stents
-
స్టెంట్ వేశాక మళ్లీ పూడుకుపోతే..?
అన్ని అవయవాలకు అందినట్లే గుండెకు కూడా రక్తం నిరంతరం అందుతుండాలి. ఒక్కోసారి గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో పూడిక చేరినప్పుడు స్టెంట్లు వేసి, గుండె కండరానికి రక్తం నిరంతరాయంగా అందేలా చూస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇలా స్టెంట్లు వేసినప్పటికీ... అవి మళ్లీ పూడుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు అందుకు కారణాలను కనుగొని, స్టెంట్లలో ఏర్పడ్డ పూడికలను తొలగించి, ఆ రక్తనాళాలు మళ్లీ పూడుకుపోకుండా చేసేందుకు అందుబాటులో ఉన్న చికిత్సల గురించి కథనమిది. గుండెకు రక్తాన్ని చేరవేసే ప్రధాన ధమనుల్లో ఎక్కడైనా పూడికలు ఏర్పడినప్పుడు... సాధారణంగా యాంజియోప్లాస్టీ అనే చికిత్స ప్రక్రియ ద్వారా స్టెంట్ వేసి, సన్నబడ్డ రక్తనాళాన్ని మళ్లీ విచ్చుకునేలా చేస్తారు. అయితే స్టెంట్ వేశాక... మళ్లీ ఆ రక్తనాళం పూడుకుపోకుండా డాక్టర్లు కొన్ని జాగ్రత్తలు సూచిస్తారు. ఉదాహరణకు మధుమేహాన్ని, అధికరక్తపోటును అదుపులో పెట్టుకోవడం, స్మోకింగ్, మద్యం అలవాట్లను పూర్తిగా మానేయడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, మళ్లీ కొవ్వు పేరుకోడాన్ని నివారించేందుకుగాను కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే సమతులాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు చెబుతారు. అయితే స్టెంట్ వేశాక కొంతమంది బాధితులు ఈ నియమాలన్నింటినీ పాటించరు. దాంతో... నియమాలు పాటించని వారిలో మళ్లీ పూడికలు వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన లక్షణాలు హఠాత్తుగా ఛాతీలో నొప్పి చెమటలు పట్టడం వాంతులు దీర్ఘకాలికమై లక్షణాలు శ్వాసలో ఇబ్బంది ఛాతీలో అసౌకర్యం నడక, కదలికల సమయంలో ఆయాసం తమ కదలికలు కేవలం కొద్ది దూరాలకు మాత్రమే పరిమితమైపోవడం. నిర్ధారణ పరీక్షలు ఈసీజీ ఎకోకార్డియోగ్రామ్ కరొనరీ యాంజియోగ్రామ్ పూడికలు ఎక్కడ వస్తాయంటే...? ఒక్కోసారి ఇలా వేసిన స్టెంట్లోనే మళ్లీ పూడిక రావచ్చు. లేదా స్టెంట్‌కు పరిసర ప్రాంతాల్లో రెండోసారి పూడికలు రావచ్చు. స్టెంట్ వేశాక కూడా ఇలా రక్తనాళాలు తిరిగి మూసుకుపోవడానికి 3 నుంచి 5 శాతం వరకు అవకాశాలుంటాయి. ఇన్స్టెంట్ స్టెనోసిస్ అంటే... స్టెంట్ వేశాక ఏర్పడే పూడిక... స్టెంట్ లోపలగానీ లేదా దానికి 5 మిల్లీమీటర్ల పరిధిలోగానీ, స్టెంట్ అంచుల్లోగానీ ఏర్పడితే దాన్ని ఇన్స్టెంట్ స్టెనోసిస్ అంటారు. ఈ పూడికను కరొనరీ ఇమేజింగ్ పద్ధతుల ద్వారా దాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. కరొనరీ ఇమేజింగ్ అంటే ‘ఇంట్రావాస్క్యులార్ అల్ట్రాసౌండ్’ లేదా ‘ఆప్టికల కొహరెన్స్ టోమోగ్రఫీ’ అనే ఇమేజింగ్ ప్రక్రియలు. ఇలా స్టెంట్ లోపలగానీ లేదా చుట్టుపక్కల గానీ, అంచుల్లోగానీ పూడికలు మళ్లీ ఏర్పడటానికి కారణం... స్టెంట్ అవసరమైనంత మేరకు వ్యాకోచించకపోవడం అన్నమాట. ఇలా జరగడాన్ని ‘స్టెంట్ అండర్–ఎక్స్‌ప్యాన్షన్’ అంటారు. అలాగే స్టెంట్ ఫ్రాక్చర్‌కు గురికావచ్చు కూడా. స్టెంట్ పొడవు 30 మిల్లీమీటర్లకు మించినప్పుడు అది తిరిగి పూడుకుపోయే అవకాశాలు కొంతమేర ఎక్కువ. అలాగే ఒకటికి మించి... రెండు స్టెంట్లు వేసిన సందర్భాల్లోనూ ఒకదాని పైకి ఒకటి వచ్చేలా (ఓవర్‌ల్యాప్ చేస్తున్నట్లుగా) వేసిన సందర్భాల్లోనూ ఇలా మరోసారి పూడిక చేరేందుకు అవకాశాలు ఎక్కువ. అలాగే స్టెంట్ వేసినప్పుడు, అందులో ఎముకల తాలూకు అవశేషాలు పేరుకుని ఉన్నట్లయితే, స్టెంట్ అవసరమైన మేరకు వ్యాకోచించడానికి అది అడ్డంకిగా మారవచ్చు. అలాంటిప్పుడు దాన్ని సరిచేయకపోతే... ఆ తర్వాతి కాలంలో తిరగి పూడికలు ఏర్పడేందుకు అవకాశాలు ఎక్కువ. స్టెంట్ లోపల మరో స్టెంట్... ఈ ప్రక్రియను వైద్యులు చివరి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. సాధారణంగా స్టెంట్లోపల మరోస్టెంట్ వేయడం వల్ల రక్తనాళం మరింత ఇరుగ్గా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా రక్తనాళం తిరిగి పూడుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మిగతా ఏ విధానాలూ పనిచేయని సందర్భాల్లో మాత్రమే అరుదుగా ఇలా రీస్టెంటింగ్ ప్రక్రియను చివరగా ఉపయోగిస్తారు. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్... స్టెంట్లలో రెండురకాలు ఉంటాయి. అవి... బేర్ మెటల్ స్టెంట్స్, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్. ప్రస్తుతం బేర్ మెటల స్టెంట్లు అందుబాటులో లేవు. అయితే ఈ బేర్ మెటల్ స్టెంట్లు తిరిగి పూడుకుపోయేందుకు అవకాశాలు ఎక్కువ. వీటిలో కణజాలం పెరగకుండా నిరోధించడం అసాధ్యం. అందుకే బేర్ మెటల్ స్టెంట్లకు బదులుగా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్లు వాడుకలోకి వచ్చాయి. ఈ స్టెంట్లలో ఉండే ఔషధ పదార్థం (డ్రగ్) మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు విడుదలవుతూ... స్టెంట్లోపల కణజాలం పెరుగుదలను నియంత్రిస్తుంది. తద్వారా ఇది చాలాకాలంపాటు పూడుకుపోకుండా ఉంటుంది. ఇలాంటి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్లు వేయించుకున్న రోగుల్లో, తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలు కేవలం 3 నుంచి 5 శాతం మేరకే ఉంటాయి. కానీ బేర్ మెటల్ స్టెంట్లు వేయించుకున్నవారిలో తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలు 30 శాతం వరకు ఉంటాయి. అందుకే ఇవి అంతగా ప్రాచుర్యం పొందలేదు. లేజర్‌తో పూడిక తొలగింపు.... స్టెంట్లో కణజాలం మళ్లీ పెరిగి. అవి మళ్లీ పూడుకుపోయే కండిషన్‌ను ‘టిష్యూ హైపర్‌ప్లేసియా’ అంటరు. ఇలాంటి కండిషన్‌ను లేజర్‌తో చక్కదిద్దవచ్చు. తొలత లేజర్లను ఉపయోగించి పూడికను తొలగించాక... ఆ తర్వాత డ్రగ్ పైపూతగా ఉన్న బెలూన్ల సహాయంతో స్టెంట్ లోపలి పొరల్లోకి ఔషధపదార్థాన్ని పంపుతారు. ఇందుకోసం ‘పాక్లిటాక్సెల లేదా ‘సిరోలిమస్’ అనే ఔషధాలను (డ్రగ్స్)ను వైద్యులు ఉపయోగిస్తారు. ఇన్స్టెంట్ స్టెనోసిస్‌కు చికిత్స ఇలా... కరొనరీ ఇమేజింగ్ ద్వారా స్టెంట్ తగినంతగా వ్యాకోచించలేదని గుర్తిస్తే... అప్పుడు ఆ స్టెంట్ తాలూకు అండర్–ఎక్స్‌ప్యాన్షన్ కండిషన్‌కు చికిత్స చేసి, సరిదిద్దాల్సి ఉంటుంది. అంతే తప్ప పాత స్టెంట్ స్థానంలో కొత్త స్టెంట్ ఏర్పటు చేయడం సరికాదు. కాబట్టి స్టెంట్ అండర్–ఎక్స్ప్యాన్షన్కు తగిన కారణాలను కనిపెట్టి, వాటిని సరిదిద్దాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో స్టెంట్ చుట్టూరా క్యాల్షియమ్ లేదా దృఢ కణజాలం పేరుకుపోయి స్టెంట్ తగినంతగా వ్యాకోచించడానికి అడ్డుపడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఒత్తిడితో కూడిన బెలూన్ల సహాయంతో స్టెంట్‌ను తిగిరి వ్యాకోచించేలా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో రొటాబ్లేషన్, కటింగ్ బెలూన్ల వంటి ప్రక్రియలతో స్టెంట్‌ను తగినంతగా వ్యాకోచించేలా చేయవచ్చు. -డాక్టర్ ఎ. శరత్‌రెడ్డి, సీనియర్ కార్డియాలజిస్ట్ -
మొదటిసారే తీవ్రమైన గుండెపోటు.. మరణానికి దారితీసే పరిస్థితి, ఎందుకిలా?
గుండెపోటు వచ్చినప్పుడు కొందరిలో మూడు సార్లు వస్తుందని కొందరిలో ఓ అభిప్రాయం ఉంది. కానీ మరికొందరు మాత్రం మొదటిసారి స్ట్రోక్కే చనిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. అన్ని కండరాల్లాగే గుండె కండరానికీ రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలు ఉంటాయి. వాటి ద్వారానే గుండెకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందుతుంటాయి. ఒకవేళ కొవ్వు పేరుకోవడం వంటి కారణాలతో రక్తనాళాలు ఆ పూడుకుపోతే గుండె కండరం చచ్చుబడిపోవడం మొదలవుతుంది. ఇదే ‘గుండెపోటు’ రూపంలో కనిపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఎంత వేగంగా గుండెకు అందాల్సిన రక్తాన్ని మళ్లీ పునరుద్ధరించగలిగితే అంతగా గుండెపోటు ప్రభావాన్ని తగ్గించవచ్చు. గుండెపోటుకు గురైన వ్యక్తిని వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తీసుకురావాలంటూ వైద్యులు చెప్పేది ఇందుకే. అయితే కొందరిలో గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన రక్తనాళాలన్నీ పూడుకుపోయి... హాస్పిటల్‌కు చేరేలోపే గుండె కండరం పూర్తిగా చచ్చుబడిపోతే.... గుండెకే కాదు... గుండెనుంచి మన దేహంలోని ఏ అవయవానికీ రక్తం సరఫరా కాదు. పైగా రక్తనాళాలు పూడుకుపోవడం క్రమంగా జరుగుతున్న కొద్దీ... రక్తసరఫరా సాఫీగా కొనసాగేందుకు పక్కనుంచి రక్తనాళాలు వృద్ధి చెందుతుంటాయి. (చదవండి: ఇకపై నిర్ణయించేది మేమే!) వాటినే కొల్లేటరల్స్ అంటారు. కానీ మొదటిసారే పూర్తిగా పూడుకుపోయిన పరిస్థితి ఉన్నప్పుడు కొల్లేటరల్స్ కూడా వృద్ధిచెందవు కాబట్టి గుండెకు రక్తం అందించేందుకు పక్కనాళాలూ ఉండవు. ఇలాంటి సమయాల్లోనే మొదటిసారే గుండెపోటు తీవ్రంగా వచ్చిందచి చెబుతుంటారు. రోగి మరణానికి దారితీసే ప్రమాదకరమైన స్థితి ఇది. అందుకే ముందునుంచీ జాగ్రత్తలు తీసుకుంటూ పూడిక ఉన్నప్పుడు స్టెంట్ వేయించడం, రక్తాన్ని పలుచబార్చే మందులు వాడటం, అన్ని ప్రధాన రక్తనాళాలూ పూడుకుపోయినప్పుడు అవసరాన్ని బట్టి గుండె శస్త్రచికిత్స చేయించడం వంటివి అవసరమవుతాయి. (చదవండి: మీరు బాగా అరుస్తున్నారా? అయితే, అరవండి ఇంకా అరవండి.. కానీ ఓ కండిషన్) -
సగం ధరకే స్టెంట్లు
సాక్షి, హైదరాబాద్: గుండెజబ్బుల చికిత్స కోసం ఉపయోగించే స్టెంట్లు మరింత చౌక కానున్నాయి. నికెల్, టైటానియం డయాక్సైడ్ల మిశ్రమంతో తయారైన సరికొత్త స్టెంట్‌ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ శాఖ సంస్థ మిధాని (మిశ్ర ధాతు నిగమ్) అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టెంట్ల ధరలో సగానికే కొత్తవి అందుబాటులోకి వస్తాయని, ప్రస్తుతం వీటిని ఓ మెడికల్ యూనివర్సిటీ పరీక్షిస్తున్నట్లు మిధాని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ లేఖీ తెలిపారు. ‘షేప్ మెమరీ అల్లాయ్’గా పిలిచే ఈ కొత్త లోహ మిశ్రమాన్ని కొన్ని నెలల కిందే అభివృద్ధి చేశామని చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఏడాదిన్నరలో ఈ కొత్త స్టెంట్ అందుబాటులోకి రావొచ్చని చెప్పారు. స్టెయిన్లెస్ స్టీల్ కంటే ఎంతో మెరుగైన టైటానియం, ఇతర లోహాల తయారీలో ప్రఖ్యాతిగాంచిన మిధాని ఈ ఏడాది నుంచి బయో ఇంప్లాంట్స్ మార్కెటింగ్ రంగంలోకి అడుగుపెడుతోందని హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. కృత్రిమ పళ్లు బిగించేందుకు అవసరమైన స్క్రూ మొదలుకొని, కృత్రిమ కీళ్లు, భుజాలు, మోకాలు చిప్ప, తుంటి ఎముకలను తాము చాలా కాలంగా తయారు చేస్తున్నామని, ఇప్పటివరకు వాటి మార్కెటింగ్‌కు ప్రయత్నాలు చేయలేదని చెప్పారు. హిందుస్తాన్ యాంటీ బయోటిక్స్ లిమిటెడ్‌తో బయో ఇంప్లాంట్స్ మార్కెటింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. పరీక్షలు అవసరం.. టైటానియం, నికెల్ స్టెంట్ల గురించి మాట్లాడుతూ వీటి సామర్థ్యాన్ని ప్రపంచానికి నిరూపించేందుకు విస్తృత స్థాయిలో వందల మందితో పరీక్షలు నిర్వహించాల్సి ఉందని.. ఇందుకోసం మిలటరీ ఆసుపత్రులను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు దినేశ్ లేఖీ చెప్పారు. ఈ పరీక్షలు తమ దేశంలోనే నిర్వహించాలని ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కజకిస్తాన్ ప్రతిపాదించిందని, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని తగు నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో బయో ఇంప్లాంట్స్ మార్కెటింగ్ ద్వారా రూ.100 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఏఎల్ చైర్మన్, ఎండీ నీరజా సరాఫ్ తదితరులు పాల్గొన్నారు. -
మన స్టెంట్లూ మంచివే!
న్యూఢిల్లీ: విదేశాల్లో తయారయ్యే ఖరీదైన కరొనరీ స్టెంట్లు బాగా పనిచేస్తాయని దేశంలోని చాలామంది వైద్యులు, రోగుల్లో ఒక నమ్మకం ఉంది. దీంతోపాటు దేశీయ కంపెనీలు తక్కువ ధరకే మార్కెట్లోకి తెచ్చే స్టెంట్లు సమర్ధంగా పనిచేయవనే అపోహ ఉంది. అయితే, సామర్ధ్యం, నాణ్యత విషయంలో ఖరీదైన విదేశీ స్టెంట్లతో పోటీ పడగలిగే స్థాయిలో దేశీయంగా తయారైన స్టెంట్లు ఉన్నాయని అంతర్జాతీయ అధ్యయనంలో తాజాగా నిరూపితమయింది. న్యూఢిల్లీలోని బాత్రా హార్ట్ సెంటర్‌కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ ఉపేందర్ కౌల్, నెదర్లాండ్స్ ప్రొఫెసర్ పాట్రిక్ సెర్రుస్‌తో కలిసి ప్రపంచ ప్రఖ్యాత క్లినికల్ రీసెర్చి ఆర్గనైజేషన్(సీఆర్వో) సాయంతో టాలెంట్ పేరుతో ఓ సర్వే నిర్వహించారు. ఆ ఫలితాలను ఇటీవల అమెరికాలోని శాన్‌డియాగోలో జరిగిన నాన్ సర్జికల్ కార్డియాక్ ఇంటర్వెన్షన్స్–టీసీటీ (ట్రాన్స్ క్యాథెటర్ ఇంటర్వెన్షన్స్)లో వెల్లడించారు. సర్వేలో భాగంగా యూరోపియన్ దేశాలకు చెందిన బహుళజాతి సంస్థల స్టెంట్లు అమర్చిన 1,500 మంది రోగులను పరిశీలించారు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే అబాట్ సంస్థ తయారీ ఎక్సియన్స్ స్టెంట్‌తో, భారత్‌లో ఎస్ఎంటీ సంస్థ రూపొందించే సుప్రాఫ్లెక్స్ స్టెంట్లను పోల్చి చూశారు. పనితనం, సురక్షితం విషయంలో ఎక్సియన్స్‌తో సుప్రాఫ్లెక్స్ ఏమాత్రం తీసిపోదని ధ్రువపరిచారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న స్టెంట్ల కంటే భారత్‌లో తయారైనవి అంత సురక్షితం, సమర్ధవంతం కావని వైద్యులు, రోగుల్లో ఉన్న అపోహ తప్పని తేల్చారు. దేశంలో తయారయ్యే స్టెంట్లు అంత సమర్ధవంతంగా పనిచేయవన్న అపోహలను తొలగించేందుకే అంతర్జాతీయంగా పేరున్న సంస్థలతో విదేశాల్లో సర్వే చేపట్టినట్లు డాక్టర్ కౌల్ వివరించారు. దేశీ, విదేశీ స్టెంట్లను వాడిన రోగులపై ఏడాదిపాటు జరిపిన అధ్యయనంలో భాగంగా కార్డియాక్ డెత్, టార్గెట్ వెస్సల్ ఎంఐ వంటి అంశాలు కూడా సమానంగా ఉన్నట్లు తేలిందన్నారు. గత ఏడాది కేంద్రం విదేశీ తయారీ కరొనరీ స్టెంట్ల ధరలపై పరిమితి విధించింది. ఫలితంగా రూ.1.30లక్షల వరకు ఉన్న విదేశీ స్టెంట్ల ధర రూ.35 వేలకు తగ్గిపోయింది. అంతేకాకుండా దేశీయ కంపెనీలు తయారు చేసిన స్టెంట్ల వినియోగం బాగా పెరిగిందని డాక్టర్ కౌల్ తెలిపారు. బహుళ జాతి సంస్థలు తయారు చేసే స్టెంట్ల ధర భారాన్ని మోయలేని దేశాల వారికి ఈ అధ్యయనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ అధ్యయనం పూర్తి వివరాలు లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితం కానున్నాయన్నారు. మిగతా భారతీయ కంపెనీలు కూడా ఇటువంటి అధ్యయనాలు చేపట్టి.. విదేశీ తయారీ స్టెంట్లతో పోలిస్తే తమ స్టెంట్లు తీసిపోవని నిరూపించుకోవాలని కోరారు. గుండెలో మూసుకుపోయిన కరోనరీ ధమనుల్లో స్టెంట్లను అమర్చి రక్త ప్రవాహం సజావుగా సాగేలా చేస్తారు. -
మన స్టెంట్లే మేలు..
సాక్షి, న్యూఢిల్లీ : బహుళజాతి కంపెనీలు రూపొందించే స్టెంట్లతో పోలిస్తే దేశీయంగా తయారయ్యే కరోనరీ స్టెంట్లే మేలైనవని తాజా అథ్యయనం వెల్లడించింది. అమెరికాలోని శాండియాగోలో నాన్ సర్జికల్ కార్డియాక్ ఇంటర్వెన్షన్స్పై ఇటీవల జరిగిన సదస్సులో అథ్యయన వివరాలు సమర్పించారు. యూరప్ సహా పలు దేశాల్లోని 1500 మంది రోగులపై నిర్వహించిన ఈ అథ్యయనాన్ని ప్రపంచ ప్రఖ్యాత క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఆర్ఓ) పర్యవేక్షించింది. విదేశాల్లో తయారయ్యే స్టెంట్లలో ఉండే నాణ్యత, సామర్థ్యం భారత్‌లో తయారయ్యే దేశీయ స్టెంట్లకు లేదని చాలా మంది డాక్టర్లు, రోగుల్లో ఉండే అపోహలను ఈ అథ్యయనం పటాపంచలు చేసింది. గుండె ధమనుల్లో పూడికలకు చికిత్స అందించే క్రమంలో లోహంతో తయారయ్యే కరోనరీ స్టెంట్లపై పాలిమర్స్‌తో ఔషధపు పూత ఉంటుంది. దీర్ఘకాలం సరైన సామర్థ్యంతో పనిచేసేలా వీటిని తయారుచేస్తారు. యూరప్, అమెరికాల్లో తయారయ్యే అబాట్ వాస్కులర్ కంపెనీకి చెందిన జిన్స్ స్టెంట్‌తో పోలిస్తే భారత్‌లో రూపొందే ఎస్‌ఎంటీకి చెందిన సుప్రాఫ్లెక్స్ స్టెంట్ మెరుగైనదని రాండమ్ ట్రయల్‌లో పలువురు పేర్కొన్నారు. దేశీయ స్టెంట్లు చవకగా అందుబాటులో ఉండటంతో తాజా అథ్యయనం నేపథ్యంలో వీటి వాడకం పెరుగుతుందని అథ్యయనంలో చురుకైన పాత్ర పోషించిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ ఉపేంద్ర కౌల్ పేర్కొన్నారు. దేశీయ పరిజ్ఞానంతో తయారయ్యే స్టెంట్లు మెరుగైనవని సర్వేలో వెల్లడవడంస్వాగతించదగిందని చెప్పారు. -
అనైతిక వైద్యం వెనుక అవినీతి చీకటి
వైద్య ఖర్చులు భరించలేని పేదల సంక్షేమచర్యలలో భాగంగా కార్మిక జీవిత బీమా సంస్థ వారు (ఇఎస్ఐసి) అనేక వైద్యశాలలు నడుపుతున్నారు. చిన్న ఉద్యోగులకు, కార్మికులకు అందులో చికిత్స ఉచి తంగా ఇస్తారు. ఒక్కోసారి వాటిలో అవసరమైన చికిత్సా సౌకర్యాలు లేకపోతే వారే సమీపంలోని ప్రయివేటు వైద్యశాలలకు చికిత్సకోసం రోగులను పంపించవలసి ఉంటుంది. అక్కడి చికిత్సకు శస్త్ర చికిత్సలకు, రోగులకు అమర్చిన స్టెంట్ వంటి పరికరాలకు అయ్యే ఖర్చులను కార్మిక జీవిత బీమా సంస్థ భరించవలసి ఉంటుంది. ప్రైవేటు వైద్యదుకాణాల వ్యాపారులు స్టెంట్ అనే పరికరాన్ని గుండెజబ్బుతో బాధపడేవారికి అమర్చినందుకు తీసుకునే డబ్బు విపరీ తంగా ఉంటుంది. వాటి అసలు ధరకు, వారు వసూలు చేసే సొమ్ముకు సంబంధమే ఉండదు. ప్రయివేటు ఆస్పత్రులకు ఇఎస్ఐసి పంపే రోగుల చికిత్సకు వాడే పరికరాలకు గాను చెల్లింపుల గందరగోళం గురించి ఒక ఆర్టీఐ దరఖాస్తు దాఖ లైంది. రెండో అప్పీలు రూపంలో ఆ సమస్య కేంద్ర సమాచార కమిషన్‌కు చేరింది. ఎవరైనా సరే చికిత్సకు వాడే వస్తువులకు ఇష్టం వచ్చినట్టు ధర విధించడానికి వీల్లేదని, ఇఎస్ఐసి వారు కేవలం సీజీహెచ్ఎస్ వారు నిర్ధారించిన ధరల ప్రకారమే రేట్లు వసూలు చేస్తారని సమాధానం ఇచ్చారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వారి రేట్లప్రకారం కూడా చెల్లింపులు ఉంటాయి. ఇఎస్ఐ కూడా ధరలను నిర్ధారించింది. గుండె రోగులకు కార్డో వాస్క్యులార్ డెప్రిబిలేటర్ సింగిల్ చాంబర్, డబుల్ చాంబర్, సీఆర్‌టీపీ వస్తువులను, పేసర్లను అమర్చుతూ ఉంటారు. అయితే ఇఎస్ఐ తాము పంపిన రోగులకు ఎంత ధర వసూలు చేస్తున్నారనే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రయివేటు ఆస్పత్రుల వారు అడిగినంత డబ్బు ఇచ్చి, రేట్ల తేడాలు పట్టించుకోకుండా ఉండేందుకు ప్రతిఫలాలు అందుకుంటున్నారని దరఖాస్తుదారు పవన్ సారస్వత్ ఫిర్యాదు చేశారు. గుండె సింగిల్ చాంబర్‌కు వాడే ఐసీడీకి ఎయిమ్స్ వారు లక్షా 75 వేల 786 రూపాయలు ధర నిర్ణయిస్తే ఇఎస్ఐ పంపిన రోగులకోసం ప్రయివేటు వైద్యశాలలు 5 లక్షల 50 వేల నుంచి 8 లక్షల 50 వేల దాకా అడుగుతున్నారని, ఇఎస్ఐసి చెల్లిస్తున్నదని వివరించారు. కార్మికులు. చిన్న ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు, బీమా సొమ్మును ఆస్పత్రులు ఈ విధంగా దోచుకుంటున్నాయని ఫిర్యాదు చేశారు. అసలు ఈ విధంగా స్టెంట్లు వేయడం, ఖరీదైన చికిత్సలు చేయడం కూడా చాలా సందర్భాలలో అవసరం లేదని నిపుణులైన డాక్టర్ల మాట. అవసరం లేని కేసుల్లో కూడా సర్జరీలు చేస్తున్నారని, వారు సూచిం చిన చికిత్స వెంటనే చేయకపోతే ప్రాణాలుపోతాయని, అందుకు తాము బాధ్యులం కామని ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్లు భయపెడితే ఏమీ తోచక భయపడి రోగులు స్టెంట్లు వేయించుకోవడానికి ఒప్పుకోక తప్పడం లేదని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ దేవిశెట్టి (నారాయణ హృదయాలయ) అన్నారు. సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ మనోజ్ అగర్వాల్ ఔషధ వైద్యంద్వారా గుండె జబ్బును నివారించే అవకాశం ఉంటే స్టెంట్ వాడకూడదని అన్నారు. అవసరం లేకపోయినా స్టెంట్ వాడితే అది చాలా తీవ్రమైన అనైతిక చర్య అని వైద్య వృత్తికి ఉన్న గౌరవాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని విమర్శించారు. అసలు ఇఎస్ఐ వారు ఎందుకు వేలాది మంది రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు పంపించేస్తున్నారనేది ప్రశ్న. రెండున్నర రెట్లకన్న ఎక్కువ ధరను స్టెంట్లకు చెల్లించాల్సి వస్తోందని వారికీ తెలుసు. ఇఎస్ఐ సంస్థ వారు కేంద్ర ప్రభుత్వానికి గానీ, ఆరోగ్య శాఖ వారికి గానీ ఈ సంగతులు వివరించి, ఈ దారుణమైన దోపిడీని ఆపడానికి కనీసం ప్రయత్నించకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. అందుకు కారణం ప్రయివేటు ఆస్పత్రులనుంచి వీరికి క్రమం తప్పకుండా ఒక్కో స్టెంట్‌కు కొంత కమీషన్ చొప్పున సొమ్ము అందుతున్నదని, రోగులను తమకు రిఫర్ చేసినందుకు ఇఎస్ఐసి వారికి తగిన ప్రతిఫలం ముట్టచెబుతారని అన్నారు. వీరి లంచం డబ్బులు కూడా కలుపుకుని, దానికిపైన కూడా తమ లాభాన్ని తగిలించి, రోగులనుంచి, బీమా కంపెనీలనుంచి ఎక్కువ డబ్బు వసూలు చేయడానికి ఆస్పత్రులు వెనుకాడడం లేదని ఆయన వివరించారు. చర్యతీసుకునే వారెవరు? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
‘గుండె’లు తీసిన బంట్లు
సాక్షి, హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన అనిల్‌కుమార్‌కు బీపీ, షుగర్ సహా ఏ అనారోగ్య సమస్యా లేదు. ఓ రోజు కడుపునొప్పి రావడంతో దారిలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు ఓసారి కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లమన్నాడు. కార్పొరేట్లో ఏవేవో పరీక్షలు చేసి గుండె సమస్య ఉందని, వెంటనే స్టెంట్ వేయాలని చెప్పారు. అనిల్ అందుకు అంగీకరించడంతో మరుసటి రోజే ‘ఆరోగ్యశ్రీ’కింద స్టెంట్ వేసేశారు. నిజానికి అనిల్‌కు ఆ స్టెంట్ వేయాల్సిన అవసరం లేదు! వరంగల్‌కు చెందిన ఓ రైతు గుండెలో నొప్పి రావడంతో హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చాడు. ఆయనకు అందించాల్సిన వైద్య వివరాలను సదరు ఆసుపత్రి ఆన్లైన్లో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు పంపింది. రోగి గుండెకు స్టెంట్ వేయాలని ప్రతిపాదించాయి. ఈ వివరాలను ఆరోగ్యశ్రీలోని ఓ వైద్య నిపుణుడు పరిశీలించి.. స్టెంట్ అవసరం ఉండదు కదా అని ప్రశ్నించారు. ఆస్పత్రి వారు అందుకు బదులిస్తూ.. ‘‘ఇప్పుడు అవసరం లేదుగానీ త్వరలో అవసరం ఉండవచ్చు. అయినా ఉన్నతాధికారులు చెప్పాలి గానీ.. ధ్రువీకరించాల్సింది నువ్వు కాదు’’అంటూ దబాయించారు. మరుసటి రోజు ఆస్పత్రి ప్రతిపాదించిన ఆపరేషన్‌కు అనుమతి వచ్చేసింది! ...ఇలా ఒకటీ రెండు కాదు.. ఆరోగ్యశ్రీ కింద జరుగుతున్న గుండె ఆపరేషన్లలో కార్పొరేట్ ఆస్పత్రుల అక్రమాలకు లెక్కేలేదు. స్టెంట్లు, బైపాస్ సర్జరీల వంటి ఖరీదైన శస్త్ర చికిత్సల నిర్వహణ అడ్డగోలుగా మారింది. గుండె ఆపరేషన్లపై ఆరోగ్యశ్రీ ట్రస్టు కింది స్థాయి సిబ్బంది ఈ లోపాలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం ఉండడం లేదు. లోపాలను సరిచేయకపోవడంతో.. ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు పరాకాష్టకు చేరుతున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఇలా ప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారుతోంది. ప్రజల ఆరోగ్యం ఏమైనా సరే.. తమకు కాసులు వస్తే చాలన్నట్టు ఆసుపత్రులు వ్యవహరిస్తున్నాయి. అవసరం లేకున్నా ఖరీదైన శస్త్ర చికిత్సలు చేస్తూ.. కోట్లు దండుకుంటున్నాయి. నిరంతర పర్యవేక్షణతో అక్రమాలను నిరోధించాల్సిన ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. గుండె ఆపరేషన్లే ఎక్కువ.. ఆరోగ్యశ్రీలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్టెంట్ల అమర్చడం, బైపాస్ సర్జరీలు కలిపి ఏటా సగటున 17 వేల ఆపరేషన్లు అవుతున్నాయి. ఇందులో స్టెంట్ల కేసులు 15 వేలు, బైపాస్ శస్త్ర చికిత్సలు 2 వేల దాకా ఉంటున్నాయి. ఒక్కో బైపాస్ ఆపరేషన్‌కు సగటున రూ.1.14 లక్షలు, స్టెంట్‌కు రూ.54 వేల చొప్పున ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తోంది. ఎక్కువ డబ్బులు వచ్చే శస్త్ర చికిత్సలు కావడంతో ప్రైవేటు ఆస్పత్రులు వీటిని లాభదాయక వ్యవహారంగా మార్చేశాయి. గుండెకు సంబంధించిన వ్యాధులు కావడంతో ప్రజల్లోనూ ఎక్కువ ఆందోళన ఉంటోంది. దీన్ని అదనుగా చేసుకొని ప్రైవేటు ఆస్పత్రులు చెలరేగిపోతున్నాయి. అవసరం లేకపోయినా స్టెంట్లు అమర్చడం, నేరుగా బైపాస్ శస్త్రచికిత్స చేయాల్సిన సందర్భాల్లో.. ముందుగా స్టెంటు వేయడం వంటివి చేస్తున్నాయి. ఒక స్టెంట్ వేశాక ఆరు నెలల్లోపే మళ్లీ రెండో స్టెంట్ వేయాలని రోగులను హెచ్చరిస్తున్నాయి. ఇలా రెండు రకాలా డబ్బులు ఆర్జించిన తర్వాత అదే రోగికి బైపాస్ చేయాలని చెబుతున్నాయి. పెరిగిపోతున్న ‘రెండో స్టెంట్’ సాధారణంగా రోగులకు గుండె పనితీరు నిర్ధారణ పరీక్షలు (యాంజియోగ్రామ్) నిర్వహిస్తే వారిలో 60 మందిలో ఒక్కరికి మాత్రమే ఒక స్టెంట్ అవసరం ఉంటుందని, ఇక రెండో స్టెంట్ అవసరం ఇంకా తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యశ్రీ పరీక్షల్లో మాత్రం రెండో స్టెంట్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. గతేడాది రెండో స్టెంట్ వేసుకున్న వారి సంఖ్య ఏకంగా 50.80 శాతం వరకు నమోదైంది. అవసరం లేకున్నా రెండో స్టెంట్ అమర్చడంతో ఆరోగ్యశ్రీలో ఏటా అదనంగా రూ.50 కోట్ల వరకు వృథా అవుతున్నట్లు అంతర్గత విచారణలో నిర్ధారించారు. అయినా చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యశ్రీలోని వైద్య నిపుణుల సహకారంతోనే ఈ అక్రమ, అనవసర శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ గుర్తించిన కొన్ని లోపాలివీ ►గుండె శస్త్ర చికిత్సలలో ఎక్కువగా అవసరం లేనివే ఉంటున్నాయి. గుండె పని చేసేందుకు ఉపయోగపడే స్టెంట్ అమర్చాలంటే రక్తనాళాల్లో 70 శాతం కంటే ఎక్కువగా పూడిక ఉండాలి. కానీ 30 శాతం పూడిక ఉన్నా స్టెంట్ వేస్తున్నారు ► అవసరం లేకున్నా రెండో స్టెంట్ వేస్తున్నారు ► బైపాస్ సర్జరీ రోగుల్లో గుండెకు రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం 70 శాతం వరకు ఉంటుంది. ఇది 40 శాతం కంటే తగ్గిపోయినప్పుడే ఐఏబీపీ చికిత్సను ఉపయోగిస్తారు. కానీ ప్రైవేటు ఆస్పత్రులు, ముఖ్యంగా కార్పొరేట్ ఆస్పత్రులు ప్రతి ఒక్కరికీ ఐఏబీపీ రకం చికిత్సనే చేస్తున్నాయి. 98 శాతం బైపాస్ సర్జరీల్లో ఐఏబీపీని ఉపయోగించినట్లు తేలింది. బీమా కంపెనీల ఆందోళన అడ్డగోలుగా గుండె ఆపరేషన్లపై బీమా కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ఆస్పత్రికి వచ్చే రోగికి వైద్య బీమా ఉందా అని వైద్యుల నుంచి వచ్చే మొదటి ప్రశ్న. ఉంది అని అనడమే ఆలస్యం అన్ని టెస్టులు చేయాలంటూ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుంటున్నారు. అన్ని రకాల పరీక్షలు చేశామని, గుండె సమస్య ఉందని చెబుతారు. ఇప్పుడైతే స్టెంట్‌తో సరిపోతుందని, నిర్లక్ష్యం చేస్తే బైపాస్ చేయాల్సి రావచ్చని భయపెడతారు. సదరు వ్యక్తి స్టెంట్ వేయడానికి ఒప్పుకొని అంగీకార పత్రం రాస్తాడు. వెంటనే స్టెంట్ అమరుస్తారు. ఒక నెలలో అసాధారణంగా ఈ తరహా కేసులు మా దృష్టికి రావడంతో మేం వాటిని పరిశీలించాం. పరీక్షల నివేదికలు తెప్పించుకున్నాం. అన్ని పరిశీలిస్తే మేం పరిశీలించిన పది కేసుల్లో నాలుగు కేసుల్లో అసలు ఎలాంటి హృద్రోగ సమస్యలే లేవు. ఇద్దరికీ సమస్య ఉన్నా మందులతో నయమయ్యే స్టేజీలోనే ఉంది’’అని ఓ బీమా కంపెనీ ప్రతినిధి అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేశారు. -
2 శాతం పెరిగిన స్టెంట్ల ధరలు
న్యూఢిల్లీ: ఔషధ ధరల నిర్ణాయక సంస్థ (ఎన్పీపీఏ) స్టెంట్ల ధరలను 2 శాతం పెంచింది. టోకు ధరల సూచీ ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి రానుంది. తాజా మార్పులతో బేర్ మెటల్ స్టెంట్ల ధరలు రూ.7260 నుంచి రూ.7400కు పెరిగాయి. అలాగే ఎల్యూటింగ్ స్టెంట్ల ధరలు రూ.29600 నుంచి రూ. 30,180కి చేరుకున్నాయి. హెపటిటిస్, హెచ్ఐవీ, టీబీలకు లాంటి వ్యాధులకు వాడే 46 డ్రగ్ ఫార్ములేషన్ల గరిష్ట ధరలను కూడా ఎన్పీపీఏ నిర్ణయించింది. ఫిబ్రవరిలో ఎన్పీపీఏ స్టెంట్లను ధరల నియంత్రణ జాబితాలోకి తెచ్చి బేర్ మెటల్ స్టెంట్ల ధరలను రూ.7260గా, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్ల ధరలను రూ.29600గా నిర్ధారించింది. అంతకు ముందు వాటి సరాసరి గరిష్ట ధరలు వరుసగా రూ.45,100, రూ.1.21 లక్షలుగా ఉన్నాయి. -
స్టెంట్ల ధరలు తగ్గినా... పేదలను పీడిస్తూనే ఉన్నారు
⇒ ప్రైవేట్ ఆసుపత్రులను అదుపుచేయటంలో విఫలం ⇒ ప్రభుత్వం తీరును ఎండగట్టిన కాంగ్రెస్ సభ్యులు ⇒ ధరలు పెంచి అమ్మితే చర్యలు తప్పవన్న మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా హృద్రో గంతో చనిపోతున్న వారిలో తెలంగాణ ప్రాంత వాసుల సంఖ్యనే అధికంగా ఉన్నందున ప్రజ లకు తక్కువ ధరలకే స్టెంట్లు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభలో డిమాండ్ చేసింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ నిర్ధారించిన ధరలకే స్టెంట్లు అందుబాటులో ఉండేలా చూడాలని, రాష్ట్రంలో ప్రతి నెలా ఏడు వేల స్టెంట్లు అవసరమవుతున్నందున స్థాని కంగా ప్రభుత్వమే నాణ్యమైన స్టెంట్లు తయారు చేసేందుకు యూనిట్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని ఆలోచించాలని కోరింది. కేంద్రం స్టెంట్ల ధరలను నిర్ధారించిందని.. కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వాటిని అధిక ధరలకు విక్రయిస్తు న్నా ప్రభుత్వం నిలవరించ లేకపో తోందని ఆరోపించింది. బుధవారం శాసన సభలో కాంగ్రెస్ సభ్యులు జీవన్‌రెడ్డి, చిన్నా రెడ్డి, సంపత్ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం ధర లు తగ్గించినా దాన్ని అమలు చేయకపోవటం దారుణమన్నారు. వైద్య శాఖ మంత్రి నిమ్స్‌ను వెంటనే తనిఖీ చేయాలన్నారు. స్టెంట్ అవసర మో కాదో తేల్చేందుకు పరీక్షలు అందుబా టులో ఉన్నప్పటికీ చాలా ఆసుపత్రుల్లో రోగి రాగానే నేరుగా స్టెంట్ వేయాలని డాక్టర్లు చెప్తున్నారని, ప్రాణభయంతో పేదలు ఆస్తులు అమ్మి స్టెంట్లు కొనాల్సి వస్తోందని అధికార పార్టీ సభ్యుడు శ్రీనివాసగౌడ్ పేర్కొన్నారు. నిర్ధారిత ధరలకే స్టెంట్లు: లక్ష్మారెడ్డి నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ మందు పూత ఉన్న స్టెంట్ ధరను రూ.29,600గా, పూత లేని స్టెంట్ ధర రూ.7,260గా నిర్ధారించిందని, ఆ ధరలకే వాటిని అమ్మాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ ధరలకు అమ్మలేక కొన్ని కంపెనీలు మార్కెట్లోని స్టెంట్లను వెనక్కు తీసుకుం టున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టును అడాప్ట్ చేసుకుని రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. ఇందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి పర్యవేక్షి స్తామన్నారు. అనవసర శస్త్రచికిత్సలు చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నా మన్నారు. ఇటీవలే అలాంటి 8 ఆసుపత్రులపై చర్యలు తీసుకు న్నామని చెప్పారు. నిమ్స్‌లో కొత్తగా 109 వెంటిలేటర్లు, 54 వరకు బెడ్లు సమకూర్చా మన్నారు. నిమ్స్ తరహాలో మరిన్ని ఆసుపత్రులు నిర్మించే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. -
ఆ డబ్బు తిరిగి ఇవ్వండి!
ఢిల్లీ: స్టెంట్ల ధరలు తగ్గిగా ప్రైవేటు ఆస్పత్రులు పాత ధరకే అమ్ముతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు అలా అమ్మకూడదని అఖరి హెచ్చరిక చేసింది జాతీయ ఔషద నియంత్రణ సంస్థ. అధికంగా డబ్బు వసూలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికంగా వసూలు చేసిన డబ్బును రోగులకు చెల్లిస్తే చర్యలుండవని ఒక ప్రకటన జారీ చేసింది. ఢిల్లీ, హరియాణాలోని పలు ఆస్పత్రులపై అధిక వసూళ్ల ఆరోపణలు వస్తుండటంతో సంస్థ హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని కోరింది. -
దోపిడీ జబ్బుకు చికిత్స!
ఆధునిక జీవనశైలి, ఆహారపుటలవాట్ల పర్యవసానంగా ఈమధ్య కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసులవారినీ కాటేస్తున్న ప్రాణాంతక వ్యాధి గుండె జబ్బు. అన్నిటిమాదిరే ఈ వ్యాధి కూడా ఉత్పత్తిదారులకూ, కార్పొరేట్ ఆసుపత్రులకూ, ఫైవ్‌స్టార్ వైద్యులకూ కల్పతరువైంది. స్వల్ప వ్యవధిలో భారీ లాభా లను ఆర్జించేందుకు మార్గమైంది. ఫలితంగా ఏటా వేలాది కోట్ల రూపాయల జనం సొమ్ము నిలువుదోపిడీ అయింది. ఆరోగ్యశ్రీలాంటి పథకాలున్న రాష్ట్రాల్లోని నిరుపే దల మాటేమోగానీ... మిగిలినచోట్ల ఈ జబ్బు బారిన పడిన సామాన్యులకు చావు తప్ప దిక్కులేదు. ఈ దయనీయమైన స్థితిని మార్చడానికి ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం కదలింది. గుండె రక్త నాళాలు మూసుకుపోయిన హృద్రోగులకు అమర్చే స్టెంట్ల ధరలకు కళ్లెం వేసింది. పర్యవసానంగా స్టెంట్ల ధరలు ఒక్కసారిగా 86 శాతం మేర తగ్గాయి. సర్వసాధారణంగా హృద్రోగులకు అమర్చే డీఈఎస్ స్టెంట్ ధర ఇప్పటివరకూ దాదాపు రూ. 2,50,000 ఉంటే తాజా నిర్ణయంతో అది రూ. 29,600కు దిగొచ్చింది. ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉన్న ఎబాట్ సంస్థ ఒక్కో స్టెంట్‌ను రూ. 27,000కు పంపిణీదారుకు విక్రయిస్తే రోగికి చేరేసరికి దాని ధర మరింత ఎక్కువవుతోంది. రోగికి అమర్చడం మినహా మరే పాత్రా లేని ఆసు పత్రులు, వైద్యులు కూడా ఈ క్రమంలో డబ్బు వెనకేసుకుంటున్నారు. వెరసి స్టెంట్ ధర లక్షల్లోకి ఎగబాకుతోంది. ఇది ఒక్క స్టెంట్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. కెమో థెరపీ మాటున, ఎముకలకు సంబంధించిన వ్యాధుల చికిత్సల్లో కూడా ఈ మాదిరి దోపిడీయే రాజ్యమేలుతున్నదని ప్రజారోగ్య కార్యకర్తలు చెబుతున్న మాట. స్టెంట్ల పేరు చెప్పి సాగుతున్న నిలువుదోపిడీని అరికట్టాలని దాదాపు దశాబ్ద కాలంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాపార విస్తృతి ఎంతో తెలుసు కుంటే ఎలాంటివారైనా గుండెలు బాదుకోవాల్సిందే. హృద్రోగులు ఏటా దాదాపు రూ. 4,450 కోట్ల సొమ్మును ఈ స్టెంట్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తున్నదని ఒక అంచనా. కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బు వచ్చిందంటే ఆ ఇల్లు గుల్ల కావలసిందే. అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. లేదంటే చావుకు సిద్ధపడాల్సిందే. నిజానికి లక్షలాదిమంది హృద్రోగులు ఈ క్షణాన తల్చుకోవాల్సిన పేరు బీరేం దర్ సంగ్వాన్. చాలా యాదృచ్ఛికంగా రెండేళ్లక్రితం ఆయన ప్రారంభించిన న్యాయ పోరాటం ఏటా వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్న స్టెంట్ పరిశ్రమను చావు దెబ్బ తీసింది. నిరుపేద కుటుంబాలు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఒక సందర్భంలో హృద్రోగిని చూడటానికి ఆసుపత్రికి వెళ్లాల్సివచ్చినప్పుడు ఆయన స్టెంట్‌కు వసూలు చేసే ధరను చూసి విస్మయపడ్డాడు. దానికి బిల్లు కూడా ఇవ్వరని తెలిసి మరింత ఆశ్చర్యపోయాడు. కొంత పరిశోధన తర్వాత దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ ఇదే తంతు నడుస్తున్నదని నిర్ధారణకొచ్చాడు. శస్త్ర చికిత్సకు ఒక్కో రోగి దాదాపు రూ. 4 లక్షలు ఖర్చు చేయాల్సివస్తున్నదని లెక్కేశాడు. అనంతరం ఈ నిలు వుదోపిడీపై పోరాడాలన్న నిర్ణయానికొచ్చాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. మన దేశంలో గుండె జబ్బు అంటువ్యాధులను మించి విస్తరిస్తోంది. జనాభాలో 3 కోట్ల మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. గుండె సంబంధ వ్యాధులతో, గుండెపోట్లతో ఏటా 20 లక్షలమంది మరణిస్తున్నారు. దేశంలో ఏటా రెండు లక్షల గుండె శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని ఒక అంచనా. ఇందులో నిజంగా అవసరం ఏర్పడి చేస్తున్న ఆపరేషన్ల సంఖ్య ఎంతన్న సంగతలా ఉంచి... వీటి ద్వారా కార్పొరేట్ ఆసు పత్రులకు వచ్చిపడుతున్న ఆదాయం అంతా ఇంతా కాదు. ఉత్పత్తిదారుల నుంచి రోగులకే చేరేసరికి ఒక్కో స్టెంట్ ధర 1,000 నుంచి 2,000 శాతం మధ్య పెరుగు తున్నదంటున్నారు. పైగా ఫలానా సంస్థ ఉత్పత్తి చేసే స్టెంట్‌నే కొనుగోలు చేయా లని ఒత్తిళ్లు! చవగ్గా ఉన్న స్టెంట్ వైపు మొగ్గు చూపితే బెదరగొట్టడం!! నిజానికి ఈ దోపిడీ పర్యవసానంగా నష్టపోతున్నది ప్రైవేటు వ్యక్తులు మాత్రమే కాదు... ప్రభుత్వ ఖజానా సైతం హరిం చుకుపోతోంది. దేశంలో స్టెంట్ల సర ఫరాలో 70 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల... ప్రభుత్వ రంగ ఆరోగ్య పథకాల పరిధిలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు సంతోషించాల్సింది స్టెంట్ల ధరలు దిగొచ్చాయని కాదు... ఇన్నేళ్లుగా దీని సంగతి ప్రభుత్వాలకు ఎందుకు పట్టలేదని ప్రశ్నించుకోవాలి. క్యూబా వంటి చిన్న దేశం కూడా తమ పౌరులకు ఉచిత ఆరోగ్య సౌకర్యాలను కల్పిస్తూ అందుక నుగుణంగా స్టెంట్ల వంటివాటిని అతి చవగ్గా ఉత్పత్తి చేయడానికి నూతన మార్గా లను అన్వేషిస్తే మన దేశంలో మాత్రం ఎవరెంతగా గొంతు చించుకున్నా పాలకు లకు పట్టలేదు. క్యూబాను సోషలిస్టు దేశమని కొట్టిపారేయొచ్చు. కానీ యూరప్ దేశాల్లో, థాయ్‌లాండ్, శ్రీలంక, లాటిన్ అమెరికా దేశాల్లో సైతం పౌరులందరికీ ఉచిత ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఔషధ రంగ సంస్థలపై నియంత్రణ ఉంటుంది. వాస్తవానికి దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు చవగ్గా లభ్యమయ్యే కలామ్–రాజు స్టెంట్‌ను అభివృద్ధి చేశారు. కేరళకు చెందిన మరో డాక్టర్ కూడా ఆ మాదిరి స్టెంట్కే రూపకల్పన చేశారు. కానీ వాటిని మరింత అభివృద్ధి పరిచే దిశగా చర్యలు ప్రారంభించాలని మన పాలకులకు లేకపోయింది. ప్రాణాంతక వ్యాధులకు వినియోగించే ఔషధాల ధరలను నియంత్రించేందుకు మన దేశంలో జాతీయ అత్యవసర ఔషధ జాబితా (ఎన్‌ఈఎల్‌ఎం) ఉంటుంది. అందులో చేర్చిన మందుల ధరలు పౌరులకు అందు బాటులో ఉండాలి. ఇన్నాళ్లుగా స్టెంట్లు ఆ జాబితాలో లేవు. బీరేందర్ పోరాటం, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల పర్యవసానంగా ఎట్టకేలకు ఇన్నాళ్లకు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్పీపీఏ) మేల్కొంది. స్టెంట్లను ఎన్ఈఎల్ఎంలో చేర్చడంతో పాటు వాటి గరిష్ట ధరల్ని నిర్ణయించింది. కానీ ఇది ఇక్కడితో ఆగకూడదు. ఇతర ప్రాణాంతక వ్యాధుల్లో సాగే నిలువుదోపిడీని సైతం అరికట్టాలి. ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే దేశం అన్నివిధాలా బాగుపడుతుందని గ్రహించాలి. -
‘స్టెంట్ల’ లాభాలు వింటే గుండె ఆగాల్సిందే
గతంలోకన్నా ఇప్పుడు గుండె జబ్బులు పెరిగాయో, లేదో గానీ ఛాతి నొప్పంటూ ఆస్పత్రికి వెళితే చాలు ఎడా పెడా ‘స్టెంట్లు’ వేసేస్తున్నారు డాక్టర్లు. స్టెంట్లలో లాభాల మార్జిన్ ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. వాటి తయారీ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, ఆస్పత్రులకు లేదా డాక్టర్లకు స్టెంట్లలో వచ్చే లాభం ఎంతో తెలిస్తే ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు కూడా గుండెపోటు రావాల్సిందే. స్టెంట్లు డిస్ట్రిబ్యూటర్ దగ్గరి నుంచి రోగి వద్దకు వెళ్లేసరికి ఉత్పాదక ధర నుంచి 892 శాతం పెరుగుతోంది. ఇందులో ఆస్పత్రులకు లభించే మార్జినే 654 శాతం అంటే అవి ఎంతటి దారుణ వ్యాపారం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఔషధాన్ని విడుదల చేసే స్టెంట్లలో (డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్) ఒక్కదాన్ని తయారు చేసేందుకు ఉత్పత్తిదారుడికి 40,820 రూపాయలు అవుతుంటే అది ఆస్పత్రిలో రోగికి 1,98,000 రూపాయలకు చేరుతోంది. అది ఎలాగంటే ఉత్పత్తిదారుడికి ఒక్కో స్టెంట్‌కు 40,820 రూపాయలు పడుతుంటే అది డిస్ట్రిబ్యూటర్ వద్దకు 1,01,000 రూపాయలకు, అక్కడి నుంచి ఆస్పత్రులకు 1,70,000 రూపాయలకు, అక్కడి నుంచి రోగికి 1,98,000 రూపాయలకు చేరుతోంది. అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న ఈ స్టెంట్ల వ్యాపారాన్ని నియంత్రించేందుకు ‘ధరల నియంత్రణా వ్యవస్థ’ పరిధిలోకి వీటిని తీసుకురావాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇందులో స్టేక్ హోల్డర్లకు కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం గత డిసెంబర్ నెలలోనే నోటిఫికేషన్ జారీచేసింది. ఇప్పటికే నెల రోజులు గడుస్తున్నా ఇంకా ఈ అంశం ఓ కొలిక్కి రాలేదు. స్టెంట్ల ధరను తమ వద్ద నియంత్రించే బదులు ఆస్పత్రుల వద్దనే నియంత్రించాలని ఉత్పత్తిదారులు వాదిస్తున్నారు. అందరి వాదనలు విన్న తర్వాత ఫార్మాస్యూటికల్స్ విభాగం ఓ నిర్ణయం తీసుకోనుంది. ధరల నియంత్రణ జరగాలంటే మరో నెల రోజులపాటు నిరీక్షించాల్సిందే. స్టెంట్లకు గరిష్ట ధరను నిర్ణయించాలంటే ఇవి బహిరంగ మార్కెట్లో లభించవు. ఉత్పత్తిదారుడి నుంచి పంపిణీదారుడి ద్వారా నేరుగా కార్డియోలజిస్టులకు లేదా ఆస్పత్రులకు వెళతాయి. ఈ కారణంగానే ప్రైవేటు ఆస్పత్రులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. -
25 వేలకు కొని.. 1.55 లక్షలకు అమ్ముతున్నారు
ముంబై: ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వస్తున్న హృద్రోగులను నిలువు దోపీడి చేస్తున్నారు. హృద్రోగులకు అమర్చే స్టెంట్లను లాభసాటి వ్యాపారంగా మార్చేశారు. పశ్చిమ దేశాల నుంచి భారత్‌కు దిగుమతి చేసుకునే ఒకో స్టెంట్ విలువ అక్షరాల 25 వేల రూపాయలు. కానీ రోగికి అమ్మే విలువ ఏకంగా 1.55 లక్షల వరకు ఉంటోంది. అంటే దిగుమతి రేటు కంటే దాదాపు 700 శాతం ఎక్కువ. ముంబై సహా మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఈ తంతు సాగుతోంది. స్టెంట్ల దిగమతి దారులు దాని ధరపై దాదాపు 120 శాతం లాభానికి డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు తాము కొనుగోలు చేసిన మొత్తం కంటే దాదాపు 120-125 శాతం అధిక ధరకు ఆస్పత్రులకు విక్రయిస్తున్నారు. ఇక ఆస్పత్రి యాజమాన్యాలు కనీసం 25 శాతం అధిక ధరను రోగుల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో దిగుమతిదారు నుంచి స్టెంట్ రోగికి వెళ్లే క్రమంలో క్రమేణా రేటు పెంచుతూ దోచుకుంటున్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వచ్చే హృద్రోగులు తమకు భారమైనా గత్యంతరం లేని పరిస్థితుల్లో లక్షలు ఖర్చు చేసి స్టెంట్లు కొనుగోలు చేస్తున్నారు.