మా వారి వయసు 45 ఏళ్లు. ఆయన పదేళ్లుగా గుండె సమస్యతో బాధపడుతున్నారు. బైపాస్ సర్జరీ, రీ–డూ సర్జరీ కూడా చేయించాం. కానీ ఫలితం లేదు. హార్ట్ ఫెయిల్యూర్ అన్నారు. మందులు వాడుతున్నారు. రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు. డాక్టర్లను సంప్రదిస్తే ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ ఒక్కటే పరిష్కారం అని చెప్పారు. మాకు ఆందోళనగా ఉంది. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ అంటే ఏమిటి? దానికి సంబంధించిన అన్ని విషయాలను వివరంగా చెప్పండి.
గుండెపనితీరు, దాని సామర్థ్యం పూర్తిగా పడిపోయిన వారికి మాత్రమే గుండెమార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. సాధారణంగా 65 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి, శరీరంలోని మిగతా అన్ని అవయవాల పనితీరు నార్మల్‌గా ఉండటంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్లూ, యాంటీబాడీస్ లేకుండా ఉంటేనే గుండెమార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. మీరు చెప్పిన వివరాలను బట్టి మీ వారికి గుండె నుంచి రక్తం పంప్ అయ్యే సామర్థ్యం 20 శాతం లేదా పది శాతానికి పడిపోయినట్లు అనిపిస్తోంది. ఈ పరిస్థితినే ‘హార్ట్ ఫెయిల్యూర్’ అంటారు. ఇలాంటి వారికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు వెంటనే మీ వారి పూర్తి వివరాలను ప్రభుత్వ సంస్థ అయిన ‘జీవన్‌దాన్’కు అందించి, అందులో మీ వారి పేరు నమోదు చేయించండి. అవయవదానం చేశాక చనిపోయిన వారు లేదా బ్రెయిన్‌డెడ్‌కు గురైన వారి బంధువులు అవయవదానానికి ముందుకు వచ్చిన సందర్భాల్లో ‘జీవన్‌దాన్’ ప్రతినిధులు పూర్తిగా ప్రాధాన్యక్రమంలో గుండెను ప్రదానం చేస్తారు.
అలాంటి వారి నుంచి మీవారికి తగిన గుండె లభ్యం కాగానే, మీకు సమాచారం అందజేస్తారు. వారి నుంచి గుండె సేకరించిన (హార్ట్ హార్వెస్టింగ్ జరిగిన) నాలుగు గంటల లోపే ఆ గుండెను రోగికి అమర్చాల్సి ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు మీకు ఎంత త్వరగా గుండె లభ్యమైతే, ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. గుండె మార్పిడి తర్వాత రోగులు అది చక్కగా పనిచేసే మందులతో పాటు ఇమ్యునోసప్రెస్సెంట్స్ అనే ఔషధాలను వాడాల్సి ఉంటుంది. గుండె మార్పిడి ఆపరేషన్‌లలో చాలావరకు విజయవంతమవుతున్నాయి. ఇలాంటి శస్త్రచికిత్స చేసిన వారు గతంలో కంటే చాలా ఎక్కువ కాలమే జీవిస్తున్నారు. కాబట్టి మీరు ఆందోళన, నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
– ఎమ్. కవిత, నిజామాబాద్
హార్ట్ కౌన్సెలింగ్ అప్పుడు స్టెంట్ వేశారు... ఇప్పుడు బైపాస్‌చేయాలంటున్నారు
మా నాన్నగారి వయసు 56 ఏళ్లు. ఏడాది క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి, ఒక స్టెంట్ వేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. కానీ మళ్లీ ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఆయాసపడుతున్నారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళితే పరీక్షలు చేసి, బైపాస్ చేయాలంటున్నారు. మా నాన్నగారికి బీపీతో పాటు షుగర్ కూడా ఉంది. ఈ వయసులో ఆయన సర్జరీని తట్టుకోగలరా? దయచేసి మా సందేహాలకు వివరంగా సమాధానమివ్వగలరు.
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడితేనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. రెండు లేదా మూడు అడ్డంకులు ఉంటే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేస్తారు. మీ నాన్నగారికి గుండె రక్తనాళాల్లో ఎక్కువగా బ్లాక్స్ ఏర్పడి ఉండవచ్చు. అందుకే డాక్టర్ బైపాస్ సర్జరీని సూచించి ఉంటారు. ఒకప్పుడు గుండె ఆపరేషన్లు అంటే ప్రజలు చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు వైద్యరంగంలో అనేక మార్పులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుండె ఆపరేషన్లు చాలా సురక్షితంగా చేయగలుగుతున్నారు. అందులో భాగంగానే అతి చిన్న కోతతో ‘మినిమల్లీ ఇన్వేజివ్ బైపాస్ సర్జరీ’ అనే అధునాతన పద్ధతి కూడా అందుబాటులోకి వచ్చింది.
ఈ విధానం ద్వారా ఛాతీ ఎముకలు కట్ చేయకుండానే కొన్ని ప్రత్యేకమైన పరికరాలతో శస్త్రచికిత్స సులువుగానే నిర్వహించవచ్చు. ఈ ఆపరేషన్ ద్వారా కోత తక్కువగా ఉండటం వల్ల నొప్పి కూడా తక్కువగానే ఉంటుంది. ఈ విధానంలో తక్కువ రక్తస్రావం జరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం కూడా చాలా తక్కువ. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ 3 – 4 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. ముఖ్యంగా ఈ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే 50ఏళ్లు పైబడిన వారికి కూడా ఈ శస్త్రచికిత్స విధానం అత్యంత సురక్షితం. బీపీ, షుగర్ ఉన్నవారికి కూడా నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఎటువంటి ఆందోళన అవసరం లేదు.
– కె.వి. రమణ, కాకినాడ
స్టెంట్ వేశాక కూడా మళ్లీ గుండెపోటు వస్తుందా?
నా వయసు 55 ఏళ్లు. ఇదివరకు ఒకసారి గుండె రక్తనాళాల్లో ఒకచోట పూడిక ఏర్పడిందని నాకు స్టెంట్ వేశారు. ఇటీవల మళ్లీ నాకు అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఇదివరకే స్టెంట్ వేయించుకున్నాను కదా గుండెపోటు రాదులే అనుకొని కొంతకాలంపాటు ఛాతీనొప్పిని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఒక సందేహం వస్తోంది. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి.
ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలామంది మీలాగే అపోహ పడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. స్టెంట్ సహాయంతో అప్పటికి ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ మళ్లీ కొత్తగా పూడికలు రాకుండా ఆ స్టెంట్ అడ్డుకోలేదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, స్టెంట్ అమర్చిన తర్వాత మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి మీకు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఒకవేళ బైపాస్ అవసరం అని చెప్పినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యవిధానాలతో చిన్న కోతతోనే బైపాస్ చేయడమూ సాధ్యమే. మీరు మీ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. మందులతోనే నయం అయ్యే పరిస్థితి ఉంటే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. ఇక సాధ్యమైనంతవరకు మీరు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
డాక్టర్ ఎన్. నాగేశ్వర్‌రావు,
సీనియర్ కార్డియోథొరాసిక్ అండ్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్,
యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment