ఒకసారి స్టెంట్‌ వేయించుకున్న తర్వాత గుండెజబ్బు మళ్లీ వస్తుందా?  | Full Care Should be Taken by the Doctors Supervision | Sakshi
Sakshi News home page

ఒకసారి స్టెంట్‌ వేయించుకున్న తర్వాత గుండెజబ్బు మళ్లీ వస్తుందా? 

Published Mon, Apr 15 2019 1:47 AM | Last Updated on Mon, Apr 15 2019 1:47 AM

Full Care Should be Taken by the Doctors Supervision - Sakshi

నా వయసు 59 ఏళ్లు. ఇదివరకు ఒకసారి గుండె రక్తనాళాల్లో ఒకచోట పూడిక ఏర్పడిందని నాకు స్టెంట్‌ వేశారు. ఇటీవల మళ్లీ నాకు అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఇదివరకే స్టెంట్‌ వేయించుకున్నను కదా గుండెపోటు రాదులే అనుకొని కొంతకాలంపాటు ఛాతీనొప్పిని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ సందేహం వస్తోంది. ఒకసారి స్టెంట్‌ వేయించుకున్న తర్వాత మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.

ఒకసారి స్టెంట్‌ వేయించుకున్న తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలామంది మీలాగే అపోహ పడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. స్టెంట్‌ సహాయంతో అప్పటికే ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ మళ్లీ కొత్తగా పూడికలు రాకుండా ఆ స్టెంట్‌ అడ్డుకోలేదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి స్టెంట్‌ పెట్టిన తర్వాత మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి.

మీ ఆరోగ్య పరిస్థితి బట్టి మీకు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఒకవేళ బైపాస్‌ అవసరం అని చెప్పినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అత్యాధునిక వైద్యవిధానాలతో చిన్న కోతతోనే బైపాస్‌ చేయడమూ సాధ్యమే. మీరు మీ  ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. మందులతోనే నయం అయ్యే పరిస్థితి ఉంటే ఆపరేషన్‌ కూడా అవసరం ఉండదు. ఇక  సాధ్యమైనంతవరకు మీరు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. 

గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల గుండెజబ్బు వస్తుందా? 

నా వయసు 37 ఏళ్లు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నాను. నాకు కోపం, ఆవేశంతో పాటు భయం కూడా ఎక్కువ. నా మనసు ఎప్పుడూ కీడు శంకిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మా బాస్‌ పిలిస్తే చాలు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందనని నాకు ముచ్చెమటలు పట్టేస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాగే ఎవరైనా నాతో పర్సనల్‌గా మాట్లాడాలని అన్నప్పుడు కూడా చాలా తీవ్రంగా. 

అదేపనిగా ఆలోచిస్తుంటాను. కానీ వాళ్లతో మాట్లాడిన అనంతరం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాను. ఆందోళన సమయంలో నా గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. దీన్ని బట్టి నాకేమైనా గుండెజబ్బు ఉందేమోనని అనిపిస్తుంటుంది. నాకు గుండెజబ్బు ఉందా? వచ్చేందుకు అవకాశం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. 

మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీకు ఫోబియా ఉన్నట్లు చెప్పవచ్చు. అలాగని, అది మినహాయించి, మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని మాత్రం చెప్పలేం. సాధారణంగా ఎక్కువగా భయపడినప్పుడు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే గుండెకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అయ్యే ముందు కూడా ఈ సంకేతాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. మీరు నడిచినప్పుడు గానీ, మెట్లెక్కినప్పుడు గానీ మీరు పేర్కొన్న లక్షణాలతో పాటుగా ఆయాసం, ఛాతీలో నొప్పి రావడం వంటివి చోటుచేసుకుంటే మీరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలకు అవి సంకేతాలని చెప్పవచ్చు.

 కాబట్టి మీరు వెంటనే కార్డియాలజిస్ట్‌ని కలిసి, మీ లక్షణాలను వివరిస్తే, వారు తగిన పరీక్షలు నిర్వహించి, మీకు ఉన్న అసలు సమస్యను తెలుసుకునేందుకూ, మీ వాస్తవ  సమస్యపై ఒక అవగాహనకు వచ్చేందుకు వీలుంది. అందుకు అనుగుణంగా తగిన చికిత్సను కూడా అందించవచ్చు. అంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరైనా గుండె సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురైన చరిత్ర ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే మీకు పొగతాగడం, ఆల్కహాల్‌ తీసుకోవడం లాంటి అలవాట్లు ఉన్నా లేదా షుగర్‌ వంటి ఇతర వ్యాధులు ఉన్నా మీరు భవిష్యత్తులో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఒకవేళ పై లక్షణాలు ఉన్నప్పటికీ, వైద్య పరీక్షల్లో ఏ కారణాలూ కనిపించకపోతే మీరు కేవలం ఫోబియాతో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ చేయవచ్చు. ఆ తర్వాత మీరు సైకియాట్రిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్‌ ఇప్పించుకుంటే సరిపోతుంది. ఈమధ్యకాలంలో ఇలాంటి కేసులు యువతీయువకుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా కాకుండా పైన పేర్కొన్న గుండెకు సంబంధించిన లక్షణాలుంటే మాత్రం ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణం డాక్టర్‌ని కలిసి, పరీక్షలు నిర్వహించుకుని, తగిన చికిత్సను పొందండి. భయపడాల్సిన పనేమీ లేదు. మీ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు, చికిత్స ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 

తరచూ ఛాతీనొప్పి... గుండెజబ్బు కావచ్చా?

నా వయసు 42 ఏళ్లు.  నాకు తరచూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఈ విషయం స్నేహితులతో చెప్పినప్పుడు... అది గుండెపోటుకు దారితీయవచ్చుననీ, పరీక్షలు చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. గుండెపోటు ఎందుకు వస్తుంది? దానిని ఎలా గుర్తించాలి? 
 
శరీరంలోని భాగాలన్నింటికీ రక్తం సరఫరా చేసే పంపింగ్‌ స్టేషన్‌ లాంటిది గుండె. కండరాలతో నిర్మితమైన ఈ గుండె సక్రమంగా పనిచేయడానికి దానికి శుద్ధమైన (ఆక్సిజన్‌తో కూడిన) రక్తం నిరంతరం సరఫరా జరుగుతూ ఉండాలి. కరొనరీ ధమనుల ద్వారా దానికి రక్తం అందుతూ ఉంటుంది. ఈ ధమనులకు వ్యాధి సోకితే అవి కుంచించుకుపోయి తగిన పరిమాణంలో శుద్ధమైన రక్తాన్ని సరఫరా చేయలేవు. కొవ్వు – క్యాల్షియమ్‌ – ప్రోటీన్‌ అణువులు రక్తనాళాల లోపలి గోడలపై పాచిలాగా పేరుకుపోవడం వల్ల ఈ రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అలా ధమని పూర్తిగా మూసుకుపోయిన పక్షంలో దాని ద్వారా రక్తం సరఫరా కావాల్సిన గుండె కండరాలకు పోషకాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఫలితంగా గుండెకండరాలు చచ్చుబడిపోతాయి. దాంతో గుండెపోటు వస్తుంది.

సాధారణంగా గుండెపోటుకు ఇదే కారణం అయినప్పటికీ కరొనరీ ధమనుల్లో ఏర్పడే తీవ్రమైన సంకోచ వ్యాకోచాలు కూడా గుండెపోటుకు దారితీస్తాయి. ఈ విధంగా సంకోచించిన సమయంలో రక్తనాళాల (ధమనుల) ద్వారా గుండె కండరాలకు జరిగే రక్తసరఫరా చాలా తక్కువ పరిమాణానికి పడిపోవడమో లేదా పూర్తిగా నిలిచిపోవడమో జరుగుతుంది. వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కరోనరీ ధమనులకు సంబంధించి పెద్దగా సమస్యలు లేని సందర్భంలో కూడా ఇలా జరగవచ్చు. గుండెపోటులో ఈ కింద పేర్కొన్న లక్షణాలు ముందే కనిపిస్తాయి. 
∙ఛాతీ–రొమ్ము ఎముక కింద – ఎడమచేతిలో భాగంగా, ఒత్తిడిగా, నొప్పిగా అనిపిస్తుంది. 

►ఈ అసౌకర్యం వీపు వైపునకు, దవడలు, చేతి గుండా ఇతర అవయవాలకు వ్యాపిస్తున్నట్లుగా తోస్తుంది. 
►కడుపు ఉబ్బరంగా, అజీర్తిగా, ఏదో అడ్డుపడుతున్నట్లుగా అనిపిస్తుంది. 
►చెమటలు పట్టడం, వికారం, వాంతి వస్తున్నట్లుగా ఉంటుంది. 
►చాలా బలహీనంగా, ఆందోళనగా ఉండి శ్వాస తీసుకోవడం కష్టంగా తోస్తుంది. 
►గుండె వేగంగా, అసహజంగా కొట్టుకుంటుంది. 

ఈ లక్షణాలు దాదాపు 30 నిమిషాల పాటు కనిపిస్తాయి. అందువల్ల ఛాతీలో నొప్పి వస్తే ముందుగా ఆసుపత్రికి వెళ్లి, అది గుండెపోటు కాదని నిర్ధారణ చేసుకోండి. కొంతమందిలో ఈ లక్షణాలు ఏమీ కనిపించకుండా కూడా గుండెపోటు రావచ్చు. దీన్ని సైలెంట్‌ హార్ట్‌ఎటాక్‌గా పరిగణించవచ్చు. ఈ సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ ఎవరికైనా రావచ్చు. అయితే డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల్లో ఈ రకమైన గుండెపోటు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. స్పష్టమైన లక్షణాలుతో, వెంటనే గుర్తించడానికి తెలిసిపోయే లక్షణాలతో గుండెలో అసౌకర్యం కలుగుతున్న విషయాన్ని గుర్తించినప్పుడు, తక్షణం ఆ రోగులను ఆసుపత్రికి చేరిస్తే, వారి ప్రాణాలు కాపాడవచ్చు. మన దేశంలో ప్రతి 33 సెకండ్లకు ఒకరు గుండెపోటుకు గురవుతున్నారు.

ఇలా ఏటా ఇరవై లక్షల మంది హార్ట్‌ ఎటాక్‌ కారణంగా మరణిస్తున్నట్లు అంచనా. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల వారితో పోలిస్తే భారతీయులు సగటున పది సంవత్సరాలు ముందుగానే గుండెపోటుకు గురవుతున్నారు. పైగా మన దేశస్తుల్లో గుండెపోటుకు గురవుతున్నవారిలో చాలా మంది యువకులు, మధ్యవయస్కులే ఎక్కువ. ఇలా స్పష్టమైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే అన్ని సౌకర్యాలు ఉన్న పెద్దాసుపత్రులకు వెళ్లి, తగిన పరీక్షలు చేయించుకుంటే ఎన్నో ప్రాణాలు అర్థంతరంగా ముగియకుండా కాపాడవచ్చు.

డా. రాజశేఖర్‌ వరద, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ అండ్‌ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, 
యశోద హాస్పిటల్స్‌. సికింద్రాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement