ్మ లేని నిజాలు బయట పడ్డాయి. కావ్యశ్రీకి కడుపు కింది భాగంలో పురుషుల మాదిరిగా వృషణాలు ముడుచుకుని ఉండడంతోపాటు, 2.5 ఇంచుల అంగం బయటకు రావడం గమనించారు. ముడుచుకున్న వృషణాలను శస్త్ర చికిత్స చేసి సరి చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఛాతీ భాగం సైతం అబ్బాయిదేనని, అధిక కొవ్వు కారణంగా ఎత్తుగా కనపడిందని తేల్చారు. ఇలా ఛాతీ ఎత్తుగా పెరగడాన్ని గైనాకో మాస్టియో అంటారని వైద్యులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కావ్యశ్రీ అని పిలుచుకున్న తమ సంతానానికి కార్తికేయ అని పేరు మార్చామని తల్లిదండ్రులు తెలిపారు. మూడు వారాల క్రితం ఆధార్ కార్డులో సైతం కార్తికేయగా పేరు మారి్పంచారు. కావ్యశ్రీ విద్యార్హతల సర్టిఫికేట్లలో సైతం పేరు మార్చాల్సి ఉంది. 2014 నుంచే కార్తికేయ బైక్, కారు సైతం నడుపుతున్నాడు. ప్రస్తుతం కార్తికేయ ఫ్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా, సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.అబ్బాయిగా జీవించటం ఆనందంగా ఉంది నాకు టీనేజ్ వచ్చేసరికి అబ్బాయిలాగా గడ్డం, మీసాలు రావడం మొదలైంది. డాక్టర్లను సంప్రదించగా అసంకల్పిత రోమాలు అని చెప్పారు. కడుపు నొప్పి తరచుగా వస్తుండడంతో హైదరాబాద్‌లో నిపుణులను కలిశాం. దీంతో నాకు అసలు విషయం తెలిసింది. ఇప్పుడు అబ్బాయిగా జీవించడం నాకెంతో ఆనందంగా ఉంది. –దొంతగౌని కార్తికేయజన్యు లోపాల వల్లే.. కార్తికేయ విషయంలో క్రోమోజోమ్‌ల లోపంతో ఇలా జరిగింది. కొన్ని క్రోమోజోమ్‌లు ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల వృషణాలు చిన్నగా పెరిగాయి. వృషణాలు కొంత భాగం కడుపులో ముడుచుకొని ఉండటాన్ని గుర్తించాం. తదుపరి వైద్య పరీక్షలకు నిపుణులను సంప్రదించాలని సూచించాం. అతడు అమ్మాయి కాదు అబ్బాయే. టెస్టిక్యులర్ ఫెమినైజేషన్ సిండ్రోమ్ కారణంగా బయటకు అమ్మాయిలా కనిపించినా అంతర్గతంగా మొత్తం పురుష లక్షణాలే ఉన్నాయి. ఇది చాలా అరుదైన లక్షణం. –డాక్టర్ హేమారాజ్ సింగ్, సర్జన్, దుబ్బాక ఆస్పత్రి సూపరింటెండెంట్కార్తికేయను అబ్బాయిలాగే గుర్తించండి నా కొడుకులో జన్యు మార్పుల వల్ల మేము ఇన్నాళ్లు అమ్మాయిగా భ్రమపడ్డాం. యుక్త వయస్సు వచ్చేసరికి వాడికి గడ్డం, మీసాలు రావడం గమనించాం. ఈ క్రమంలో కడుపు నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించాం. అమ్మాయి కాదని అబ్బాయి అని నిర్థారించారు. సమాజం తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా అబ్బాయిని అబ్బాయిలాగే గుర్తించండి. –మంజుల–రమేష్ గౌడ్, కార్తికేయ తల్లిదండ్రులు -
అమ్మమ్మ నుంచి అమ్మకు.. అమ్మ నుంచి కుమారులకు గుండె సమస్య!
హైదరాబాద్: అమ్మమ్మ నుంచి అమ్మకు, అమ్మ నుంచి కుమారులు ఇద్దరికీ ఒకే రకమైన గుండె సమస్య అనువంశికంగా రావడం అత్యంత అరుదు. జన్యుపరమైన కారణాల వల్ల ఇలా సంభవించినా, అందులోనూ మార్ఫన్స్ సిండ్రోమ్ అనే అత్యంత అరుదైన సమస్య రావడం చాలా చాలా తక్కువ. ప్రతి లక్ష మంది ప్రజల్లో కేవలం 0.19 మందికే ఈ సమస్య వస్తుంది. సరిగ్గా ఇలాంటి సమస్యే వచ్చిన తల్లీ కుమారులిద్దరికీ ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, గుండెలోని ప్రధాన రక్తనాళమైన బృహద్ధమనిని మార్చి, కృత్రిమ బృహద్ధమని అమర్చి వాళ్ల ప్రాణాలు కాపాడారు. ఈ అరుదైన సమస్య గురించి, దానికి అందించిన చికిత్స గురించి కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ విశాల్ వి ఖంటే తెలిపారు.“సుమారు ఆరు నెలల క్రితం మా ఎమర్జెన్సీ విభాగానికి ఒక మహిళ వచ్చారు. ఆమెకు అన్నిరకాల పరీక్షలు చేయగా, బృహద్ధమని వాపు వల్ల పగిలిపోయిందని గుర్తించాము. వెంటనే అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి, కృత్రిమ బృహద్ధమని అమర్చాము. ఆమె సాధారణంగా మహిళలు ఉండే పొడవు కంటే చాలా ఎక్కువ పొడవుగా.. అంటే 5 అడుగుల 9 అంగుళాలు ఉన్నారు. ఆమెను చూసేందుకు వచ్చిన 18 ఏళ్ల కుమారుడు కూడా 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉండటంతో.. జన్యుపరంగా పోలికలు ఉన్నట్లు గుర్తించాము. అలాంటప్పుడు కొన్నిరకాల సమస్యలు, అందులోనూ మార్ఫన్స్ సిండ్రోమ్ వారసత్వంగా వచ్చే అవకాశం ఉందని అతడిని కూడా పరీక్షించాము. అతడికీ ఇదే సమస్య ఉన్నట్లు గుర్తించి, అప్పుడే ముందుగానే శస్త్రచికిత్స చేయించుకోవాల్సిందిగా చెప్పాము. అయితే ఆర్థికపరమైన కారణాల వల్ల వాళ్లు ఆరేడు నెలల తర్వాత వచ్చారు.ఈ యువకుడికి కూడా బృహద్ధమని బాగా వాచిపోయింది. అతడికి అవసరమైన అన్నిరకాల పరీక్షలు చేసిన తర్వాత బెంటల్స్ ప్రొసీజర్ అనే సంక్లిష్టమైన శస్త్రచికిత్స ప్రారంభించాము. వాపు ఉన్న బృహద్ధమని మొత్తాన్ని తొలగించి, దాని స్థానంలో కృత్రిమ బృహద్ధమనిని అమర్చాం. 29 సైజు ఉన్న వాల్వును, ట్యూబును అమర్చాల్సి వచ్చింది. ఇది చాలా సంక్లిష్టమైన, అత్యంత కష్టమైన శస్త్రచికిత్స. సాధారణంగా ఇవి విజయవంతం అయ్యే అవకాశాలు కూడా 50 శాతం మాత్రమే ఉంటాయి. కానీ అదృష్టవశాత్తు మొదట తల్లి, ఇప్పుడు పెద్ద కుమారుడు ఇద్దరికీ శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతం అయ్యింది. యువకుడికి శస్త్రచికిత్స చేసిన రోజే సాయంత్రం 6 గంటలకల్లా వెంటిలేటర్ తీసేశాము. నాలుగోరోజు అతడిని డిశ్చార్జి చేశాము.జన్యుపరమైన కారణాల వల్ల కేవలం వారసత్వంగా మాత్రమే ఈ సమస్య వస్తుంది. ఈ కేసులో తొలుత అమ్మమ్మకు, తర్వాత అమ్మకు, ఇప్పుడు పెద్ద కుమారుడికి వచ్చింది. 14 ఏళ్ల చిన్న కుమారుడిని పరీక్షిస్తే, అతడికీ ఇదే సమస్య ఉంది. వీటిని వీలైనంత త్వరగా గుర్తించిగలిగితే, బృహద్ధమని వాచిపోయి పగిలిపోకముందే దాన్ని మార్చడానికి వీలుంటుంది. ఈ పరీక్షలు, శస్త్రచికిత్స కూడా చాలా ఖరీదైనవి కావడంతో రోగులు త్వరగా ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు కామినేని ఆస్పత్రిలో 13 శస్త్రచికిత్సలు ఇలాంటివి చేయగా, అన్నీ విజయవంతం అయ్యాయి. ఈ కుటుంబంలో అందరూ పొడవు ఎక్కువ. వీల్లకు రకరకాల సమస్యలు వస్తాయి. వీళ్ల ఎముకలు, లిగమెంట్లు కూడా బలహీనంగా ఉంటాయి. రక్తనాళాలు, కవాటాల్లో సమస్య ఉంటోంది. కంటి లెన్సులలో కూడా అందరికీ సమస్య ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి” అని డాక్టర్ విశాల్ వి ఖాంటే తెలిపారు.కామినేని హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) డాక్టర్ గాయత్రి కామినేని మాట్లాడుతూ.. ఈ విజయవంతమైన శస్త్రచికిత్స మా ఆసుపత్రి వైద్య సామర్థ్యాలను తెలియచేస్తుంది. ఈ శస్త్రచికిత్సలో కీలక పాత్ర పోషించిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్స్ డాక్టర్ విశాల్ ఖాంటే, డాక్టర్ రాజేష్ దేశ్‌ముఖ్, చీఫ్ కార్డియాక్ అనస్తీటిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్ ఎసంపల్లి మరియు కన్సల్టెంట్ అనస్థీటిస్ట్ డాక్టర్ రవళి సాడే, మరియు ప్రత్యేక ఐసియూ సిబ్బంది, నర్సింగ్ టీమ్‌తో సహా అందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. -
35 ఏళ్ల తర్వాతా... ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే?
గత కొన్నేళ్ల కిందటి వరకు గర్భధారణకు పెరిగే వయసు లేదా పెద్దవయసు కాస్త ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చనీ, సాధారణంగా 28 లేదా 30 ఏళ్లలోపే గర్భధారణ జరగడంతో ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే ఆస్కారం ఎక్కువనే మాటలు వినిపించేవి. అంతేకాదు... 35 ఏళ్లు పైబడ్డ తర్వాత గర్భధారణ జరిగితే పిల్లల్లో డౌన్స్ సిండ్రోమ్ వంటి కొన్ని అనర్థాలు కనిపించే అవకాశాలూ ఎక్కువేనంటూ ఆందోళన నిండిన సలహాలూ వచ్చేవి. అయితే ఆ మాటల్లో కొద్దిపాటి నిజాలున్నప్పటికీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. మెడికల్ పుస్తకాల్లో చెప్పినట్లుగా 35 వయసు దాటాక పుట్టిన పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు అరుదుగా ఉంటాయి. వాటి గురించి అంతగా ఆందోళన అవసరం లేదంటూ డాక్టర్లు చెబుతున్న సంగతులివి.... ఇటీవల కాలం అనేక మార్పులను తెస్తోంది. యువతులు సైతం బాగా చదువుకుంటూ, కెరియర్లో స్థిరపడిన తర్వాతే పిల్లలను కోరుకుంటున్నారు. దాంతో గర్భధారణ, పిల్లలు కలగడంలో ఆలస్యం సాధారణమవుతోంది. వయసు 35 ఏళ్లు దాటాక గర్భధారణ జరిగిన కేసుల్లో గర్భస్రావాలు జరిగే రేటు ఎక్కువనీ, ఆలస్యంగా గర్భధారణ జరిగినప్పుడు పుట్టే పిల్లలకు పుట్టుకతో వచ్చే జన్యుసమస్యలు వస్తాయనే అభిప్రాయాలు ఎక్కువగా ఉండేవి. అందులో కొద్దిపాటి సత్యం ఉంటే ఉండవచ్చేమోగానీ... అదే అక్షరసత్యమనీ, ఆ మాటలే శిలాక్షరాలని అనుకోడానికి వీల్లేదని వైద్యపరిశోధనలు వెల్లడిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. అందుకే ‘అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్’, ‘జీరియాట్రిక్ ప్రెగ్నెన్సీ’ అనే పదాలను విని, చదివి కంగారు పడవద్దని చెబుతున్నారు. ఆలస్యపు గర్భధారణలో అనర్థాలు ఎందుకంటే..? ముప్ఫై ఐదేళ్ల తర్వాత జరిగే గర్భధారణల వల్ల పుట్టబోయే పిల్లల్లో అనేక ఆరోగ్యపరమైన రిస్క్‌లతో పాటు అబార్షన్స్‌కు అవకాశం ఎక్కువ. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవి... ► అండాశయం వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యకరమైన అండం విడుదల సక్రమంగా జరగడానికి అవకాశం తక్కువ. అండం నాణ్యతా తగ్గుతుంది. అంటే గర్భధారణకు అవకాశాలు పూర్తిగా తగ్గుతాయని కాదు. కానీ ఆలస్యపు గర్భధారణ విషయంలో క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ► అబార్షన్స్ రిస్క్ ఎక్కువ. ∙వయసు పెరుగుతున్న కొద్దీ అండంలో జరిగే కణవిభజన అంత సక్రమంగా ఉంకపోవచ్చు. దాంతో క్రోమోజోముల సంఖ్యలో విభజన సక్రమంగా జరకపోవచ్చు. ఇతర సమస్యల విషయానికి వస్తే... ► మహిళల్లో 30 ఏళ్లు దాటాక అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గర్భధారణపై ప్రభావం చూపవచ్చు. ► పీసీఓడీ, ఫైబ్రాయిడ్స్ సమస్యలూ, ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోవడం జరగవచ్చు. ► పెద్ద వయసు మహిళలకు పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశముంది. ► 35 ఏళ్లు దాటిన మహిళల్లో సహజ ప్రసవపు అవకాశాలు తగ్గి, సిజేరియన్‌కే అవకాశాలు ఎక్కువ. ఇటీవల ఆలస్యంగా కెరియర్లో స్థిరపడ్డ తర్వాత, అప్పటికీ స్వాభావికంగా గర్భధారణ జరగకపోతే 35 దాటిన తర్వాతే కృత్రిమ గర్భధారణకు వెళ్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యకరమైన గర్భధారణ, పండంటిబిడ్డ పుట్టే కేసులే చాలా ఎక్కువ. ఇందుకు కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలి. కొంత రిస్క్ ఉన్నా... ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం... ఒకవేళ మహిళకు 35 ఏళ్లు దాటాక గర్భధారణ జరిగే అవకాశం ఉన్నప్పుడు కొన్ని స్క్రీనింగ్ పరీక్షలు చేయించాలి. అవి... ► సెల్–ఫ్రీ డీఎన్ఏ స్కీనింగ్ పరీక్ష ∙మెటర్నల్ బ్లడ్ స్క్రీనింగ్ (అయితే ఇలాంటి స్క్రీనింగ్ పరీక్షల వల్ల పుట్టబోయే చిన్నారిలోని లోపాలన్నీ నూరు శాతం తెలియకపోవచ్చు. కానీ రాబోయే ముప్పులు కొంత సూచనాత్మకంగా తెలిసే అవకాశాలు మాత్రం ఉంటాయి). ► న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ (ఎన్టీ) స్కాన్ టెస్ట్ అనే పరీక్షను గర్భధారణ తర్వాత 14వ వారాల లోపు చేయించాలి. ► గర్భధారణ తర్వాత 20 వారాలప్పుడు అనామలీ స్కాన్ వంటి పరీక్షల్ని చేయించాలి. భవిష్యత్తుకోసం అండాల సంరక్షణ... రోజులు గడుస్తున్న కొద్దీ విడుదలయ్యే అండాల నాణ్యత, అందులో లోపాలు వస్తాయి. అందుకే జీవితంలో ఇంకా స్థిరపడని వారు తగిన సమయంలో ఆరోగ్యంగా ఉన్న అండాలను సేకరించి పెట్టుకోవడానికీ ఇప్పడు అవకాశం ఉంది. అన్నీ అనువుగా ఉన్న సమయంలో ఆ అండాలను గర్భధారణకు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు... దురదృష్టవశాత్తూ చిన్నవయసులోనే మెనోపాజ్ రావడం లేదా ఏవైనా క్యాన్సర్లకు గురై అండాశయాలను తొలగించాల్సిన పరిస్థితులు రావడం వంటివి జరిగితే... ముందుగా సేకరించి పెట్టుకున్న ఆరోగ్యకరమైన అండాల సహాయంతో అటు తర్వాత కూడా ఆరోగ్యకరమైన రీతిలో గర్భధారణకు ఇప్పుడు అవకాశాలున్నాయి. చివరగా... 35 ఏళ్ల తర్వాత కూడా సురక్షితమైన గర్భధారణ కోసం ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే ముందుగానే సరైనరీతిలో డాక్టర్ సలహాలు పాటించడం, సమతులాహారం తీసుకోవడం, తగినంత బరువు ఉండేలా చూసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనవైలి వంటివి పండంటి బిడ్డ పుట్టేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. గర్భధారణకు ముందునుంచే గైనకాలజిస్ట్ çసూచనలు అనుసరిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే ఆరోగ్యకరమైన గర్భధారణకు వయసు ఒక అంకె మాత్రమే. గర్భధారణ కంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భం ధరించాలనుకున్న కాస్త పెద్ద వయసు మహిళ గర్భధారణ కంటే ముందునుంచే కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలి. ► తమ సాధారణ ఆరోగ్యం, జీవనశైలి, ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వాటి గురించి, కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి డాక్టర్‌కు విపులంగా వివరించాలి. ► అప్పటికే తీసుకున్న వ్యాక్సిన్ల వివరాలు తెలపాలి. తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇంకేమైనా ఉన్నాయా అని వాకబు చేయాలి. జీవిత భాగస్వామి (భర్త) వారి వైపు ఆరోగ్య వివరాలు, కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి కూడా చెప్పాలి. (వయసు ఎక్కువైనా, తక్కువైనా గర్భధారణ కోరుకున్న మహిళలందరూ ఈ సూచనలు పాటించాలి.) ► డిప్రెషన్, హైబీపీ, మధుమేహం (డయాబెటిస్) లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్‌కు వివరించాలి. ► ప్రతిరోజూ 400 మైక్రోగ్రాములకు తగ్గకుండా ఫోలిక్ యాసిడ్‌తో పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్లు వాడాలి. (పిండం పెరుగుదల సమయంలో ఈ పోషకాలన్నీ ప్రతి కణానికీ కావాలి. ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల పుట్టబోయే చిన్నారికి గ్రహణం మొర్రి వంటి సమస్యలతో పాటు వెన్నుపాము లోపాలు (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్) నివారితమవుతాయి. ► గర్భధారణ సమయంలో ఉండాల్సిన బరువు కంటే... మరీ ఎక్కువ బరువు ఉండటం, అలాగని బరువు తక్కువగా ఉండటం ఈ రెండూ కొన్ని ముప్పులను ఆహ్వానిస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన రీతిలో ఆహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తూ ఉండాల్సినంత బరువు మాత్రమే ఉండేలా జాగ్రత్త పడాలి. ► గర్భధారణ సమయంలో ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ► పనిచేసే చోట లేదా ఇతరత్రా ప్రదేశాలలో హానికారకమైన రసాయనాలకు దూరంగా ఉండాలి. ఇలా హానికర రసాయనాలకు ఎక్స్పోజ్ కావడం బిడ్డలో పుట్టుకతో వచ్చే లోపాలకు దారితీయవచ్చు. (ఉదాహరణకు కెమికల్ లేదా పెయింట్స్ వంటి పరిశ్రమల్లో పనిచేసేవారి కోసం ఈ జాగ్రత్తలు). ► ఒత్తిడికి పూర్తిగా దూరంగా ఉండాలి. హాయిగా, ఆహ్లాదంగా ఉండటానికి ప్రయత్నించాలి. గర్భధారణ సమయమప్పుడు ఈ సూచనలు... ► అన్ని విధాలా ఆరోగ్యకరంగా ఉన్నామని ఫీలవుతున్నప్పటికీ... డాక్టర్లు నిర్దేశించిన ప్రకారం క్రమం తప్పకుండా వారి ఫాలో అప్‌లో ఉండాలి. ► గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల వివరాలు (ఫ్లూ షాట్ వంటివి) తెలుసుకుని, వాటిని తప్పక తీసుకోవాలి. ► ఆ సమయంలో డాక్టర్లు సూచించిన చికిత్స ప్రణాళికను పూర్తిగా అనుసరించాలి. ఇది తల్లి, కడుపులోని బిడ్డ... ఈ ఇరువురూ పూర్తిగా సురక్షితంగా ఉండేలా చేస్తాయి. ► సమతులాహారం తీసుకుంటూ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అంటే... క్యాల్షియమ్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్–డి వంటి అన్ని పోషకాలందేలా చూడాలి. శరీరానికి శ్రమ కలగని రీతిలోనే వ్యాయామం చేస్తూ, రోజంతా చురుగ్గా ఉండాలి. డాక్టర్ వరలక్ష్మి కె.ఎస్. సీనియర్ గైనకాలజిస్ట్ -
కన్న బిడ్డలని చంపేసింది: ఆమెని విడుదల చేయండి
మెల్బోర్న్: బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లి విలవిల్లాడుతుంది.. నొప్పి నుంచి కోలుకునే వరకు తల్లి మనసు ప్రశాంతంగా ఉండదు. అలాంటిది ఓ తల్లి తన కడుపున పుట్టిన నలుగురు బిడ్డలను చంపేసింది.. సీరియల్ కిల్లర్ అనే ఆరోపణలతో జైలు పాలయ్యింది. తాజాగా ఆమెను విడుదల చేయాలని కోరుతూ.. శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంతకు ఎవరా మహిళా.. ఆమెని విడుదల చేయమని కోరడం ఏంటి.. ఈ ఘటన ఎక్కడ జరిగింది వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన కాథ్లీన్ ఫోల్బిగ్ తన నలుగురు పిల్లలు కాలేబ్, పాట్రిక్, సారా, లారాలను చంపినందుకు గాను ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తుంది. మరణించిన చిన్నారులంతా 19 రోజుల నుంచి 19 నెలల మధ్య వయస్సు వారే. కాథ్లీన్ మానసిక పరిస్థితి సరిగా లేదని.. ఈ క్రమంలోనే ఆమె తన నలుగురు పిల్లల్ని హత్య చేసిందనే ఆరోపణలపై అరెస్టయ్యింది. పోలీసు విచారణలో కాథ్లీన్ ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకుంది. ఈ క్రమంలో 2003లో కోర్టు ఆమెకు హత్య, నరహత్య నేరాల కింద శిక్ష విధించింది. అయితే కాథ్లీన్ తన బిడ్డలను చంపేసింది అనే దానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు. కేవలం ఆమె డైరీ ఆధారంగానే కోర్టు ఆమెకి శిక్ష విధించింది. కాథ్లీన్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిచింది. ‘‘కన్నతల్లా.. కసాయా’’ అనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కొందరు నిపుణులు ఈ కేసును ప్రత్యేకంగా స్టడీ చేశారు. సంచలన విషయాలు వెల్లడించారు. దీనిలో కాథ్లీన్ నలుగురు పిల్లలు సహజ కారణాలతో మరణించినట్లు నిపుణులు ఆధారాలతో సహా వెల్లడించారు. 'బేబీ కిల్లర్' గా పిలువబడే మహిళను విడుదల చేయాలని వాదించినట్లు గార్డియన్ తెలిపింది. ఈ క్రమంలో 90 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు సంతకం చేసిన పిటిషన్‌ను ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ విడుదల చేసింది. నివేదకిలో ఏం ఉందంటే.. కాథ్లీన్,ఆమె నలుగురు పిల్లల పూర్తి జన్యు శ్రేణి ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. కాథ్లీన్ కుమార్తెలలో ఇద్దరైనా సారా, లారాకు జన్యు పరివర్తన ఉందని జెనోమిక్ సీక్వెన్సింగ్ వెల్లడించింది. అలానే కాథ్లీన్‌కు కూడా జన్యు సమస్యలు ఉన్నాయని దీని గురించి ఆమెకు ఏ మాత్రం తెలియదని.. ఆ సమస్యల వల్ల ఆమెకు ఆకస్మిక గుండె పోటు రావచ్చని నివేదిక పేర్కొంది. "కాలేబ్, పాట్రిక్ జన్యువులు బీఎస్న్ జన్యువుల్లో ఒక ప్రత్యేకమైన అరుదైన జన్యు వైవిధ్యాన్ని చూపించాయి. అధ్యయనం తెలిపిన ప్రకారం ఈ అరుదైన జన్యు వైవిధ్యం వల్ల ఎలుకల్లో ప్రాణాంతక మూర్ఛ వ్యాధి వచ్చే అవకాశాలు అధికం. ఇదే సమస్య పాట్రిక్‌లో బయటపడింది. తన పుట్టుకకు నాలుగు నెలల ముందు నుంచే మూర్ఛతో బాధపడుతున్నట్లు తెలిసింది. అలానే కాలేబ్‌కు స్వరపేటిక సమస్య, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది” అని నివేదిక పేర్కొంది. మరణించిన చిన్నారులందరూ వివధ జన్యుకారణాల వల్లనే చనిపోయారని.. ఇలాంటి సంఘటనలు సర్వ సాధారణం అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ నివేదికను న్యూ సౌత్ వేల్స్ గవర్నర్‌కు సమర్పించారు. 1991లో ఎనిమిది నెలల వయస్సులో మరణించిన పాట్రిక్, మూర్ఛతో చనిపోగా.. 1993లో 10 నెలల వయసులో ఎస్ఐడీఎస్ వల్ల సారా మరణించింది. లారా 1999లో 19 నెలల వయస్సులో మరణించగా.. కాలేబ్ కేవలం 19 రోజుల వయసులో నరహత్యకు గురయ్యాడని ఆరోపించారు. కానీ వాస్తవంగా ఈ చిన్నారి కూడా ఎస్ఐడీఎస్ వల్లనే మరణించాడు. నలుగురు చిన్నారుల హత్యకు సంబంధించి ఎలాంటి ప్రత్యక్ష్య సాక్షులు కానీ, భౌతిక ఆధారాలు కానీ లేనప్పటికీ, ప్రాసిక్యూటర్లు కాథ్లీన్ డైరీలోని విషయాల ఆధారంగా ఆమెని నిందితురాలిగా పేర్కొన్నారు. విచారణ సమయంలో కూడా కాథ్లీన్ ఎటువంటి భావోద్వేగాలను చూపించలేదు. దాంతో ఆమె తన పిల్లలను అత్యంత క్రురంగా హత్య చేసి ఉంటుందని భావించారు. డైరీ రాతల గురించి కాథ్లీన్ని ప్రశ్నించినప్పుడు ఆమె మానవాతీత శక్తి తన పిల్లల్ని తీసుకెళ్లిందని తెలిపింది. చదవండి: కారు మట్టిలో కూరుకుపోయి..18 రోజుల తర్వాత గుర్రాన్ని వాకింగ్‌కు తీసుకెళుతున్న కుక్కపిల్ల -
మేనరికపు ‘విధి’వంచితులు
వారికి ఆస్తిపాస్తులేవీ లేవు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ముగ్గురూ అనారోగ్యంతో అవస్థ పడుతున్నారు. బుద్ధిమాంద్యం, నడవలేనిస్థితిలో ఇద్దరు మంచానికే పరిమితమయ్యారు. మరొకరికి మూగ–చెవుడు. వారి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. అయినా ఫలితం కన్పించడం లేదు. మరింత మెరుగైన వైద్యం అందిస్తే సాధారణ స్థితికి చేరతారన్న ఆశతో ఉన్నారు. వారిని ఎవరు కదిలించినా పిల్లలను కాపాడమంటూ చేతులెత్తి మొక్కుతున్నారు. సాక్షి, నంద్యాల(కర్నూలు) : నంద్యాల పట్టణంలోని దేవనగర్‌కు చెందిన ఉశేనిబాషా గౌండా (బేల్దారి) పనికి వెళుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను 2009వ సంవత్సరంలో మేనమామ కుమార్తె షేక్ ఆశాను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాదికి కుమారుడు జన్మించాడు. పేరు షేక్ మహమ్మద్ ఆసిఫ్. ప్రస్తుతం తొమ్మిదేళ్ల వయస్సు. మూగ–చెవుడు సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. దీనికితోడు తరచూ ఫిట్స్ వస్తున్నాయి. అనేక వైద్యశాలల్లో చూపించినా ఫలితం లేదు. ఆసిఫ్ తర్వాత అమ్మాయి షేక్ సుహానా జన్మించింది. ప్రస్తుతం ఏడేళ్లు. పుట్టుకతోనే బుద్ధిమాంద్యం వచ్చింది. నడవలేదు, కూర్చోలేదు, మాటలు కూడా రావు. పూర్తిగా మంచానికే పరిమితమైంది. వీరిద్దరి తర్వాత జన్మించిన షేక్ మహమ్మద్ అసద్దీ ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఐదేళ్ల వయస్సున్న ఈ చిన్నారి బుద్ధిమాంద్యం కారణంగా అవస్థ పడుతున్నాడు. ఎప్పుడూ తల కిందకు దించుకునే ఉంటున్నాడు. కంటిచూపు కూడా లేదు. పలుచోట్ల వైద్యం చేయించినా.. వైద్యం చేయిస్తే పిల్లలు మామూలు స్థితికి వస్తారన్న ఆశతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. ఇప్పటికే రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశారు. బంధువులు, పరిచయస్తుల దగ్గర అప్పులు చేసి వైద్యం చేయించినా ఫలితం కన్పించడం లేదు. దీంతో ప్రతిరోజూ పిల్లల పరిస్థితిని తలచుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. పూటగడవని దైన్యం.. కూలి పనికి వెళితేగానీ పూటగడవని స్థితి ఆ కుటుంబానిది. షేక్ ఆశా ఇంటి వద్ద ఉంటూ ముగ్గురు పిల్లల బాగోగులను చూసుకుంటుండగా.. ఉశేనిబాషా గౌండా పనికి వెళుతూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నాడు. ఇక పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు చేతిలో డబ్బుల్లేక అవస్థ పడుతున్నారు. దాతలు స్పందించి తమ పిల్లల వైద్యానికి చేయుత ఇవ్వాలని వేడుకుంటున్నారు. మా పిల్లలకే ఎందుకీ శిక్ష? పిల్లల పరిస్థితి తలచుకుని ప్రతిరోజూ వేదన పడుతున్నాం. దేవుడు మా పిల్లలకే ఎందుకీ శిక్ష వేశారు?! గత ఏడాది పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం. అయితే.. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలలో ఇటువంటి పిల్లలకు వైద్యం చేస్తారని కొందరు చెప్పడంతో ఆశ చిగురించింది. కానీ రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని అంటున్నారు. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాం. మా చేతికి డబ్బులేమీ వద్దు. పిల్లలకు వైద్యం చేయిస్తే అంతే చాలు. –ఉశేనిబాషా, ఆశా -
మాకెందుకీ శాపం
అబ్బాయిలను పోలిన మాట, ముఖం అనుభవిస్తోంది అమ్మాయి జీవితం పూర్తిస్థారుులో అమ్మాయిలుగా మార్చే చికిత్సకు రూ.6లక్షలు మందులకూ ఖర్చుచేయలేని దైన్యం టీబీతో మంచం పట్టిన తండ్రి కూలీకి వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లి పరకాల : ముఖ లక్షణాలు, మాటలు వింటే వారిద్దరిని మగపిల్లలనే అందరూ అనుకుంటారు. కానీ సమాజంలో అనుభవించేది మాత్రం ఆడపిల్లల జీవితం. వారు అటు ఆడ ఇటు మగ లక్షణాలు పూర్తిస్థాయిలో లేకుండా జన్మించారు. వారిద్దరి వేదనను చూస్తూ నిత్యం తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ఈ చిన్నారుల అవస్థలు చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో అనక తప్పని పరిస్థితి. పిల్లలను పూర్తిస్థాయిలో అమ్మాయిలుగా మార్చడానికి చికిత్స చేయించడానికి రూ.6 లక్షలు కావాలి. నెలనెలా మందుల కోసం రూ.3వేలు కూడా లేని దీనస్థితిలో ఆ తల్లిదండ్రులు.. దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పరకాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన జన్నాజి రఘుణాచారి-రాజనీల దంపతులకు అంజలి(11), రవళి(8) ఇద్దరు కూతుళ్లు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అంజలి ఆరో తరగతి చదువుతుండగా.. రవళి నాలుగో తరగతి చదువుతున్నది. రఘుణాచారి కులవృత్తి కమ్మరి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా కొద్దికాలంగా టీబీ కారణంగా మంచానికే పరిమితమయ్యూరు. ప్రభుత్వం నుంచి మందులు సరిగ్గా అందకపోవడంతో రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇక చారి దంపతులకు మొదటి, రెండో సంతానంగా కుమారులే జన్మించినా వివిధ కారణాలతో మృతి చెందారు. ఆ తర్వాత అంజలి, రవళి జన్మించగా.. చిన్నతనంలో అబ్బారుులుగా భావించినప్పటికీ మర్మాంగాలు లేవని గుర్తించిన తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. హన్మకొండలోని వివిధ ఆస్పత్రుల్లో చూపించిన వారు చివరకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చూపించారు. అక్కడ వైద్యులు పరీక్షించి పిల్లలకు ఎక్కువగా ఆడ లక్షణాలే ఉన్నందున శస్త్రచికిత్స చేస్తే ఆడవారిగా మారిపోతారని చెప్పారు. అయితే, శస్త్రచికిత్సకు రూ.3లక్షలు వెచ్చించాల్సి వస్తుందని చెప్పడంతో అప్పటి నుంచి చారి దంపతులు డబ్బుల కోసం నానా తంటాలు పడుతున్నారు. పొద్దంతా పని చేస్తేనే రెండు పూటల తినడమే కష్టంగా ఉన్న ఆ పేద కుటుంబానికి ఈ డబ్బు వెచ్చించడం అంతు లేని సమస్యగా పరిణమించింది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు అంజలి, రవళి శస్త్రచికిత్స కోసం డబ్బు లేకపోగా.. నెలనెలా మందుల కోసం రూ.3వేల చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. ఓ పూట తిండి పెట్టకున్నా పర్వాలేదు కానీ మందులు మాత్రం తప్పక వాడాలన్న వైద్యుల సూచనతో నెలకు రూ.3వేలు వెచ్చించేందుకు రఘుణాచారి దంపతులు నానా తిప్పలు పడుతున్నారు. అటు చారితో పాటు ఆయన భార్య రాజనీల కూలికి వెళ్తూ వచ్చే డబ్బుతో మందులు కొనుగోలు చేస్తున్నారు. ఆ దంపతులకు వ్యవసాయ భూమి లేకపోగా కనీసం ఉండేందుకు ఇల్లు కూడా సరిగ్గా లేని దుస్థితి. ఈ మేరకు అటు ప్రభుత్వంతో పాటు ఇటు దాతలు తమకు చేయూతనివ్వాలని రఘుణాచారి దంపతులు చేతులు జోడించి కోరుతున్నారు. సాయం చేయాలనుకుంటే... అంజలి, రవళి చికిత్స కోసం ఆర్థిక సాయం చేయూలనుకునే వారు 96182 95958, 98482 32520 నంబర్ల లో సంద్రిం చొచ్చు. లేదంటే ఆంధ్రాబ్యాంకు పరకాల బ్రాంచి లోని ఏడీబీ ఏ/సీ 138510100060498 ఖాతాలో జమ చేయాలని చేయొచ్చు. -
రక్తసంబంధీకులతోనే వివాహాలెందుకు?
మేలుకాని మేనరికం! మేనరికాల జోడీ... భావితరాలకు కీడు ఓ చిన్నారి పుట్టగానే ప్రసూతి అయిన తల్లి దగ్గరే ఉన్న పెద్దవాళ్లు చేసే మొదటి పని... చేతులకు ఐదైదు వేళ్లు ఉన్నాయా, అదనంగా ఏమైనా ఉన్నాయా అని చూడటం. ఆ తర్వాతి పని బుజ్జాయికి శారీరక అవకరాలేమీ లేవని నిర్ధారణ చేసుకోవడం. ఆ తర్వాతే పండంటి బిడ్డ పుట్టిందంటూ ప్రకటిస్తారు. ఆ బిడ్డ పెరుగుతూ తల్లిదండ్రులూ, సమాజంలోని ఇతరుల పలకరింపులకు చక్కగా స్పందిస్తుంటే బిడ్డ మానసిక పరిస్థితీ బాగుందంటూ ఆనందిస్తారు. కానీ... తొలిదశలోనే బిడ్డలో ఏవైనా అవయవలోపాలు కనిపిస్తే...? ఎదిగే క్రమంలో చిన్నారిలో ఏవైనా మానసిక సమస్యలు ఎదురైతే...? ఇక ఆ తల్లిదండ్రుల వేదనను మాటల్లో వర్ణించలేం. సాధారణంగా ఇలా శారీరక లోపాలు ఉండే బిడ్డలు పుట్టేందుకు మేనరికపు వివాహాల్లోనే అవకాశాలు ఎక్కువ. అందుకే... మారుతున్న సమాజంలో ఆరోగ్యకరమైన బిడ్డల కోసం మేనరికపు వివాహాలను పరిహరించడమే మంచిదని ఆధునిక వైద్యశాస్త్రం చెబుతోంది. మేనరికపు వివాహాల్లో ఇలా ఎందుకు జరుగుతోంది, ఒకవేళ మేనరికపు వివాహమే తప్పనప్పుడు బిడ్డ పుట్టకముందూ, కడుపున పడ్డ తర్వాత దంపతులు చేయించుకోవాల్సిన పరీక్షలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. 1 జన్యుపరమైన సమస్యలూ - రకాలు సాధారణంగా జన్యుపరమైన సమస్యలను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి.. ఆటోజోమల్ డామినెంట్ ఇలాంటి జీన్స్ వచ్చిన పిల్లల్లో సమస్య బయటకు కనిపిస్తూ ఉంటుంది. పైగా లోపంతో ఉన్న జీన్ డామినెంట్‌గా ఉంటుంది. దాంతో ఒక్క జీన్ సంక్రమించినా పిల్లల్లో సమస్య బయటపడుతుంది. 2 ఆటోజోమల్ రెసెసివ్ వీటిలో సమస్య బయటపడదు. కానీ తల్లిదండ్రులిద్దరిలోనూ సమస్య కలగజేసే జన్యువులు నిశ్శబ్దంగా లోపలే ఉంటాయి. వీళ్లు తర్వాత తరానికి సమస్యను మోసుకెళ్తారు. కాబట్టి వీరిని ‘క్యారియర్స్’ అంటారు. ఇద్దరు ‘క్యారియర్స్’ పెళ్లాడితే... రెండు రెసెసివ్ జీన్స్ కలిసి... పుట్టబోయే బిడ్డలో సమస్య తప్పక బయటపడుతుంది. 3 ఎక్స్ లింక్డ్ సమస్యలు ఇలాంటి సమస్యలు ‘ఎక్స్’ క్రోమోజోమ్‌పై నిక్షిప్తమై ఉంటాయి. దాంతో ఈ జీన్ కలిగిన ఆడపిల్లలు సమస్యకు ‘క్యారియర్స్’గా ఉంటారు. సమస్య మగపిల్లల్లో బయటపడుతుంది. ఒక ఆరోగ్యకరమైన అమ్మాయి, ఒక ఆరోగ్యకరమైన అబ్బాయి కలిసి ఒక ఆరోగ్యకరమైన చిన్నారికి జన్మనిచ్చే అంశంలో... ప్రతి విషయంలోనూ, ప్రతి అంశంలోనూ సగం పాళ్లు అమ్మాయి నుంచి, మరో సగం అబ్బాయి నుంచి వస్తాయి. ఆ అంశాలనే వైద్యపరిభాషలో జన్యువులంటారు. తల్లిదండ్రులకు చెందిన ఆ జన్యువుల్లో ఏ లోపాలూ లేకపోతే ఆరోగ్యకరమైన అవయవం రూపుదిద్దుకుంటుంది. తల్లిదో, తండ్రిదో చెప్పలేకపోయినా... ఒకవేళ ఒక జన్యువులో ఏదైనా లోపం ఉంటే... మరో జన్యువు ఆ లోపాన్ని పూరిస్తుంది. మరి రెండు జన్యువులూ లోపంతోనే ఉంటే...? అప్పుడు అవకరం లేదా లోపం తప్పదు. మరి ఇలా రెండు జన్యువులూ లోపంతోనే ఉండే పరిస్థితి ఎప్పుడు తటస్థిస్తుంది? ఎప్పుడంటే... వాళ్లిద్దరూ ఒకే సంతతికి చెందినవారైనప్పుడు... ఆయా జన్యువులూ ఒకేలా ఉంటాయి. ఒకే సంతతికి చెందిన వారంటే... చాలా దగ్గరి సంబంధం కలిగినవారని అర్థం. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డ కావాలనుకున్నప్పుడు ఆ పెళ్లిళ్లను ఆధునిక వైద్యశాస్త్రం అంతగా ప్రోత్సహించదు. మరి ఎలాంటి దగ్గరి సంబంధాలు లేనప్పుడు ఇలాంటి అవకరాలకు అవకాశం లేదా? ఉంటుంది. కానీ... దూరపు సంబంధాల్లో 400 జంటల్లో ఒకదానికి అవకరమైన బిడ్డ పుట్టే అవకాశం ఉంటే... దగ్గరి సంబంధాల విషయంలో కేవలం 200కు పైగా జంటల్లోనే ఒక బిడ్డ ఇలా లోపాలతో పుట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకే ఆరోగ్యకరమైన బిడ్డ కోసం దూరపు సంబంధాలనూ, వీలైతే అసలేవిధమైన రక్తసంబంధం లేని ఇతర కుటుంబాల వారితో వివాహాలను ప్రోత్సహిస్తోంది ఆధునిక వైద్యశాస్త్రం. రక్తసంబంధీకులతోనే వివాహాలెందుకు? ఇంగ్లాండ్ రాజకుటుంబాల్లోని వారికి ఒక అపోహ ఉండేది. తమలో ప్రవహించేది పవిత్రమైన రాజరికపు నెత్తురనీ... ఆ రక్తం కలుషితం కాకూడదనీ వాళ్లు భావించేవారు. బయటి సంబంధాల వల్ల రాజరికపు నెత్తురు సంకరమవుతుందనే ఉద్దేశంతో రాజవంశీయుల్లోనే చాలా దగ్గరి సంబంధాలను చేసుకునేవారు. దాంతో బ్రిటిష్ రాజవంశీయుల జన్యువుల్లోని ఒక జన్యులోపం కారణంగా మగపిల్లల్లో ఒక లోపం ఏర్పడింది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల రాకుమారుడికి చిన్నపాటి గాయం తగిలినా... రక్తం ఎంతకూ గడ్డకట్టేది కాదు. ఇలా ఎంతసేపటికీ రక్తం గడ్డకట్టకపోవడం వల్ల తీవ్రరక్తస్రావంతో రాకుమారుడు చనిపోయే అవకాశాలుండేవి. అందుకే బ్రిటన్ రాజవంశీయుల పూర్వికులైన రాజులందరూ బ్లేడు గాటు కూడా తగలకుండా జాగ్రత్త పడేందుకు బవిరి గడ్డాలతో, గుబురు మీసాలతో కనిపిస్తుండేవారు. ఇది అలనాటి బ్రిటన్ రాజవంశీయుల చిత్తరువుల్లో చూడవచ్చు. ఆధునిక కాంలో ఈ లక్షణంపై పరిశోధనలు జరిగాయి. ఇలా రక్తం గడ్డకట్టనివ్వని లక్షణమున్న జబ్బును హీమోఫీలియా అంటారనీ, ఎన్నో తరాలుగా దగ్గరి సంబంధీకులతోనే వివాహాలు జరగబట్టి ఈ లోపం ఏర్పడిందని పరిశోధనల ద్వారా తెలిసింది. అయితే రాజకుటుంబాల్లోని వారి సంతానాలకే ఈ జబ్బు ఉండటం వల్ల అప్పట్లో ప్రజానీకం దీన్ని ‘రాయల్ డిసీజ్’ అనేవారు. (కానీ సామాన్యుల్లోనూ ఈ జబ్బు కనిపిస్తుంది). ఇక సామాన్య ప్రజానీకం విషయాలకు వస్తే... ప్రధానంగా ఆర్థిక అంశాలే దగ్గరి సంబంధీకులతో వివాహాలను ప్రోత్సహిస్తాయి. ప్రధానంగా మేనత్త మేనమామ పిల్లలను చేసుకుంటే ఆస్తిలో ఆస్తి కలుస్తుంది... ఆ ఆస్తి ఇతరుల పాలయ్యే బాధ తప్పుతుందనే అంశమే ఇలాంటి పెళ్లిళ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఇక రెండో ప్రధాన అంశం... ఉద్వేగపూరిత బంధం. అంటే ఎమోషనల్ రిలేషన్షిప్. మనం ప్రాణప్రదంగా పెంచుకున్న మన బిడ్డను ఎక్కడో దూరంగా ఉన్నవారికి ఇచ్చి పెళ్లి చేస్తే... వారెలా చూసుకుంటారో, పువ్వులో పెట్టుకుంటారో లేక ఆరళ్లు పెడుతూ ఉంటారో? అదే... మన కళ్లెదురుగా ఉండేలా చేస్తే... బిడ్డ బాగోగులు చూస్తూ ఉండవచ్చు కదా! ఈ అంశాలతో కులాలు, మతాలు, ప్రాంతాలు, దేశాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా 20 శాతం పెళ్ళిళ్లు దగ్గరి బంధువుల్లోనే జరుగుతుంటాయి. తమ జీవనశైలిలో, తమ సాంస్కృతిక విధానంలో తేలిగ్గా ఇమిడిపోవడం వల్ల పెళ్లి తర్వాత దంపతులకు ఇబ్బందులు రావనే భావనే ఇలాంటి వివాహాలను ప్రోత్సహిస్తుంది. అంటే సాంస్కతిక సమానత మూడో ప్రధానమైన అంశం అన్నమాట. బిడ్డలకు లక్షణాలెలా వస్తాయంటే... ప్రతి మానవుడి దేహం కోటానుకోట్ల కణాలతో నిర్మితమవుతుంది. ఇది తొలుత ఒకే ఒక కణంతో మొదలవుతుంది. ప్రతి మానవ కణంలో 46 క్రోమోజోములుంటాయి. అంటే 23 జతలన్నమాట. వీటిలో మొదటి జత 23 మహిళ నుంచి, మరో 23 పురుషుడి నుంచి ఏకీకృతమై మొదటి కణం ఏర్పడుతుంది. దీన్నే పిండం అని అభివర్ణిస్తాం. ఈ పిండంలో ఉంటే 23 జతల క్రోమోజోములపై అనేక జన్యువులు ఉంటాయి. జన్యువు అంటే ఏమిటో కాస్త తేలిక భాషలో చెప్పుకుందాం. బిడ్డ పుట్టగానే బంధువులందరూ చుట్టూ చేరి మురిపెంగా చూసుకుంటూ ‘‘అరె... వీడి ముక్కు చూడండి. అచ్చం వాళ్ల తాతయ్యదే. వాడి కళ్లు చూడండి. అచ్చం వాళ్ల అమ్మవే’’ అంటూ పోలికలు చెబుతుంటారు. బిడ్డలో ఈ పోలికలు ఎలా వస్తాయి? ఎలాగంటే... ప్రతి అవయవానికీ, దాని ఆకృతికీ, సైజ్‌కూ, ఒడ్డూపొడవునకు సంబంధించిన ప్రతి అంశమూ జన్యువులో ముందే నిక్షిప్తమై ఉంటుంది. ఈ జన్యువులన్నీ క్రోమోజోములపై ఉంటాయి. ఈ క్రోమోజోముల 23 జతలు ఒకదానితో మరొకటి కలిసి ఒక కణంగా రూపొందే సమయంలో తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు పోలికలు వస్తాయి. అంతేకాదు... తల్లిదండ్రుల లక్షణాలూ, ఒంటి రంగు వంటి అనేక అంశాలూ తల్లిదండ్రుల నుంచే సంక్రమిస్తాయి. ఇలా ఈ లక్షణాలన్నీ ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుంటాయి. మేనరికపు దంపతులు చేయించుకోవాల్సిన పరీక్షలు గర్భందాల్చిన మూడో నెలలో (12 వారాల్లో) డబుల్ మార్కర్ టెస్ట్ అనే రక్తపరీక్ష చేయించుకుంటే బిడ్డలో డౌన్స్ సిండ్రోమ్, ట్రైజోమ్ 18, 13 వంటి కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా లేక తక్కువగా ఉన్నాయా అని తెలుస్తుంది. ఈ పరీక్షల ఫలితాలను బట్టి వేరే పరీక్షలు అవసరమా కాదా అని తెలుస్తుంది.మూడో నెలలో (12 వారాలప్పుడు) న్యూకల్ ట్రాన్స్‌లుయెన్సీ స్కాన్ (ఎన్టీ స్కాన్) చేయించుకుంటే, ఆ సమయానికి బయటపడే సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తాయి. పై పరీక్షల్లో కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందనే సందేహం కలిగినప్పుడు దాన్ని నిర్ధారణ చేయడానికి బిడ్డ చుట్టూ ఉండే మాయ నుంచి కొంత ముక్క సేకరించి కోరియా విల్లస్ బయాప్సీ చేస్తారు. ఐదో నెలలో ట్రిపుల్ మార్కర్ లేదా క్వాడ్రపుల్ మార్కర్ వంటి రక్తపరీక్షలు చేయించుకుంటే పుట్టబోయే బిడ్డలో కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు ఎక్కువా లేదా తక్కువా అన్నది తెలుస్తుంది. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు ఫలితాలు వస్తే ఆమ్నియోసెంటైసిస్ అనే పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఇందులో గర్భంలోని బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు లోంచి 10 - 20 ఎమ్ఎల్. తీసి జన్యువుల పరీక్షకు (క్యారియోటైపింగ్‌కు) పంపించి సమస్యను నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్ష వల్ల ఒక శాతం మందిలో గర్భస్రావమయ్యే అవకాశం ఉంటుంది. ఐదో నెల చివరిలో 18-22 వారాలప్పుడు ‘టిఫ్ఫా’ అనే స్కానింగ్ చేయడం వల్ల బిడ్డలో వచ్చే అవయవలోపాలను ముందుగానే గుర్తించవచ్చు. దీనితో పాటు జెనెటిక్ సోనోగ్రామ్ చేయించుకుంటే కొన్ని జన్యుసంబంధిత వ్యాధులను సూచించే సాఫ్ట్ మార్కర్లను గుర్తించి, దానికి తగినట్లుగా తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు. ఆరో నెలలో 22-24 వారాల్లో 2డీ ఫీటల్ ఎకో కూడా చేయించుకుంటే బిడ్డలో గుండెకు సంబంధించిన లోపాలను గుర్తించవచ్చు. స్కానింగ్‌లో నూటికి నూరు పాళ్లూ లోపాలను కనుక్కోలేకపోవచ్చు. కొందరిలో బిడ్డ పొజిషన్, ఉమ్మనీటి శాతం, తల్లి పొట్ట మీద అధికకొవ్వు వంటి అంశాలను బట్టి కూడా కొన్ని లోపాలను కనుగొనడంలో విఫలమయ్యే అవకాశం ఉంది. బిడ్డ పుట్టాక బిడ్డపుట్టిన తర్వాత మొదటి వారంలోనే నియోనేటల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం వల్ల త్వరగా చికిత్స చేయదగిన వ్యాధులు ఏవైనా ఉంటే తెలుస్తుంది. అంటే ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజమ్ వంటివి గుర్తించవచ్చు. బిడ్డ మూడో నెలలో వినికిడి లోపాలను గుర్తించే పరీక్షలు చేయించి, ఒకవేళ ఉంటే వాటిని చాలావరకు సరిదిద్దవచ్చు. దగ్గరి సంబంధాల్లో లోపాలు ఎందుకంటే... క్రోమోజోములపై లక్షణాలను సంక్రమింపజేసే జన్యువులు తండ్రి నుంచి ఒకటీ, తల్లి నుంచి మరొకటి కలిసి సంపూర్ణమవుతాయి. ఉదాహరణకు... ఒక మహిళలో (కాబోయే తల్లిలోని) ఒక జన్యువు కాస్త చెడిపోయి... బిడ్డలో అది ఆస్తమా వ్యాధిని కలగజేసేందుకు అవకాశం ఉందనుకుందాం. ఆ మహిళ తన కుటుంబంలోని దగ్గరి వారిని కాకుండా సంబంధాలు లేని మరొకరిని ఎవరినో పెళ్లి చేసుకుందని అనుకుందాం. అప్పుడు ఆ పురుషుడిలోని అదే రకమైన జన్యువు ఆరోగ్యంగా ఉందనుకుందాం. ఈ ఆరోగ్యకరమైన పురుషుడి జన్యువు, అనారోగ్యకరమైన ఆ స్త్రీ జన్యువును అధిగమిస్తుంది. అంటే ఇంగ్లిష్‌లో చెప్పాలంటే డామినేట్ చేస్తుంది. ఇలా డామినేట్ చేసే జన్యువును ‘డామినెంట్’ జీన్ అంటారు. అలాగే లొంగి ఉండే అనారోగ్యకరమైన జన్యువును ‘రెసెసివ్’ జీన్ అంటారు. అలాగే ఒకవేళ కుటుంబ సభ్యుల్లోని దగ్గరి సంబంధంలోనే పెళ్లి జరిగిందనుకోండి. అప్పుడు తల్లిదండ్రులిద్దరూ ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చినవారు కాబట్టి వారిద్దరిలోనూ సదరు జన్యువుల తీరు ఒకేలా ఉంటాయి. దాంతో ఇద్దరి జన్యువుల్లోనూ ఏదీ మరొకదాన్ని డామినేట్ చేయకపోవడం, రెండూ లోపంతోనే ఉండటంతో పుట్టబోయే బిడ్డలో ఆస్తమా వ్యక్తమవుతుందన్నమాట. ఇది ఒక జన్యువు ఉదాహరణ మాత్రమే. ఇలా తల్లిదండ్రుల లక్షణాలను మోసుకెళ్లే జన్యువులు ఒక్క క్రోమోజోమ్‌పై దాదాపు 20,000 వరకూ ఉంటాయి. అంటే భవిష్యత్తులో ఆ పుట్టబోయే బిడ్డ ప్రతి లక్షణమూ ముందే ప్రోగ్రామ్ అయిపోయి జన్యువుల్లో నిక్షిప్తమై ఉంటుందన్నమాట. అందుకే దంపతులిద్దరూ దగ్గరి బంధువులైతే ఇద్దరిలోనూ ఉన్నది ఒకేలాంటి లోపం ఉన్న (ఫాల్టీ) జీన్ అయితే పుట్టే బిడ్డలో అవకరం /లోపం కనిపిస్తుందన్నమాట. ఎలాంటి జబ్బులు? మేనరికపు వివాహాలు చేసుకున్న వారిలో అవయవలోపాలు, పుట్టుకతో వచ్చే జబ్బులు లేదా లోపాలు (కంజెనిటల్ డిసీజెస్), రక్తసంబంధిత వ్యాధులైన హీమోఫీలియా, థలసీమియా వంటివి, సిస్టిక్ ఫైబ్రోసిస్, మూత్రపిండాల వ్యాధులు (కంజెనిటల్ యురెట్రోపెల్విక్ అబ్స్ట్రక్షన్), కండరాల, నరాలకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల సిండ్రోములు, బుద్ధిమాంద్యత, వికినిడి సమస్యలు, కళ్లసమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు (గుండెలో రంధ్రాలు, వాటి ధమనుల్లో లోపాలు), చిన్నప్పుడే వచ్చే మధుమేహం, జన్యుపరమైన సమస్యలు, తల్లిలో మాటిమాటికీ జరిగే గర్భస్రావాలు, పుట్టగానే బిడ్డ చనిపోవడం, శ్వాససంబంధిత సమస్యలు, జీవక్రియలకు సంబంధించిన (మెటబాలిక్) సమస్యలు ఇలా అనేక వైద్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. చేసుకున్న ప్రతివారికీ ఇదే సమస్యా? మేనరికపు వివాహం చేసుకున్న ప్రతి దంపతులకూ ఇలాంటి సమస్యలే వస్తాయని నమ్మకంగా చెప్పవచ్చా అని అడిగితే... అలాగే జరిగి తీరుతుందని చెప్పలేం. కానీ సాధారణంగా మిగతావారిలో 2-3 శాతం మందికి ఇలా పుట్టుకతో వచ్చే వైద్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటే... మేనరికం చేసుకున్నవారిలో ఈ ప్రమాదం (రిస్క్) రెట్టింపు ఉంటుంది. అంటే మేనరికపు వివాహాలు చేసుకున్నవారిలో 4 - 6 శాతం మంది పిల్లలకు ఇలా వైద్యసమస్యలున్న పిల్లలు పుట్టవచ్చు. లేదా మొదటి సంతానం బాగానే పుట్టి రెండో సంతానానికి సమస్య రావచ్చు. లేదా దీనికి విరుద్ధంగా కూడా కావచ్చు. ఒక వ్యాధిని ఒక తరం నుంచి మరో తరానికి మోసుకెళ్లే ఒక రిసెసివ్ జీన్ తల్లిదండ్రులిద్దరిలోనూ ఉన్నప్పుడు వారి బిడ్డకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు 25 శాతం అన్నమాట. అంటే వారికి నలుగురు సంతానం కలిగితే ఒక్కరికి తప్పక ఈ వ్యాధి రావచ్చు. అలాగే ఆరోగ్యకరంగా ఉన్న ఆ పిల్లల్లో సగం మందికి తమ కణాల్లో అదే చెడిపోయిన జీన్ (రిసెసివ్ జీన్) ఉండవచ్చు. అది తర్వాతి తరంలో ప్రయుక్తం కానూ వచ్చు. కాకపోనూ వచ్చు. కానీ... ప్రమాదం పొంచి ఉందిలా... దగ్గరి వివాహాలను వైద్య పరిభాషలో కన్‌సాంగ్వినియస్ మ్యారేజెస్ అంటారు. అంటే కోడలు వరసయ్యే అమ్మాయి మేనమామను చేసుకోవడం, లేదా మేనమామ, మేనత్త పిల్లలను పెళ్లి చేసుకోవడం. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్ల పుట్టబోయే బిడ్డల్లో అవయవలోపం నుంచి బుద్ధిమాంద్యం వరకు ఎన్నో రకాల రుగ్మతలు, సిండ్రోమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని మేనరికపు వివాహాలకు దూరంగా ఉండటమే మేలు. ఒకవేళ ఈ అంశాలన్నీ తెలియక నిశ్చితార్థమో, వివాహమో చేసుకుంటే... అప్పుడు ఆ జంట చేయాల్సిన పనులివి... పెళ్లికి ముందు: వివాహానికి ముందే అమ్మాయీ, అబ్బాయి... ఈ ఇద్దరినీ ప్రీ-మేరిటల్ అండ్ జెనెటిక్ కౌన్సెలింగ్ కోసం నిపుణులను కలవాలి. అప్పుడా నిపుణులు కుటుంబ ఆరోగ్య చరిత్రను పరిగణనలో తీసుకుంటారు. అంటే వీరి తల్లిదండ్రులు, మేనత్త, మేనమామ, తాతలు, ముత్తాతల్లో ఏవైనా దగ్గరి సంబంధం చేసుకోవడం వల్ల వచ్చిన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటారు. ఉంటే... వీరికి పుట్టే పిల్లలకు ఆ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో విశ్లేషణాత్మకంగా అంచనా వేస్తారు. వాటి ఆధారంగా రిస్క్ తీసుకోవచ్చా లేదా అనేది ఆ జంట నిర్ణయించుకోవచ్చు. అవసరమైతే ఆ జంట కొన్ని రక్తపరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇద్దరి సాధారణంగా వచ్చే జన్యుపరమైన సమస్యలను తెచ్చే జీన్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోడానికి జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు. అయితే ఎన్ని పరీక్షలు చేసినా వారికి ఏ సమస్యా రాదనో, వస్తుందనో నిర్ధారణగా చెప్పడం కష్టం. ఒకవేళ పెళ్లి తప్పనిసరిగా చేసుకోవాలని నిర్ణయించుకుంటే పైకి కనిపించే (ఆటోజోమల్ డామినెంట్) సమస్యలు వస్తాయని తెలిసినప్పుడు ఆ పెళ్లిని తప్పించడమే మేలు. పెళ్లి తర్వాత: పెళ్లి తర్వాత కూడా జెనెటిక్ కౌన్సెలింగ్‌కు వెళ్లి పైన చెప్పినవి పాటించవచ్చు. గర్భందాల్చడానికి మూడు నెలల ముందునుంచే ఫోలిక్‌యాసిడ్ మాత్రలు రోజుకు ఒకటి చొప్పున తీసుకోవడం మంచిది. గర్భం వచ్చిన తర్వాత: పిల్లల్లో ఏ సమస్యా రాకుండా ఉండేందుకు ఏమీ చేయలేం. ఎందుకంటే అవి జన్యుపరంగా సంక్రమించేవి కాబట్టి. కాకపోతే కొన్ని గుర్తించదగిన సమస్యలను ముందుగానే పసిగట్టడం వల్ల, పుట్టిన తర్వాత చెయ్యగలిగిన చికిత్సలు ఏవైనా ఉంటే వాటికి తక్షణమే సన్నద్ధమయ్యేలా జాగ్రత్త తీసుకోవచ్చు. లేదా లోపల ఉన్న సమస్య మెదడుకు సంబంధించినదీ లేదా ఎప్పటికీ సరిచేయలేనిదని తెలిస్తే గర్భస్రావం (ఐదు నెలల లోపల) చేయించుకోవడం వంటి అంశాలను ఆలోచించవచ్చు. లేదంటే పుట్టిన తర్వాత ఆ పిల్లలతో జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉంటుంది. మేనరికం పెళ్లిళ్ల వల్ల తప్పనిసరిగా ఆరోగ్య సమస్యలు వచ్చి తీరతాయని నిర్ధారణగా చెప్పలేకపోయినా... వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ అని మాత్రం నిర్ధారణగా చెప్పవచ్చు. గుర్తుంచుకోండి మేనరికపు పెళ్లిళ్ల వల్ల పుట్టే పిల్లలకు వచ్చే అవయవలోపాలను రాకుండా చేసేందుకు గర్భంతో ఉన్నప్పుడే ఇచ్చే మందులు, చేసే ఇంజెక్షన్లు ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. ఇక మేనరికపు వివాహాల వల్ల పిల్లలకు అవకరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఆస్తి కోసం అలాంటి వాటిని చేసుకుని... సంక్రమించిన ఆస్తిని పిల్లలను బాగు చేయడానికంటూ వ్యయం చేసుకోవడం కంటే... ఆరోగ్యకరమైన బిడ్డలు పుట్టడమే అన్నిటికంటే ఉత్తమమైన ఆస్తి అని గుర్తుంచుకోండి. బయటి సంబంధాలను చేసుకోవడమే అన్నివిధాలా ఉత్తమం. కాకపోతే సంబంధం మంచిదా, కాదా అని నిర్ధారణ చేసుకోవడం ఒక్కటే ఈ విషయంలో పాటించాల్సిన జాగ్రత్త. మేనరికపు వివాహం తర్వాతి పరీక్షలతో పోలిస్తే అది సులభం కూడా. - నిర్వహణ: యాసీన్ సంబంధాల దగ్గరితనం... వాటి వర్గీకరణ ఇలా తల్లిదండ్రులు - వారి పిల్లలు మొదటి డిగ్రీ సంబంధం తోబుట్టువులు - మేనమామ, మేనత్త రెండో డిగ్రీ సంబంధం మేనమామ పిల్లలు, మేనత్త పిల్లలు మూడో డిగ్రీ సంబంధం తాత అన్నదమ్ముల పిల్లల పిల్లలు (మనవలు) నాలుగో డిగ్రీ సంబంధం డాక్టర్ వి. శోభ సీనియర్ గైనకాలజిస్ట్, లీలా హాస్పిటల్స్, మోతీనగర్, హైదరాబాద్.