గత వందేళ్లలో లేని వర్షాలు, వరదలతో భీతిల్లుతున్న కేరళ ప్రజలనుఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్దా ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఈ క్రమంలో నేను సైతం అంటూ ఓ చిన్నారి ఆకర్షణీయంగా నిలిచింది. తనవంతు సాయంచేసి మానవత్వాన్ని చాటుకోవడంతో పాటు తన కలను సాకారం చేసుకుంది. నాలుగేళ్లపాటు దాచుకున్న సుమారు 9వేల రూపాయలను డొనేట్ చేసింది. అంతేకాదు తన ఔదార్యంతో దేశీయ సైకిళ్ల కంపెనీ బంపర్ ఆఫర్ కొట్టేసింది.
ఎవరికైనా మంచి చేస్తే అదిఎప్పటికైనా నీకు మంచి చేస్తుందన్న పెద్దలమాట బేబి అనుప్రియ(8) పాలిట అక్షరాలా నిజమైంది. తమిళనాడు, విలుపురం జిల్లాకు చెందిన అనుప్రియ మూడవ తరగతి చదువుతోంది. వరద బాధితులు, ముఖ్యంగా పిల్లలు పడుతున్న అవస్థల్ని టీవీలో చూసి చలించిపోయింది. ఏకంగా ఐదు పిగ్గీ బ్యాంకుల్లో దాచుకున్న 8,240 రూపాయలను కేరళ వరద బాధితులకు విరాళంగా ప్రకటించింది. ఈ మొత్తం నాణేలను సోమవారం స్థానిక బ్యాంకులో డిపాజిట్ చేసింది.
ఎల్‌కేజీలో ఉన్నప్పటినుంచీ సైకిల్ కొనుక్కోవాలనే కోరికతో రోజుకు కనీసం రెండు రూపాయల చొప్పున పిగ్గీ బ్యాంకులో దాచుకుంటున్నా..కానీ టీవీలో కేరళ ప్రజలు, చిన్నపిల్లలు పడుతున్న ఇబ్బందులు చూసాకా బాధ అనిపించింది. అందుకే నేను సేవ్ చేసుకున్న డబ్బులు వారికివ్వాలని నిర్ణయించుకున్నానని అనుప్రియ చెప్పింది.
చిన్ని వయసునుంచే ఆమెకు పొదుపు అలవాటు చేద్దామనుకున్నా కానీ అది ఇలా ఉపయోగపడుతుందని భావించలేదని ఆమె తండ్రి శివ షణ్ముగనాధన్ సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి గత సంవత్సరం సైకిల్ కొనిద్దామనుకున్నా..కానీ పాప ఇంకా పెద్దది కాలేదని భయపడ్డా... ఇపుడు తన నిర్ణయం తనకు చాలా గర్వంగా ఉందంటూ ఆయన మురిసిపోయారు.
హీరో సైకిల్స్ లిమిటెడ్ బంపర్ ఆఫర్
అనుప్రియ ఔదార్యానికి అబ్బురపడిన దేశీయ అతిపెద్ద సైకిళ్ల తయారీ సంస్థ హీరో సైకిల్స్ అనూహ్యంగా స్పందించింది. ఏ ఉద్దేశంతో అయితే పిగ్గీ బ్యాంకులో డబ్బు దాచుకుందో ఆ కోరికను నెరవేర్చాలని నిర్ణయించింది. చిన్నారికి కొత్త సైకిల్‌ను కానుకగా ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు సంవత్సరానికి ఒక కొత్త బైక్‌ను గిఫ్ట్‌గా అందిస్తామంటూ హీరో మోటార్స్ గ్రూప్ చైర్మన్, ఎండీ పంకజ్ ఎం ముంజాల్ ట్వీట్ చేశారు.
‘సైకిల్ కోసం ఇలా చేయలేదు. సహాయం చేయాలనుకున్నా, చేశాను అంతే. నా స్కూలు స్నేహితులను కూడా సాయం చేయమని కోరతా’ ఈ ఆఫర్ గురించి ప్రశ్నించినపుడు అనుప్రియ ఇలా వ్యాఖ్యానించడం విశేషం.
Anupriya, parnam to you. You are a noble soul and wish you spread the good around. Hero is too pleased to give you one bike every year of your life. Pl share your contact on my account. Love you and best wishes. Prayers for Kerala https://t.co/vTUlxlTnQR
— Pankaj M Munjal (@PankajMMunjal) August 19, 2018
Comments
Please login to add a commentAdd a comment