Heart problem
-
గుండెకు ముప్పు రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరి..!
గుండెపోట్లు ఇప్పుడు మరీ చిన్న వయసులోనూ వస్తున్నాయి. ఆ ముప్పునుంచి రక్షించుకోవడానికి అందుబాటులో ఉన్న పరీక్షలూ, వాటి ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈసీజీ : ఛాతీ నొప్పి వచ్చిన ప్రతి వ్యక్తికీ తప్పనిసరి. ఇందులో గుండెపోటు 80, 90 శాతం నిర్ధారణ అవుతుంది. గతంలో గుండెపోటు వచ్చి ఉండి, అప్పుడా విషయం బాధితుడికి తెలియకపోయినా ఈ పరీక్షతో తెలిసిపోతుంది. అయితే కొన్నిసార్లు గుండెపోటు వచ్చిన వెంటనే ఈసీజీ తీయించినా ఒక్కోసారి గుండెపోటు వల్ల కలిగే మార్పులను ఈసీజీ పరీక్ష నమోదు చేయలేకపోవచ్చు. అందుకే గుండెనొప్పి / ఛాతీనొప్పి వచ్చాక 45 నిమిషాల తర్వాత కనీసం 2 లేదా 3 ఈసీజీలను తీసిచూడాలి.టు డీ ఎకో పరీక్ష : ఇది గుండెస్పందనల్లో, గుండె కండరంలో వచ్చిన మార్పులను తెలుపుతుంది. ఛాతీ నొప్పి వచ్చినప్పుడు అది గుండెజబ్బు కారణంగానే అని తెలుసుకునేందుకు ‘ఎకో’ పరీక్షలో 95 శాతం కంటే ఎక్కువే అవకాశాలుంటాయి. టీఎమ్‌టీ పరీక్ష : ట్రెడ్మిల్ టెస్ట్ అని పిలిచే ఈ పరీక్షను ‘కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్’ అని కూడా అంటారు. నడకలో గుండెపనితీరు తెలుసుకునేందుకు ఉపయోగపడే పరీక్ష ఇది. బాధితులకు గుండెపోటుకు కారణమైన కరొనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) ఉందా లేదా అని తెలియజెప్పే పరీక్ష ఇది. గుండెకు వెళ్లే రక్తనాళాల్లోని అడ్డంకులనూ ఈ పరీక్ష గుర్తిస్తుంది. గుండె లయ (రిథమ్)లో ఉన్న లోపాలను పసిగడుతుంది. యాంజియోగ్రామ్: గుండెపోటు అని డౌట్ వచ్చినప్పుడు కచ్చితంగా నిర్ధారణ చేసే మరో పరీక్ష యాంజియోగ్రామ్. కొన్నిసార్లు ఈసీజీలో మార్పులు స్పష్టంగా లేకపోయినా, 2 డీ ఎకో సరైన క్లూస్ ఇవ్వలేకపోయినా అవన్నీ ఈ పరీక్షలో తెలిసిపోతాయి. అంతేకాదు గుండె రక్తనాళాల కండిషన్, వాటిల్లోని అడ్డంకులు కచ్చితంగా తెలుస్తాయిగానీ ఈసీజీ, ఎకోలతో పోలిస్తే ఈ పరీక్షకు అయ్యే ఖర్చు ఎక్కువ. యాంజియోగ్రామ్‌లో వచ్చే ఫలితాలు 99 శాతం కంటే ఎక్కువగా నమ్మదగినవి. హైసెన్సిటివిటీ ట్రోపోనిన్‌లు: గుండెపోటు వచ్చిన నాలుగు గంటల లోపు రక్తంలో హైసెన్సిటివిటీ ట్రోపోనిన్ అనే రసాయనాలు పెరుగుతాయి. ఈ రక్త పరీక్ష ద్వారా ఎంత చిన్న గుండెపోటు అయినా అది కచ్చితంగా నిర్ధారణ అవుతుంది. (చదవండి: ఓ డాక్టర్ హార్ట్ బిట్..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!) -
చిన్ని గుండెకు పెద్ద కష్టం
జీడిమెట్ల (హైదరాబాద్): బాబు పుట్టగానే తల్లి చనిపోయింది.. నాన్న రెండో పెళ్లి చేసుకుని బంధాన్ని తెంచుకున్నాడు. చివరకు అమ్మమ్మ సుబ్బలక్ష్మి అక్కున చేర్చుకుని వృద్ధాప్యంలోనూ అట్టల పరిశ్రమలో పనిచేస్తూ అన్నీ తానై సాకుతోంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో బాబుకు ఉహించని విపత్తుగా గుండెకు సంబంధించిన సమస్య వచ్చి పడింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లి ప్రశాంత్‌నగర్‌లో ఉంటున్న నూకల లక్ష్మీనారాయణ (15) ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. వారం క్రితం బాబుకు ఛాతీలో నొప్పి రావడంతో అమ్మమ్మ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. ఆయన సూచన మేరకు మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు బాబుకు అపరేషన్ చేయాలని, ప్రాణాలకు భరోసా ఇవ్వలేమని చెప్పారు. దీంతో బాబును అమ్మమ్మ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అరోగ్యశ్రీ లేదని తిప్పి పంపించారు. అనంతరం బాబును రెయిన్బో ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బాబు గుండె నుంచి వచ్చే నాళానికి రంధ్రం పడిందని, ఆపరేషన్‌కు రూ.8 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ఐదు రోజుల్లో బాబుకు అపరేషన్ చేయకపోతే ప్రాణానికి ముప్పు ఉందని తెలిపారు. రెక్కాడితేగానీ డొక్కాడని అమ్మమ్మ కంట నీరు పెట్టడమే తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉంది. దీంతో ఆమె అందరి కాళ్ల మీద పడి తన మనవడిని రక్షించాలని రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తుంది. ఆమె అట్టల కంపెనీలో పనిచేస్తే నెలకు రూ.7 వేలు వస్తుంది. ఇంటి అద్దె రూ.2,500 పోను మిగిలిన సొమ్ముతోనే మనవడిని చదివిస్తూ తిండిపెట్టాలి. దీంతో దాతల సహాయం కోసం ఆ చిన్ని గుండె ఎదురుచూస్తుంది. బాలుడికి ఆర్థికంగా సాయం చేయాలనుకునేవారు 9177376666 (సాయి), 912159 3999(కృష్ణ)లను సంప్రదించవచ్చు.అకౌంట్ నంబర్: 240810100015391 పేరు: చింతలపూడి రామకృష్ణ, బ్యాంక్: యూనియన్ బ్యాంక్, బ్రాంచ్: అపురూపా కాలనీ, ఐఎఫ్ఎస్సీ కోడ్: UBIN0824089 -
అమ్మమ్మ నుంచి అమ్మకు.. అమ్మ నుంచి కుమారులకు గుండె సమస్య!
హైదరాబాద్: అమ్మమ్మ నుంచి అమ్మకు, అమ్మ నుంచి కుమారులు ఇద్దరికీ ఒకే రకమైన గుండె సమస్య అనువంశికంగా రావడం అత్యంత అరుదు. జన్యుపరమైన కారణాల వల్ల ఇలా సంభవించినా, అందులోనూ మార్ఫన్స్ సిండ్రోమ్ అనే అత్యంత అరుదైన సమస్య రావడం చాలా చాలా తక్కువ. ప్రతి లక్ష మంది ప్రజల్లో కేవలం 0.19 మందికే ఈ సమస్య వస్తుంది. సరిగ్గా ఇలాంటి సమస్యే వచ్చిన తల్లీ కుమారులిద్దరికీ ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, గుండెలోని ప్రధాన రక్తనాళమైన బృహద్ధమనిని మార్చి, కృత్రిమ బృహద్ధమని అమర్చి వాళ్ల ప్రాణాలు కాపాడారు. ఈ అరుదైన సమస్య గురించి, దానికి అందించిన చికిత్స గురించి కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ విశాల్ వి ఖంటే తెలిపారు.“సుమారు ఆరు నెలల క్రితం మా ఎమర్జెన్సీ విభాగానికి ఒక మహిళ వచ్చారు. ఆమెకు అన్నిరకాల పరీక్షలు చేయగా, బృహద్ధమని వాపు వల్ల పగిలిపోయిందని గుర్తించాము. వెంటనే అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి, కృత్రిమ బృహద్ధమని అమర్చాము. ఆమె సాధారణంగా మహిళలు ఉండే పొడవు కంటే చాలా ఎక్కువ పొడవుగా.. అంటే 5 అడుగుల 9 అంగుళాలు ఉన్నారు. ఆమెను చూసేందుకు వచ్చిన 18 ఏళ్ల కుమారుడు కూడా 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉండటంతో.. జన్యుపరంగా పోలికలు ఉన్నట్లు గుర్తించాము. అలాంటప్పుడు కొన్నిరకాల సమస్యలు, అందులోనూ మార్ఫన్స్ సిండ్రోమ్ వారసత్వంగా వచ్చే అవకాశం ఉందని అతడిని కూడా పరీక్షించాము. అతడికీ ఇదే సమస్య ఉన్నట్లు గుర్తించి, అప్పుడే ముందుగానే శస్త్రచికిత్స చేయించుకోవాల్సిందిగా చెప్పాము. అయితే ఆర్థికపరమైన కారణాల వల్ల వాళ్లు ఆరేడు నెలల తర్వాత వచ్చారు.ఈ యువకుడికి కూడా బృహద్ధమని బాగా వాచిపోయింది. అతడికి అవసరమైన అన్నిరకాల పరీక్షలు చేసిన తర్వాత బెంటల్స్ ప్రొసీజర్ అనే సంక్లిష్టమైన శస్త్రచికిత్స ప్రారంభించాము. వాపు ఉన్న బృహద్ధమని మొత్తాన్ని తొలగించి, దాని స్థానంలో కృత్రిమ బృహద్ధమనిని అమర్చాం. 29 సైజు ఉన్న వాల్వును, ట్యూబును అమర్చాల్సి వచ్చింది. ఇది చాలా సంక్లిష్టమైన, అత్యంత కష్టమైన శస్త్రచికిత్స. సాధారణంగా ఇవి విజయవంతం అయ్యే అవకాశాలు కూడా 50 శాతం మాత్రమే ఉంటాయి. కానీ అదృష్టవశాత్తు మొదట తల్లి, ఇప్పుడు పెద్ద కుమారుడు ఇద్దరికీ శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతం అయ్యింది. యువకుడికి శస్త్రచికిత్స చేసిన రోజే సాయంత్రం 6 గంటలకల్లా వెంటిలేటర్ తీసేశాము. నాలుగోరోజు అతడిని డిశ్చార్జి చేశాము.జన్యుపరమైన కారణాల వల్ల కేవలం వారసత్వంగా మాత్రమే ఈ సమస్య వస్తుంది. ఈ కేసులో తొలుత అమ్మమ్మకు, తర్వాత అమ్మకు, ఇప్పుడు పెద్ద కుమారుడికి వచ్చింది. 14 ఏళ్ల చిన్న కుమారుడిని పరీక్షిస్తే, అతడికీ ఇదే సమస్య ఉంది. వీటిని వీలైనంత త్వరగా గుర్తించిగలిగితే, బృహద్ధమని వాచిపోయి పగిలిపోకముందే దాన్ని మార్చడానికి వీలుంటుంది. ఈ పరీక్షలు, శస్త్రచికిత్స కూడా చాలా ఖరీదైనవి కావడంతో రోగులు త్వరగా ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు కామినేని ఆస్పత్రిలో 13 శస్త్రచికిత్సలు ఇలాంటివి చేయగా, అన్నీ విజయవంతం అయ్యాయి. ఈ కుటుంబంలో అందరూ పొడవు ఎక్కువ. వీల్లకు రకరకాల సమస్యలు వస్తాయి. వీళ్ల ఎముకలు, లిగమెంట్లు కూడా బలహీనంగా ఉంటాయి. రక్తనాళాలు, కవాటాల్లో సమస్య ఉంటోంది. కంటి లెన్సులలో కూడా అందరికీ సమస్య ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి” అని డాక్టర్ విశాల్ వి ఖాంటే తెలిపారు.కామినేని హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) డాక్టర్ గాయత్రి కామినేని మాట్లాడుతూ.. ఈ విజయవంతమైన శస్త్రచికిత్స మా ఆసుపత్రి వైద్య సామర్థ్యాలను తెలియచేస్తుంది. ఈ శస్త్రచికిత్సలో కీలక పాత్ర పోషించిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్స్ డాక్టర్ విశాల్ ఖాంటే, డాక్టర్ రాజేష్ దేశ్‌ముఖ్, చీఫ్ కార్డియాక్ అనస్తీటిస్ట్ డాక్టర్ సురేష్ కుమార్ ఎసంపల్లి మరియు కన్సల్టెంట్ అనస్థీటిస్ట్ డాక్టర్ రవళి సాడే, మరియు ప్రత్యేక ఐసియూ సిబ్బంది, నర్సింగ్ టీమ్‌తో సహా అందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. -
గుండెపోటుకు బై బై..వందేళ్లు హాయ్‌హాయ్!
సాక్షి, హైదరాబాద్: గుండెపోటు రాకుండా వందేళ్లు బతకాలనుకుంటున్నారా? హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికోసం సరికొత్త మందు మార్కెట్లోకి వచ్చింది. గుండెపోటు దరిచేరకుండా ఆ మందు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. దాని పేరే ఇన్‌క్లిసిరాన్.. అపోలో ఆస్పత్రి, నోవార్టిస్ సంయుక్తంగా ఓ మందును మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఈ మందుతో వందేళ్లు గుండెపోటు రాకుండా జీవించవచ్చని వైద్యులు చెబుతున్నారు.హార్ట్ ఎటాక్‌లు డబుల్.. గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య భారతదేశంలో భారీగా పెరుగుతోంది. హృద్రోగ సమస్యల కారణంగా ఏటా సంభవిస్తున్న మరణాల్లో 20 శాతం మంది పురుషులు గుండెపోటుతో మరణిస్తుండగా 17 శాతం మంది మహిళలు అదే సమస్యతో చనిపోతున్నారు. గత 30 ఏళ్లలో గుండె సంబంధిత వ్యాధులతో సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో పదేళ్ల ముందే గుండె సంబంధ సమస్యలు ఎదురవుతున్నాయి. యుక్తవయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవల మరింతగా పెరి గింది. గుండెపోటుకు ఎన్నో కారణాలున్నా ప్రధానంగా తక్కువ సాంద్రతగల కొవ్వుల (ఎల్డీఎల్) కారణంగా ఎక్కువగా హార్ట్ఎటాక్స్ వస్తున్నాయి.అసలేంటీ మందు..? ఇన్‌క్లిసిరాన్ అనే మందు శరీరంలోని కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించేందుకు స్టాటిన్స్ అనే రకం మందులు ఎన్నో ఏళ్లుగా అందుబాటులో ఉన్నా ఇన్‌క్లిసిరాన్ మాత్రం వాటికన్నా ఎన్నో రెట్లు ప్రభావవంతగా పనిచేస్తుందని అంటున్నారు. ఇంజెక్షన్ రూపంలో ఉండే ఈ మందును ఇన్సులిన్ మాదిరిగా వేసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకోసారి తీసుకుంటే గుండెపోటు దరిచేరదని పేర్కొంటున్నారు.ఎలా పనిచేస్తుంది? సాధారణంగా ఇన్‌క్లిసిరాన్ (సింథటిక్ ఎస్ఐ ఆర్ఎన్ఏ) కొవ్వులు తయారయ్యే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ప్లాస్మాలోని తక్కువ సాంద్రతగల కొవ్వుల (ఎల్డీఎల్)ను నియంత్రించే సెరిన్ ప్రోటీన్ అయిన ప్రోప్రోటీన్ కన్వర్టేజ్ సబి్టలిసిన్ కెక్సిన్–9 (పీసీఎస్‌కే9)కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పీసీఎస్‌కే9 మెసెంజర్ ఆర్ఎన్ఏకు ఇది అతుక్కొని పీసీఎస్‌కే9 ప్రోటీన్ తయారుకాకుండా అడ్డుకుంటుంది. దీంతో ప్లాస్మాలో ఎల్డీఎల్ గణనీయంగా తగ్గి రక్తంలోని ఎల్‌డీఎల్‌ను కాలేయం గ్రహించేలా చేస్తుంది. తద్వారా హృద్రోగ సమస్యలు రాకుండా కాపాడుతుంది. 200 వరకు ఉన్న స్థాయి కూడా 40 వరకు తగ్గేంత ప్రభావవంతంగా ఈ మందు పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.ఈ మందు తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకమైన జీవన విధానాన్ని పాటించాలి. ఆల్కహాల్, సిగరెట్ వంటి అలవాట్లకు దూరంగా ఉంటే మందు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ట్రై–గ్లిజరైడ్స్ ఉన్న వారిపై ఈ మందు అంతగా ప్రభావం చూపదు. – శ్రీనివాస్ కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ఎవరెవరు వాడొచ్చు?సాధారణంగా హృద్రోగ సమస్యలు అన్ని వయసుల వారికి వస్తున్నాయి. కుటుంబంలో ఎవరికైనా హృద్రోగ సమస్యలు ఉన్న చరిత్ర ఉంటే వారందరూ తక్కువ వయసులోనే ఈ మందు తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే అధిక కొలెస్టరాల్‌తో బాధపడుతున్న వారు, 40 ఏళ్లు దాటిన వారు ఈ మందును తీసుకుంటే హార్ట్ఎటాక్ రాకుండా చూసుకోవచ్చని పేర్కొంటున్నారు. గుండెలో స్టెంట్ వేయించుకున్న వారు కూడా ఈ ఇంజెక్షన్ తీసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.అనుమతులు వచ్చాయా? ఇప్పటికే ఈ మందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అనుమతులు మంజూరు చేయగా భారత్‌లో 6 నెలల కిందటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కార్యాలయం అనుమతులు ఇచి్చంది. దీంతో తాజాగా ఈ మందును మార్కెట్లోకి తీసుకొచ్చారు. నేటి నుంచి హృద్రోగసమస్యలపై కాన్ఫరెన్స్ గుండె సమస్యలపై అవగాహన కోసం ఈ నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో ప్రీమియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ జరగనుంది. అపోలో హాస్పిటల్స్, అమెరికాలోని కార్డియోవ్యాస్కులర్ రీసెర్చ్ ఫౌండేషన్‌తో కలిసి ఫ్యాక్ట్స్ ఫౌండేషన్ ఈ సదస్సును నిర్వహించనుంది. గురువారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. గుండె విఫలమైనప్పుడు ఉపయోగపడే కొత్త పరికరాల పాత్రపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టులు హాజరుకానున్నారు. -
పబ్లిసిటీ కోసం వాడుకున్నారు.. అందువల్లే తీవ్రమైన సమస్య: నటి సోదరుడు
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆమె తల్లి మరణం, భర్తతో వివాదం తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా రాఖీ సావంత్ తీవ్రమైన గుండె సమస్యతో ముంబయిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె బ్రదర్ రాకేశ్ వెల్లడించారు. తన సోదరి డిప్రెషన్లో ఉండడం వల్లే గుండె సమస్య వచ్చిందని ఆమె సోదరుడు రాకేష్ సావంత్ వెల్లడించారు.మా అమ్మ చనిపోయాక అందరూ రాఖీని పబ్లిసిటీ కోసం, డబ్బు కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా ఆమెను అందరూ వేధింపులకు గురి చేశారని అన్నారు. ఆదిల్ తన సోదరి వద్ద ఉన్న డబ్బునంతా కాజేసి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిల్‌పై ఇప్పటివరకు ఛార్జ్‌షీట్ వేయలేదని..డబ్బులతో అందరినీ మేనేజ్ చేస్తున్నాడని అన్నారు. తన సోదరి కోసం ప్రార్థించాలని ఆమె అభిమానులను కోరారు. అందరూ కలిసి రాఖీకి ద్రోహం చేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని రాకేశ్ పేర్కొన్నారు. రాఖీకి ఏదైనా జరిగితే ఆమె అభిమానులు తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టరని రాకేశ్ సావంత్ అన్నారు. ఆమెకు అపరేషన్ బాగా జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by Bollywood Khabar (@bollywoodkhabarofficial) -
ఆ వ్యాధితో...అపుడసలు బుర్ర పని చేయలేదు : స్టార్ హీరోయిన్
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి పరిచయం అవసరం లేదు. కేవలం నటనతోనేకాకుండా బోల్డ్ స్టేట్మెంట్లు, జిమ్‌లో కసరత్తులు చేస్తూ అభిమానులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇంత ఫిట్‌గా ఉన్న ఈ అమ్మడు కూడి ఇటీవల గుండెజబ్బు బారిన పడింది. తనకు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని విషయాలను ఇటీవల ఒక ఇంటర్య్వూలో వెల్లడించారు. మార్చి 2023లో, ఆమెకు గుండెపోటు రావడంతో స్టెంట్ అమర్చాల్సి వచ్చింది. కానీ కొద్ది రోజుల్లోనే మంచి వ్యాయాయంతో తిరిగి ఫిట్ నెస్‌ను సాధించింది. అప్పటినుంచి వివిధ ఇంటర్వ్యూలలో తన ఆరోగ్య పరిస్థితి గురించి నిస్సంకోచంగా వెల్లడిస్తూ వస్తోంది. సుస్మిత చివరిగా వెబ్ సిరీస్ ఆర్య సీజన్ 3లో కనిపించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తల్లిదండ్రులిద్దరూ హార్ట్ పేషెంట్లని అందుకే తాను కూడా అప్రత్తమంగా ఉండేదాన్ని చెప్పుకొచ్చింది. గుండెపోటు తర్వాత తాను ఆపరేషన్ థియేటర్లో నవ్వుతున్నానని సుస్మిత వెల్లడించింది. అలాగే దీని తర్వాత తన ఆమె జీవనశైలిలో వచ్చిన మార్పుల గురించి కూడా వెల్లడించింది. తాను చాలా హ్యాపీ గోయింగ్ మనిషిని అని తెలిపింది. అలాగే తన ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురించి కూడా సుస్మితా సేన్ ఓపెన్ అయింది. తన జీవితంలో పెద్ద సమస్య అని, ఆ సమయంలో తన మెదడు మొద్దు బారి పోయిందనీ, ఇప్పటికీ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకోలేకపోతున్నానని పేర్కొంది 2014లోనే సుస్మిత ఆడిసన్స్ వ్యాధిబారిన పడిందట. ఆటో ఇమ్యున్ సిస్టంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే డిప్రెషన్‌కు లోనైంది. కార్టిసోల్ వంటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్ లతో బాధపడ్డానని కూడా తెలిపింది సుస్మిత. ప్రస్తుత కఠోర సాధనతో సాధారణ స్థితికి వచ్చానని కూడా తెలిపింది. -
Heart Infection: మృత్యువుతో పొరాడి ఓడిన యువకుడు!
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గుండె దగ్గర ఇన్ఫెక్షన్తో ప్రాణా పాయ స్థితిలో ఆస్పత్రిలో చేరి మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన యువకుడు చివరికి ప్రాణాలు వదిలాడు. దాతలు స్పందించి సాయం అందించి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చినప్పటికీ మృత్యువును గెలువలేకపోయాడు. కుటుంబ పెద్ద మృతితో అతనిపై ఆధారపడ్డ భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు. ఈ సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో బుధవారం విషాదం నింపింది. నారాయణపూర్‌కు చెందిన అనుప రాజు(25) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రాజును కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చూపించగా, గుండె వద్ద ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే వైద్యం చేయించకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలపడంతో ఓ ప్రైవేట్ అస్పత్రిలో చేర్పించారు. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో రాజు ప్రాణాలు దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు తెలిసిన వ్యక్తుల వద్ద అప్పులు చేసి పెట్టారు. దాదాపు రూ.3లక్షల వరకు వెచ్చించారు. కుటుంబ పరిస్థితి అంతంతే కావడంతో అప్పటికే గ్రామస్తులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించారు. అయినా ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. రెండు రోజుల్లో రూ.3 లక్షలు ఖర్చుచేసిన ప్రాణాలు దక్కకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి తండ్రి మల్లయ్య, భార్య శీరిష, మూడేళ్ల కూతురు మనుశ్రీ, నాలుగు నెలల కుమారుడు మన్విత్ ఉ న్నారు. కడుపేదరికం అనుభవిస్తున్న రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గాల్లోనే ఊపిరి పోశారు!
న్యూఢిల్లీ: అది శనివారం ఉదయం వేళ. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం. బయల్దేరి అప్పటికి 20 నిమిషాలైంది. ఇంకో గంట ప్రయాణం ఉంది. ప్రయాణికుల్లో పుట్టుకతోనే తీవ్ర హృద్రోగ సమస్యతో బాధ పడుతున్న ఒక ఆర్నెల్ల చిన్నారి. తల్లిదండ్రులు తనను చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ తీసుకెళ్తున్నారు. ఉన్నట్టుండి ఊపిరాడక పాప అల్లాడింది. దాంతో తల్లి పెద్దపెట్టున రోదించింది. సాయం కోసం అర్థించింది. విషయం అర్థమై ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు డాక్టర్లు హుటాహుటిన రంగంలో దిగారు. తనకు తక్షణం సాయం అందించారు. విమానంలో పెద్దలకు ఉద్దేశించి అందుబాటులో ఉండే ఆక్సిజన్ కిట్ నుంచే పాపకు శ్వాస అందించారు. ఎయిర్ హోస్టెస్ వద్ద అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ నుంచే మందులను వాడారు. అలా ఏకంగా గంట పాటు తన ప్రాణం నిలబెట్టారు. అంతసేపూ ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఊపిరి బిగబట్టి దీన్నంతా ఉత్కంఠతో చూస్తూ గడిపారు. విమానం ఢిల్లీలో దిగుతూనే అక్కడ అప్పటికే అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ వైద్య బృందం చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. దాంతో ప్రయాణికులతో పాటు అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఆ 15 నిమిషాలు... ఇలా చిన్నారి ప్రాణాలను నిలబెట్టిన వైద్యుల్లో ఒకరు ఐఏఎస్ అధికారి కావడం విశేషం! ఆయన పేరు డాక్టర్ నితిన్ కులకరి్ణ. జార్ఖండ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మరొకరు డాక్టర్ మొజమ్మిల్ ఫిరోజ్. రాంచీలోని సదర్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. చిన్నారి పుట్టుకతోనే పేటెంట్ డక్టస్ అర్టరియోసిస్ అనే హృద్రోగంతో బాధ పడుతోందని వారు చెప్పారు. ‘మేం వెంటనే రంగంలో దిగి పాపకు ఆక్సిజన్ అందివ్వడంతో పాటు థియోఫైలిన్ ఇంజక్షన్ ఇచ్చాం. అలాగే తల్లిదండ్రులు తమ వెంట తెచి్చన డెక్సోనా ఇంజక్షన్ కూడా బాగా పని చేసింది. హార్ట్ బీట్ ను స్టెతస్కోప్ తో చెక్ చేస్తూ వచ్చాం. తొలి 15 నుంచి 20 నిమిషాలు చాలా భారంగా గడిచింది. పెద్ధగా ఏమీ పాలుపోలేదు. కాసేపటికి పాప స్థితి క్రమ క్రమంగా మెరుగైంది‘ అని వారు తమ అనుభవాన్ని వివరించారు. సహా ప్రయాణికుల్లో పలువురు వారి అమూల్య సేవను మెచ్చుకుంటూ ఎక్స్‌లో మేసేజ్‌లు చేశారు. -
గుండెకు గండం
ఖమ్మం వైద్యవిభాగం: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి భరోసా కల్పించేలా జిల్లా జనరల్ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏడాదిన్నరగా మెరుగైన సేవలు అందుతుండడంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తీరాయి. అయితే, వారం రోజులుగా మాత్రం ఇక్కడ చికిత్సకు అంతరాయం ఏర్పడింది. శస్త్రచికిత్సలు నిలిచిపోవడంతో బాధితులు బెడ్ల మీదే ఉంటూ దీనంగా ఎదురుచూస్తున్నారు. త్వరగా తమకు శస్త్రచికిత్స నిర్వహించాలని వేడుకుంటున్నారు. అత్యాధునిక యంత్రాలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే కొన్నేళ్లుగా ఖమ్మం జిల్లాలో గుండె జబ్బులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లి ఆర్థికంగా నష్టపోయేవారు. మరికొందరు నిరుపేదలు వైద్యం చేయించుకునే స్థోమత లేక తనువు చాలించేవారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రెండేళ్ల క్రితం గుండె సంబంధిత బాధితుల కోసం కార్డియాలజీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శస్త్రచికిత్సలు నిర్వహించడానికి రూ.7 కోట్ల విలువైన క్యాథల్యాబ్ మిషన్‌ను కేటా యించగా, గత ఏడాది జనవరిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. తద్వారా ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స ఉచితంగా అందుబాటులోకి రాగా, వందలాది మందికి శస్త్రచికిత్స చేశారు. కార్డియాలజీ విభాగంలో కరోనరీ యాంజియోగ్రామ్ శస్త్రచికిత్సతో పాటు, స్టంట్లు, బలూన్ యాంజియోప్లాస్టీ, రెనల్ యాంజియోగ్రామ్, రూట్ యాంజియోగ్రామ్, కారోటిడ్ యాంజియోగ్రామ్, పెరిపెరల్ యాంజియోగ్రామ్, బ్రాంకియల్ యాంజియోగ్రామ్, పెరీకార్డియో సెంటెసిస్ తదితర సేవలందిస్తున్నారు. బిల్లులు పేరుకుపోవడంతో... క్యాఽథల్యాబ్ యంత్రం ద్వారా చికిత్స చేయాలంటే కాంట్రాస్ట్ ఇంజక్షన్లు అవసరమవుతాయి. బాధితులకు శస్త్రచికిత్స చేసే ముందు ఈ ఇంజక్షన్ ఇచ్చి గుండె పనితీరు, ఎక్కడ ఏ సమస్య ఉంది, స్టంట్ ఎక్కడ వేయాలనే అంశాన్ని మానిటర్ ద్వారా తెలుసుకుంటారు. అనంతరమే శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమవుతారు. కానీ కాంట్రాస్ట్ ఇంజక్షన్లు లేకపోవడంతో వారం రోజులుగా శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ గాందీ, నిమ్స్ తదితర ఆస్పత్రుల మాదిరిగానే ఈ ఇంజక్షన్లు ఇండెంట్ పెట్టి బయట నుంచి తెప్పిస్తారు. అయితే, సరఫరా చేసే ఏజెన్సీకి బిల్లులు పేరుకుపోవడం వారు నిలిపివేశారని తెలుస్తోంది. కారణాలు ఏమైనా శస్త్రచికిత్సలు నిలిచి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఇక్కట్లు ఎదుర్కొంటుండగా... కొందరు చేసేదేం లేక బయటి ఆస్పత్రులకు వెళ్తున్నారు. మరికొందరు మాత్రం శస్త్రచికిత్స ఎప్పుడు చేస్తారా అని వేయి కళ్లతో ఎదురుచూస్తూ గడుపుతున్నారు. ఇంజక్షన్ వస్తేనే.. ఈయన పేరు సీహెచ్.నాగేశ్వరరావు. వయస్సు 38 ఏళ్లు మాత్రమే. ఐదు రోజుల క్రితం గుండె భాగంలో నొప్పి రావటంతో కూలబడగా ఆయన భార్య ప్రభుత్వ ఆస్పత్రి కార్డియాలజీ విభాగానికి తీసుకొచ్చింది. వైద్యులు పరీక్షించి గుండె సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. కానీ సమస్య తీవ్రత తెలియాలన్నా, శస్త్రచికిత్స చేయాలన్నా కాంట్రాస్ట్ ఇంజక్షన్ అవసరం. అవి లేకపోవడంతో యాంజియోగ్రామ్ నిర్వహించకపోగా ఏమవుతుందోనన్న బెంగతో నాగేశ్వరరావు, ఆయన కుటుంబం ఎదురుచూస్తోంది. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం... కాంట్రాస్ట్ ఇంజక్షన్లు లేక శస్త్రచికిత్సలు నిలిచిన మాట వాస్తవమే. బయట నుండి తెప్పించాల్సి ఉంది. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం. అయితే, ఇన్పేషంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కార్డియాలజీ వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. – బి.వెంకటేశ్వర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఖమ్మం: గుండెపోటుతో 9వ తరగతి విద్యార్థి మృతి
క్రైమ్, ఖమ్మం: హఠాన్మరణాలు.. అందులో గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఈ మరణాలపై వైద్య నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరణించిన వాళ్లలో గుండె సంబంధిత సమస్యలూ ఉంటున్నాయని, వాటిని గుర్తించకపోవడం కూడా ఒక కారణమేనని చెబుతున్నారు. తాజాగా.. ఖమ్మంలో తొమ్మిదో క్లాస్ చదివే విద్యార్థి మరణం.. స్థానికంగా విషాదం నింపింది. ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు మాదాసి రాజేష్. బుధవారం స్కూల్‌కు వెళ్లిన రాజేష్ ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు అది గమనించి టీచర్లకు చెప్పడంతో.. వాళ్లు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రాజేష్ మరణించాడని, రాజేష్ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. రాజేష్‌కు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంది. పైగా గత కొద్దిరోజులుగా నీరసంగా కూడా ఉంటున్నాడు. మూడు రోజుల నుంచి సరిగ్గా బడికి వెళ్లలేదు. అయితే.. బుధవారం స్కూల్లో విద్యార్థులకు అవగాహనా సినిమా ప్రదర్శించాడు. అందుకోసం వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో.. బడికి వెళ్లిన కాసేపటికే సొమ్మసిల్లి పడిపోయి కన్నుమూశాడు. ఈ ఘటనతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇదీ చదవండి: తమ్ముడి పెద్దకర్మ ఆ అన్నకి ఆఖరిరోజు! -
ప్రేమకు రోగాలు అడ్డుకావని నిరూపించారు
తమిళనాడు: ప్రేమకు రోగాలు అడ్డుకావని వినీత –నిత్యానంద జంట నిరూపించారని ఎస్ఆర్ఎంసీ హృద్రోగ వైద్య నిపుణుడు తనికాచలం అన్నారు. తన ప్రియుడికి గుండె సమస్య ఉందని తెలిసినప్పటికీ ఏడేళ్లపాటు నిరీక్షించిన ప్రియురాలు వినీత కుటుంబ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. కడలూరు జిల్లా పలూరు గ్రామానికి చెందిన వినీత నిత్యానందను ప్రేమించింది. అతనికి హృద్రోగ సమస్య ఉందని తెలిసింది. అయినా ఆమె అధైర్యపడలేదు. ఓ వ్యక్తి దానం చేసిన గుండెను 2015లో నిత్యానందకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించింది. ఏడేళ్ల తర్వాత పెద్దలను ఒప్పించి అతన్ని పెళ్లి చేసుకుంది. ప్రసుతం ఆ దంపతులు ఒక బిడ్డకు జన్మనిచ్చారు. గుండె ఆపరేషన్ తర్వాత అతను మామూలుగా సంసార జీవితాన్ని సాగించవచ్చని నిరూపించారని తనికాచలం తెలిపారు. హార్ట్ సర్జరీ స్పెషలిస్ట్ టి.పెరియస్వామితో కూడిన హృద్రోగ వైద్య బృందం నిత్యానంద, వినీత దంపతులను అభినందించారు. -
‘నాన్న.. అమ్మను కొట్టకు బాగా చూసుకో.. నేనింక బ్రతకను..’
తన భవిష్యత్తు కలలను విధి చిదిమేసింది. తన జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిన్నారిని ఛాతినొప్పి రూపంలో మృత్యువు వెంటాడింది. దీంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, చివరి నిమిషాల్లో ఆమె మాటలు అందరినీ కన్నీరుపెట్టిస్తున్నాయి. వివరాల ప్రకారం.. జిల్లేడుగూడెం మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన గడ్డ మీది కృష్ణయ్య, నీలమ్మ దంపతుల కుమార్తె నవనీత(13). ఆమె ప్రస్తుతం ఎనిమదో తరగతి చదువుతోంది. నవనీత పేరెంట్స్ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, స్కూల్‌కు వెళ్లిన నవనీత.. ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. క్లాస్‌లో ఉన్న సమయంలోనే ఛాతిలో నొప్పి వస్తోందంటూ ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ విషయంలో తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆమెను వెంటనే షాద్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని డాక్టర్లు నవనీతకు ప్రాథమిక వైద్యం అందించారు. చికిత్స సందర్భంగా చిన్నారి గుండెకు సంబంధించిన సమస్య ఉందని.. వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు తమ కుమార్తెను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ నవనీత శనివారం రాత్రి చనిపోయింది. దీంతో, ఆమె పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. తమ బిడ్డను కాపాడుకోలేకపోయామని ఆవేదనకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. నీలోఫర్‌లో నవనీత చికిత్స పొందుతున్న సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆవేదనకు గురిచేశాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నవనీత మాట్లాడుతూ..‘నాన్న అమ్మని బాగా చూసుకో.. అమ్మను కొట్టకు.. తిట్టకు. నేనింక బ్రతకను.. చనిపోతున్నాను. నా గురించి మర్చిపోండి’ అని కన్నీరుపెట్టుకుంది. ఆమె మాటలకు తండ్రి ధైర్యం చెబుతూ.. నీకేం కాదమ్మా.. అలా అనొద్దు అని చెబుతూనే కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. -
FIFA WC: ఏం గుండెరా నీది.. చచ్చేంత సమస్య ఉన్నా దేశం కోసం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శుక్రవారం అర్జెంటీనా, నెదర్లాండ్స్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఇక గ్రూప్ దశలో ఓటమి ఎరుగని నెదర్లాండ్స్‌ను మెస్సీ సేన ఏ విధంగా ఎదుర్కొంటుందనేది ఆసక్తికంగా మారింది. అయితే 2014 ఫిఫా వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్లో ఈ రెండుజట్లు ఎదురుపడ్డాయి. అప్పటి మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా.. డచ్ జట్టుపై విజయాన్ని అందుకుంది. ఈ విషయం పక్కనబెడితే.. నెదర్లాండ్స్ సీనియర్ స్టార్ ఆటగాడు డేలీ బ్లైండ్ గురించి ఒక ఆసక్తికర విషయం బయటకొచ్చింది. గుండె సమస్యతో బాధపడుతూ కూడా ధైర్యంగా మైదానంలో ఫుట్‌బాల్ ఆడడం అతనికే చెల్లింది. డేలీ బ్లైండ్ కొంతకాలంగా గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. ఎక్కువగా పరిగెడితే వచ్చే ఆయాసంతో బ్లైండ్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే డేలీ బ్లైండ్ ఏ మ్యాచ్‌లో బరిలోకి దిగినా తనవెంట డిఫిబ్రిలేషన్(Defibrillation) మెషిన్ ఉంటుంది. డీఫిబ్రిలేషన్ అనేది ప్రాణాంతక కార్డియాక్ అరిథ్మియాలకు చికిత్సగా పనిచేస్తుంది. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ (V-Fib), నాన్-పెర్ఫ్యూజింగ్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (V-Tach)లకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. డీఫిబ్రిలేటర్ ద్వారా గుండెకు కరెంట్‌షాక్ ఇచ్చి ఊపిరి ఆగిపోకుండా ఉంచుతారు.(దీనినే వైద్య భాషలో కౌంటర్-షాక్ అని పిలుస్తారు). డిఫిబ్రిలేటర్(Defibrillator) మరి ఇంత సమస్య పెట్టుకొని డేలీ బ్లైండ్‌ను ఆడించడం అవసరమా అనే డౌట్ రావొచ్చు. కానీ అతను జట్టుకు కీలక ఆటగాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో అమెరికాతో జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో గోల్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అందుకే అతన్ని జట్టు నుంచి తప్పించడం పెద్ద సాహసమే అవుతుందని జట్టు మేనేజర్ పేర్కొన్నాడు. అయితే ఇదివరకే డేలీ బ్లైండ్ డిఫిబ్రిలేషన్ను ఉపయోగించారు. 2019లో చాంపియన్స్ లీగ్ సందర్భంగా ఒక మ్యాచ్‌లో బ్లైండ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి డిఫిబ్రిలేషన్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే అప్పుడే ఫుట్‌బాల్ ఆటను మానుకోవాలని బ్లైండ్‌ను హెచ్చరించారు. కానీ బ్లైండ్ వారి మాటను లెక్కచేయలేదు. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాగైనా పాల్గొనాలని ధ్యేయంగా పెట్టుకున్న డేలీ బ్లైండ్ తన వెంట డిఫిబ్రిలేషన్ మిషన్‌ను తెచ్చుకున్నాడు. చనిపోయేంత సమస్య ఉన్నప్పటికి భయపడకుండా దేశం కోసం బరిలోకి దిగిన అతని గుండె ధైర్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. నెదర్లాండ్స్ కప్ గెలుస్తుందో లేదో తెలియదు కానీ డేలీ బ్లైండ్ మాత్రం అభిమానుల మనసులను గెలిచేశాడు. 🟠MATCH PREVIEW🤩 🇳🇱 Netherlands v Argentina 🇦🇷 #NEDARG Prepare for a tasty World Cup quarter final with @EredivisieMike speaking with @sebaongarelli! WATCH: 📺https://t.co/2IDySVyqTa pic.twitter.com/6bPweVEiZJ — Dutch Football 🇳🇱 (@FootballOranje_) December 6, 2022 చదవండి: 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన.. బీసీసీఐ షాకింగ్ ట్విస్ట్! ఖతర్‌లో వరల్డ్‌కప్.. ప్రపంచానికి తెలియని మరణాలు! -
చిన్నారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి చేయూత
నెల్లూరు రూరల్(నెల్లూరు జిల్లా): హార్ట్‌లో హోల్‌తో బాధపడుతున్న చిన్నారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేయూతనందించారు. బాలికకు ఆపరేషన్ విజయవంతమైంది. మంగళవారం చిన్నారితో పాటు తల్లిదండ్రులు నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని కోటంరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీధర్‌రెడ్డి రూరల్ పరిధిలోని ఉప్పుటూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. చదవండి: బాగున్నావా అవ్వా..! ఈ సమయంలో గిరిజన కుటుంబానికి చెందిన పొట్లూరి స్నేహ అనే చిన్నారికి గుండె సమస్య ఉన్నట్లుగా ఆయన దృష్టికి వెళ్లింది. చిన్నారి తల్లిదండ్రులు తమ బాధను ఆయనకు చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే కారు ఏర్పాటు చేసి వారితోపాటు తన ప్రతినిధిని తిరుపతిలోని పెద్ద ఆస్పత్రికి పంపారు. చిన్నారి ఆపరేషన్ విషయమై అక్కడి వైద్యులతో కోటంరెడ్డి స్వయంగా మాట్లాడారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద స్నేహకు ఆపరేషన్ చేయగా విజయవంతమైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. తన వద్దకు వచ్చిన స్నేహతో ఎమ్మెల్యే ఎంతో ఆప్యాయంగా మాట్లాడి దుస్తులు అందజేశారు. ఆ కుటుంబానికి తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని భరోసా ఇచ్చారు. -
అగ్నిపథ్ ఆందోళనలతో నిలిచిన రైలు.. సమయానికి వైద్యం అందక వ్యక్తి మృతి
సాక్షి, విజయనగరం: త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు దేశ వ్యాప్తంగా హింసాత్మకంగా మారిన విషయం తెలిసింది. ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన అల్లర్లు రూ.కోట్లలో ఆస్తినష్టాన్ని మిగల్చడమే కాకుండా పలుచోట్ల ప్రాణాలను కూడా బలితీసుకున్నాయి. అగ్నిపథ్ ఆందోళన నేపథ్యంలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కొత్తవలసలో నిలిపివేయడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గుండె జబ్బు చికిత్స కోసం ఒడిశా నుంచి వస్తున్న జోగేష్ బెహరా(70) అనే వృద్ధుడు మృతి చెందాడు. విశాఖలో రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు బెహరా కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే చికిత్స కోసం ఒడిశా నుంచి విశాఖకు అతని కుటుంబ సభ్యులు కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. అయితే అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలును అధికారులు కొత్తవలసలోనే నిలిపివేశారు. సమయానికి అంబులెన్స్ లేక కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేస్తుండగానే జోగేష్ బెహరా మృతి చెందారు. సమయానికి వైద్యం అందకనే జోగేష్ మృతిచెందాడని బాధితుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విశాఖలో రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం -
చిన్నారి ప్రాణం నిలిపిన ఆరోగ్యశ్రీ
సాక్షి, నందిగామ(కృష్ణా): అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కృష్ణాజిల్లా నందిగామలోని 13వ వార్డుకు చెందిన ముంగి కోటయ్య 10 నెలల బాబు సంతోష్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తొలుత విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో చేర్చగా, అక్కడ నుంచి హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. రూ.10 లక్షల ఖరీదైన శస్త్ర చికిత్స ఈనెల 8న కిమ్స్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా జరిగింది. చిన్నారి సంతోష్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా శుక్రవారం ఇంటికి చేరుకున్నాడు. దీంతో బాలుడి కుటుంబసభ్యులు పట్టరాని సంతోషంతో వారి ఇంటి ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం వల్లే తమ బిడ్డ తిరిగి వచ్చాడని, ముఖ్యమంత్రికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని చిన్నారి తండ్రి కోటయ్య పేర్కొన్నాడు. -
ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి
న్యూయార్క్: మనం రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వాడే ప్లాస్టిక్స్ పరికరాలన్నింటిలో థాలెట్ ఆనే కెమికల్ ఉన్నట్లు న్యూయార్క్ పరిశోధకులు గుర్తించారు. ఆఖరికి పిల్లలు ఆడుకునే బొమ్మలు దగ్గర్నించి మనం నిత్యం వాడే దుస్తులు, షాంపు నుంచి మేకప్ వరకు అన్ని ప్లాస్టిక్‌తోనే రూపోందించినవే కావడంతో అత్యధికంగా థాలెట్ అనే కెమికల్ ఉత్పన్నవతోందని వెల్లడించారు. (చదవండి: ఆ గాయని వస్తువులు మిలియన్ డాలర్లు!) ఇది హర్మోన్ల వ్యవస్థను నాశనం చేసే కారకాలుగా ప్రసిద్ధిమైనవే కాక మొత్తం మానవ వినాళికా గ్రంథి వ్యవస్థనే ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. ఆ ప్లాస్టిక్ వస్తువులు మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయని అందువల్లే ఈ విషపూరిత రసాయనాలు మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తున్నాయి అని అన్నారు. దీంతో మధుమేహం, ఊబకాయం, గుండే జబ్బులు అధికమవుతున్నట్లు తాజా అద్యయనాల్లో తెలపారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనలో 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల ఐదు వేల మంది మూత్రంలో థాలెట్ల సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అంతేకాదు వారు గుండె జబ్బులతో చనిపోయే అవకాశం ఉందని వెల్లడించారు. గుండెజబ్బులకు ప్రధానం కారణం రసాయాలేనని తెలిపారు. అలాగే పురుషులలో టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గిపోవడానికి కారణం ఈ థాలెట్ రసాయనమే కారణం అని చెప్పారు. ఈ థాలెట్ రసాయనం వల్ల అమెరికన్లు రకరకాల వ్యాధుల భారినపడి ఏటా 1,00,000 మంది అమెరికన్లు మరణిస్తున్నారని.. ఫలితంగా ఆర్థికంగా 40 నుంచి 47 బిలియన్ల డాలర్ల వరకు నష్టపోతున్నట్లు న్యూయార్క్ పరిశోధకులు అధ్యయనాల్లో పేర్కొన్నారు. (చదవండి: కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!) -
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని మహిళ మృతి
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో ఒకవైపు కరోనా వైరస్ మహమ్మారి ఆందోళనకరంగా విస్తరిస్తోంది. మరోవైపు వ్యాక్సిన్ తీసుకొని మహిళ మరణించిన ఘటన ఆందోళన రేపింది. పైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత గుండె సంబంధిత సమస్యలతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. దేశంలో ఫైజర్ టీకా కారణంగా దేశంలో తొలి మరణమని న్యూజిలాండ్ ఆరోగ్య అధికారులు ప్రకటించారు. టీకా కారణంగా ఉత్పన్నమైన మయోకార్డిటిస్ సమస్యతో ఆమె చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. టీకా స్వీకరించిన తర్వాత అనారోగ్యంతో మహిళ మరణించిందని కోవిడ్ భద్రతా పర్యవేక్షణ బోర్డు సమీక్ష అనంతరం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే బాధిత మహిళ వయస్సును ప్రకటించ లేదు. ఫైజర్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించి అరుదైన సైడ్ఎఫెక్ట్ మయోకార్డిటిస్ కారణంగా మహిళ మరణం సంభవించిందని ఈ ప్రకటన పేర్కొంది. అయితే ఈ పరిణామంపై ఫైజర్ ఇంకా స్పందించాల్సి ఉంది. మయోకార్డిటిస్ అనేది గుండె కండరాల వాపు. ఇది రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. హృదయ స్పందనల తీరులో మార్పులకు కారణమవుతుంది. కాగా కరోనాను పూర్తిగా కట్టడి చేసిన దాదాపు ఆరు నెలల తర్వాత న్యూజిలాండ్‌లో డెల్టా వేరియంట్ భారీగా వ్యాప్తిస్తోంది. సోమవారం 53 కొత్త కేసులను నివేదించింది, ప్రస్తుత వ్యాప్తితో మొత్తం సంఖ్య 562 కి చేరుకుంది. డెల్టా వేరియంట్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ నెల ప్రారంభంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. కాగా దేశంలో ఫైజర్/బయోఎన్‌టెక్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనెకా టీకాలను న్యూజిలాండ్ అధికారులు తాత్కాలికంగా ఆమోదించారు. -
వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్పకు అస్వస్థత
పుంగనూరు: పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం గుండెపో టు రావడంతో ఆయన్ను ఢిల్లీలోని ఫోర్టీస్ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు పరీక్షలు చేసి పేస్‌మేకర్‌ను అమర్చారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. రెండుమూడు రోజుల్లో ఆపరేషన్ చేయనున్నట్టు ఆయన కుమార్తె డాక్టర్ హిమబిందు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కుమార్తెతో పాటు, భార్య రెడ్డెమ్మ, అల్లుడు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. -
చిన్నారి వైద్యానికి సోనూసూద్ భరోసా
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి) : సినీనటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 4 నెలల పసిబిడ్డ వైద్యచికిత్సలకు అయ్యే ఖర్చు భరిస్తానని ట్విట్టర్ ద్వారా భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామానికి చెందిన పందిపెల్లి బాబు, రజిత దంపతుల కుమారుడు అద్విత్ శౌర్య (4నెలలు) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. బాబు సిరిసిల్లలో ఓ కొరియర్ సంస్థలో బాయ్‌గా పనిచేస్తున్నాడు. బాబు తన కుమారుడిని ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. శౌర్యను పరీక్షించిన వైద్యులు.. చికిత్స కోసం రూ.7 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీనస్థితిలో ఉన్న బాబు తన కుమారుడి వైద్యానికి సాయం అందించాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అతడి స్నేహి తులు ట్విట్టర్లో ఆ సమాచారాన్ని పోస్టు చేశారు. దీనిపై సోనూసూద్ స్పందించి అద్విత్ శౌర్య ఆపరేషన్‌కు అవసరమయ్యే డబ్బులో వీలైనంత మొత్తం భరించేందకు సిద్ధంగా ఉన్నట్లు ట్టిట్టర్ ద్వారా భరోసా ఇచ్చారని బాలుడి తండ్రి తెలిపాడు. ఇన్నోవా ఆస్పత్రిలో చిన్నారికి వైద్యచికిత్స చేయించాలని పేర్కొన్నట్లు తెలిపాడు. ఆపరేషన్‌ను డాక్టర్ కోన సాంబమూర్తి చేస్తారని సోనూసూద్ తెలిపినట్టు బాబు చెప్పారు. రూ.లక్షన్నర కోసం తిప్పలు చిన్నారి అద్విత్ చికిత్సకు అవసరమయ్యే రూ.7 లక్షల్లో అధికభాగం సోనూసూద్ ఇవ్వనుండగా ఇంకా రూ.1.5 లక్షలు కావాలని, అంత డబ్బు తమ వద్ద లేదని.. దాతలు ఆదుకుని తన కుమారునికి ప్రాణం పోయాలని బాబు వేడుకుంటున్నాడు. దాతలు 80964 24621 మొబైల్ నంబరును సంప్రదించాలని ఆయన కోరాడు. -
ప్రాణంకంటే ఆటే ఎక్కువ అనుమతి ఇవ్వండి
న్యూఢిల్లీ : క్రీడల చరిత్రలో ఇదో అరుదైన ఉదంతం ... గుండె జబ్బుతో బాధపడుతున్నా సరే తనను ఆడకుండా అడ్డుకోవడం తప్పంటూ ఒక యువ ఫుట్‌బాలర్ నేరుగా కోర్టుకెక్కిన ఘటన ఇది. తనకు ఇష్టమైన ఆటను ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ అతను చేస్తున్న ప్రయత్నమిది. ఈ కేసుకు సంబంధించి గురువారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. వివరాల్లోకెళితే... పంజాబ్‌కు చెందిన అన్వర్ అలీ అండర్–17, అండర్–20 విభాగాల్లో భారత ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దాదాపు ఏడాది క్రితం అతనికి ఐఎస్ఎల్లో ముంబై సిటీ ఎఫ్‌సీ తరఫున ఆడే అవకాశం వచ్చింది. అయితే టోర్నీకి ముందు జరిపిన పరీక్షల్లో అన్వర్ అరుదైన గుండె జబ్బు (ఎపికల్ హైపర్ కార్డియో మయోపతీ–హెచ్‌సీఎం)తో బాధపడుతున్నట్లు తేలింది. దాంతో అతను ఫుట్‌బాల్‌కు దూరమయ్యాడు. ఏఐఎఫ్ఎఫ్ జోక్యం... సుమారు సంవత్సరం తర్వాత అన్వర్ తన కెరీర్‌ను పునర్నిర్మించుకునే ప్రయత్నంలో పడ్డాడు. అతనికి సెకండ్ డివిజన్ ఐ–లీగ్‌లో మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా లభించింది. అయితే ఇక్కడ అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అతడిని అడ్డుకుంది. దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ తండ్రి డాక్టర్ వీస్ పేస్ సారథ్యంలోని తమ వైద్య బృందం నిర్ణయించే వరకు అన్వర్ ఫుట్‌బాల్ ఆడరాదని ఏఐఎఫ్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. దీనిపైనే అన్వర్ కోర్టుకెక్కాడు. తాను ఆడకుండా అడ్డుకునే హక్కు ఏఐఎఫ్ఎఫ్కు లేదని అతను వాదిస్తున్నాడు. ‘అన్వర్ ఆడాలా వద్దా అనేది సదరు క్లబ్ నిర్ణయిస్తుంది. అది వారిద్దరికి సంబంధించిన అంశం. ఇందులో ఏఐఎఫ్ఎఫ్ ఎందుకు జోక్యం చేసుకుంటోంది. దానికి ఆ అధికారం లేదు. నేను చెప్పేది నైతికంగా సరైంది కాకపోవచ్చు కానీ అన్వర్ ఫుట్‌బాల్ ఆడితే కచ్చితంగా చనిపోతాడని చెప్పగలమా. గతంలోనూ ఇదే తరహాలో ఇద్దరు ఫుట్‌బాలర్లకు మైదానంలోనే గుండెపోటు వచ్చింది. కానీ వారు ఆ తర్వాత చికిత్స చేయించుకొని మళ్లీ ఆడారు. ఇలా ఆటగాడిని నిషేధించే అధికారం ఉందని ఏఐఎఫ్ఎఫ్ భావిస్తే నిబంధనలు కూడా చూడాల్సి ఉంటుంది. కానీ అలాంటివేమీ లేవు. అన్వర్‌ను ఆడించవద్దంటూ మొహమ్మదాన్ క్లబ్‌కు ఫెడరేషన్ లేఖ రాయడం పూర్తిగా తప్పు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వైద్య బృందం చెబుతోంది. ఈ స్థితిలో ఏఐఎఫ్ఎఫ్ ఆదేశాలు రద్దు చేయాలి’ అంటూ అన్వర్ న్యాయవాది అమితాబ్ తివారి స్పష్టం చేశారు. అన్వర్ అనారోగ్య విషయం అనుకోకుండా బయటపడిందని, లేదంటే అనుమానం కూడా రాకపోయేదన్న లాయర్... నిజంగా ఫెడరేషన్‌కు బాధ ఉంటే ఆటగాళ్లందరికీ హెచ్‌సీఎం పరీక్షలు చేయించాలని సూచించారు. -
పసిబిడ్డ పునర్జన్మ కోసం..
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే హృద్రోగ సమస్యతో మృత్యువుతో పోరాడుతున్న తన కొడుకును కాపాడుకునేందుకు ఓ తల్లి సుదూరాల తీరం దాటి నగరానికి తీసుకొచ్చింది.ఎంతో వ్యయప్రయాసలకోర్చి యోజనాల దూరం దాటి ఇక్కడకు తెచ్చిన కన్నపేగు బంధం నగర వైద్యుల్లో తమ సంకల్ప బలాన్ని రెట్టింపు చేసింది. 20 గంటలపాటు డాక్టర్లు శ్రమించి చికిత్స చేసి ఆ పసిబిడ్డకు పునర్జన్మను ప్రసాదించారు. అతిక్లిష్టమైన చికిత్సను చేసి శిశువుకు ప్రాణం పోసి అంతర్జాతీయంగా నగర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది కిమ్స్ వైద్య బృందం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కిమ్స్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ అనిల్ కుమార్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆయాసం..గుక్కపట్టి ఒక్కటే ఏడుపు జింబాబ్వేకు చెందిన నోరా సిటుంబెకో 11 నెలల క్రితం ఓ మగ శిశువుకు జన్మనించింది. పుట్టిన తర్వాత శిశువు సరిగా పాలు తాగకపోవడంతో పాటు ఆయాసం, గుక్కపట్టి ఏడవటం వంటి సమస్యలతో బాధపడుతుండటంతో తల్లి నోరా సిటుంబెకో చికిత్స కోసం స్థానికంగా ఉన్న పలువురు వైద్యులను ఆశ్రయించింది. పరీక్షించిన వైద్యులు శిశువు క్లిష్టమైన హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జింబాబ్వేలో నిపుణులు లేకపోవడంతో వారు హైదరాబాద్‌లోని కిమ్స్‌కి సిఫార్సు చేశారు. దీంతో తల్లి నోరా తన బిడ్డతో గత నెలలో నగరం చేరుకుంది. యూనిఫోకలైజేషన్ పద్ధతిలో చికిత్స ఆస్పత్రికి చెందిన చిన్నపిల్లల గుండె చికిత్సల వైద్య నిపుణుడు డాక్టర్ అనిల్‌కుమార్ శిశువును పరీక్షించారు. 2డిఎకో, ఈసీజీ, ఆ్రల్టాసౌండ్ సహా పలు వైద్య పరీక్షలు చేశారు. గుండె కుడి జఠరిక నుంచి ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే రక్తనాళం లేకపోవడంతో పాటు ఎడమ ఊపిరితిత్తులకు రావాల్సిన రక్తనాళాల శాఖలు కూడా చిన్నగా ఉన్నట్లు గుర్తించారు. ఊపిరితిత్తులకు మాప్కాస్ అనే నాళా ల నుంచి రక్తం సరఫరా అవుతుండటమే శిశువు హృద్రోగ సమస్యకు కారణంగా గుర్తించారు. వైద్య పరిభాషలో ‘పల్మనరీ ఆట్రిíÙయా’గా పిలుస్తారు. రక్త ప్రసరణను సాధారణ స్థితికి తెచి్చ, శిశువు ఆరోగ్యాన్ని కాపాడేందుకు క్లిష్టమైన యూనిఫోకలైజేషన్ అనే ప్రక్రియను వైద్యులు ఎంచుకున్నారు. గుండె వెనుక నుంచి వచ్చే అయోటా నుంచి మాప్కాస్‌లను తప్పించి, గుండె నుంచి నేరుగా ఊపిరితిత్తులకు ప్రత్యామ్నాయంగా రక్తనాళాలు ఏర్పాటు చేసి సరఫరాను పునరుద్ధరించారు. చికిత్సకు 20 గంట ల సమయం పట్టినట్లు అనిల్ తెలిపారు. శిశువు ఆరోగ్యం మెరుగుపడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు. తన కొడుకుని బతికించిన వైద్యులకు రుణపడి ఉంటానని తల్లి నోరా తెలిపారు. -
ఎమ్మెల్యే పదవికి రాజీనామా యోచనలో సిద్ధూ !
సాక్షి బెంగళూరు: ఇటీవలే సీఎల్పీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య త్వరలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు కాంగ్రెస్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గుండె వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధరామయ్య.. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయాలనుకుంటున్నట్లు తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఆస్పత్రిలో తనను కలిసేందుకు వచ్చిన నేతలంతా సీఎల్పీ పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అయితే, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సిద్ధరామయ్య తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. -
గుండె రంధ్రం నుంచి చూస్తే...
గుండెలో తడి ఉండాలంటే గుండె పదిలంగా ఉండాలి కదా! కానీ ప్రేమశాంతి గుండెకు రంధ్రం ఉంది. ఆయుష్షును మింగేస్తున్న రంధ్రం అది. కానీ తను ఆ రంధ్రంలో నుంచి ప్రపంచంలోని తనలాంటి అభాగ్యులను చూసింది. ధైర్యంతో, మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో తనలాంటి ఎంతో మంది అభాగ్యుల ఆయుష్షు తగ్గకుండా చెయ్యి అడ్డు పెడుతోంది. ప్రేమను పంచుతోంది. సాక్షి, చెన్నై : ఎవరి కోసం వారు బతకడం సహజం. మరొకరి కోసం బతకడం మానవత్వం. బతికి ఉన్నంతకాలం వారిని కాపాడుకుంటాను...నేను చనిపోయినా వారు మాత్రం నిండునూరేళ్లూ జీవించాలని కోరుకోవడం దైవత్వం. మానసికంగా, శారీరకంగా పిన్న వయసులోనే జీవితంలో చితికిపోయిన తిరుపతికి చెందిన ప్రేమశాంతి రెడ్డి అలాంటి దైవత్వాన్నే పదుగురికీ పంచుతోంది. ‘ఏ క్షణాన్నైనా నేను చనిపోవచ్చు... అయితే నన్ను నమ్ముకున్న రోగులు మాత్రం తమ జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇందుకు దయార్ద్ర హృదయులు స్వచ్చందంగా ముందుకు రావాలి’’ అని ముకుళిత హస్తాలతో ఆమె వేడుకుంటున్నారు. తిరుపతి మల్లంగుంటకు చెందిన పార్లపల్లి చిన్నస్వామిరెడ్డి, సుదర్శనమ్మ దంపతుల కుమార్తె ప్రేమ శాంతికి తిరుపతి పద్మావతి మహిళా కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలోనే వివాహం అయింది. ఆ కొత్తల్లోనే ఆమె గర్భం ధరించింది. ఐదో నెలలో వైద్య పరీక్షలు చేయించుకున్న సమయంలో ప్రేమశాంతికి పుట్టినప్పుడే గుండెలో రంధ్రం ఉన్న సంగతి బయటపడింది. వేలూరు సీఎంసీలో చేర్చగా ‘తల్లో, బిడ్డో ఎవరో ఒకరే’ అని వైద్యులు సూచించారు. దీంతో ప్రేమ శాంతి తల్లిదండ్రులు తమ కుమార్తె దక్కితే చాలని చెప్పడంతో అబార్షన్‌కు అవసరమైన చికిత్స ప్రారంభించారు. ప్రేమ శాంతి శారీరక పరిస్థితుల వల్ల శస్త్ర చికిత్స చేయకుండానే బిడ్డను బయటకు తీయాల్సి ఉండడంతో వైద్యులు కృత్రిమ నొప్పులతో నార్మల్ డెలివరీ కోసం ఇంజక్షన్ ఇచ్చారు. 52 గంటల పాటు నొప్పులను భరించిన ప్రేమశాంతి ఏడోనెల ఆరంభంలో అతి కష్టం మీద.. గర్భంలోనే మరణించిన మగ బిడ్డను ప్రసవించింది. ఆమె కూడా ఇక కొన్నిరోజుల్లో చనిపోతుందని వైద్యులు చెప్పినా ఆత్మస్థైర్యంతో కోలుకుంది. వైవాహిక జీవితానికి పూర్తిగా దూరమై ఒంటరిగా మిగిలింది. భవిష్యత్తు శూన్యంగా గోచరించింది. అయినప్పటికీ తల్లిదండ్రులు, అన్నదమ్ముల ఒత్తిడి మీద ఏడు నెలల పాటు చికిత్స తీసుకుంది. వెయిటింగ్ రూమ్‌లో తనలాంటి వారెందరో! అలా నాలుగు గోడలకు పరిమితమై దిగాలుతో కృంగిపోతున్న దశలో ఆమె ఇంటికి సమీపంలో ఒకరు స్కూల్‌ను ప్రారంభించారు. ప్రైవేటుగా ఎం.ఏ పూర్తి చేసి మానసికవ్యధ నుంచి బయటపడేందుకు ఆ స్కూల్లో టీచర్‌గా చేరారు ప్రేమశాంతి. మరోవైపు స్విమ్స్ కార్డియాలజీ విభాగం స్పెషలిస్ట్ డాక్టర్ వనజ వద్దకు వైద్యపరీక్షలకు వెళుతున్న సమయంలో గుండె రంధ్రాలతో బాధపడుతున్న రోగులు ప్రేమశాంతికి తారసపడేవారు. తనలా ఇంకా ఎందరో ఉన్నారని తెలిసి తల్లడిల్లిపోయింది. తాను పడిన కష్టం మరొకరికి రాకూడదని నిర్ణయానికి వచ్చి వారిని ఆదుకోవడం ప్రారంభించింది. వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన జగదీష్, చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన రమేష్ అనే రోగులకు అవసరమైన మందులను ప్రతినెలా కొరియర్లో పంపడం మొదలైంది. పాకెట్‌మనీగా ఇంట్లో ఇచ్చే డబ్బును వారి మందుల కొనుగోలుకు ఖర్చు చే సేది. 2015లో తండ్రి చనిపోయిన తర్వాత ఆయనకు వచ్చే రూ.23 వేల పింఛన్ మొత్తాన్ని తల్లి, సోదరులు ఆమెకే ఇచ్చేస్తున్నారు. ఈ డబ్బుతో మందులు కొని ఇంటికి తెచ్చి రోగుల వారీగా విభజించి ప్యాకెట్లు కట్టి మూడు నెలలకొకసారి కొరియర్ ద్వారా రోగుల ఇళ్లకు పంపుతోంది. క్రమంగా ఆమెను నమ్ముకున్న రోగుల సంఖ్య క్రమేణా 46కు చేరుకుంది. ఇలా కడప, అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన రోగులు గత పద్నాలుగేళ్లుగా ఆమె నుంచి ఉచితంగా మందులు పొందుతున్నారు. ఈ విధంగా తన గుండెలోని రంధ్రాన్ని ఆపరేషన్‌తో కాక పరులకు పంచే ప్రేమ, శాంతి, సేవా కార్యక్రమాలతో పూడ్చుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న తిరుపతిలో జరిగిన స్విమ్స్ సిల్వర్ జూబ్లి వేడుకల్లో స్విమ్స్ డైరక్టర్ రవికుమార్ ప్రేమశాంతిని సన్మానించి ఆమె చేస్తున్న సేవలను కొనియాడారు. అర్థిస్తున్నా... అక్కున చేర్చుకోండి ‘‘1995లో పెళ్లయిన కొత్తల్లోనే గర్భం దాల్చగా తల్లి ప్రాణాలకు ముప్పు అని వైద్యులు చెప్పారు. దీంతో కడుపులోని బిడ్డను చేజేతులా చంపుకోవాల్సి వచ్చింది. అబార్షన్ జరిగిన అరగంటలో నేనూ చనిపోతానని వైద్యులు తెలిపినా అదృష్టవశాత్తూ ఓ మేరకు కోలుకున్నాను. మెరుగైన చికిత్స కోసం స్విమ్స్‌లోని డాక్టర్ వనజ మేడమ్ వద్దకు వెళుతున్నపుడు నాలాంటి ఎందరో రోగులు ఎదురయ్యేవారు. ఎలాగోలా పరీక్షలు చేయించుకున్నా మందులు కొనే స్థోమతలేక అల్లాడిపోయేవారు. తోచినంతలో వారిని ఆదుకోవాలనే నిర్ణయానికి వచ్చి మందులు పంపడం ప్రారంభించాను. అయితే మందులు కొనలేని స్థితిలో ఇంకా యాభై మందికి పైగా ఉన్నారు. మాది మధ్యతరగతి కుటుంబం కావడం వల్ల వారందరికీ సాయం చేయడం వీలు కాలేదు. అలాగని వారిని వదిలివేయలేను. పాతికేళ్ల క్రితం చనిపోవాల్సిన నేను వైద్యుల అండదండలు, దేవుడి ఆశీర్వాదం, రోగుల అభిమానంతో ఇంకా బతికి ఉన్నాను. వైవాహిక జీవితం, సంతానం లేదనే చింతలేదు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నలభై ఆరు మంది పిల్లలున్నారని గర్వపడుతున్నాను. ఈ రోగం ఏ క్షణాన నా ప్రాణాన్ని కబళిస్తుందో చెప్పలేను. నేను అకస్మాత్తుగా చనిపోతే నా ద్వారా మందులు పొందుతున్న రోగుల పరిస్థితి ఏమిటని ఆందోళన ఇటీవలే మొదలైంది. నేను గతించినా వారు జీవించాలని నా ఆశయం. దాతల కోసం పలువురు రోగులు ఎదురు చూస్తున్నారని లోకానికి తెలియజేయడం కోసమే పద్నాలుగేళ్లుగా గోప్యంగా ఉంచిన నా జీవితాన్ని బహిరంగపరుస్తున్నాను. దేశంలో ఎందరో దయార్ద్ర హృదయులున్నారు. వారందరికీ ఇలాంటి రోగుల వివరాలు చేరాలంటే ఒక వెబ్సైట్ తీసుకురావడం మంచిదని తలంచాను. జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడి, చనిపోయిన తరువాత కూడా పింఛన్ రూపంలో నాసేవలకు సహకరిస్తున్న కన్నతండ్రి పేరున pcrsevasamstha.com అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాను. విశాల హృదయం కలిగిన దాతలు ఈ వెబ్సైట్లోకి వెళ్లి తమకు తోచిన రోగిని దత్తత తీసుకోవాలని కోరుతున్నాను. అవసరమైన మందులు రోగి చిరునామాకు నేరుగా పంపడం ద్వారా వారి ప్రాణాలు కాపాడాలని ప్రార్థిస్తున్నాను. రోగులకు సేవాహస్తం అందించే దాతలకు ఏమైనా సందేహాలుంటే 7680870322 సెల్ఫోన్లో అందుబాటులో ఉంటాను’’ అని విజ్ఞప్తి చేస్తున్నారు. -
హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే...?
మా వారి వయసు 45 ఏళ్లు. ఆయన పదేళ్లుగా గుండె సమస్యతో బాధపడుతున్నారు. బైపాస్ సర్జరీ, రీ–డూ సర్జరీ కూడా చేయించాం. కానీ ఫలితం లేదు. హార్ట్ ఫెయిల్యూర్ అన్నారు. మందులు వాడుతున్నారు. రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు. డాక్టర్లను సంప్రదిస్తే ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ ఒక్కటే పరిష్కారం అని చెప్పారు. మాకు ఆందోళనగా ఉంది. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ అంటే ఏమిటి? దానికి సంబంధించిన అన్ని విషయాలను వివరంగా చెప్పండి. గుండెపనితీరు, దాని సామర్థ్యం పూర్తిగా పడిపోయిన వారికి మాత్రమే గుండెమార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. సాధారణంగా 65 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి, శరీరంలోని మిగతా అన్ని అవయవాల పనితీరు నార్మల్‌గా ఉండటంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్లూ, యాంటీబాడీస్ లేకుండా ఉంటేనే గుండెమార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. మీరు చెప్పిన వివరాలను బట్టి మీ వారికి గుండె నుంచి రక్తం పంప్ అయ్యే సామర్థ్యం 20 శాతం లేదా పది శాతానికి పడిపోయినట్లు అనిపిస్తోంది. ఈ పరిస్థితినే ‘హార్ట్ ఫెయిల్యూర్’ అంటారు. ఇలాంటి వారికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు వెంటనే మీ వారి పూర్తి వివరాలను ప్రభుత్వ సంస్థ అయిన ‘జీవన్‌దాన్’కు అందించి, అందులో మీ వారి పేరు నమోదు చేయించండి. అవయవదానం చేశాక చనిపోయిన వారు లేదా బ్రెయిన్‌డెడ్‌కు గురైన వారి బంధువులు అవయవదానానికి ముందుకు వచ్చిన సందర్భాల్లో ‘జీవన్‌దాన్’ ప్రతినిధులు పూర్తిగా ప్రాధాన్యక్రమంలో గుండెను ప్రదానం చేస్తారు. అలాంటి వారి నుంచి మీవారికి తగిన గుండె లభ్యం కాగానే, మీకు సమాచారం అందజేస్తారు. వారి నుంచి గుండె సేకరించిన (హార్ట్ హార్వెస్టింగ్ జరిగిన) నాలుగు గంటల లోపే ఆ గుండెను రోగికి అమర్చాల్సి ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు మీకు ఎంత త్వరగా గుండె లభ్యమైతే, ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. గుండె మార్పిడి తర్వాత రోగులు అది చక్కగా పనిచేసే మందులతో పాటు ఇమ్యునోసప్రెస్సెంట్స్ అనే ఔషధాలను వాడాల్సి ఉంటుంది. గుండె మార్పిడి ఆపరేషన్లలో చాలావరకు విజయవంతమవుతున్నాయి. ఇలాంటి శస్త్రచికిత్స చేసిన వారు గతంలో కంటే చాలా ఎక్కువ కాలమే జీవిస్తున్నారు. కాబట్టి మీరు ఆందోళన, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. – ఎమ్. కవిత, నిజామాబాద్ హార్ట్ కౌన్సెలింగ్ అప్పుడు స్టెంట్ వేశారు... ఇప్పుడు బైపాస్చేయాలంటున్నారు మా నాన్నగారి వయసు 56 ఏళ్లు. ఏడాది క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి, ఒక స్టెంట్ వేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. కానీ మళ్లీ ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఆయాసపడుతున్నారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళితే పరీక్షలు చేసి, బైపాస్ చేయాలంటున్నారు. మా నాన్నగారికి బీపీతో పాటు షుగర్ కూడా ఉంది. ఈ వయసులో ఆయన సర్జరీని తట్టుకోగలరా? దయచేసి మా సందేహాలకు వివరంగా సమాధానమివ్వగలరు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడితేనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. రెండు లేదా మూడు అడ్డంకులు ఉంటే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేస్తారు. మీ నాన్నగారికి గుండె రక్తనాళాల్లో ఎక్కువగా బ్లాక్స్ ఏర్పడి ఉండవచ్చు. అందుకే డాక్టర్ బైపాస్ సర్జరీని సూచించి ఉంటారు. ఒకప్పుడు గుండె ఆపరేషన్లు అంటే ప్రజలు చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు వైద్యరంగంలో అనేక మార్పులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుండె ఆపరేషన్లు చాలా సురక్షితంగా చేయగలుగుతున్నారు. అందులో భాగంగానే అతి చిన్న కోతతో ‘మినిమల్లీ ఇన్వేజివ్ బైపాస్ సర్జరీ’ అనే అధునాతన పద్ధతి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా ఛాతీ ఎముకలు కట్ చేయకుండానే కొన్ని ప్రత్యేకమైన పరికరాలతో శస్త్రచికిత్స సులువుగానే నిర్వహించవచ్చు. ఈ ఆపరేషన్ ద్వారా కోత తక్కువగా ఉండటం వల్ల నొప్పి కూడా తక్కువగానే ఉంటుంది. ఈ విధానంలో తక్కువ రక్తస్రావం జరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం కూడా చాలా తక్కువ. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ 3 – 4 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. ముఖ్యంగా ఈ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే 50ఏళ్లు పైబడిన వారికి కూడా ఈ శస్త్రచికిత్స విధానం అత్యంత సురక్షితం. బీపీ, షుగర్ ఉన్నవారికి కూడా నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. – కె.వి. రమణ, కాకినాడ స్టెంట్ వేశాక కూడా మళ్లీ గుండెపోటు వస్తుందా? నా వయసు 55 ఏళ్లు. ఇదివరకు ఒకసారి గుండె రక్తనాళాల్లో ఒకచోట పూడిక ఏర్పడిందని నాకు స్టెంట్ వేశారు. ఇటీవల మళ్లీ నాకు అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఇదివరకే స్టెంట్ వేయించుకున్నాను కదా గుండెపోటు రాదులే అనుకొని కొంతకాలంపాటు ఛాతీనొప్పిని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఒక సందేహం వస్తోంది. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలామంది మీలాగే అపోహ పడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. స్టెంట్ సహాయంతో అప్పటికి ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ మళ్లీ కొత్తగా పూడికలు రాకుండా ఆ స్టెంట్ అడ్డుకోలేదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, స్టెంట్ అమర్చిన తర్వాత మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి మీకు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఒకవేళ బైపాస్ అవసరం అని చెప్పినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యవిధానాలతో చిన్న కోతతోనే బైపాస్ చేయడమూ సాధ్యమే. మీరు మీ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. మందులతోనే నయం అయ్యే పరిస్థితి ఉంటే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. ఇక సాధ్యమైనంతవరకు మీరు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. డాక్టర్ ఎన్. నాగేశ్వర్రావు, సీనియర్ కార్డియోథొరాసిక్ అండ్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్