
రచయిత, దర్శకుడు పూసల ఇక లేరు
ప్రముఖ రచయిత, దర్శకుడు పూసల (74) కన్ను మూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇటీవల ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. అది విజయవంతమైనప్పటికీ కిడ్నీ సంబంధిత వ్యాధి కారణంగా ఆదివారం ఉదయం 5 గంటలకు తుది శ్వాస విడిచారు. రచయితగా పూసలకు మంచి గుర్తింపు ఉంది. 64 కథలు రాశారాయన. వాటిలో ఆయన నటించిన ‘మండువ లోగిలి’ నాటకానికి బళ్ళారి రాఘవ అవార్డు వరించింది. అలాగే, ఏకపాత్రతో పూసల దర్శకత్వం వహించిన ‘అలెగ్జాండర్’ నాటకానికి ప్రశంసలు లభించాయి.
అందులో జయప్రకాశ్‌రెడ్డి నటించారు. ప్రస్తుత సమాజానికి దర్పణం పడుతూ తాజాగా ఆయన ‘డాలర్‌కి మరో వైపు’ ఆనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోపు ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. పూసలకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నేడు (సోమవారం) ఎర్రగడ్డ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.