కార్డియాలజీ కౌన్సెలింగ్
మా అమ్మగారి వయసు 45 ఏళ్లు. ఆమెకు ఈమధ్య ఆయాసంగా, ఛాతీ బిగబట్టినట్లుగా ఉంటే డాక్టర్‌కు చూపించాం. గుండె ధమనుల్లో బ్లాక్‌లు ఏర్పడ్డాయని, వాటిని తొలగించేందుకు బైపాస్ సర్జరీ చేయాలన్నారు. బైపాస్ అంటే కాలికి పెద్ద కోత కోస్తారనీ, అలాగే ఛాతీ మధ్యలో పెద్ద గాటు పెట్టి ఆపరేషన్ చేస్తారని తెలుసు. అయితే ఇలా ఆపరేషన్ చేసిన వారి చర్మం ఉబ్బి చాలా అందవికారంగా అసహ్యంగా కనిపిస్తుంటుంది. ప్రత్యేకించి ఆడవాళ్లకు... వాళ్ల వైవాహిక, సామాజిక జీవితానికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి కదా! దాంతో మాకు అమ్మ ఆపరేషన్ అంటేనే ఆందోళనగా ఉంది. మా అమ్మగారికి సరైన ప్రత్యామ్నాయ చికిత్స ఏదైనా ఉందా?
- అమృత, వైజాగ్
కరోనరీ ధమనులు మూసుకుపోయి, గుండె కండరాలకు రక్తసరఫరా జరగనప్పుడు వైద్యులు కొత్త దారి ఏర్పరచి గుండెకు రక్తప్రసరణ సాఫీగా అయ్యేలా చేస్తారు. అందుకు ఉపకరించే ముఖ్యమైన శస్త్రచికిత్స ప్రక్రియ ‘బైపాస్ సర్జరీ’. ఈ ధమనులు గుండె కండరానికి ప్రాణవాయువు లాంటివి. రక్తంలో కొవ్వు, కొలెస్ట్రాల్, ఖనిజాల వంటివి ధమనుల గోడలపై పూడికలాగా ఏర్పడితే రక్తప్రసరణ మందగిస్తుంది. హృదయ ధమనుల్లోకి అవసరమైనంత రక్తప్రసరణ జరిగేందుకు శరీరంలోని ఇతర భాగాల నుంచి తీసిన ధమనులు, సిరలను గుండెలో అమర్చే ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్సను ‘కరోనరీ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ’ అంటారు. ఈ శస్త్రచికిత్సలో వాడే సిరలు, ధమనుల వ్యాకోచించగలిగే గుణం ఉన్నందున వాటిని తీసిన ప్రదేశంలో రక్తప్రసరణకు ఏ విధమైన అవరోధమూ కలగదు. దీనికి కాలిపై చర్మం దిగువన ఉండే సిరను ప్రత్యేకంగా వాడతారు. ఈ సంప్రదాయ చికిత్సలో మీరన్నట్లు కోత ఎక్కువగానే ఉంటుంది. కానీ మీ అమ్మగారికి లేటెస్ట్‌గా అందుబాటులోకి వచ్చిన మినిమల్లీ ఇన్వేజివ్ డెరైక్ట్ కరొనరీ బైపాస్ (ఎంఐడీసీఏబీ-మిడ్‌కాబ్) విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం ఛాతీ కోయాల్సిన అవసరం లేదు. ఈ విధానంలో 5 - 6 సెంటీమీటర్ల కోతతో బైపాస్ సర్జరీ నిర్వహిస్తారు. కాబట్టి అందవికారంగా ఉండదు. బైపాస్ సర్జరీలో ఇది ఎంతో సురక్షితమైన శస్త్ర చికిత్స. ఇక ఎండోస్కోపిక్ వెయిన్ హార్వెస్ట్ విధానంలో చిన్నకోతతోనే కాలి నుంచి సిరలను కూడా తొలగించడం వల్ల కాలిపై ఎలాంటి నిలువు గాటూ ఏర్పడదు. మీరు కంగారు పడకుండా నిరభ్యంతరంగా మీ అమ్మగారికి బైపాస్ సర్జరీ చేయించండి. చిన్నకోతతోనే పూర్తి ఫలితాన్ని పొందవచ్చు.
డాక్టర్ సుఖేష్ కుమార్ రెడ్డి
సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ యశోద హాస్పిల్స్
సోమాజిగూడ
హైదరాబాద్
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 32 ఏళ్లు. నాకు తరచూ మూత్ర విసర్జన సమయంలో మంట వస్తోంది. మాటిమాటికీ జ్వరం కూడా వస్తోంది. మందులు వాడుతున్నప్పుడు తగ్గుతోంది కానీ మందులు మానేయగానే మళ్లీ అదే పరిస్థితి. దయచేసి నాకు పరిష్కారం చెప్పండి.
- వెంకట రమణ, అమలాపురం
మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నారు. ఇలా మళ్లీ మళ్లీ మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలను ముందుగా తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉన్నట్లయితే దానివల్ల ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అందుకే ముందుగా ఒకసారి షుగర్ పరీక్షలు చేయించండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించి మూత్ర విసర్జక వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లు ఉన్నాయా అని కూడా చూడాలి. ఇక యాంటీబయాటిక్ కోర్సు పూర్తిగా వాడకపోయినా ఇన్ఫెక్షన్ పదేపదే తిరగబెట్టవచ్చు. మీరు మంచినీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. రోజుకు కనీసం రెండు, మూడు లీటర్ల నీళ్లు తాగండి. మూత్రవిసర్జన ఫీలింగ్ కలగగానే ఎక్కువసేపు వేచిచూడకుండా వెంటనే విసర్జనకు వెళ్లండి.
నా వయసు 62 ఏళ్లు. నేను విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. వీటి కోసం ఎక్కువగా నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల మూత్రపిండాలు (కిడ్నీలు) దెబ్బతినే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
- అబ్దుల్ నబీ, నల్గొండ
పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినట్లయితే మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందుల కాంబినేషన్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాలకు చాలా హాని చేస్తాయి. అందుకే మీలా మోకాళ్ల నొప్పులు, ఇతర జాయింట్ పెయిన్స్ ఉన్న వారు నొప్పినివారణ మందులు వాడకుండా, ఫిజియోథెరపీ లాంటి ఇతర ప్రక్రియలతో నొప్పి తగ్గించుకోవాలి. ఫిజియోథెరపిస్టులు సూచించిన మేరకు వ్యాయామాలు చేయాలి. ప్రతిరోజూ మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్
హైదరాబాద్
డర్మటాలజీ కౌన్సెలింగ్
నా వయసు 48 ఏళ్లు. ఇటీవల వాతావరణంలో వేడిమి పెరగగానే నాకు ప్రైవేట్ పార్ట్స్‌లో చెమటలు పట్టడం ఎక్కువైంది. దాంతో నా ప్రైవేటు పార్ట్స్‌లో శరీరం మడత పడే ప్రాంతాల్లో చర్మం నలుపురంగులోకి మారుతోంది. చెమటలు పట్టినప్పుడు వాటిలో చాలా దురద ఉంటుంది. నాకు తగిన పరిష్కారం చూపండి.
- కె. వెంకట్‌రెడ్డి, ఒంగోలు
మీరు చెబుతున్న అంశాలను బట్టి మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య మాటిమాటికీ తిరగబెడుతున్నట్లు అనిపిస్తోంది. మీరు ఇట్రకొనజోల్-100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినఫిన్ ఉన్న క్రీమును 2-3 వారాల పాటు రాయాలి. దీంతోపాటు ప్రతిరోజూ మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి.
నాకు ఎడమ చేతి మీద అలర్జిక్ ర్యాష్ వచ్చింది. దురదగా అనిపిస్తుంటే విపరీతంగా గీరాను. దాంతో అక్కడ డార్క్ మార్‌క్స ఏర్పడ్డాయి. నా చర్మం మీద అవి అసహ్యంగా కనిపిస్తున్నాయి. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
- కోమల, సూళ్లూరుపేట
మీరన్నట్లు తీవ్రంగా గోకడం వల్ల మీకు ఈ పరిస్థితి వచ్చింది. మీరు ‘పోస్ట్ ఇన్‌ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్’తో బాధపడుతున్నారని తెలుస్తోంది. అలర్జీని అదుపులో ఉంచుకునే మందులు వాడుతూ మీరు ఈ కింది సూచనలనూ పాటించండి.సాఫ్ట్ పారఫిన్, షియాబట్టర్, గ్లిజరిన్ ఉన్న మాయిశ్చరైజర్‌ను డార్క్ మార్క్స్ ఉన్నచోట అప్లై చేయండి. ఆ ప్రాంతంలో ఎస్‌పీఎఫ్ 50 కంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రాయండి. కోజిక్ యాసిడ్, అర్బ్యుటిన్, నికోటినమైడ్‌తో పాటు లికోరైస్ ఉన్న స్కిన్ లెటైనింగ్ క్రీములు రాయండి. ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజాపండ్లు ప్రతిరోజూ తీసుకోండి.
ఈ సూచనలు పాటించాక కూడా తగ్గకపోతే కెమికల్ పీలింగ్, మైక్రో డర్మా అబ్రేషన్ వంటి చికిత్సలు తీసుకోవడం కోసం మీరు మీకు దగ్గర్లోని డర్మటాలజిస్ట్‌ను కలవండి.
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డెర్మటాలజిస్ట్
త్వచ స్కిన్ క్లినిక్
గచ్చిబౌలి
హైదరాబాద్
అతి చిన్న కోతతో అత్యాధునిక బైపాస్!
Published Sun, Feb 21 2016 11:04 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement