తన భవిష్యత్తు కలలను విధి చిదిమేసింది. తన జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిన్నారిని ఛాతినొప్పి రూపంలో మృత్యువు వెంటాడింది. దీంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, చివరి నిమిషాల్లో ఆమె మాటలు అందరినీ కన్నీరుపెట్టిస్తున్నాయి.
వివరాల ప్రకారం.. జిల్లేడుగూడెం మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన గడ్డ మీది కృష్ణయ్య, నీలమ్మ దంపతుల కుమార్తె నవనీత(13). ఆమె ప్రస్తుతం ఎనిమదో తరగతి చదువుతోంది. నవనీత పేరెంట్స్ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, స్కూల్‌కు వెళ్లిన నవనీత.. ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. క్లాస్‌లో ఉన్న సమయంలోనే ఛాతిలో నొప్పి వస్తోందంటూ ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ విషయంలో తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆమెను వెంటనే షాద్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ఈ సందర్బంగా ఆసుపత్రిలోని డాక్టర్లు నవనీతకు ప్రాథమిక వైద్యం అందించారు. చికిత్స సందర్భంగా చిన్నారి గుండెకు సంబంధించిన సమస్య ఉందని.. వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు తమ కుమార్తెను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ నవనీత శనివారం రాత్రి చనిపోయింది. దీంతో, ఆమె పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. తమ బిడ్డను కాపాడుకోలేకపోయామని ఆవేదనకు గురయ్యారు.
ఇదిలా ఉండగా.. నీలోఫర్‌లో నవనీత చికిత్స పొందుతున్న సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆవేదనకు గురిచేశాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నవనీత మాట్లాడుతూ..‘నాన్న అమ్మని బాగా చూసుకో.. అమ్మను కొట్టకు.. తిట్టకు. నేనింక బ్రతకను.. చనిపోతున్నాను. నా గురించి మర్చిపోండి’ అని కన్నీరుపెట్టుకుంది. ఆమె మాటలకు తండ్రి ధైర్యం చెబుతూ.. నీకేం కాదమ్మా.. అలా అనొద్దు అని చెబుతూనే కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment