బైపాస్ సర్జరీ (ప్రతీకాత్మక చిత్రం)
వైద్య ఖర్చులు భరించలేని పేదల సంక్షేమచర్యలలో భాగంగా కార్మిక జీవిత బీమా సంస్థ వారు (ఇఎస్‌ఐసి) అనేక వైద్యశాలలు నడుపుతున్నారు. చిన్న ఉద్యోగులకు, కార్మికులకు అందులో చికిత్స ఉచి తంగా ఇస్తారు. ఒక్కోసారి వాటిలో అవసరమైన చికిత్సా సౌకర్యాలు లేకపోతే వారే సమీపంలోని ప్రయివేటు వైద్యశాలలకు చికిత్సకోసం రోగులను పంపించవలసి ఉంటుంది. అక్కడి చికిత్సకు శస్త్ర చికిత్సలకు, రోగులకు అమర్చిన స్టెంట్ వంటి పరికరాలకు అయ్యే ఖర్చులను కార్మిక జీవిత బీమా సంస్థ భరించవలసి ఉంటుంది. ప్రైవేటు వైద్యదుకాణాల వ్యాపారులు స్టెంట్ అనే పరికరాన్ని గుండెజబ్బుతో బాధపడేవారికి అమర్చినందుకు తీసుకునే డబ్బు విపరీ తంగా ఉంటుంది. వాటి అసలు ధరకు, వారు వసూలు చేసే సొమ్ముకు సంబంధమే ఉండదు.
ప్రయివేటు ఆస్పత్రులకు ఇఎస్‌ఐసి పంపే రోగుల చికిత్సకు వాడే పరికరాలకు గాను చెల్లింపుల గందరగోళం గురించి ఒక ఆర్టీఐ దరఖాస్తు దాఖ లైంది. రెండో అప్పీలు రూపంలో ఆ సమస్య కేంద్ర సమాచార కమిషన్‌కు చేరింది. ఎవరైనా సరే చికిత్సకు వాడే వస్తువులకు ఇష్టం వచ్చినట్టు ధర విధించడానికి వీల్లేదని, ఇఎస్‌ఐసి వారు కేవలం సీజీహెచ్‌ఎస్ వారు నిర్ధారించిన ధరల ప్రకారమే రేట్లు వసూలు చేస్తారని సమాధానం ఇచ్చారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి రేట్లప్రకారం కూడా చెల్లింపులు ఉంటాయి. ఇఎస్‌ఐ కూడా ధరలను నిర్ధారించింది.
గుండె రోగులకు కార్డో వాస్క్యులార్ డెప్రిబిలేటర్ సింగిల్ చాంబర్, డబుల్ చాంబర్, సీఆర్‌టీపీ వస్తువులను, పేసర్లను అమర్చుతూ ఉంటారు. అయితే ఇఎస్‌ఐ తాము పంపిన రోగులకు ఎంత ధర వసూలు చేస్తున్నారనే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రయివేటు ఆస్పత్రుల వారు అడిగినంత డబ్బు ఇచ్చి, రేట్ల తేడాలు పట్టించుకోకుండా ఉండేందుకు ప్రతిఫలాలు అందుకుంటున్నారని దరఖాస్తుదారు పవన్ సారస్వత్ ఫిర్యాదు చేశారు. గుండె సింగిల్ చాంబర్‌కు వాడే ఐసీడీకి ఎయిమ్స్ వారు లక్షా 75 వేల 786 రూపాయలు ధర నిర్ణయిస్తే ఇఎస్‌ఐ పంపిన రోగులకోసం ప్రయివేటు వైద్యశాలలు 5 లక్షల 50 వేల నుంచి 8 లక్షల 50 వేల దాకా అడుగుతున్నారని, ఇఎస్‌ఐసి చెల్లిస్తున్నదని వివరించారు. కార్మికులు. చిన్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు, బీమా సొమ్మును ఆస్పత్రులు ఈ విధంగా దోచుకుంటున్నాయని ఫిర్యాదు చేశారు.
అసలు ఈ విధంగా స్టెంట్లు వేయడం, ఖరీదైన చికిత్సలు చేయడం కూడా చాలా సందర్భాలలో అవసరం లేదని నిపుణులైన డాక్టర్ల మాట. అవసరం లేని కేసుల్లో కూడా సర్జరీలు చేస్తున్నారని, వారు సూచిం చిన చికిత్స వెంటనే చేయకపోతే ప్రాణాలుపోతాయని, అందుకు తాము బాధ్యులం కామని ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్లు భయపెడితే ఏమీ తోచక భయపడి రోగులు స్టెంట్లు వేయించుకోవడానికి ఒప్పుకోక తప్పడం లేదని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ దేవిశెట్టి (నారాయణ హృదయాలయ) అన్నారు.
సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ మనోజ్ అగర్వాల్ ఔషధ వైద్యంద్వారా గుండె జబ్బును నివారించే అవకాశం ఉంటే స్టెంట్ వాడకూడదని అన్నారు. అవసరం లేకపోయినా స్టెంట్ వాడితే అది చాలా తీవ్రమైన అనైతిక చర్య అని వైద్య వృత్తికి ఉన్న గౌరవాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని విమర్శించారు. అసలు ఇఎస్‌ఐ వారు ఎందుకు వేలాది మంది రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపించేస్తున్నారనేది ప్రశ్న. రెండున్నర రెట్లకన్న ఎక్కువ ధరను స్టెంట్లకు చెల్లించాల్సి వస్తోందని వారికీ తెలుసు.
ఇఎస్‌ఐ సంస్థ వారు కేంద్ర ప్రభుత్వానికి గానీ, ఆరోగ్య శాఖ వారికి గానీ ఈ సంగతులు వివరించి, ఈ దారుణమైన దోపిడీని ఆపడానికి కనీసం ప్రయత్నించకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. అందుకు కారణం ప్రయివేటు ఆస్పత్రులనుంచి వీరికి క్రమం తప్పకుండా ఒక్కో స్టెంట్‌కు కొంత కమీషన్ చొప్పున సొమ్ము అందుతున్నదని, రోగులను తమకు రిఫర్ చేసినందుకు ఇఎస్‌ఐసి వారికి తగిన ప్రతిఫలం ముట్టచెబుతారని అన్నారు. వీరి లంచం డబ్బులు కూడా కలుపుకుని, దానికిపైన కూడా తమ లాభాన్ని తగిలించి, రోగులనుంచి, బీమా కంపెనీలనుంచి ఎక్కువ డబ్బు వసూలు చేయడానికి ఆస్పత్రులు వెనుకాడడం లేదని ఆయన వివరించారు. చర్యతీసుకునే వారెవరు?
వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్
ఈమెయిల్: professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment