ఏటా పెరుగుతున్న గుండె జబ్బులు
రాష్ట్రంలో 2022–23లో ఆరోగ్యశ్రీ ద్వారా లక్ష మందికి పైగా చికిత్స
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని హెచ్చరిస్తున్న వైద్యులు
గుండె జబ్బు లక్షణాలను పసిగట్టి ముందే వైద్యులను సంప్రదించాలి
సాక్షి, అమరావతి: ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాట.. ‘హార్ట్ ప్రాబ్లమ్’. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనం వెరసి గుండె జబ్బులు ఏటా పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం గుండె పోటుతో మరణిస్తున్నారు.
దేశంలో ఏటా సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 27 శాతం గుండె జబ్బుల వల్లేనని తేలింది. దీంతో ‘గుండె ఘోష’ను ముందే పసిగట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురైతే తాత్సారం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు ఉన్న వారంతా గుండె జబ్బులేనని నిర్ధారణకు రాకుండా.. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ, ఈసీసీ
రాష్ట్రంలో ఏటా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారందరికీ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది. 2019–20వ సంవత్సరంలో ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కార్డియాలజీ, కార్డియాక్, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాల్లో 59,700 చికిత్సలు జరిగాయి.
2022–23 నాటికి ఈ చికిత్సల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. అలాగే 2023–24లో కూడా ఈ ఏడాది జనవరి నాటికి 84 వేల మందికి ప్రభుత్వం గుండె జబ్బులకు ఉచితంగా చికిత్సలు చేయించింది. ఏటా పెరుగుతున్న గుండె జబ్బులను పరిగణనలోకి తీసుకుని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.
గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించేందుకు ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్(ఈసీసీ) కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో సైతం ఛాతీనొప్పితో వచ్చే బాధితులకు ఈసీజీ తీసి, కార్డియాలజిస్ట్‌ల సూచనలతో థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్‌లు చేసి ప్రాణాపాయం నుంచి రక్షిస్తున్నారు.
జీవన విధానం మారాలి
» 40 ఏళ్లు దాటిన వారు, రిస్క్ ఫ్యాక్టర్స్(బీపీ, షుగర్, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు) ఉన్నవారు తరచూ జనరల్ చెకప్ చేయించుకోవాలి.
» రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి చేయాలి.
» ఆకుకూరలు, చిరుధాన్యాలు, తాజా పళ్లు, కూరగాయలు, గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.
» రెడ్ మీట్ తినడం తగ్గించాలి. జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
» ధూమపానం, మద్యపానం మానేయాలి.
» శరీర బరువు పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి.
» మానసిక ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధ్యానం చేస్తుండాలి.
మనం మారితేనే గుండె పదిలం
గతంలో గుండె జబ్బులు వయసు పైబడిన వారికి లేదా వంశపారంపర్యంగా మాత్రమే ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం అన్ని రకాల వయసు వారిలోనూ గుండె జబ్బులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మారిన జీవన విధానమే.
అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడికి లోనవ్వడం, శారీరక శ్రమ లేకుండా జీవించడం వంటి విధానాలను మనం వీడాలి. మనం మారినప్పుడే గుండె పదిలంగా ఉంటుంది. అలాగే గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇప్పటికే సమస్యలున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాధిపతి, కర్నూలు జీజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment