అమ్మ‌మ్మ నుంచి అమ్మ‌కు.. అమ్మ నుంచి కుమారుల‌కు గుండె స‌మ‌స్య‌! | Marfans Syndrome: Kamineni Doctors Changed Aorta For Mother And Son, More Details Inside | Sakshi
Sakshi News home page

అమ్మ‌మ్మ నుంచి అమ్మ‌కు.. అమ్మ నుంచి కుమారుల‌కు గుండె స‌మ‌స్య‌!

Published Sun, Aug 4 2024 4:47 PM | Last Updated on Sun, Aug 4 2024 5:38 PM

Marfans syndrome: Kamineni Doctors Changed Aorta For Mother And Son

అత్యంత అరుదైన మార్ఫ‌న్స్ సిండ్రోమ్‌

ప్ర‌తి ల‌క్ష మందిలో 0.19 మందికే ఈ స‌మ‌స్య‌

త‌ల్లీ కుమారులిద్ద‌రికీ బృహ‌ద్ధ‌మ‌ని వాపు

ఇద్ద‌రికీ బృహ‌ద్ధ‌మ‌ని మార్చిన కామినేని వైద్యులు

హైద‌రాబాద్:  అమ్మ‌మ్మ నుంచి అమ్మ‌కు, అమ్మ నుంచి కుమారులు ఇద్ద‌రికీ ఒకే ర‌క‌మైన గుండె స‌మ‌స్య అనువంశికంగా రావ‌డం అత్యంత అరుదు. జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల ఇలా సంభ‌వించినా, అందులోనూ మార్ఫ‌న్స్ సిండ్రోమ్ అనే అత్యంత అరుదైన స‌మ‌స్య రావ‌డం చాలా చాలా త‌క్కువ‌. ప్ర‌తి ల‌క్ష మంది ప్ర‌జ‌ల్లో కేవ‌లం 0.19 మందికే ఈ స‌మ‌స్య వ‌స్తుంది. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌స్యే వ‌చ్చిన త‌ల్లీ కుమారులిద్ద‌రికీ ఎల్బీన‌గ‌ర్‌లోని కామినేని ఆస్ప‌త్రిలో విజ‌య‌వంతంగా శ‌స్త్రచికిత్స చేసి, గుండెలోని ప్ర‌ధాన ర‌క్త‌నాళ‌మైన బృహ‌ద్ధ‌మ‌నిని మార్చి, కృత్రిమ బృహ‌ద్ధ‌మ‌ని అమ‌ర్చి వాళ్ల ప్రాణాలు కాపాడారు. ఈ అరుదైన స‌మ‌స్య గురించి, దానికి అందించిన చికిత్స గురించి కామినేని ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ కార్డియోథొరాసిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ విశాల్ వి ఖంటే తెలిపారు.

“సుమారు ఆరు నెల‌ల క్రితం మా ఎమ‌ర్జెన్సీ విభాగానికి ఒక మ‌హిళ వ‌చ్చారు. ఆమెకు అన్నిర‌కాల ప‌రీక్ష‌లు చేయ‌గా, బృహ‌ద్ధ‌మ‌ని వాపు వ‌ల్ల పగిలిపోయింద‌ని గుర్తించాము. వెంట‌నే అత్య‌వ‌స‌రంగా శ‌స్త్రచికిత్స చేసి, కృత్రిమ బృహ‌ద్ధ‌మ‌ని అమ‌ర్చాము. ఆమె సాధార‌ణంగా మ‌హిళ‌లు ఉండే పొడ‌వు కంటే చాలా ఎక్కువ పొడ‌వుగా.. అంటే 5 అడుగుల 9 అంగుళాలు ఉన్నారు. ఆమెను చూసేందుకు వ‌చ్చిన 18 ఏళ్ల కుమారుడు కూడా 6 అడుగుల 4 అంగుళాల పొడ‌వు ఉండ‌టంతో.. జ‌న్యుప‌రంగా పోలిక‌లు ఉన్న‌ట్లు గుర్తించాము. అలాంట‌ప్పుడు కొన్నిర‌కాల స‌మ‌స్యలు, అందులోనూ మార్ఫ‌న్స్ సిండ్రోమ్ వార‌స‌త్వంగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అత‌డిని కూడా ప‌రీక్షించాము. అత‌డికీ ఇదే స‌మ‌స్య ఉన్న‌ట్లు గుర్తించి, అప్పుడే ముందుగానే శ‌స్త్రచికిత్స చేయించుకోవాల్సిందిగా చెప్పాము. అయితే ఆర్థికప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల వాళ్లు ఆరేడు నెల‌ల త‌ర్వాత వ‌చ్చారు.

ఈ యువ‌కుడికి కూడా బృహ‌ద్ధ‌మ‌ని బాగా వాచిపోయింది. అత‌డికి అవ‌స‌ర‌మైన అన్నిర‌కాల ప‌రీక్ష‌లు చేసిన త‌ర్వాత బెంట‌ల్స్ ప్రొసీజ‌ర్ అనే సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స ప్రారంభించాము. వాపు ఉన్న బృహ‌ద్ధ‌మ‌ని మొత్తాన్ని తొల‌గించి, దాని స్థానంలో కృత్రిమ బృహ‌ద్ధ‌మ‌నిని అమ‌ర్చాం. 29 సైజు ఉన్న వాల్వును, ట్యూబును అమ‌ర్చాల్సి వ‌చ్చింది. ఇది చాలా సంక్లిష్ట‌మైన‌, అత్యంత క‌ష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌. సాధార‌ణంగా ఇవి విజ‌య‌వంతం అయ్యే అవ‌కాశాలు కూడా 50 శాతం మాత్ర‌మే ఉంటాయి. కానీ అదృష్ట‌వ‌శాత్తు మొద‌ట త‌ల్లి, ఇప్పుడు పెద్ద కుమారుడు ఇద్ద‌రికీ శ‌స్త్రచికిత్స పూర్తిగా విజ‌య‌వంతం అయ్యింది. యువ‌కుడికి శ‌స్త్రచికిత్స చేసిన రోజే సాయంత్రం 6 గంట‌లక‌ల్లా వెంటిలేట‌ర్ తీసేశాము. నాలుగోరోజు అత‌డిని డిశ్చార్జి చేశాము.

జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల కేవ‌లం వార‌స‌త్వంగా మాత్ర‌మే ఈ స‌మ‌స్య వ‌స్తుంది. ఈ కేసులో తొలుత అమ్మ‌మ్మ‌కు, త‌ర్వాత అమ్మ‌కు, ఇప్పుడు పెద్ద కుమారుడికి వ‌చ్చింది. 14 ఏళ్ల చిన్న కుమారుడిని ప‌రీక్షిస్తే, అత‌డికీ ఇదే స‌మ‌స్య ఉంది. వీటిని వీలైనంత త్వ‌ర‌గా గుర్తించిగ‌లిగితే, బృహ‌ద్ధ‌మ‌ని వాచిపోయి ప‌గిలిపోక‌ముందే దాన్ని మార్చ‌డానికి వీలుంటుంది. ఈ ప‌రీక్ష‌లు, శ‌స్త్రచికిత్స కూడా చాలా ఖ‌రీదైన‌వి కావ‌డంతో రోగులు త్వ‌ర‌గా ముందుకు రావ‌డం లేదు. ఇప్ప‌టివ‌ర‌కు కామినేని ఆస్ప‌త్రిలో 13 శ‌స్త్రచికిత్స‌లు ఇలాంటివి చేయ‌గా, అన్నీ విజ‌య‌వంతం అయ్యాయి.  

ఈ కుటుంబంలో అంద‌రూ పొడ‌వు ఎక్కువ‌. వీల్ల‌కు ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వీళ్ల ఎముక‌లు, లిగ‌మెంట్లు కూడా బ‌ల‌హీనంగా ఉంటాయి. ర‌క్త‌నాళాలు, క‌వాటాల్లో స‌మ‌స్య ఉంటోంది. కంటి లెన్సుల‌లో కూడా అంద‌రికీ స‌మ‌స్య ఉంటుంది. కాబ‌ట్టి అన్ని విష‌యాల్లోనూ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి” అని డాక్ట‌ర్ విశాల్ వి ఖాంటే తెలిపారు.

కామినేని హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) డాక్టర్ గాయత్రి కామినేని మాట్లాడుతూ.. ఈ విజయవంతమైన శస్త్రచికిత్స మా ఆసుపత్రి వైద్య సామర్థ్యాలను తెలియచేస్తుంది. ఈ శస్త్రచికిత్సలో కీలక పాత్ర పోషించిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్స్ డాక్టర్ విశాల్ ఖాంటే, డాక్టర్ రాజేష్ దేశ్‌ముఖ్, చీఫ్ కార్డియాక్ అనస్తీటిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్ ఎసంపల్లి మరియు కన్సల్టెంట్ అనస్థీటిస్ట్ డాక్టర్ రవళి సాడే, మరియు ప్రత్యేక ఐసియూ సిబ్బంది, నర్సింగ్ టీమ్‌తో సహా అందరికీ ధన్యవాదాలు తెలియజేసారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement