దోపిడీ జబ్బుకు చికిత్స! | Hospitals must display price list of stents, says NPPA | Sakshi
Sakshi News home page

దోపిడీ జబ్బుకు చికిత్స!

Published Thu, Feb 23 2017 1:06 AM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

దోపిడీ జబ్బుకు చికిత్స!

దోపిడీ జబ్బుకు చికిత్స!

ఆధునిక జీవనశైలి, ఆహారపుటలవాట్ల పర్యవసానంగా ఈమధ్య కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసులవారినీ కాటేస్తున్న ప్రాణాంతక వ్యాధి గుండె జబ్బు. అన్నిటిమాదిరే ఈ వ్యాధి కూడా ఉత్పత్తిదారులకూ, కార్పొరేట్‌ ఆసుపత్రులకూ, ఫైవ్‌స్టార్‌ వైద్యులకూ కల్పతరువైంది. స్వల్ప వ్యవధిలో భారీ లాభా లను ఆర్జించేందుకు మార్గమైంది. ఫలితంగా ఏటా వేలాది కోట్ల రూపాయల జనం సొమ్ము నిలువుదోపిడీ అయింది. ఆరోగ్యశ్రీలాంటి పథకాలున్న రాష్ట్రాల్లోని నిరుపే దల మాటేమోగానీ... మిగిలినచోట్ల ఈ జబ్బు బారిన పడిన సామాన్యులకు చావు తప్ప దిక్కులేదు. ఈ దయనీయమైన స్థితిని మార్చడానికి ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం కదలింది. గుండె రక్త నాళాలు మూసుకుపోయిన హృద్రోగులకు అమర్చే స్టెంట్ల ధరలకు కళ్లెం వేసింది.

పర్యవసానంగా స్టెంట్ల ధరలు ఒక్కసారిగా 86 శాతం మేర తగ్గాయి. సర్వసాధారణంగా హృద్రోగులకు అమర్చే డీఈఎస్‌ స్టెంట్‌ ధర ఇప్పటివరకూ దాదాపు రూ. 2,50,000 ఉంటే తాజా నిర్ణయంతో అది రూ. 29,600కు దిగొచ్చింది. ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉన్న ఎబాట్‌ సంస్థ ఒక్కో స్టెంట్‌ను రూ. 27,000కు  పంపిణీదారుకు విక్రయిస్తే రోగికి చేరేసరికి దాని ధర మరింత ఎక్కువవుతోంది. రోగికి అమర్చడం మినహా మరే పాత్రా లేని ఆసు పత్రులు, వైద్యులు కూడా ఈ క్రమంలో డబ్బు వెనకేసుకుంటున్నారు. వెరసి స్టెంట్‌ ధర లక్షల్లోకి ఎగబాకుతోంది. ఇది ఒక్క స్టెంట్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. కెమో థెరపీ మాటున, ఎముకలకు సంబంధించిన వ్యాధుల చికిత్సల్లో కూడా ఈ మాదిరి దోపిడీయే రాజ్యమేలుతున్నదని ప్రజారోగ్య కార్యకర్తలు చెబుతున్న మాట. స్టెంట్ల పేరు చెప్పి సాగుతున్న నిలువుదోపిడీని అరికట్టాలని దాదాపు దశాబ్ద కాలంగా వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యాపార విస్తృతి ఎంతో తెలుసు కుంటే ఎలాంటివారైనా గుండెలు బాదుకోవాల్సిందే. హృద్రోగులు ఏటా దాదాపు రూ. 4,450 కోట్ల సొమ్మును ఈ స్టెంట్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తున్నదని ఒక అంచనా. కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బు వచ్చిందంటే ఆ ఇల్లు గుల్ల కావలసిందే. అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. లేదంటే చావుకు సిద్ధపడాల్సిందే.

నిజానికి లక్షలాదిమంది హృద్రోగులు ఈ క్షణాన తల్చుకోవాల్సిన పేరు బీరేం దర్‌ సంగ్వాన్‌. చాలా యాదృచ్ఛికంగా రెండేళ్లక్రితం ఆయన ప్రారంభించిన న్యాయ పోరాటం ఏటా వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్న స్టెంట్‌ పరిశ్రమను చావు దెబ్బ తీసింది. నిరుపేద కుటుంబాలు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఒక సందర్భంలో హృద్రోగిని చూడటానికి ఆసుపత్రికి వెళ్లాల్సివచ్చినప్పుడు ఆయన స్టెంట్‌కు వసూలు చేసే ధరను చూసి విస్మయపడ్డాడు. దానికి బిల్లు కూడా ఇవ్వరని తెలిసి మరింత ఆశ్చర్యపోయాడు. కొంత పరిశోధన తర్వాత దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ ఇదే తంతు నడుస్తున్నదని నిర్ధారణకొచ్చాడు. శస్త్ర చికిత్సకు ఒక్కో రోగి దాదాపు రూ. 4 లక్షలు ఖర్చు చేయాల్సివస్తున్నదని లెక్కేశాడు. అనంతరం ఈ నిలు వుదోపిడీపై పోరాడాలన్న నిర్ణయానికొచ్చాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. మన దేశంలో గుండె జబ్బు అంటువ్యాధులను మించి విస్తరిస్తోంది. జనాభాలో 3 కోట్ల మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. గుండె సంబంధ వ్యాధులతో, గుండెపోట్లతో ఏటా 20 లక్షలమంది మరణిస్తున్నారు. దేశంలో ఏటా రెండు లక్షల గుండె శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని ఒక అంచనా. ఇందులో నిజంగా అవసరం ఏర్పడి చేస్తున్న ఆపరేషన్ల సంఖ్య ఎంతన్న సంగతలా ఉంచి... వీటి ద్వారా కార్పొరేట్‌ ఆసు పత్రులకు వచ్చిపడుతున్న ఆదాయం అంతా ఇంతా కాదు. ఉత్పత్తిదారుల నుంచి రోగులకే చేరేసరికి ఒక్కో స్టెంట్‌ ధర 1,000 నుంచి 2,000 శాతం మధ్య పెరుగు తున్నదంటున్నారు. పైగా ఫలానా సంస్థ ఉత్పత్తి చేసే స్టెంట్‌నే కొనుగోలు చేయా లని ఒత్తిళ్లు! చవగ్గా ఉన్న స్టెంట్‌ వైపు మొగ్గు చూపితే బెదరగొట్టడం!! నిజానికి ఈ దోపిడీ పర్యవసానంగా నష్టపోతున్నది ప్రైవేటు వ్యక్తులు మాత్రమే కాదు... ప్రభుత్వ ఖజానా సైతం హరిం చుకుపోతోంది. దేశంలో స్టెంట్ల సర ఫరాలో 70 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల... ప్రభుత్వ రంగ ఆరోగ్య పథకాల పరిధిలోనే జరుగుతున్నాయి.

ఇప్పుడు సంతోషించాల్సింది స్టెంట్ల ధరలు దిగొచ్చాయని కాదు... ఇన్నేళ్లుగా దీని సంగతి ప్రభుత్వాలకు ఎందుకు పట్టలేదని ప్రశ్నించుకోవాలి. క్యూబా వంటి చిన్న దేశం కూడా తమ పౌరులకు ఉచిత ఆరోగ్య సౌకర్యాలను కల్పిస్తూ అందుక నుగుణంగా స్టెంట్ల వంటివాటిని అతి చవగ్గా ఉత్పత్తి చేయడానికి నూతన మార్గా లను అన్వేషిస్తే మన దేశంలో మాత్రం ఎవరెంతగా గొంతు చించుకున్నా పాలకు లకు పట్టలేదు. క్యూబాను సోషలిస్టు దేశమని కొట్టిపారేయొచ్చు. కానీ యూరప్‌ దేశాల్లో, థాయ్‌లాండ్, శ్రీలంక, లాటిన్‌ అమెరికా దేశాల్లో సైతం పౌరులందరికీ ఉచిత ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఔషధ రంగ సంస్థలపై నియంత్రణ ఉంటుంది. వాస్తవానికి దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు చవగ్గా లభ్యమయ్యే కలామ్‌–రాజు స్టెంట్‌ను అభివృద్ధి చేశారు. కేరళకు చెందిన మరో డాక్టర్‌ కూడా ఆ మాదిరి స్టెంట్‌కే రూపకల్పన చేశారు. కానీ వాటిని మరింత అభివృద్ధి పరిచే దిశగా చర్యలు ప్రారంభించాలని మన పాలకులకు లేకపోయింది. ప్రాణాంతక వ్యాధులకు వినియోగించే ఔషధాల ధరలను నియంత్రించేందుకు మన దేశంలో జాతీయ అత్యవసర ఔషధ జాబితా (ఎన్‌ఈఎల్‌ఎం) ఉంటుంది. అందులో చేర్చిన మందుల ధరలు పౌరులకు అందు బాటులో ఉండాలి. ఇన్నాళ్లుగా స్టెంట్లు ఆ జాబితాలో లేవు. బీరేందర్‌ పోరాటం, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల పర్యవసానంగా ఎట్టకేలకు ఇన్నాళ్లకు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్‌పీపీఏ) మేల్కొంది. స్టెంట్లను ఎన్‌ఈఎల్‌ఎంలో చేర్చడంతో పాటు వాటి గరిష్ట ధరల్ని నిర్ణయించింది. కానీ ఇది ఇక్కడితో ఆగకూడదు. ఇతర ప్రాణాంతక వ్యాధుల్లో సాగే నిలువుదోపిడీని సైతం అరికట్టాలి. ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే దేశం అన్నివిధాలా బాగుపడుతుందని గ్రహించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement