
న్యూఢిల్లీ : క్రీడల చరిత్రలో ఇదో అరుదైన ఉదంతం ... గుండె జబ్బుతో బాధపడుతున్నా సరే తనను ఆడకుండా అడ్డుకోవడం తప్పంటూ ఒక యువ ఫుట్‌బాలర్ నేరుగా కోర్టుకెక్కిన ఘటన ఇది. తనకు ఇష్టమైన ఆటను ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ అతను చేస్తున్న ప్రయత్నమిది. ఈ కేసుకు సంబంధించి గురువారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. వివరాల్లోకెళితే... పంజాబ్‌కు చెందిన అన్వర్ అలీ అండర్–17, అండర్–20 విభాగాల్లో భారత ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దాదాపు ఏడాది క్రితం అతనికి ఐఎస్‌ఎల్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ తరఫున ఆడే అవకాశం వచ్చింది. అయితే టోర్నీకి ముందు జరిపిన పరీక్షల్లో అన్వర్ అరుదైన గుండె జబ్బు (ఎపికల్ హైపర్ కార్డియో మయోపతీ–హెచ్‌సీఎం)తో బాధపడుతున్నట్లు తేలింది. దాంతో అతను ఫుట్‌బాల్‌కు దూరమయ్యాడు.
ఏఐఎఫ్‌ఎఫ్ జోక్యం...
సుమారు సంవత్సరం తర్వాత అన్వర్ తన కెరీర్‌ను పునర్నిర్మించుకునే ప్రయత్నంలో పడ్డాడు. అతనికి సెకండ్ డివిజన్ ఐ–లీగ్‌లో మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా లభించింది. అయితే ఇక్కడ అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అతడిని అడ్డుకుంది. దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ తండ్రి డాక్టర్ వీస్ పేస్ సారథ్యంలోని తమ వైద్య బృందం నిర్ణయించే వరకు అన్వర్ ఫుట్‌బాల్ ఆడరాదని ఏఐఎఫ్‌ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. దీనిపైనే అన్వర్ కోర్టుకెక్కాడు. తాను ఆడకుండా అడ్డుకునే హక్కు ఏఐఎఫ్‌ఎఫ్‌కు లేదని అతను వాదిస్తున్నాడు. ‘అన్వర్ ఆడాలా వద్దా అనేది సదరు క్లబ్ నిర్ణయిస్తుంది. అది వారిద్దరికి సంబంధించిన అంశం. ఇందులో ఏఐఎఫ్‌ఎఫ్ ఎందుకు జోక్యం చేసుకుంటోంది. దానికి ఆ అధికారం లేదు.
నేను చెప్పేది నైతికంగా సరైంది కాకపోవచ్చు కానీ అన్వర్ ఫుట్‌బాల్ ఆడితే కచ్చితంగా చనిపోతాడని చెప్పగలమా. గతంలోనూ ఇదే తరహాలో ఇద్దరు ఫుట్‌బాలర్లకు మైదానంలోనే గుండెపోటు వచ్చింది. కానీ వారు ఆ తర్వాత చికిత్స చేయించుకొని మళ్లీ ఆడారు. ఇలా ఆటగాడిని నిషేధించే అధికారం ఉందని ఏఐఎఫ్‌ఎఫ్ భావిస్తే నిబంధనలు కూడా చూడాల్సి ఉంటుంది. కానీ అలాంటివేమీ లేవు. అన్వర్‌ను ఆడించవద్దంటూ మొహమ్మదాన్ క్లబ్‌కు ఫెడరేషన్ లేఖ రాయడం పూర్తిగా తప్పు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వైద్య బృందం చెబుతోంది. ఈ స్థితిలో ఏఐఎఫ్‌ఎఫ్ ఆదేశాలు రద్దు చేయాలి’ అంటూ అన్వర్ న్యాయవాది అమితాబ్ తివారి స్పష్టం చేశారు. అన్వర్ అనారోగ్య విషయం అనుకోకుండా బయటపడిందని, లేదంటే అనుమానం కూడా రాకపోయేదన్న లాయర్... నిజంగా ఫెడరేషన్‌కు బాధ ఉంటే ఆటగాళ్లందరికీ హెచ్‌సీఎం పరీక్షలు చేయించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment