
బాక్సాఫీస్ వద్ద అంతంతమాత్రమే ఆడినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది లాపతా లేడీస్ (Laapataa Ladies). బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ చిత్రాన్ని 2019లో వచ్చిన అరబిక్ మూవీ నుంచి కాపీ కొట్టారని ఇటీవల ట్రోలింగ్ జరిగింది. బుర్ఖా సిటీ అనే అరబిక్ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్‌ను యథాతథంగా తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
టూ బ్రైడ్స్ పేరిట రిజిస్టర్
తాజాగా ఈ ఆరోపణలపై లాపతా లేడీస్ కథారచయిత బిప్లాబ్ గోస్వామి (Biplab Goswami) స్పందించాడు. అరబిక్ సినిమాను తెరకెక్కించడానికంటే ముందే తను ఈ కథను రిజిస్టర్ చేయించినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేశాడు. అందులో ఏముందంటే.. లాపతా లేడీస్ కథ ఎన్నో ఏళ్లకిందట రాసుకున్న కథ. 2014 జూలై 3న ఈ కథను స్క్రీన్‌రైటర్స్ అసోసియేషన్‌లో టూ బ్రైడ్స్ పేరిట క్లుప్తంగా రిజిస్టర్ చేయించాను.
ఎప్పుడో రాసుకున్నా..
పరదా కారణంగా పెళ్లికొడుకు పొరపాటున వేరొకరి భార్యను ఇంటికి తీసుకురావడం.. తీరా ఇంటికొచ్చాక జరిగిన తప్పిదానికి బాధపడటం.. ఇవన్నీ కూడా ఆ కథలో పొందుపర్చాను. అలాగే పెళ్లికొడుకు తన భార్య ఆచూకీ వెతికిపెట్టమని పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడని.. పరదా కప్పుకున్న భార్య ఫోటోను పోలీస్‌కు ఇస్తాడని కూడా పేర్కొన్నాను. 2018 జూన్ 30న పూర్తి స్క్రిప్ట్‌ను రిజిస్టర్ చేయించాను. అదే ఏడాది జరిగిన సినీస్తాన్ స్టోరీటెల్లర్స్ పోటీలో నా కథకుగానూ రన్నరప్ అవార్డు గెల్చుకున్నాను.
దశాబ్దాల నుంచి ఉన్నదే!
పరదాల కారణంగా అమ్మాయిల్ని గుర్తుపట్టడం కష్టంగా మారుతుందనే అంశాన్ని దశాబ్దాల తరబడి ఉపయోగిస్తున్నాం. విలియం షేక్‌స్పియర్, అలెగ్జాండర్ డుమాస్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ఎందరో రచయితలు సైతం తమ కథల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. వధువులు మారిపోతే అనే అంశాన్ని ప్రధానంగా తీసుకున్న లాపతా లేడీస్ తెరకెక్కింది. ఇది పూర్తిగా ఒరిజినల్ స్టోరీ. కథ, డైలాగ్స్, పాత్రలు, సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే.. అంతా కూడా ఏళ్లతరబడి మేము చేసిన అధ్యయనానికి ప్రతీకగా నిలిచాయి.
100% ఒరిజినల్
లింగ వివక్ష, అసమానత్వం వంటి సమస్యల్ని స్పష్టంగా చూపించాం. మా కథ, పాత్రలు, డైలాగ్స్ అన్నీ కూడా నూటికి నూరుపాళ్లు ఒరిజినలే! కాపీ కొట్టామంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఇలాంటి ఆరోపణలు మా శ్రమకు ఫలితం లేకుండా చేస్తాయి. నాకే కాదు, నా టీమ్ మొత్తం చేసిన కృషిని దెబ్బ తీస్తాయి అని రచయిత బిప్లాబ్ చెప్పుకొచ్చాడు.