Bypass Surgery
-
హార్ట్ బైపాస్ సర్జరీ: రికవరీ కోసం తీసుకోవాల్సిన డైట్ ఇదే..!
కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG) శస్త్రచికిత్స నుంచి కోలుకోవడం అంటే హృదయ ఆరోగ్యం వైపు వేస్తున్న తొలి అడుగు. ఇక్కడ అంత పెద్ద సర్జరీ తర్వాత త్వరితగతిన కోలుకోవడంలో తీసుకునే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. సరైన పోషకాహారంపై దృష్టిసారిస్తే త్వరితగతిన కోలుకోవడమే గాక మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు ఉపకరిస్తుంది. ఇక్కడ సర్జరీ తర్వాత లిక్విడ్ డైట్‌తో ప్రారంభించి..కోలుకున్న వెంటనే రెగ్యులర్ డైట్‌ని ఫాలో అవ్వడానికి ముందు కొన్ని విషయాలు గుర్తించుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే..?మళ్లీ ఘన పదార్థాలు తీసుకునేటప్పుడూ ఆకలి లేకపోవడం, వికారం లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను ఎదురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చంటే..గుండెకు ఉపకరించే ఆరోగ్యకరమైన ఆహారాలు..హృదయాన్ని ఆరోగ్యకరంగా ఉండేలా చేసే అత్యుత్తమమైన ఆహారాలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండేవి తీసుకోవాలి. ఇవి గుండెల్లో మంటను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు..మీలో కొలస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం.అందుకోసం వేయించిన ఆహారాలు, మాంసాహారాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కి దూరంగా ఉండండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే అవోకాడోస్, నట్స్, గింజలు,సాల్మన్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలను తినండి. అలాగే వేరుశెనగ, బియ్యం ఊక, పొద్దుతిరుగుడు లేదా ఆవాల నూనెలను వంటనూనెలుగా ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు తగ్గించండి..రక్తపోటుని నిర్వహించేందుకు ఉప్పు తక్కువుగా తీసుకోవడం అత్యంత ముఖ్యం. అధిక సోడియం ప్రాసెస్ చేసిన ఆహారాలు, క్యాన్డ్ సూప్‌లు, స్నాక్స్‌కి బదులుగా ఉప్పులేని భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.ప్రోటీన్ ప్యాకేజీలు రికవరీకి లీన్ ప్రోటీన్లు కీలకం, ఎందుకంటే అవి కణజాల మరమ్మత్తు, కండరాల బలానికి సహాయపడతాయి. పౌల్ట్రీ, చేపలు, చిక్కుళ్ళు, టోఫు, తక్కువ కొవ్వు వంటి లీన్ సోర్స్‌లను ఎంచుకోండి. కండరాల రిపేర్‌కు తోడ్పడేందుకు, అలాగే నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ప్రతి భోజనంలో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి..సర్జరీ తర్వాత కోలుకోవాలంటే హైడ్రేటెడ్ ఉండటం అత్యంత కీలకం. శరీరం బాగా పనిచేసేలా రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. చక్కెర పానీయాలు, కెఫిన్‌లను నివారించండి. డైటీషియన్ సలహాలు తీసుకోవడం..సర్జరీ తర్వాత ఎలాంటి ఆహారం మంచిదనేది మన వైద్య చరిత్ర తెలిసిన డైటీషియన్‌ని అడగడం మంచిది. అది మనకు ఎలాంటి సమస్యలు రాకుండా నివారించడమే గాకుండా ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు ఉపకరిస్తుంది. బాడీ పరిస్థితిని అర్థం చేసుకోండి..దీర్ఘకాలిక గుండె ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమైనదో అలాగే మనం తీసుకునే ఫుడ్‌కి శరీరం ఎలా రియాక్షన్ ఇస్తుందనేది గమనించడం అంతే ముఖ్యం.అలాగే ఎప్పటికప్పుడూఆరోగ్య సంరక్షణ నిపుణులు సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవడం కూడా విస్మరించొద్దని సూచిస్తున్నారు నిపుణులు.(చదవండి: నా ఉద్దేశంలో ఆ పండుగ అర్థం.. సుధామూర్తి పోస్ట్ వైరల్) -
ఆరోగ్యశ్రీ సేవలు చాలా బాగున్నాయి
కష్టకాలంలో ఆదుకున్నారు గుండెకు బైపాస్ సర్జరీ చేయాలన్నారు. నా భర్త ఆటో డ్రైవర్. రోజువారి సంపాదన కుటుంబ పోషణకు సరిపోతుంది. బైపాస్ సర్జరీ అంటే బయట అప్పులు చేయాలని భయపడ్డాను. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేయిస్తుందని చెప్పారు. ఫిబ్రవరిలో ఆపరేషన్ చేశారు. అనంతరం విశ్రాంత సమయానికి రూ. 9,500 భృతిని ఆరోగ్య ఆసరా కింద ఇచ్చారు. చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టకుండా ఆపరేషన్ పూర్తి అయింది. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు నాలాంటి ఎంతోమంది ప్రాణాలను నిలుపుకుని సంతోషంగా ఉంటున్నారు. కష్టకాలంలో సీఎం జగన్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది. – అల్లంశెట్టి రాజ్యలక్ష్మి, ఒంగోలు, ప్రకాశం జిల్లా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలకు సంజీవని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆయా కుటుంబాల వారికి ఏదైనా అనారోగ్యం వస్తే రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం లభిస్తుంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ పథకం అమలుపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తొలి నుంచి ప్రత్యేక దృష్టి పెడుతూ వస్తోంది. సంతృప్తకర స్థాయిలో ప్రజలకు సేవలు అందించేలా విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పథకం కింద చికిత్స పొందిన రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. చికిత్స పొందిన రోగుల్లో సుమారు వంద శాతం సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రమే సేవల్లో సమస్యలను ప్రస్తావించారు. ఈ స్వల్ప సమస్యలను కూడా సరిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. 99.71 శాతం మంది సంతృప్తి ఆరోగ్యశ్రీ సేవల్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సర్దుబాటు చేసి ప్రజలకు వంద శాతం సంతృప్తికరంగా సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా గతేడాది ఆగస్టు 16 నుంచి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగుల నుంచి అభిప్రాయ సేకరణను ప్రారంభించారు. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జయి ఇంటికి వెళ్లిన వారం నుంచి 10 రోజుల్లో ఏఎన్ఎం సంబంధిత రోగి ఇంటికి వెళ్లి రోగి ఆరోగ్య పరిస్థితులపై వాకబు చేస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలపైనా అభిప్రాయం సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. ఇప్పటి వరకూ పథకం కింద చికిత్స పొందిన 15,43,831 మంది నుంచి అభిప్రాయాలు తీసుకోగా.. 15,39,506 మంది అంటే 99.71 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 0.29 శాతం మంది మాత్రమే సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురైనట్టు చెప్పారు. ఈ సమస్యలను క్రమశిక్షణ కమిటీల ద్వారా విచారించి, కారణాలను అన్వేషించి బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. డబ్బు వసూళ్లకు పాల్పడ్డారా? నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని డిశ్చార్జయిన రోగి చిరునామా ఆధారంగా సంబంధిత ఏఎన్ఎంకు యాప్ ద్వారా వివరాలు వెళతాయి. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిపై ఏఎన్ఎం ఆరా తీసి.. యాప్‌లో రూపొందించిన పలు ప్రశ్నలపై సమాధానాలు రాబడతారు. చికిత్స కోసం నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు డబ్బు డిమాండ్ చేశారా? వైద్య సేవలు, సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? ఆరోగ్యమిత్ర సహకారం ఎలా ఉంది? మందులు ఉచితంగా ఇచ్చారా? లేదా? తదితర ప్రశ్నలకు సమాధానం రాబడతారు. ఇలా సేకరించిన అభిప్రాయాన్ని యాప్‌లో నమోదు చేస్తారు. రోగులు ఎవరైనా సమస్యలు తెలియజేసినట్లయితే.. సంబంధిత జిల్లా కో–ఆర్డినేటర్ల లాగిన్‌కు వెళతాయి. కో–ఆర్డినేటర్ విచారణ చేపట్టి కారణాలను అన్వేషించాల్సి ఉంటుంది. రోగుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడిన సందర్భాల్లో రూ. 20 వేలలోపు డబ్బు వసూళ్ల ఆరోపణల్లో జిల్లా స్థాయిలో, ఆపైన వసూళ్ల కేసులను రాష్ట్ర స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజారోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజల ఆరోగ్యాలకు సీఎం జగన్ ప్రభుత్వం భరోసాగా ఉంటోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 1,059 ప్రొసీజర్లు ఈ పథకంలో అందుబాటులో ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 3,257కు పెంచారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు నాటికి 46.12 లక్షల మందికి ఉచితంగా వైద్యం అందించారు. ఏకంగా రూ. 9,193.61 కోట్లు ఖర్చు చేశారు. చికిత్స అనంతరం విశ్రాంత సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమం కింద ఆర్థికంగా చేయూత ఇస్తున్నారు. ఇలా రూ. వెయ్యి కోట్లకుపైగా ప్రభుత్వం రోగులకు సాయం చేసింది. 104కు ఫిర్యాదు చేయవచ్చు ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు ఈ పథకం కింద పూర్తి ఉచితంగా అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు చర్యలు చేపడుతున్నాం. రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టి అవకతవకలకు పాల్పడిన ఆస్పత్రులపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రజలు 104కు ఫిర్యాదు చేయవచ్చు. – ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జవాబుదారీతనం పెరుగుతుంది చికిత్స అనంతరం రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే ప్రజలు ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఇది మంచి పరిణామం. ఈ తరహా విధానాలతో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. రోగులకు ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు -
పుట్టిన 24 గంటలకే బైపాస్ సర్జరీ
లక్డీకాపూల్: గుండెలో రంధ్రంతో పుట్టిన ఒక రోజు వయసుగల ఆడశిశువుకు మంగళవారం నిమ్స్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. యూకేకు చెందిన ఆల్డర్ హే ఆస్పత్రి కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ ధన్నపునేని ఆధ్వర్యంలోని వైద్య బృందం నిమ్స్ కార్డియోథిరాసిక్ సర్జన్ డాక్టర్ ఎ. అమరేశ్‌రావు, పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్‌తో కలసి ఈ సర్జరీ చేపట్టింది. నిజామాబాద్ జిల్లా చిట్టాపూర్‌కు చెందిన ప్రశాంత్ గ్రూప్–2 ప్రిపరేషన్ కోసం తన భార్య సమీర శ్రావణితో కలసి హైదరాబాద్ వచ్చి ఇబ్రహీంపట్నంలో ఉంటున్నాడు. ఆయన భార్య సోమవారం ఉదయం ఆడశిశువు (సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా)కు జన్మనివ్వగా శిశువుకు గుండెలో రంధ్రం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించారు. అప్పటికే గుండె సంబంధ జబ్బులతో బాధపడుతున్న ఐదేళ్లలోపు చిన్నారులకు చార్లెస్ హార్ట్ హీరోస్ పేరిట నిమ్స్‌లో యూకే వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని (ఈ నెల 24 మొదలు 30 వరకు) నిర్వహిస్తుండటంతో వారి ఆధ్వర్యంలో శిశువుకు బైపాస్ సర్జరీ చేశారు. కాగా, హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ (ఏపీ–తెలంగాణ) మంగళవారం నిమ్స్‌ను సందర్శించి డాక్టర్ రమణ, ఆయన బృందాన్ని కలిసి అభినందించారు. అలాగే గుండె సర్జరీ అనంతరం కోలుకుంటున్న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన చిన్నారి నిత్యను గారెత్ పరామర్శించారు. నవజాత శిశువులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. -
వెంటిలేటర్‌పై ప్రముఖ నటుడు
తిరువనంతపురం (కేరళ): ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ ఆస్పత్రిపాలయ్యారు. మార్చి 30న ఆయనకు గుండెపోటు రావడంతో కేరళలోని అపోలో అడ్లక్స్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆయనకు బైపాస్ సర్జరీ చేసిన అనంతరం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్కు స్పందిస్తున్నారని వైద్యులు పేర్కొన్నారు. కాగా శ్రీనివాసన్ నటుడు మాత్రమే కాదు రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాత కూడా! దాదాపు 225 పైచిలుకు సినిమాల్లో నటించారు. కేరళ స్టేట్ ఫిలిం అవార్డులతో పాటు పలు పురస్కారాలను ఆయన సొంతం చేసుకున్నారు. The veteran actor, writer and director #Sreenivasan is on ventilator support after a bypass surgery following heart issues. Wishing him a speedy recovery. pic.twitter.com/cFLbukBInU — Sreedhar Pillai (@sri50) April 7, 2022 చదవండి: ఎన్టీఆర్ చేతికి పెట్టుకున్న కొత్త వాచ్ ధరెంతో తెలుసా? -
విశాఖలో హార్ట్ వాల్వుల తయారీ యూనిట్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆసియాలోనే అతి పెద్ద గుండె వాల్వుల తయారీకి విశాఖపట్నం కేంద్రం కానుంది. విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్)లో వివిధ రకాల వాల్వుల తయారీ యూనిట్ ఏర్పాటుకు ట్రాన్స్‌లూమినా సంస్థ ఇటీవల భూమిపూజ చేసింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ పనులను వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. అనంతరం వాల్వుల తయారీ ప్రారంభించే అవకాశం ఉంది. అంటే 2023లో విశాఖపట్నం నుంచే హార్ట్ వాల్వులు తయారుకానున్నాయి. ఈ యూనిట్లో ట్రాన్స్‌కేథటర్, మిట్రల్, ట్రైకుస్పిడ్ వాల్వులను తయారు చేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి పెట్టనున్నారు? ఎంతమందికి ఉపాధి లభిస్తుందనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. బైపాస్ సర్జరీ అవసరం లేకుండానే.. వాస్తవానికి గుండె వాల్వులకు సమస్య వస్తే బైపాస్ సర్జరీ చేయడం పరిపాటి. ఈ ప్రక్రియలో ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి రావడంతోపాటు భారీగా కోతలు పడతాయి. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కేథటర్ హార్ట్ వాల్వ్ ఇంప్లాంటేషన్ ప్రక్రియ ముందుకొచ్చింది. ఈ వాల్వుల వల్ల బైపాస్ సర్జరీ అవసరం లేకుండానే.. చిన్నపాటి రంధ్రంతో ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండా గుండె శస్త్రచికిత్స పూర్తిచేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ యూనిట్లో ప్రధానంగా ట్రాన్స్‌కేథటర్ వాల్వులను తయారు చేయనున్నట్టు ట్రాన్స్‌లూమినా కంపెనీ ఎండీ గుర్మీత్‌సింగ్ చాగ్ ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నూతన తరహా వాల్వుల తయారీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు, నిపుణులతో సంప్రదించామని ఆయన వెల్లడించారు. -
రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ
న్యూఢిల్లీ: ఛాతీలో నొప్పితో అనారోగ్యానికి గురయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇటీవల ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం మంగళవారం ఆయనకు బైపాస్ సర్జరీ విజయవంతంగా చేశారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రపతి ఆరోగ్యం కుదుటగా ఉందని.. కోలుకుంటున్నారని వెల్లడించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ వైద్యులను ఆయన అభినందించారు. ఈనెల 27వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఛాతీ నొప్పితో సైనిక (ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్) ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆ ఆస్పత్రి వర్గాలు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లాలని సూచించాయి. సాధారణ వైద్య పరీక్షలు రావడంతో రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు బైపాస్ సర్జరీ విజయవంతంగా ముగించారు. దీనిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ జరిగింది. విజయవంతంగా సర్జరీ చేసిన వైద్యులను అభినందిస్తున్నా. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడి తెలుసుకున్నా. రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. The President of India, Shri Ramnath Kovind has undergone a successful bypass surgery at AIIMS, Delhi. I congratulate the team of Doctors for successful operation. Spoke to Director AIIMS to enquire about Rashtrapatiji’s health. Praying for his well-being and speedy recovery. — Rajnath Singh (@rajnathsingh) March 30, 2021 -
ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత గుండెజబ్బు మళ్లీ వస్తుందా?
నా వయసు 59 ఏళ్లు. ఇదివరకు ఒకసారి గుండె రక్తనాళాల్లో ఒకచోట పూడిక ఏర్పడిందని నాకు స్టెంట్ వేశారు. ఇటీవల మళ్లీ నాకు అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఇదివరకే స్టెంట్ వేయించుకున్నను కదా గుండెపోటు రాదులే అనుకొని కొంతకాలంపాటు ఛాతీనొప్పిని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ సందేహం వస్తోంది. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలామంది మీలాగే అపోహ పడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. స్టెంట్ సహాయంతో అప్పటికే ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ మళ్లీ కొత్తగా పూడికలు రాకుండా ఆ స్టెంట్ అడ్డుకోలేదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి స్టెంట్ పెట్టిన తర్వాత మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి మీకు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఒకవేళ బైపాస్ అవసరం అని చెప్పినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అత్యాధునిక వైద్యవిధానాలతో చిన్న కోతతోనే బైపాస్ చేయడమూ సాధ్యమే. మీరు మీ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. మందులతోనే నయం అయ్యే పరిస్థితి ఉంటే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. ఇక సాధ్యమైనంతవరకు మీరు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల గుండెజబ్బు వస్తుందా? నా వయసు 37 ఏళ్లు. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నాను. నాకు కోపం, ఆవేశంతో పాటు భయం కూడా ఎక్కువ. నా మనసు ఎప్పుడూ కీడు శంకిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మా బాస్ పిలిస్తే చాలు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందనని నాకు ముచ్చెమటలు పట్టేస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాగే ఎవరైనా నాతో పర్సనల్‌గా మాట్లాడాలని అన్నప్పుడు కూడా చాలా తీవ్రంగా. అదేపనిగా ఆలోచిస్తుంటాను. కానీ వాళ్లతో మాట్లాడిన అనంతరం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాను. ఆందోళన సమయంలో నా గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. దీన్ని బట్టి నాకేమైనా గుండెజబ్బు ఉందేమోనని అనిపిస్తుంటుంది. నాకు గుండెజబ్బు ఉందా? వచ్చేందుకు అవకాశం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీకు ఫోబియా ఉన్నట్లు చెప్పవచ్చు. అలాగని, అది మినహాయించి, మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని మాత్రం చెప్పలేం. సాధారణంగా ఎక్కువగా భయపడినప్పుడు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే గుండెకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అయ్యే ముందు కూడా ఈ సంకేతాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. మీరు నడిచినప్పుడు గానీ, మెట్లెక్కినప్పుడు గానీ మీరు పేర్కొన్న లక్షణాలతో పాటుగా ఆయాసం, ఛాతీలో నొప్పి రావడం వంటివి చోటుచేసుకుంటే మీరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలకు అవి సంకేతాలని చెప్పవచ్చు. కాబట్టి మీరు వెంటనే కార్డియాలజిస్ట్‌ని కలిసి, మీ లక్షణాలను వివరిస్తే, వారు తగిన పరీక్షలు నిర్వహించి, మీకు ఉన్న అసలు సమస్యను తెలుసుకునేందుకూ, మీ వాస్తవ సమస్యపై ఒక అవగాహనకు వచ్చేందుకు వీలుంది. అందుకు అనుగుణంగా తగిన చికిత్సను కూడా అందించవచ్చు. అంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరైనా గుండె సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురైన చరిత్ర ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే మీకు పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి అలవాట్లు ఉన్నా లేదా షుగర్ వంటి ఇతర వ్యాధులు ఉన్నా మీరు భవిష్యత్తులో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒకవేళ పై లక్షణాలు ఉన్నప్పటికీ, వైద్య పరీక్షల్లో ఏ కారణాలూ కనిపించకపోతే మీరు కేవలం ఫోబియాతో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ చేయవచ్చు. ఆ తర్వాత మీరు సైకియాట్రిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ ఇప్పించుకుంటే సరిపోతుంది. ఈమధ్యకాలంలో ఇలాంటి కేసులు యువతీయువకుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా కాకుండా పైన పేర్కొన్న గుండెకు సంబంధించిన లక్షణాలుంటే మాత్రం ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణం డాక్టర్ని కలిసి, పరీక్షలు నిర్వహించుకుని, తగిన చికిత్సను పొందండి. భయపడాల్సిన పనేమీ లేదు. మీ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు, చికిత్స ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తరచూ ఛాతీనొప్పి... గుండెజబ్బు కావచ్చా? నా వయసు 42 ఏళ్లు. నాకు తరచూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఈ విషయం స్నేహితులతో చెప్పినప్పుడు... అది గుండెపోటుకు దారితీయవచ్చుననీ, పరీక్షలు చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. గుండెపోటు ఎందుకు వస్తుంది? దానిని ఎలా గుర్తించాలి? శరీరంలోని భాగాలన్నింటికీ రక్తం సరఫరా చేసే పంపింగ్ స్టేషన్ లాంటిది గుండె. కండరాలతో నిర్మితమైన ఈ గుండె సక్రమంగా పనిచేయడానికి దానికి శుద్ధమైన (ఆక్సిజన్‌తో కూడిన) రక్తం నిరంతరం సరఫరా జరుగుతూ ఉండాలి. కరొనరీ ధమనుల ద్వారా దానికి రక్తం అందుతూ ఉంటుంది. ఈ ధమనులకు వ్యాధి సోకితే అవి కుంచించుకుపోయి తగిన పరిమాణంలో శుద్ధమైన రక్తాన్ని సరఫరా చేయలేవు. కొవ్వు – క్యాల్షియమ్ – ప్రోటీన్ అణువులు రక్తనాళాల లోపలి గోడలపై పాచిలాగా పేరుకుపోవడం వల్ల ఈ రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అలా ధమని పూర్తిగా మూసుకుపోయిన పక్షంలో దాని ద్వారా రక్తం సరఫరా కావాల్సిన గుండె కండరాలకు పోషకాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఫలితంగా గుండెకండరాలు చచ్చుబడిపోతాయి. దాంతో గుండెపోటు వస్తుంది. సాధారణంగా గుండెపోటుకు ఇదే కారణం అయినప్పటికీ కరొనరీ ధమనుల్లో ఏర్పడే తీవ్రమైన సంకోచ వ్యాకోచాలు కూడా గుండెపోటుకు దారితీస్తాయి. ఈ విధంగా సంకోచించిన సమయంలో రక్తనాళాల (ధమనుల) ద్వారా గుండె కండరాలకు జరిగే రక్తసరఫరా చాలా తక్కువ పరిమాణానికి పడిపోవడమో లేదా పూర్తిగా నిలిచిపోవడమో జరుగుతుంది. వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కరోనరీ ధమనులకు సంబంధించి పెద్దగా సమస్యలు లేని సందర్భంలో కూడా ఇలా జరగవచ్చు. గుండెపోటులో ఈ కింద పేర్కొన్న లక్షణాలు ముందే కనిపిస్తాయి. ∙ఛాతీ–రొమ్ము ఎముక కింద – ఎడమచేతిలో భాగంగా, ఒత్తిడిగా, నొప్పిగా అనిపిస్తుంది. ►ఈ అసౌకర్యం వీపు వైపునకు, దవడలు, చేతి గుండా ఇతర అవయవాలకు వ్యాపిస్తున్నట్లుగా తోస్తుంది. ►కడుపు ఉబ్బరంగా, అజీర్తిగా, ఏదో అడ్డుపడుతున్నట్లుగా అనిపిస్తుంది. ►చెమటలు పట్టడం, వికారం, వాంతి వస్తున్నట్లుగా ఉంటుంది. ►చాలా బలహీనంగా, ఆందోళనగా ఉండి శ్వాస తీసుకోవడం కష్టంగా తోస్తుంది. ►గుండె వేగంగా, అసహజంగా కొట్టుకుంటుంది. ఈ లక్షణాలు దాదాపు 30 నిమిషాల పాటు కనిపిస్తాయి. అందువల్ల ఛాతీలో నొప్పి వస్తే ముందుగా ఆసుపత్రికి వెళ్లి, అది గుండెపోటు కాదని నిర్ధారణ చేసుకోండి. కొంతమందిలో ఈ లక్షణాలు ఏమీ కనిపించకుండా కూడా గుండెపోటు రావచ్చు. దీన్ని సైలెంట్ హార్ట్‌ఎటాక్‌గా పరిగణించవచ్చు. ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ ఎవరికైనా రావచ్చు. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో ఈ రకమైన గుండెపోటు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. స్పష్టమైన లక్షణాలుతో, వెంటనే గుర్తించడానికి తెలిసిపోయే లక్షణాలతో గుండెలో అసౌకర్యం కలుగుతున్న విషయాన్ని గుర్తించినప్పుడు, తక్షణం ఆ రోగులను ఆసుపత్రికి చేరిస్తే, వారి ప్రాణాలు కాపాడవచ్చు. మన దేశంలో ప్రతి 33 సెకండ్లకు ఒకరు గుండెపోటుకు గురవుతున్నారు. ఇలా ఏటా ఇరవై లక్షల మంది హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నట్లు అంచనా. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల వారితో పోలిస్తే భారతీయులు సగటున పది సంవత్సరాలు ముందుగానే గుండెపోటుకు గురవుతున్నారు. పైగా మన దేశస్తుల్లో గుండెపోటుకు గురవుతున్నవారిలో చాలా మంది యువకులు, మధ్యవయస్కులే ఎక్కువ. ఇలా స్పష్టమైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే అన్ని సౌకర్యాలు ఉన్న పెద్దాసుపత్రులకు వెళ్లి, తగిన పరీక్షలు చేయించుకుంటే ఎన్నో ప్రాణాలు అర్థంతరంగా ముగియకుండా కాపాడవచ్చు. డా. రాజశేఖర్ వరద, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్ -
హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే...?
మా వారి వయసు 45 ఏళ్లు. ఆయన పదేళ్లుగా గుండె సమస్యతో బాధపడుతున్నారు. బైపాస్ సర్జరీ, రీ–డూ సర్జరీ కూడా చేయించాం. కానీ ఫలితం లేదు. హార్ట్ ఫెయిల్యూర్ అన్నారు. మందులు వాడుతున్నారు. రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారు. డాక్టర్లను సంప్రదిస్తే ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ ఒక్కటే పరిష్కారం అని చెప్పారు. మాకు ఆందోళనగా ఉంది. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ అంటే ఏమిటి? దానికి సంబంధించిన అన్ని విషయాలను వివరంగా చెప్పండి. గుండెపనితీరు, దాని సామర్థ్యం పూర్తిగా పడిపోయిన వారికి మాత్రమే గుండెమార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. సాధారణంగా 65 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి, శరీరంలోని మిగతా అన్ని అవయవాల పనితీరు నార్మల్‌గా ఉండటంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్లూ, యాంటీబాడీస్ లేకుండా ఉంటేనే గుండెమార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. మీరు చెప్పిన వివరాలను బట్టి మీ వారికి గుండె నుంచి రక్తం పంప్ అయ్యే సామర్థ్యం 20 శాతం లేదా పది శాతానికి పడిపోయినట్లు అనిపిస్తోంది. ఈ పరిస్థితినే ‘హార్ట్ ఫెయిల్యూర్’ అంటారు. ఇలాంటి వారికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు వెంటనే మీ వారి పూర్తి వివరాలను ప్రభుత్వ సంస్థ అయిన ‘జీవన్‌దాన్’కు అందించి, అందులో మీ వారి పేరు నమోదు చేయించండి. అవయవదానం చేశాక చనిపోయిన వారు లేదా బ్రెయిన్‌డెడ్‌కు గురైన వారి బంధువులు అవయవదానానికి ముందుకు వచ్చిన సందర్భాల్లో ‘జీవన్‌దాన్’ ప్రతినిధులు పూర్తిగా ప్రాధాన్యక్రమంలో గుండెను ప్రదానం చేస్తారు. అలాంటి వారి నుంచి మీవారికి తగిన గుండె లభ్యం కాగానే, మీకు సమాచారం అందజేస్తారు. వారి నుంచి గుండె సేకరించిన (హార్ట్ హార్వెస్టింగ్ జరిగిన) నాలుగు గంటల లోపే ఆ గుండెను రోగికి అమర్చాల్సి ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు మీకు ఎంత త్వరగా గుండె లభ్యమైతే, ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. గుండె మార్పిడి తర్వాత రోగులు అది చక్కగా పనిచేసే మందులతో పాటు ఇమ్యునోసప్రెస్సెంట్స్ అనే ఔషధాలను వాడాల్సి ఉంటుంది. గుండె మార్పిడి ఆపరేషన్లలో చాలావరకు విజయవంతమవుతున్నాయి. ఇలాంటి శస్త్రచికిత్స చేసిన వారు గతంలో కంటే చాలా ఎక్కువ కాలమే జీవిస్తున్నారు. కాబట్టి మీరు ఆందోళన, నిరాశ చెందాల్సిన అవసరం లేదు. – ఎమ్. కవిత, నిజామాబాద్ హార్ట్ కౌన్సెలింగ్ అప్పుడు స్టెంట్ వేశారు... ఇప్పుడు బైపాస్చేయాలంటున్నారు మా నాన్నగారి వయసు 56 ఏళ్లు. ఏడాది క్రితం ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి, ఒక స్టెంట్ వేశారు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. కానీ మళ్లీ ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఆయాసపడుతున్నారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళితే పరీక్షలు చేసి, బైపాస్ చేయాలంటున్నారు. మా నాన్నగారికి బీపీతో పాటు షుగర్ కూడా ఉంది. ఈ వయసులో ఆయన సర్జరీని తట్టుకోగలరా? దయచేసి మా సందేహాలకు వివరంగా సమాధానమివ్వగలరు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో అడ్డంకులు (బ్లాక్స్) ఏర్పడితేనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. రెండు లేదా మూడు అడ్డంకులు ఉంటే యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేస్తారు. మీ నాన్నగారికి గుండె రక్తనాళాల్లో ఎక్కువగా బ్లాక్స్ ఏర్పడి ఉండవచ్చు. అందుకే డాక్టర్ బైపాస్ సర్జరీని సూచించి ఉంటారు. ఒకప్పుడు గుండె ఆపరేషన్లు అంటే ప్రజలు చాలా భయపడేవారు. కానీ ఇప్పుడు వైద్యరంగంలో అనేక మార్పులు, అత్యాధునిక వైద్య ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుండె ఆపరేషన్లు చాలా సురక్షితంగా చేయగలుగుతున్నారు. అందులో భాగంగానే అతి చిన్న కోతతో ‘మినిమల్లీ ఇన్వేజివ్ బైపాస్ సర్జరీ’ అనే అధునాతన పద్ధతి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా ఛాతీ ఎముకలు కట్ చేయకుండానే కొన్ని ప్రత్యేకమైన పరికరాలతో శస్త్రచికిత్స సులువుగానే నిర్వహించవచ్చు. ఈ ఆపరేషన్ ద్వారా కోత తక్కువగా ఉండటం వల్ల నొప్పి కూడా తక్కువగానే ఉంటుంది. ఈ విధానంలో తక్కువ రక్తస్రావం జరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం కూడా చాలా తక్కువ. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ 3 – 4 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు. ముఖ్యంగా ఈ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అలాగే 50ఏళ్లు పైబడిన వారికి కూడా ఈ శస్త్రచికిత్స విధానం అత్యంత సురక్షితం. బీపీ, షుగర్ ఉన్నవారికి కూడా నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. – కె.వి. రమణ, కాకినాడ స్టెంట్ వేశాక కూడా మళ్లీ గుండెపోటు వస్తుందా? నా వయసు 55 ఏళ్లు. ఇదివరకు ఒకసారి గుండె రక్తనాళాల్లో ఒకచోట పూడిక ఏర్పడిందని నాకు స్టెంట్ వేశారు. ఇటీవల మళ్లీ నాకు అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఇదివరకే స్టెంట్ వేయించుకున్నాను కదా గుండెపోటు రాదులే అనుకొని కొంతకాలంపాటు ఛాతీనొప్పిని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఒక సందేహం వస్తోంది. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలామంది మీలాగే అపోహ పడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. స్టెంట్ సహాయంతో అప్పటికి ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ మళ్లీ కొత్తగా పూడికలు రాకుండా ఆ స్టెంట్ అడ్డుకోలేదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి, స్టెంట్ అమర్చిన తర్వాత మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి మీకు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఒకవేళ బైపాస్ అవసరం అని చెప్పినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యవిధానాలతో చిన్న కోతతోనే బైపాస్ చేయడమూ సాధ్యమే. మీరు మీ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. మందులతోనే నయం అయ్యే పరిస్థితి ఉంటే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. ఇక సాధ్యమైనంతవరకు మీరు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. డాక్టర్ ఎన్. నాగేశ్వర్రావు, సీనియర్ కార్డియోథొరాసిక్ అండ్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్ -
అనైతిక వైద్యం వెనుక అవినీతి చీకటి
వైద్య ఖర్చులు భరించలేని పేదల సంక్షేమచర్యలలో భాగంగా కార్మిక జీవిత బీమా సంస్థ వారు (ఇఎస్ఐసి) అనేక వైద్యశాలలు నడుపుతున్నారు. చిన్న ఉద్యోగులకు, కార్మికులకు అందులో చికిత్స ఉచి తంగా ఇస్తారు. ఒక్కోసారి వాటిలో అవసరమైన చికిత్సా సౌకర్యాలు లేకపోతే వారే సమీపంలోని ప్రయివేటు వైద్యశాలలకు చికిత్సకోసం రోగులను పంపించవలసి ఉంటుంది. అక్కడి చికిత్సకు శస్త్ర చికిత్సలకు, రోగులకు అమర్చిన స్టెంట్ వంటి పరికరాలకు అయ్యే ఖర్చులను కార్మిక జీవిత బీమా సంస్థ భరించవలసి ఉంటుంది. ప్రైవేటు వైద్యదుకాణాల వ్యాపారులు స్టెంట్ అనే పరికరాన్ని గుండెజబ్బుతో బాధపడేవారికి అమర్చినందుకు తీసుకునే డబ్బు విపరీ తంగా ఉంటుంది. వాటి అసలు ధరకు, వారు వసూలు చేసే సొమ్ముకు సంబంధమే ఉండదు. ప్రయివేటు ఆస్పత్రులకు ఇఎస్ఐసి పంపే రోగుల చికిత్సకు వాడే పరికరాలకు గాను చెల్లింపుల గందరగోళం గురించి ఒక ఆర్టీఐ దరఖాస్తు దాఖ లైంది. రెండో అప్పీలు రూపంలో ఆ సమస్య కేంద్ర సమాచార కమిషన్‌కు చేరింది. ఎవరైనా సరే చికిత్సకు వాడే వస్తువులకు ఇష్టం వచ్చినట్టు ధర విధించడానికి వీల్లేదని, ఇఎస్ఐసి వారు కేవలం సీజీహెచ్ఎస్ వారు నిర్ధారించిన ధరల ప్రకారమే రేట్లు వసూలు చేస్తారని సమాధానం ఇచ్చారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి రేట్లప్రకారం కూడా చెల్లింపులు ఉంటాయి. ఇఎస్ఐ కూడా ధరలను నిర్ధారించింది. గుండె రోగులకు కార్డో వాస్క్యులార్ డెప్రిబిలేటర్ సింగిల్ చాంబర్, డబుల్ చాంబర్, సీఆర్‌టీపీ వస్తువులను, పేసర్లను అమర్చుతూ ఉంటారు. అయితే ఇఎస్ఐ తాము పంపిన రోగులకు ఎంత ధర వసూలు చేస్తున్నారనే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రయివేటు ఆస్పత్రుల వారు అడిగినంత డబ్బు ఇచ్చి, రేట్ల తేడాలు పట్టించుకోకుండా ఉండేందుకు ప్రతిఫలాలు అందుకుంటున్నారని దరఖాస్తుదారు పవన్ సారస్వత్ ఫిర్యాదు చేశారు. గుండె సింగిల్ చాంబర్‌కు వాడే ఐసీడీకి ఎయిమ్స్ వారు లక్షా 75 వేల 786 రూపాయలు ధర నిర్ణయిస్తే ఇఎస్ఐ పంపిన రోగులకోసం ప్రయివేటు వైద్యశాలలు 5 లక్షల 50 వేల నుంచి 8 లక్షల 50 వేల దాకా అడుగుతున్నారని, ఇఎస్ఐసి చెల్లిస్తున్నదని వివరించారు. కార్మికులు. చిన్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు, బీమా సొమ్మును ఆస్పత్రులు ఈ విధంగా దోచుకుంటున్నాయని ఫిర్యాదు చేశారు. అసలు ఈ విధంగా స్టెంట్లు వేయడం, ఖరీదైన చికిత్సలు చేయడం కూడా చాలా సందర్భాలలో అవసరం లేదని నిపుణులైన డాక్టర్ల మాట. అవసరం లేని కేసుల్లో కూడా సర్జరీలు చేస్తున్నారని, వారు సూచిం చిన చికిత్స వెంటనే చేయకపోతే ప్రాణాలుపోతాయని, అందుకు తాము బాధ్యులం కామని ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్లు భయపెడితే ఏమీ తోచక భయపడి రోగులు స్టెంట్లు వేయించుకోవడానికి ఒప్పుకోక తప్పడం లేదని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ దేవిశెట్టి (నారాయణ హృదయాలయ) అన్నారు. సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ మనోజ్ అగర్వాల్ ఔషధ వైద్యంద్వారా గుండె జబ్బును నివారించే అవకాశం ఉంటే స్టెంట్ వాడకూడదని అన్నారు. అవసరం లేకపోయినా స్టెంట్ వాడితే అది చాలా తీవ్రమైన అనైతిక చర్య అని వైద్య వృత్తికి ఉన్న గౌరవాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని విమర్శించారు. అసలు ఇఎస్ఐ వారు ఎందుకు వేలాది మంది రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపించేస్తున్నారనేది ప్రశ్న. రెండున్నర రెట్లకన్న ఎక్కువ ధరను స్టెంట్లకు చెల్లించాల్సి వస్తోందని వారికీ తెలుసు. ఇఎస్ఐ సంస్థ వారు కేంద్ర ప్రభుత్వానికి గానీ, ఆరోగ్య శాఖ వారికి గానీ ఈ సంగతులు వివరించి, ఈ దారుణమైన దోపిడీని ఆపడానికి కనీసం ప్రయత్నించకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. అందుకు కారణం ప్రయివేటు ఆస్పత్రులనుంచి వీరికి క్రమం తప్పకుండా ఒక్కో స్టెంట్‌కు కొంత కమీషన్ చొప్పున సొమ్ము అందుతున్నదని, రోగులను తమకు రిఫర్ చేసినందుకు ఇఎస్ఐసి వారికి తగిన ప్రతిఫలం ముట్టచెబుతారని అన్నారు. వీరి లంచం డబ్బులు కూడా కలుపుకుని, దానికిపైన కూడా తమ లాభాన్ని తగిలించి, రోగులనుంచి, బీమా కంపెనీలనుంచి ఎక్కువ డబ్బు వసూలు చేయడానికి ఆస్పత్రులు వెనుకాడడం లేదని ఆయన వివరించారు. చర్యతీసుకునే వారెవరు? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
‘బైపాస్’ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మా పెద్దమ్మకు బైపాస్ సర్జరీ అయ్యింది. ఆమె విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – అమరనాథరెడ్డి, కర్నూలు బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్లు మొదటి ఆరు వారాల్లో ఈ కింద సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలి.∙శస్త్రచికిత్స కోసం శరీరంపై గాటు పెట్టిన చోట ఎలాంటి ఒత్తిడీ పడకుండా చూసుకోండి ∙డాక్టర్లు సూచించిన మందులు క్రమం తప్పకుండా తీసుకోండి ∙కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచుకోండి. అందుకోసం డాక్టర్లు సూచించిన ఆహార, వ్యాయామ నియమాలను తప్పక పాటించండి ∙రక్తపోటును అదుపులో ఉంచుకోండి. ఇందుకోసం డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే... రిలాక్సేషన్ ప్రక్రియలైన ధ్యానం, యోగా వంటివి చేయండి ∙రక్తంలో చక్కెర పాళ్లను తెలుసుకునే పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ, మీ డాక్టర్‌కు తెలియజేస్తూ ఉండండి. అందులో వచ్చిన మార్పులను బట్టి వైద్యులు మీ మందులను మార్చడం వంటివి చేస్తారు ∙సిగరెట్ పొగకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్స్పోజ్ కావద్దు. అది రక్తనాళాల మృదుత్వాన్ని దెబ్బతీయడంతో పాటు అవి రక్తనాళాలు సన్నబారేలా చేస్తుంది; గుండె వేగాన్ని పెంచుతుంది. కాబట్టి పొగాకు ఏరూపంలోనైనా మంచిది కాదు ∙మద్యంకూడా గుండెకు హానిచేసేదే ∙ఒత్తిడికి గురికావడం రక్తపోటును పెంచి, గుండెపోటుకు దారితీసేలా చేసే అంశం. కాబట్టి ఒత్తిడి లేకుండా చూసుకోండి ∙ఒకే చోట కూర్చొని ఉండకండి. చురుగ్గా ఉండే జీవనశైలి మార్పుతోనూ గుండెజబ్బును నివారించుకోండి ∙డాక్టర్లు సూచించిన ఆరోగ్యకరమైన వ్యాయామాలను రోజుకు రెండుసార్లు... పదినిమిషాల పాటు చేయాలి ∙ఏమాత్రం భారం పడకుండా పది పదిహేను నిమిషాల పాటు రోజుకు రెండుసార్లు నడక (వాకింగ్)కు ఉపక్రమించాలి ∙అకస్మాత్తుగా ముందుకు, వెనక్కు, పక్కలకు ఒంగడం వంటివి చేయకూడదు ∙మూడు కిలోలకు మించిన బరువు కనీసం నెలరోజుల పాటు ఎత్తవద్దు ∙నేల మీద కూర్చోవడం, కాలుమీద కాలేసుకోవడం వంటివి చేయకండి. అరిథ్మియా అంటే ఏమిటి? నా వయసు 35 ఏళ్లు. రెండు వారాల క్రితం అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాను. స్పృహవచ్చాక చాలా నీరసంగా అనిపించింది. కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం, ఆయాసంగా ఉండటం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించాయి. డాక్టర్‌ను కలిస్తే ఎరిథ్మియా ఉండవచ్చు అని అన్నారు. అసలు అరిథ్మియా అంటే ఏమిటి? నాకు చాలా ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. – సుబ్బారావు, పెందుర్తి సాధారణంగా మన గుండె మామూలుగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్‌ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. దీన్ని సైనస్ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు. ఈ లక్షణంతో మరికొన్ని రకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు కూడా స్పృహ కోల్పోయినట్లు చెప్పారు కాబట్టి వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్‌ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్ పరీక్షల్లాంటివి చేయించండి. మీరు స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఆధునిక వైద్య విజ్ఞానం వల్ల అన్ని రకాల జబ్బులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియో థొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
గుండె రక్తనాళాల పూడికలో బైపాస్ సర్జరీకి చెక్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): క్లిష్టమైన గుండె రక్తనాళాల్లో పూడికలకు బైపాస్ లేకుండా కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్ అమర్చే విధానంపై సోమవారం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో వర్క్‌షాపు నిర్వహించారు. జర్మనీకి చెందిన ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మీరోస్లేవ్ ఫెరెస్క్ పాల్గొన్నారు. ఒకసారి బైపాస్ సర్జరీ, స్టెంట్లు అమర్చిన వారికి కాల్షియం కారణంగా మళ్లీ పూడికలు ఏర్పడగా, వాటిని రోటబ్రేటర్ ద్వారా ఆప్టికల్ కోబెరాన్స్ టోమోగ్రఫీ అనే నూతన పరిజ్ఞానంతో తొమ్మిది మందికి స్టెంట్లు విజయవంతంగా అమర్చారు. అనంతరం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జె.శ్రీమన్నారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఈ విధానం గుండె జబ్బుల వైద్యంలో విప్లవాత్మక మార్పుగా పేర్కొన్నారు. మచిలీపట్నంకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడికి ఎడమ మెయిన్ 90 శాతం బ్లాక్ అయిందన్నారు. ఆ వయస్సులో బైపాస్ సర్జరీ చేయడానికి ఆరోగ్యం సహకరించదని, ఈ వర్క్‌షాపులో అతనికి యాంజియో ప్లాస్టీ ద్వారా పూడికలు తొలగించి స్టెంట్ అమర్చినట్లు తెలిపారు. ఈ వర్క్‌షాపులో విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు పలుప్రాంతాల నుంచి 20 మంది కార్డియాలజిస్టులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ దిలీప్, డాక్టర్ తులసీరామ్ పాల్గొన్నారు. -
స్ట్రోక్ వస్తే.. ఆస్పత్రికి వెళ్లేలోపు ఏం చేయాలి?
కార్డియాలజీ కౌన్సెలింగ్ మా ఊరు సిటీకి కొంచెం దూరంలో ఉంటుంది. నాకు తరచూ ఛాతీనొప్పి వస్తుంటుంది. అది గుండెపోటేమోనని అనుకుంటుంటాను. అలా గుండెపోటు వచ్చి... ఆసుపత్రికి వెళ్లేలోపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించండి. – రామాచారి, చిట్యాల రోగికి గుండెనొప్పిగా అనిపిస్తోందని తెలిసిన వెంటనే అతడిచేత ఒక గ్లాసు నీరు తాగించాలి. కొన్నిసార్లు వెంటనే ఈసీజీ తీసే సమయం కూడా ఉండకపోవచ్చు. పరిస్థితి కాస్త తీవ్రంగా ఉందనిపిస్తే వెంటనే డిస్ప్రిన్–300 మి.గ్రా. మాత్రను నీటిలో కలిపి తాగించాలి. కూర్చోబెట్టిగానీ, పడుకోబెట్టి కూడా తల కాస్తంత పైకి లేపిగానీ డిస్ప్రిన్–300 మి.గ్రా. కలిపిన ద్రావణాన్ని తాగించవచ్చు. ఆ తర్వాత సార్బిట్రేట్ మాత్ర వేయాలి. దీంతో వెంటనే నొప్పి తగ్గిపోతుంది. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా (శరీరానికి ఏమాత్రం శ్రమ కలిగించకుండా) ఏదో ఒక వాహనం మీద రోగిని ఆసుపత్రికి తరలించాలి. రోగి తనంతట తాను తీసుకునే డిస్ప్రిన్ మాత్ర... డాక్టర్లు ఇచ్చే స్ట్రెప్టోకైనేజ్ ఇంజెక్షతో సమానంగా పనిస్తుంది. అందుకే గుండెనొప్పి వచ్చినవారికి సార్బిట్రేట్ కన్నా డిస్ప్రిన్ చాలా ముఖ్యం. ఆ మాత్రను నీళ్లలో కలిపి తాగించడం వల్ల... వెంటనే ఒంట్లో అది కలిసిపోతుంది. ఇక డిస్ప్రిన్, సార్బిట్రేట్... ఈ రెండూ ఇవ్వడం వల్ల రోగికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. ఈ రెండు టాబ్లెట్లను అందరూ ఇంట్లో ఉంచుకోవడం మంచిది. ఈ ట్యాబ్లెట్లు వేసుకునేలోపు రోగి దగ్గుతూ ఉండటం మరింత మేలు చేస్తుంది. గుండెపోటు వచ్చినప్పుడు తొలి గంట చాలా అమూల్యమైనది. కాబట్టి గుండెనొప్పి వచ్చిన రోగిని, నొప్పి వచ్చిన గంటలోపే హాస్పిటల్‌కు చేర్చడం చాలా ముఖ్యం. కొందరు దడ వచ్చిన వెంటనే కళ్లు తిరిగి పడిపోతారు. గుండెవేగం బాగా తగ్గిపోవడం వల్ల ఇలా పడిపోతారు. దీన్ని ‘సింకోప్ అటాక్’ అంటారు. ఇది గుండెజబ్బుకు సూచన. గుండెదడతో పడిపోయిన వారు మాత్రం రెండు నిమిషాల్లోనే మళ్లీ తేరుకుని, లేచి నడవగలరు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా వీళ్లకు ఒకసారి ఈసీజీ తీసి, అవసరమైన చికిత్స అందించడం మేలు. సీఏబీజీ అంటే మరేమిటో కాదు... బైపాస్ సర్జరీయే...! నా వయసు 63. ఒక రోజు ఛాతీనొప్పి తీవ్రంగా వచ్చింది. డాక్టర్లు సీఏబీజీ సర్జరీ చేయాలని అని చెప్పారు. సీఏబీజీ అంటే ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – ప్రసూన, గుంటూరు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తసరఫరా అవరోధం కలగకుండా, సీఏబీజీ అనే సర్జరీ చేసి, రక్తాన్ని ఇతర మార్గాల్లో (బైపాస్ చేసిన మార్గంలో) గుండెకండరానికి అందేలా చేసే ఆపరేషనే సీఏబీజీ. మనం ఇంగ్లిష్‌లో సాధారణంగా బైపాస్ సర్జరీ అని పిలిచే దీన్ని వైద్యపరిభాషలో కరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్ మార్గంలో అందించేలా అమర్చుతారు. సాధారణంగా ఒక బ్లాక్ (అడ్డంకి)ని బైపాస్ చేయాలంటే ఒక రక్తనాళం అవసరం. గుండె వద్ద ఉన్న రక్తనాళాన్ని నేరుగా బైపాస్ చేసే ప్రక్రియను రీ–వాస్క్యులరైజేషన్ అంటారు. ఛాతీకీ కుడి, ఎడమ వైపున ఉన్న రక్తనాళాలను ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ అంటారు. గుండెకు ఎడమవైపున ఉన్న నాళాన్ని లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అర్టరీ అని అంటారు. ఈ రక్తనాళాన్ని బ్లాక్ అయిన నాళాల వద్ద బైపాస్ మార్గంలా కలుపుతారు. దీర్ఘకాల ప్రయోజనాలతో పాటు రోగి త్వరగా కోలుకుంటున్నందున ఇప్పుడు బైపాస్‌లోనూ సరికొత్త విధానాన్ని పాటిస్తున్నారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్ సర్జరీ చేస్తారు. అంతే తప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని పేషెంట్ అపోహ పడకూడదు. అందుకే రోగి మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవే... రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి. డాక్టర్ అనూజ్ కపాడియా, కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ మాంసాహారం మానేయాల్సిందేనా? నా వయసు 48 ఏళ్లు. నేను మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. కొవ్వులతో కూడిన ఆహారం ఇంత ఎక్కువగా తీసుకోకూడదనీ, దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుందనీ, అది ఈ వయసులో గుండె జబ్బులకు దారితీస్తుందని ఫ్రెండ్స్ అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. – ఫయాజ్, నిజామాబాద్ కొలెస్ట్రాల్ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలు చేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్)అంటారు. ఇవి గుడ్డు తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్డీఎల్ (లోడెన్సిటీ లైపో ప్రొటీన్స్) అంటారు. చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్ ఫాక్టర్. చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్డీఎల్ 100 లోపు, హెచ్‌డీఎల్ 40 పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే మరో రకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్ల పాటు ఎదగడానికి ఈ కొలెస్ట్రాల్ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు ఈ రెండు రకాల కొలెస్ట్రాల్స్) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో ఈ కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి... డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే ఆపకూడదు. మీరు మాంసాహారం పూర్తిగా మానేయలేకపోతే... కొవ్వులు తక్కువగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్‌మీట్ తీసుకోండి. వీటిలోనూ చికెన్ కంటే చేపలు చాలా మంచిది. కాబట్టి మాంసాహారం తీసుకోవాలనిపిస్తే చేపలు తినడం మేలు. అది కూడా ఉడికించినవే. వేపుడు వద్దు. -
గాయకులు ఆనంద్‌కు బైపాస్ సర్జరీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రముఖ సినీ నేపథ్యగాయకులు, సంగీత దర్శకులు జీ ఆనంద్ ఈనెల 8వ తేదీన బైపాస్ సర్జరీ చేసుకుని బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. స్వల్ప అస్వస్థకు గురైన ఆనంద్‌కు ఈ నెల 4వ తేదీన వైద్యపరీక్షలు నిర్వహించగా గుండెకవాటంలో మూడు బ్లాకులు ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉంది, వెంటనే బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించా రు. సమాచారం అందిన వెంటనే అమెరికాలో ఉంటున్న ఆయన కుమారులు అరవింద్ గాదెళ్ల, అరుణ్ గాదెళ్ల హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. 8వ తేదీన చెన్నై ఫోర్టిస్ మలర్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. ‘నాకిది పునర్జన్మ’: ఆనంద్ ఆరోగ్యంగా తిరుగుతున్న నేను అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురికావడం కలచివేసింది. నిత్యం నన్ను సంప్రదించే సన్నిహితులకు మాత్రమే సమాచారం ఇవ్వగలిగాను. వాస్తవానికి నాకిది పునర్జన్మ. ఫోన్లో క్షేమసమాచారాలు తెలుసుకుంటున్నవారితో మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. నా కోసం ప్రార్థనలు చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆనంద్‌ను ఎస్పీబీ పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
అతి చిన్న కోతతో అత్యాధునిక బైపాస్!
కార్డియాలజీ కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 45 ఏళ్లు. ఆమెకు ఈమధ్య ఆయాసంగా, ఛాతీ బిగబట్టినట్లుగా ఉంటే డాక్టర్‌కు చూపించాం. గుండె ధమనుల్లో బ్లాక్‌లు ఏర్పడ్డాయని, వాటిని తొలగించేందుకు బైపాస్ సర్జరీ చేయాలన్నారు. బైపాస్ అంటే కాలికి పెద్ద కోత కోస్తారనీ, అలాగే ఛాతీ మధ్యలో పెద్ద గాటు పెట్టి ఆపరేషన్ చేస్తారని తెలుసు. అయితే ఇలా ఆపరేషన్ చేసిన వారి చర్మం ఉబ్బి చాలా అందవికారంగా అసహ్యంగా కనిపిస్తుంటుంది. ప్రత్యేకించి ఆడవాళ్లకు... వాళ్ల వైవాహిక, సామాజిక జీవితానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి కదా! దాంతో మాకు అమ్మ ఆపరేషన్ అంటేనే ఆందోళనగా ఉంది. మా అమ్మగారికి సరైన ప్రత్యామ్నాయ చికిత్స ఏదైనా ఉందా? - అమృత, వైజాగ్ కరోనరీ ధమనులు మూసుకుపోయి, గుండె కండరాలకు రక్తసరఫరా జరగనప్పుడు వైద్యులు కొత్త దారి ఏర్పరచి గుండెకు రక్తప్రసరణ సాఫీగా అయ్యేలా చేస్తారు. అందుకు ఉపకరించే ముఖ్యమైన శస్త్రచికిత్స ప్రక్రియ ‘బైపాస్ సర్జరీ’. ఈ ధమనులు గుండె కండరానికి ప్రాణవాయువు లాంటివి. రక్తంలో కొవ్వు, కొలెస్ట్రాల్, ఖనిజాల వంటివి ధమనుల గోడలపై పూడికలాగా ఏర్పడితే రక్తప్రసరణ మందగిస్తుంది. హృదయ ధమనుల్లోకి అవసరమైనంత రక్తప్రసరణ జరిగేందుకు శరీరంలోని ఇతర భాగాల నుంచి తీసిన ధమనులు, సిరలను గుండెలో అమర్చే ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సను ‘కరోనరీ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ’ అంటారు. ఈ శస్త్రచికిత్సలో వాడే సిరలు, ధమనుల వ్యాకోచించగలిగే గుణం ఉన్నందున వాటిని తీసిన ప్రదేశంలో రక్తప్రసరణకు ఏ విధమైన అవరోధమూ కలగదు. దీనికి కాలిపై చర్మం దిగువన ఉండే సిరను ప్రత్యేకంగా వాడతారు. ఈ సంప్రదాయ చికిత్సలో మీరన్నట్లు కోత ఎక్కువగానే ఉంటుంది. కానీ మీ అమ్మగారికి లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చిన మినిమల్లీ ఇన్వేజివ్ డెరైక్ట్ కరొనరీ బైపాస్ (ఎంఐడీసీఏబీ-మిడ్‌కాబ్) విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం ఛాతీ కోయాల్సిన అవసరం లేదు. ఈ విధానంలో 5 - 6 సెంటీమీటర్ల కోతతో బైపాస్ సర్జరీ నిర్వహిస్తారు. కాబట్టి అందవికారంగా ఉండదు. బైపాస్ సర్జరీలో ఇది ఎంతో సురక్షితమైన శస్త్ర చికిత్స. ఇక ఎండోస్కోపిక్ వెయిన్ హార్వెస్ట్ విధానంలో చిన్నకోతతోనే కాలి నుంచి సిరలను కూడా తొలగించడం వల్ల కాలిపై ఎలాంటి నిలువు గాటూ ఏర్పడదు. మీరు కంగారు పడకుండా నిరభ్యంతరంగా మీ అమ్మగారికి బైపాస్ సర్జరీ చేయించండి. చిన్నకోతతోనే పూర్తి ఫలితాన్ని పొందవచ్చు. డాక్టర్ సుఖేష్ కుమార్ రెడ్డి సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ యశోద హాస్పిల్స్ సోమాజిగూడ హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. నాకు తరచూ మూత్ర విసర్జన సమయంలో మంట వస్తోంది. మాటిమాటికీ జ్వరం కూడా వస్తోంది. మందులు వాడుతున్నప్పుడు తగ్గుతోంది కానీ మందులు మానేయగానే మళ్లీ అదే పరిస్థితి. దయచేసి నాకు పరిష్కారం చెప్పండి. - వెంకట రమణ, అమలాపురం మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నారు. ఇలా మళ్లీ మళ్లీ మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలను ముందుగా తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉన్నట్లయితే దానివల్ల ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అందుకే ముందుగా ఒకసారి షుగర్ పరీక్షలు చేయించండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించి మూత్ర విసర్జక వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయా అని కూడా చూడాలి. ఇక యాంటీబయాటిక్ కోర్సు పూర్తిగా వాడకపోయినా ఇన్ఫెక్షన్ పదేపదే తిరగబెట్టవచ్చు. మీరు మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. రోజుకు కనీసం రెండు, మూడు లీటర్ల నీళ్లు తాగండి. మూత్రవిసర్జన ఫీలింగ్ కలగగానే ఎక్కువసేపు వేచిచూడకుండా వెంటనే విసర్జనకు వెళ్లండి. నా వయసు 62 ఏళ్లు. నేను విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. వీటి కోసం ఎక్కువగా నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల మూత్రపిండాలు (కిడ్నీలు) దెబ్బతినే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. - అబ్దుల్ నబీ, నల్గొండ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినట్లయితే మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందుల కాంబినేషన్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాలకు చాలా హాని చేస్తాయి. అందుకే మీలా మోకాళ్ల నొప్పులు, ఇతర జాయింట్ పెయిన్స్ ఉన్న వారు నొప్పినివారణ మందులు వాడకుండా, ఫిజియోథెరపీ లాంటి ఇతర ప్రక్రియలతో నొప్పి తగ్గించుకోవాలి. ఫిజియోథెరపిస్టులు సూచించిన మేరకు వ్యాయామాలు చేయాలి. ప్రతిరోజూ మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. ఇటీవల వాతావరణంలో వేడిమి పెరగగానే నాకు ప్రైవేట్ పార్ట్స్‌లో చెమటలు పట్టడం ఎక్కువైంది. దాంతో నా ప్రైవేటు పార్ట్స్‌లో శరీరం మడత పడే ప్రాంతాల్లో చర్మం నలుపురంగులోకి మారుతోంది. చెమటలు పట్టినప్పుడు వాటిలో చాలా దురద ఉంటుంది. నాకు తగిన పరిష్కారం చూపండి. - కె. వెంకట్‌రెడ్డి, ఒంగోలు మీరు చెబుతున్న అంశాలను బట్టి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య మాటిమాటికీ తిరగబెడుతున్నట్లు అనిపిస్తోంది. మీరు ఇట్రకొనజోల్-100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినఫిన్ ఉన్న క్రీమును 2-3 వారాల పాటు రాయాలి. దీంతోపాటు ప్రతిరోజూ మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. నాకు ఎడమ చేతి మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా అనిపిస్తుంటే విపరీతంగా గీరాను. దాంతో అక్కడ డార్క్ మార్క్స ఏర్పడ్డాయి. నా చర్మం మీద అవి అసహ్యంగా కనిపిస్తున్నాయి. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - కోమల, సూళ్లూరుపేట మీరన్నట్లు తీవ్రంగా గోకడం వల్ల మీకు ఈ పరిస్థితి వచ్చింది. మీరు ‘పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్’తో బాధపడుతున్నారని తెలుస్తోంది. అలర్జీని అదుపులో ఉంచుకునే మందులు వాడుతూ మీరు ఈ కింది సూచనలనూ పాటించండి.సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిశ్చరైజర్‌ను డార్క్ మార్క్స్ ఉన్నచోట అప్లై చేయండి. ఆ ప్రాంతంలో ఎస్పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రాయండి. కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లెటైనింగ్ క్రీములు రాయండి. ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజాపండ్లు ప్రతిరోజూ తీసుకోండి. ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు తీసుకోవడం కోసం మీరు మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డెర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్ -
‘బైపాస్’ లేకుండానే గుండెకు చికిత్స
దేశంలో ఇదే తొలిసారి: అపోలో వైద్యులు హైదరాబాద్: హైదర్‌గూడ అపోలో ఆస్పత్రి వైద్యులు అరుదైన చికిత్స చేశారు. బైపాస్ సర్జరీతో పనిలేకుండా క్రాస్‌బాస్, స్ట్రింగ్రే వైద్య పరికరంతో పూర్తిగా మూసుకుపోయిన రక్తనాళాన్ని విజయవంతంగా పునరుద్ధరించారు. ఈ తరహా చికిత్స చేయడం దేశంలో ఇదే మొదటిసారని వైద్యులు చెప్పారు. బుధవారం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యుల బృందం ఈ వివరాలను వెల్లడించింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నలభయ్యేళ్ల వ్యక్తి కొంత కాలంగా తీవ్ర హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. స్థానికంగా పలువురు వైద్యులను సంప్రదించగా క్రానిక్ టోటల్ ఆక్లూజన్ (గుండె ప్రధాన రక్తనాళం వంద శాతం మూసుకుపోవడం)తో బాధపడుతున్నట్లు గుర్తించా రు. బైపాస్ ఒక్కటే దీనికి పరిష్కారమని తేల్చారు. దీంతో ఆయన ఇటీవల హైదర్‌గూడ అపోలో ఆస్పత్రి కార్డియాలజిస్ట్‌లను సంప్రదించారు. డాక్టర్ వి.సూర్యప్రకాశరావు, డాక్టర్ కపర్దిలతో కూడిన వైద్య బృందం రోగి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించింది. బైపాస్ సర్జరీ కంటే ఇటీవలే అమెరికాలో అందుబాటులోకి వచ్చిన సీటీఓ-పీటీఐ పద్ధతి ఉత్తమమని భావించారు. ఛాతిపై ఎలాంటి కోతా లేకుండానే క్రాస్‌బాస్, స్ట్రింగ్రే వైద్య పరికరాలతో డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్‌ను ధమనిలోకి పంపి, మూసుకుపోయిన రక్త నాళాన్ని విజయవంతంగా పునరుద్ధరించారు. ఇందుకు రెండు గంటలు పట్టినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స చేసిన 48 గంటల్లోనే రోగిని డిశ్చార్జ్ చేశామన్నారు. -
ఇక బైపాస్ సర్జరీకి బై బై!
గుండె రంధ్రాలకు మాసికతో అతుకు: పరిశోధనలో శాస్త్రవేత్తల విజయం ♦ ప్రత్యేక కాథెటర్ ద్వారా ఐదు నిమిషాల్లో చికిత్స పూర్తి ♦ ఓపెన్ హార్ట్ సర్జరీ, గుండెకు కుట్లు అవసరమే లేదు వాషింగ్టన్: గుండెలో రంధ్రాలను నయం చేయటానికి గుండెను తెరిచి శస్త్రచికిత్స (బైపాస్ సర్జరీ) చేసే అవసరం లేకుండా.. అతుకువేయటం ద్వారా వాటిని మూసివేసే ప్రత్యేక కాథెటర్ (నాళిక)ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, హార్వర్డ్ యూనివర్సిటీలోని విస్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయొలాజికల్లీ ఇన్స్పైర్డ్ ఇంజనీరింగ్, బ్రిఘామ్లోని కార్ప్ ల్యాబ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ సంస్థలకు చెందిన పరిశోధకులు.. జంతువులపై పరిశోధనల్లో గుండె రంధ్రాలను అతుకు ద్వారా మూసివేయటానికి ఈ కాథెటర్‌ను విజయవంతంగా వినియోగించారు. బైపాస్ సర్జరీ అవసరం లేకుండా గుండె రంధ్రాలకు ఈ అతుకు వేయటం కోసం అల్ట్రా వయొలెట్ వెలుగు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. మెడ లేదా, తొడ లోని ఏదైనా నరం ద్వా రా.. గుండెలో రంధ్రం ఉన్న ప్రాంతాని కి ఈ కాథెటర్ సాయంతో మాసికను పంపిస్తారు. సరిగ్గా రంధ్రం ఉన్న ప్రాంతానికి మాసిక చేరుకోగానే.. కాథెటర్‌కు ఇరువైపులా ఉన్న బుడగలు విచ్చుకునేలా చేస్తా రు. ఒక బుడగ గుండెరంధ్రం లోపలి వైపు కు, మరొక బుడగ గుండె గోడ వెలుపలి వైపుకు విచ్చుకుని మాసిక కదలకుండా ఉం డేలా చేస్తుంది. అప్పుడు కేథటర్లో యూవీ వెలుతురును వెలిగిస్తారు. ఈ వెలుతురు దాని బుడగల్లో ప్రతిఫలించి మాసికపై ఉన్న జిగురు పొరను క్రియాశీలం చేస్తుంది. ఈ జిగురు వల్ల మాసిక అక్కడ అతుక్కుంటూ ఉండగా.. కేథటర్కు ఉన్న బుడగల ఒత్తిడితో అది రంధ్రాన్ని మూసివేస్తూ సరైన స్థానంలో నిలిచిపోతుంది. ఆ తర్వాత రెండు బుడగలనూ ఆర్పివేసి.. కేథటర్‌ను వెనక్కు తీసివేస్తారు. కాలం గడిచేకొద్దీ.. ఈ మాసిక చుట్టూ, దానిపైనా మామూలు గుండె కణజాలం పెరిగి రంధ్రం దానికదే మూసుకుపోతుంది. మాసిక ఇక తన అవసరం లేదన్నపుడు గుండె కణజాలంలోనే కరిగిపోతుంది. ఈ విధానం వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకపోగా గుండెకు కుట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదని పరిశోధకులు పేర్కొన్నారు. -
రచయిత, దర్శకుడు పూసల ఇక లేరు
ప్రముఖ రచయిత, దర్శకుడు పూసల (74) కన్ను మూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇటీవల ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. అది విజయవంతమైనప్పటికీ కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా ఆదివారం ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచారు. రచయితగా పూసలకు మంచి గుర్తింపు ఉంది. 64 కథలు రాశారాయన. వాటిలో ఆయన నటించిన ‘మండువ లోగిలి’ నాటకానికి బళ్ళారి రాఘవ అవార్డు వరించింది. అలాగే, ఏకపాత్రతో పూసల దర్శకత్వం వహించిన ‘అలెగ్జాండర్’ నాటకానికి ప్రశంసలు లభించాయి. అందులో జయప్రకాశ్‌రెడ్డి నటించారు. ప్రస్తుత సమాజానికి దర్పణం పడుతూ తాజాగా ఆయన ‘డాలర్‌కి మరో వైపు’ ఆనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోపు ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. పూసలకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నేడు (సోమవారం) ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఇప్పుడు హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లోనే...
రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా బైపాస్ సర్జరీ అంటే మన దగ్గర ఓ అబ్బురం. ఆర్థికంగా ఉన్నవారు, పలుకుబడిగల వారు అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకుని వచ్చేవారు. కారణం... అప్పట్లో బైపాస్ సర్జరీ చేసే డాక్టర్లు అమెరికాలోనే ఉండేవారు. కానీ ఇప్పుడా చికిత్స ఇక్కడి ఓ మోస్తరు ఆసుపత్రుల్లో సైతం రోజూ జరిగే ప్రక్రియ. అలాగే ఇప్పుడు కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు జరిగే ఉన్నతస్థాయి శస్త్రచికిత్సలు అమెరికాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. మనదేశంలోని అత్యంత పెద్దస్థాయి వైద్యకేంద్రాల్లోనూ కేవలం ప్రస్తావనాపూర్వకంగా ఉన్న ఈ విభాగంలో ప్రత్యేక శిక్షణను అమెరికాలోని అత్యంత ఉన్నతస్థాయి సంస్థల్లో పొంది వచ్చిన డాక్టర్ సాయి యండమూరి... ఇప్పుడు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో ఈ విభాగంలో ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు చేసే అత్యంత నైపుణ్యమైన శస్త్రచికిత్స గురించి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... ప్ర: మన దేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాప్తి, విస్తృతి గురించి చెప్పండి డా. సాయి యండమూరి: మన దేశంలో... పురుషుల్లో వచ్చే క్యాన్సర్లలో అది గణనీయమైన స్థానంలోనే ఉంది. పాశ్చాత్యదేశాల్లోలాగా అది తగ్గుముఖం పట్టాలంటే మరో పాతికేళ్లు పడుతుంది. అప్పటివరకూ ఇక్కడ ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవించే మరణాలను అరికట్టాలి కదా. అందుకు ఆ స్థాయి చికిత్స అవసరం. ప్ర: మరి అలా అరికట్టడం సాధ్యమేనా? డా. సాయి: ఇది జబ్బు ఏ దశలో ఉందనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మొదటి దశలో గుర్తిస్తే 70% నుంచి 75% ప్రాణహాని పూర్తిగా తగ్గుతుంది. అదే రెండోదశలో గుర్తిస్తే 50 శాతం, మూడోదశలో గుర్తిస్తే కేవలం 20% నుంచి 25శాతం మాత్రమే కాపాడగలం. నాలుగోదశలోకి ప్రవేశిస్తే నయం కావడం చాలా కష్టం. ఇంతగా నయం చేయగలగడానికి అవకాశం ఉన్న ఈ క్యాన్సర్‌కు స్క్రీనింగ్ చాలా సులభం. కేవలం ఒక్క సీటీ స్కాన్‌తోనే దీన్ని గుర్తుపట్టవచ్చు. ప్ర: మీరు చేసే చికిత్స తీరుతెన్నులు...? డా. సాయి: నేను అమెరికాలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, అత్యున్నత స్థాయి సంస్థల్లో పనిచేశా. అక్కడ సూపర్‌స్పెషాలిటీలో శిక్షణ తర్వాత మళ్లీ అందులోనే మరింత నైపుణ్యం సాధించడానికి సబ్-స్పెషాలిటీని ఎంచుకోవాలి. అప్పుడు నేను కార్డియోథొరాసిక్ విభాగాన్ని గాక... కేవలం థొరాసిక్ సర్జరీని ఎంచుకున్నా. కార్డియోథొరాసిక్లో శిక్షణ పొందినవారు గుండె, ఛాతీ భాగంలోని ఊపిరితిత్తులు ఈ రెండింటినీ అధ్యయనం చేస్తారు. అయితే నేను గుండెను మినహాయించి... అంతే శిక్షణను కేవలం ఊపిరితిత్తుల భాగానికే కేటాయించి, నైపుణ్యం పొందగలిగాను. అంత సబ్-స్పెషాలిటీ స్థాయి శిక్షణ పొందినవారు అమెరికాలోనే కాస్త తక్కువ. మా శిక్షణ ఎంత నిశితంగా ఉంటుందంటే... ఇప్పుడు కేవలం నాలుగు సెం.మీ. గాటుతో ఊపిరితిత్తుల్లో దాదాపు సగభాగానికి సమర్థమైన శస్త్రచికిత్స చేయడం సాధ్యం. ఇక ఈ నాలుగు సెం.మీ. గాటుతో పాటు మరో రెండు చోట్ల ఒక సెం.మీ., ఒక సెం.మీ. పరిమాణం గల రెండు గాట్లతో పూర్తి ఊపిరితిత్తులకు శస్త్రచికిత్స చేయగల సామర్థ్యాన్ని మా టీమ్ సాధించింది. ఎండోబ్యాగ్ అనే చిన్న సంచిలో ఊపిరితిత్తులను ఉంచి ఈ చిన్నపాటి రంధ్రాల నుంచే వాటిని బయటకు తీసి, క్యాన్సర్ కణుతులను, గడ్డలను పూర్తిగా తొలగించవచ్చు. పైగా మేం శిక్షణ పొందిన తరహా శస్త్రచికిత్సలో గాటు చాలా తక్కువ కావడంతో అది తగ్గడానికీ పట్టే సమయం తక్కువ. ఇన్ఫెక్షన్లు తక్కువ. నిమోనియా వంటి కాంప్లికేషన్లూ తక్కువ. కేవలం రెండు వారాల్లోనే నయమవుతుంది. ఆసుపత్రిలో ఉండే సమయం కూడా తగ్గుతుంది. పైగా శస్త్రచికిత్స చేసిన చోట నొప్పి ఉండదు. ప్ర: ఇంత శిక్షణ పొంది, ఆ స్థాయిలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్న మీరు ఇక్కడికి రావడానికి కారణం? డా. సాయి: రెండు మూడు దశాబ్దాల క్రితం బైపాస్‌ను ఎంత సంక్లిష్టంగా పరిగణించేవారో అందరికీ తెలిసిందే. అప్పుడు అదెంతటి సంక్లిష్టమో, ఇప్పుడు నేను నిర్వహించే తరహా ఆపరేషన్లు సైతం అంతే సంక్లిష్టం. ఒకప్పుడు అమెరికన్ నిపుణులు ఇక్కడికి వచ్చి ఇక్కడా వారి స్థాయి నైపుణ్యం గల వారిని తయారు చేశారు. అదే తరహా నైపుణ్యం (ఎక్స్పర్టైజ్) ఇప్పుడు ఊపిరితిత్తుల విషయంలో మనకు అవసరం. ఎందుకంటే ఇక్కడి రోగుల సంఖ్య, ఇక్కడి ఊపిరితిత్తుల జబ్బుల వ్యాప్తి, విస్తృతి, డిమాండ్‌కు తగినట్లుగా నిపుణులు లేరు. మనకూ ఆ స్థాయి నిపుణుల అవసరం ఉంది. అందుకే నేను కేవలం శస్త్రచికిత్సలు చేయడం కంటే... నా స్థాయిలో చేయగలిగేవారిని పదిమందిని తయారు చేస్తే ఇక్కడి రోగుల అవసరాలను సమర్థంగా తీర్చగలనని అనిపించింది. అమెరికా స్థాయి నైపుణ్యం మనకూ కావాలన్న సంకల్పంతో నేనీదేశానికి వచ్చా. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా... మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్న పెద్దవైద్యకేంద్రాల్లోనూ అమెరికా స్థాయి వైద్యం అందేలా నిపుణులను తయారు చేసే పనిలో కొందరు ఉన్నారు. నాదీ అదే ఉద్దేశం కావడంతో నాలాంటి దృష్టికోణంతో పనిచేసే వారితో పాటు ఆ క్రతువులో నేనూ భాగస్వామిని అవుతున్నాను. ఇప్పుడు బైపాస్ విషయంలో ఏం జరుగుతోందో... త్వరలో ఊపిరితిత్తుల సర్జరీల విషయంలోనూ అదే జరగాలని నా కోరిక. ప్ర:హైదరాబాద్‌నే కేంద్రంగా ఎంచుకోడానికి కారణం? డా. సాయి: నేను అమెరికాలోని అంతర్జాతీయ స్థాయి సంస్థలో, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో పనిచేశానని చెప్పాను కదా. అదే తరహా ప్రొటోకాల్ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో ఉంది. ఒక వాతావరణంలో పనిచేశాక మళ్లీ మన దేశంలో అదే తరహా వాతావరణంలో పనిచేయడం సులువు కదా. ఆ స్థాయి చికిత్స జరిగే ప్రదేశంగా నేను అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ను గుర్తించాను. ఇక్కడి చాలా పెద్ద సంస్థల్లోనూ సర్జరీ, రేడియేషన్, కీమో తరహా చికిత్సలు వేటికవే స్వతంత్రంగా జరుగుతాయి. కానీ ఈ సంస్థలో మాత్రం అన్నీ సంయుక్తప్రభావంతో జరిగేలా చూస్తారు. ఇలాంటి మల్టీడిసిప్లినరీ అప్రోచ్ విషయంలో మిగతా సంస్థలు... అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ కంటే కాస్త వెనకే ఉన్నాయనిపించింది. ప్ర: విదేశాలతో పోలిస్తే ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? డా. సాయి: ఆఁ... ఉన్నాయి. పైగా ఆ అంశాలు కూడా ఇక్కడే నా సేవలు అవసరమని భావనను పెంచి నన్నిక్కడే ఉంచేలా చేశాయి. ఉదాహరణకు... ఆస్బెస్టాస్ వాడకం వల్ల మీసోథీలియోమా అనే తరహా క్యాన్సర్ వస్తుంది. దీన్ని గుర్తించిన విదేశాలు ఆస్బెస్టాస్ను పూర్తిగా నిషేధించాయి. కానీ మన దేశంలో ఆస్బెస్టాస్ ఉపయోగం ఎక్కువే. అందుకే ఈ తరహా క్యాన్సర్లు విదేశాలతో పోలిస్తే మన దగ్గర ఎక్కువ. పైగా ఈ మీసోధీలియోమా క్యాన్సర్‌కు చికిత్స అత్యంత సంక్లిష్టం, చాలా కష్టం. అందుకే ఇక్కడ ఆ తరహా క్యాన్సర్‌ను ఎదుర్కొనే బృందాన్ని ఇక్కడ రూపొందేలా కృషి చేస్తున్నాం. నాకు తెలిసి ఈ తరహా టీమ్ గత 72 ఏళ్లలో ఇదే మొదటి శ్రేణిది అని చెప్పవచ్చు. అంతేకాదు... ఈ మీసోథీలియోమా చికిత్సలో మొత్తం ఛాతీ క్యావిటీని కడిగేయడం కూడా చేస్తున్నాం. దీన్నే వైద్య పరిభాషలో ఇంట్రాప్లూరల్ కీమో థెరపీ అంటారు. ఈ తరహా అత్యున్నత స్థాయి చికిత్సలు ఇక్కడ అందుబాటులోకి రావాలన్నదే ప్రస్తుతం మా లక్ష్యం. సంప్రదించాల్సిన చిరునామా... అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, ఎట్ సిటిజన్ హాస్పిటల్, శేరిలింగంపల్లి, హైదరాబాద్ - 500 019; వెబ్సైట్ : www.americanoncology.com డాక్టర్ సాయి యండమూరి కన్సల్టెంట్ - హెడ్ ఆఫ్ థొరాసిక్ సర్జరీ, అమెరికల్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఎట్ సిటిజన్స్ హాస్పిటల్స్, ఫోన్: 67199835