
సాక్షి, చెన్నై: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు మానవత్వంతో స్పందించే మంచి మనుషులు, పెద్దమనుషుల గురించి మనకు తెలుసు. అయితే బాధితుల కష్టాల పట్ల చలిస్తున్న ‘పెద్ద’మనుసున్న చిన్నారుల గురించి తెలుసుకుంటే.. బాలలు కల్లకపట మెరుగని కరుణా మయులే అనింపిచకమానదు. తాజాగా గుండె జబ్బుతో బాధపడుతున్న తమిళనాడుకు చెందిన ఓ బాలిక చేసిన సాయం విశేషంగా నిలిచింది. గుండె ఆపరేషన్‌కోసం విరాళాల రూపంలో సేకరిస్తున్న సొమ్మును కేరళ వరద బాధితులకు డొనేట్ చేసి అపారమైన తన దాతృత్వ గుణాన్ని చాటుకుంది.
కేరళ వరద బాధితుల గాధల్ని టీవీలో చూసిన అక్షయ(12) చిన్ని గుండె కదిలిపోయింది. అందుకే తనకు డబ్బులు ఎంత అవసరమో తెలిసినా, నిస్వార్ధంగా స్పందించింది. 5వేల రూపాయలను విరాళంగా ప్రకటించింది. ఎందుకంటే పుట్టుకతోనే హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న అక్షయకు ఇప్పటికే ఒకసారి (నవంబర్, 2017)లో ఒకసారి గుండె శస్త్రచికిత్స జరిగింది. ఇపుడు మళ్లీ తీవ్ర సమస్యలు తలెత్తడంతో రెండవసారి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంది. అయితే ఆర్థికంగా వెనుకబడిన అక్షయ కుటుంబం క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆపరేషన్‌కు అవసరమైన సొమ్మును సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 20వేలు సమకూరాయి. ఈ డబ్బులోంచే ఇపుడు 5వేల రూపాయలను కేరళ వరద బాధితులకు దానం చేయడానికి ముందుకు వచ్చింది.
అక్షయ తమిళనాడులోని కరూర్ జిల్లాలోని తాంతోనిమలై సమీపంలో కుమారపలయం అనే చిన్న గ్రామంలో పుట్టింది. అక్షయ తల్లి జోతిమణి. తండ్రి ఆరు సంవత్సరాల క్రితం చనిపోయారు. ఈ దంపతుల ముగ్గురి కుమార్తెల్లో పెద్ద పాప అక్షయ. రోజువారీ వేతన వ్యవసాయ కార్మికాలిగా పనిచేస్తూ తల్లి జోతిమణి కుటుంబాన్నిఒంటరిగా నెట్టుకొస్తోంది. మొదటిపారి గుండె ఆపరేషన్ కోసం ఫేస్‌బుక్‌లో విరాళాల ద్వారా 3.5 లక్షల రూపాయలు సేకరించగలిగామని జోతిమణి తెలిపారు. ఈ సారి కూడా అదే ప్రయత్నాల్లో ఉండగా అక్షయ నిర్ణయం తనను కదిలించిందని చెప్పారు. ఆపదలో ఉన్నవారికి ప్రతీ చిన్నసహాయం ఎంత ముఖ్యమైందో, విలువైందో తెలుసు. అందుకే అక్షయ ఇష్టాన్ని కాదనలేకపోయానని జోతి తెలిపారు.
కాగా ఇటీవల వరదల్లో కేరళలో ప్రజలు, ముఖ్యంగా చిన్నారుల బాధల్ని గాధల్ని చూసి చలిస్తున్న చిన్నారులను చూస్తుంటే మాయమర్మమేమిలేని బాలలందరూ ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే అన్న ఆరుద్ర పదాలు గుర్తురాకమానవు. దండిగుండెతో కదులుతున్న ఈ చిన్నారుల సాయం కేరళలోని నిజమైన బాధితులకు చేరాలని కోరుకుందాం.