NPPA
-
పేదలపై మరో గుదిబండ.. గోలి.. జేబు ఖాళీ!
సామాన్యులు, మధ్య తరగతి వారిపై మరో పిడుగు పడనుంది. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న వారు.. ఇకపై జ్వరం గోలికి సైతం అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వివిధ రకాల కారణాలతో ఔషధ కంపెనీలు 10.7 శాతం మేర ధరలు పెంచుకునేందుకు ఎన్పీపీఏ అనుమతిచ్చింది. గత నెల నుంచే కొన్నిరకాల మందుల ధరలు పెరగగా.. తాజాగా మిగతా వాటి పెంపునకు చర్యలు చేపడుతున్నారు. ఫలితంగా మందు గోలీల రూపంలో పేదలపై మరో గుదిబండ పడనుంది. అయిజ రూరల్ (జోగులాంబ గద్వాల): నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) తీసుకుంటున్న నిర్ణయంతో ఔషధ మందులు కొనుగోలు చేసేవారి జేబులు ఖాళీ కానున్నాయి. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే మార్కెట్లో ఉన్న మందుల ధరలకు అదనంగా మరో 10.7 శాతం పెరగనున్నాయి. గత నెలలోనే ఆయా కంపెనీలకు ధరలను పెంచుకునే అవకాశం కల్పించడం వల్ల ఇప్పటికే మార్కెట్లో లభించే కొన్ని మందుల ధరలు పెరిగాయి. ఎన్పీపీఏ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మార్కెట్లో లభించే మందుల్లో దాదాపు 800 రకాల ధరలు పెగనున్నాయి. జ్వరం, గుండె వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధులకు మందులు కొనాలంటే ఇక నుంచి కొనుగోలు దారుడికి భారంగా మారనుంది. సాధారణంగా వాడే మందుల్లో పారాషిటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లో క్యాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనీడజోల్ లాంటి మందులు పెరుగుతున్న వాటి జాబితాలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. సామాన్యులపైనే.. ఫార్మాసూటికల్ కంపెనీలు పెంచుతున్న ధరలు సామాన్యుడికి గుదిబండగా మారనున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో వివిధ రకాల వ్యాధుల బారిన పడినవారు కాకుండా, ప్రధానంగా బీపీ, షుగర్ వ్యాధులు ఉన్న వారు రూ.6 వేలకు పైచిలుకు ఉంటారని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో కూడా సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే అధికంగా ఉంటారని చెబుతున్నారు. ఈ రెండు వ్యాధుల బారిన పడిన వారిలో దాదాపు 15 శాతం మంది మాత్రమే ప్రభుత్వం ద్వారా అందే మందులను వాడుతుండగా, మిగిలిన 85 శాతం వ్యాధిగ్రస్తులు ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుగోలు చేసి వాడుతున్నారు. ప్రైవేటు దుకాణాల్లో మందులు వాడుతున్న వారికి నెలకు రూ.2,500 వరకు ఖర్చు అవుతుంది. ఈ రూపేణా చూసుకున్న ఇప్పుడు పెరిగిన మందుల ధరల ప్రకారం వారికి ఏడాదికి రూ.3,210 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అసలే పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు మరోవైపు పెరిగిన మందుల ధరలు గుదిబండగా మారనున్నాయి. పెరుగుదల ఎందుకు..? కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ గణాంకాల ఆధారంగా 2020 సంవత్సరంతో పోలిస్తే 2021కి గాను మందుల టోకు ధరల సూచి ఇప్పటికే 10.7 శాతానికి పెరిగినట్లు ఎన్పీపీఏ ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు 2019లో మాత్రం ఔషధ కంపెనీలు మందుల ధరలను 2 శాతానికి పెంచుకోగా, అదే 2020 సంవత్సరంలో మాత్రం 0.5 శాతమే పెంచుకునే అవకాశం ఔషధ కంపెనీలకు కల్పించింది. కోవిడ్ అనంతరం మాత్రం మందుల తయారీ కోసం ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడం, ప్యాకింగ్, రవాణా ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఔషధ కంపెనీలకు ధరలు పెంచక తప్పడం లేదనే వాదనలు ఉన్నాయి. పేదలు ఎలా కొనాలి.. మందులు ధరలు ఇలా పెరిగితే సామాన్యులు ఎలా కొనాలి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరిగి పేదవాడు అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు మందుల ధరలు పెరిగితే అదే పేదవాడు ఎలా కొని వ్యాధిని నయం చేసుకోవాలి. జ్వరం గోలి కూడా ధర పెరుగుతుంది అంటున్నారు. ఇలా అయితే చాలా కష్టం. – ఆంజనేయులుగౌడ్, గట్టు దశల వారీగా పెంపు.. మందుల తయారికి ఉపయోగించే ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల ఔషధ మందుల ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని మందుల ధరలు నిబంధనల మేరకు పెరిగాయి. ఇంకా మరికొన్ని ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దశల వారీగా పెరుగుతాయి. – శ్రీకాంత్, డ్రగ్ ఇన్స్పెక్టర్, గద్వాల -
కరోనా: తగ్గనున్న అయిదు మెడికల్ ఉత్పత్తుల ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా ఉధృతి సమయంలో పల్స్ ఆక్సీమీటర్లు, ఇతర పరికరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపించాయి. మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ వాస్తవ ధర కంటే దాదాపు రెండుమూడు రెట్లు అధిక ధరకు విక్రయిస్తూ డబ్బులు దండుకున్నాయి. ఈ క్రమంలో నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. పల్స్ ఆక్సీమీటర్, నెబ్యులైజర్, డిజిటల్ థెర్మామీటర్, గ్లూకోమీటర్, బీపీ మానిటర్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. వీటిపై మార్జిన్‌ను 70 శాతానికి పరిమితం చేస్తూ ఎన్పీపీఏ ఉత్తర్వులు వెలువరించింది. తయారీ, దిగుమతి, మార్కెటింగ్ కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వీటి విక్రయం ద్వారా 709 శాతం వరకు లాభాలను ఆర్జిస్తున్నారని తెలిపింది. తయారీ సంస్థలు ఇక నుంచి వీటి ధరలను సవరించాల్సిందే. జూలై 20 నుంచి తాజా ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. ఔషధాల (ధరల నియంత్రణ) ఉత్తర్వు-2013 ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను తయారీదార్లు ఉల్లంఘించినట్టయితే అధికంగా వసూలు చేసిన మొత్తానికి 15 శాతం వార్షిక వడ్డీతోపాటు 100 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆక్సీజన్ కాన్సంట్రేటర్లపై మార్జిన్‌ను 70 శాతానికి పరిమితం చేస్తూ గత నెలలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
దేశవ్యాప్తంగా బ్రాండెడ్ ఔషధాల ధరలకు రెక్కలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బ్రాండెడ్ ఔషధాల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలతోనే ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో తాజాగా ధరలు పెరగడం పేదలకు భారం కానుంది. గడచిన రెండేళ్లలో ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఔషధాల ధరల పెంపునకు అనుమతి కోరుతూ ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలన్నీ ఇప్పటికే ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ)కి లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినియోగించే ఔషధాల ధరలు పెరగనున్నట్టు ఎన్పీపీఏ వర్గాలు తెలిపాయి. బీసీజీ వ్యాక్సిన్‌తో పాటు, విటమిన్–సీ, క్లోరోక్విన్, మెట్రొనిడజోల్ వంటి ప్రధానమైన 21 రకాల మందుల ధరలు మోత మోగనున్నాయి. దీంతో ఎన్పీపీఏ డిసెంబర్ మొదటి వారంలో సమావేశం నిర్వహించింది. త్వరలోనే పెరిగిన మందుల ధరలను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలకు 30 శాతం నుంచి 50 శాతం వరకూ ధర పెరగనుంది. అయితే ప్రజా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని అసాధారణంగా ధరలు పెంచబోమని ఎన్పీపీఏ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ మండలి కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి. బీసీజీ వ్యాక్సిన్ ప్రభావం తీవ్రంగా.. బీసీజీ వ్యాక్సిన్ ధర భారీగా పెరగనుంది. బిడ్డ పుట్టగానే టీబీ లేదా క్షయ రాకుండా ఈ వ్యాక్సిన్ వేస్తారు. మన రాష్ట్రంలో ఏటా 6.50 లక్షల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీళ్లందరికీ బీసీజీ వ్యాక్సిన్ వేయాల్సిందే. దీంతోపాటు మలేరియా మందులు, యాంటీ బాక్టీరియల్‌కు వాడే మెట్రోనిడజోల్ వంటి మందుల ధరలు పెరగడం వల్ల దీని ప్రభావం ప్రభుత్వంపై తీవ్రంగా పడనుంది. మన రాష్ట్రంలో ఇలా పెరిగిన మందుల వల్ల ఏటా రూ.120 కోట్ల వరకూ అదనంగా రోగులపై భారం పడే అవకాశాలున్నట్టు ఔషధ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టెంట్ రేట్లు తగ్గించినా... గుండెకు వేసే స్టెంట్ రేట్లు విచ్చలవిడిగా పెరిగిన నేపథ్యంలో వీటిని కూడా ఎన్పీపీఏ ధరల నియంత్రణలోకి తెచ్చింది. ఒక్కో స్టెంట్‌ను రూ.30 వేలకు మించి అమ్మకూడదని నిబంధన విధించింది. ఇదివరకు స్టెంట్ వేస్తే రూ. 1.50 లక్షలు వ్యయం అయ్యేది. కానీ ఇప్పుడు కూడా అంతే ధరకు వేస్తున్నారు. అంటే స్టెంట్ రేటు తగ్గినా ప్రొసీజర్ రేట్లు ఎక్కువ వేసి ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ఆస్పత్రి చార్జీలు తమ పరిధిలోకి రావని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే స్టెంట్ల ధరలు తగ్గించినా రోగులపై భారం తగ్గడం లేదు. ఇలా 870 రకాల మందులు ధరల నియంత్రణ పరిధిలో ఉన్నా వాటిని అమలు చేయడం లేదు. అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న ఉత్పత్తి సంస్థలపై ఔషధ నియంత్రణ శాఖ దాడులు చేసి ఆయా మందులను సీజ్ చేసింది. అలయెన్స్ బయోటిక్స్, డిజిటల్ విజన్, సెంచురీ డ్రగ్స్ వంటి ఉత్పత్తి సంస్థలు తయారు చేసిన మందులు నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఆ మందులను సీజ్ చేశారు. ఉత్పత్తిదారులపైనా కేసులు నమోదు చేసినట్టు ఔషధ నియంత్రణ శాఖ కృష్ణా జిల్లా అధికారి రాజభాను ‘సాక్షి’కి తెలిపారు. ధరలు పెరిగే ఔషధాల్లో కొన్ని.. -
కేన్సర్ ఔషధాల ధరల తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: యాంటి కేన్సర్ ఔషధాల ధరలను మరోసారి తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఏడాది మార్చి, మే నెలల్లో రెండు దఫాల్లో 399 రకాల కేన్సర్ ఔషధాల ధరలను భారీగా తగ్గించింది. ఒక్కో మందు ధర 60–87 శాతానికి తగ్గింది. ఇప్పుడు ఈ జాబితాలో మరిన్ని మందులను చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలోనే ధరలు తగ్గనున్న మందుల జాబితాను విడుదల చేయనున్నట్టు ఎన్పీపీఏ అధికారులు తెలిపారు. ఇటీవల కీమో థెరఫీ చికిత్సలో వినియోగించే 9 రకాల డ్రగ్స్ ధరలను ఎన్పీపీఏ తగ్గించగా, కొత్త ధరకు పాత ధరకు భారీ వ్యత్యాసం కనిపించింది. ఇందులో ఊపిరితిత్తుల కేన్సర్‌కు సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. కొత్త ధరల ప్రకారం పెమెట్రెక్సెడ్ 500ఎంజీ ఇంజక్షన్ రూ.2,800లకు లభిస్తోంది. గతంలో దీని ధర రూ.22,000 ఉండేది. 100 ఎంజీ ఇంజక్షన్ ధర రూ.7,700 నుంచి రూ.800లకు తగ్గింది. ఎపిక్లర్ బ్రాండ్ 10 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.561 నుంచి రూ.276కు.. 50 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.2,662 నుంచి రూ.960కు దిగింది. దీంతో పాటు ఎర్లో టినిబ్ 100 ఎంజీ టాబ్లెట్స్ (30 టాబ్లెట్ల ప్యాక్) ధర రూ.6,600 నుంచి రూ.1,840కు.. 150ఎంజీ ట్యాబ్లెట్ రూ.8,800 నుంచి రూ.2400లకు తగ్గింది. లానోలిమస్ బ్రాండ్ సైతం రూ.726 నుంచి రూ.406కు దిగివచ్చింది. మరిన్ని రకాల ఔషధాల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. -
స్టెంట్ల ధరల్లో మార్పులు
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది అనంతరం గుండె శస్త్రచికిత్సల్లో(యాంజియోప్లాస్టీ) వాడే కరోనరీ స్టెంట్ల గరిష్ట ధరల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. సవరించిన ధరల మేరకు బేర్ మెటల్ స్టెంట్ల(బీఎంఎస్) ధర రూ. 7,400 నుంచి రూ. 7,660కి పెరగగా, డ్రగ్‌తో కూడిన స్టెంట్ల(డీఈఎస్)ధర రూ. 30,180 నుంచి రూ. 27,890కి తగ్గింది. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని, 2019 మార్చి 31 వరకూ అమల్లో ఉంటాయని జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల నియంత్రణ విభాగం (ఎన్పీపీఏ) తెలిపింది. ఇప్పటికే స్టోర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న స్టెంట్లకు కూడా తాజా ధరలే వర్తిస్తాయంది. డీపీసీఓ(డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్) 2013, షెడ్యూల్ 1 ప్రకారం కరోనరీ స్టెంట్లు ముఖ్యమైన డ్రగ్స్ కేటగిరీలోకి వస్తాయని, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటి ధరల నియంత్రణ కొనసాగాల్సిన అవసరముందని పేర్కొం ది. స్టెంట్లపై తయారీదారులు జీఎస్టీ విధించవచ్చని, అయితే ఎమ్మార్పీ ధరకు అదనంగా ఏ ఇతర చార్జీలు ఉండవంది. -
దోపిడీ జబ్బుకు చికిత్స!
ఆధునిక జీవనశైలి, ఆహారపుటలవాట్ల పర్యవసానంగా ఈమధ్య కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసులవారినీ కాటేస్తున్న ప్రాణాంతక వ్యాధి గుండె జబ్బు. అన్నిటిమాదిరే ఈ వ్యాధి కూడా ఉత్పత్తిదారులకూ, కార్పొరేట్ ఆసుపత్రులకూ, ఫైవ్‌స్టార్ వైద్యులకూ కల్పతరువైంది. స్వల్ప వ్యవధిలో భారీ లాభా లను ఆర్జించేందుకు మార్గమైంది. ఫలితంగా ఏటా వేలాది కోట్ల రూపాయల జనం సొమ్ము నిలువుదోపిడీ అయింది. ఆరోగ్యశ్రీలాంటి పథకాలున్న రాష్ట్రాల్లోని నిరుపే దల మాటేమోగానీ... మిగిలినచోట్ల ఈ జబ్బు బారిన పడిన సామాన్యులకు చావు తప్ప దిక్కులేదు. ఈ దయనీయమైన స్థితిని మార్చడానికి ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వం కదలింది. గుండె రక్త నాళాలు మూసుకుపోయిన హృద్రోగులకు అమర్చే స్టెంట్ల ధరలకు కళ్లెం వేసింది. పర్యవసానంగా స్టెంట్ల ధరలు ఒక్కసారిగా 86 శాతం మేర తగ్గాయి. సర్వసాధారణంగా హృద్రోగులకు అమర్చే డీఈఎస్ స్టెంట్ ధర ఇప్పటివరకూ దాదాపు రూ. 2,50,000 ఉంటే తాజా నిర్ణయంతో అది రూ. 29,600కు దిగొచ్చింది. ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉన్న ఎబాట్ సంస్థ ఒక్కో స్టెంట్‌ను రూ. 27,000కు పంపిణీదారుకు విక్రయిస్తే రోగికి చేరేసరికి దాని ధర మరింత ఎక్కువవుతోంది. రోగికి అమర్చడం మినహా మరే పాత్రా లేని ఆసు పత్రులు, వైద్యులు కూడా ఈ క్రమంలో డబ్బు వెనకేసుకుంటున్నారు. వెరసి స్టెంట్ ధర లక్షల్లోకి ఎగబాకుతోంది. ఇది ఒక్క స్టెంట్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. కెమో థెరపీ మాటున, ఎముకలకు సంబంధించిన వ్యాధుల చికిత్సల్లో కూడా ఈ మాదిరి దోపిడీయే రాజ్యమేలుతున్నదని ప్రజారోగ్య కార్యకర్తలు చెబుతున్న మాట. స్టెంట్ల పేరు చెప్పి సాగుతున్న నిలువుదోపిడీని అరికట్టాలని దాదాపు దశాబ్ద కాలంగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాపార విస్తృతి ఎంతో తెలుసు కుంటే ఎలాంటివారైనా గుండెలు బాదుకోవాల్సిందే. హృద్రోగులు ఏటా దాదాపు రూ. 4,450 కోట్ల సొమ్మును ఈ స్టెంట్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తున్నదని ఒక అంచనా. కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బు వచ్చిందంటే ఆ ఇల్లు గుల్ల కావలసిందే. అప్పుల్లో కూరుకుపోవాల్సిందే. లేదంటే చావుకు సిద్ధపడాల్సిందే. నిజానికి లక్షలాదిమంది హృద్రోగులు ఈ క్షణాన తల్చుకోవాల్సిన పేరు బీరేం దర్ సంగ్వాన్. చాలా యాదృచ్ఛికంగా రెండేళ్లక్రితం ఆయన ప్రారంభించిన న్యాయ పోరాటం ఏటా వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్న స్టెంట్ పరిశ్రమను చావు దెబ్బ తీసింది. నిరుపేద కుటుంబాలు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఒక సందర్భంలో హృద్రోగిని చూడటానికి ఆసుపత్రికి వెళ్లాల్సివచ్చినప్పుడు ఆయన స్టెంట్‌కు వసూలు చేసే ధరను చూసి విస్మయపడ్డాడు. దానికి బిల్లు కూడా ఇవ్వరని తెలిసి మరింత ఆశ్చర్యపోయాడు. కొంత పరిశోధన తర్వాత దాదాపు అన్ని ఆసుపత్రుల్లోనూ ఇదే తంతు నడుస్తున్నదని నిర్ధారణకొచ్చాడు. శస్త్ర చికిత్సకు ఒక్కో రోగి దాదాపు రూ. 4 లక్షలు ఖర్చు చేయాల్సివస్తున్నదని లెక్కేశాడు. అనంతరం ఈ నిలు వుదోపిడీపై పోరాడాలన్న నిర్ణయానికొచ్చాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. మన దేశంలో గుండె జబ్బు అంటువ్యాధులను మించి విస్తరిస్తోంది. జనాభాలో 3 కోట్ల మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. గుండె సంబంధ వ్యాధులతో, గుండెపోట్లతో ఏటా 20 లక్షలమంది మరణిస్తున్నారు. దేశంలో ఏటా రెండు లక్షల గుండె శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని ఒక అంచనా. ఇందులో నిజంగా అవసరం ఏర్పడి చేస్తున్న ఆపరేషన్ల సంఖ్య ఎంతన్న సంగతలా ఉంచి... వీటి ద్వారా కార్పొరేట్ ఆసు పత్రులకు వచ్చిపడుతున్న ఆదాయం అంతా ఇంతా కాదు. ఉత్పత్తిదారుల నుంచి రోగులకే చేరేసరికి ఒక్కో స్టెంట్ ధర 1,000 నుంచి 2,000 శాతం మధ్య పెరుగు తున్నదంటున్నారు. పైగా ఫలానా సంస్థ ఉత్పత్తి చేసే స్టెంట్‌నే కొనుగోలు చేయా లని ఒత్తిళ్లు! చవగ్గా ఉన్న స్టెంట్ వైపు మొగ్గు చూపితే బెదరగొట్టడం!! నిజానికి ఈ దోపిడీ పర్యవసానంగా నష్టపోతున్నది ప్రైవేటు వ్యక్తులు మాత్రమే కాదు... ప్రభుత్వ ఖజానా సైతం హరిం చుకుపోతోంది. దేశంలో స్టెంట్ల సర ఫరాలో 70 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల... ప్రభుత్వ రంగ ఆరోగ్య పథకాల పరిధిలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు సంతోషించాల్సింది స్టెంట్ల ధరలు దిగొచ్చాయని కాదు... ఇన్నేళ్లుగా దీని సంగతి ప్రభుత్వాలకు ఎందుకు పట్టలేదని ప్రశ్నించుకోవాలి. క్యూబా వంటి చిన్న దేశం కూడా తమ పౌరులకు ఉచిత ఆరోగ్య సౌకర్యాలను కల్పిస్తూ అందుక నుగుణంగా స్టెంట్ల వంటివాటిని అతి చవగ్గా ఉత్పత్తి చేయడానికి నూతన మార్గా లను అన్వేషిస్తే మన దేశంలో మాత్రం ఎవరెంతగా గొంతు చించుకున్నా పాలకు లకు పట్టలేదు. క్యూబాను సోషలిస్టు దేశమని కొట్టిపారేయొచ్చు. కానీ యూరప్ దేశాల్లో, థాయ్‌లాండ్, శ్రీలంక, లాటిన్ అమెరికా దేశాల్లో సైతం పౌరులందరికీ ఉచిత ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఔషధ రంగ సంస్థలపై నియంత్రణ ఉంటుంది. వాస్తవానికి దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు చవగ్గా లభ్యమయ్యే కలామ్–రాజు స్టెంట్‌ను అభివృద్ధి చేశారు. కేరళకు చెందిన మరో డాక్టర్ కూడా ఆ మాదిరి స్టెంట్కే రూపకల్పన చేశారు. కానీ వాటిని మరింత అభివృద్ధి పరిచే దిశగా చర్యలు ప్రారంభించాలని మన పాలకులకు లేకపోయింది. ప్రాణాంతక వ్యాధులకు వినియోగించే ఔషధాల ధరలను నియంత్రించేందుకు మన దేశంలో జాతీయ అత్యవసర ఔషధ జాబితా (ఎన్‌ఈఎల్‌ఎం) ఉంటుంది. అందులో చేర్చిన మందుల ధరలు పౌరులకు అందు బాటులో ఉండాలి. ఇన్నాళ్లుగా స్టెంట్లు ఆ జాబితాలో లేవు. బీరేందర్ పోరాటం, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల పర్యవసానంగా ఎట్టకేలకు ఇన్నాళ్లకు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్పీపీఏ) మేల్కొంది. స్టెంట్లను ఎన్ఈఎల్ఎంలో చేర్చడంతో పాటు వాటి గరిష్ట ధరల్ని నిర్ణయించింది. కానీ ఇది ఇక్కడితో ఆగకూడదు. ఇతర ప్రాణాంతక వ్యాధుల్లో సాగే నిలువుదోపిడీని సైతం అరికట్టాలి. ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే దేశం అన్నివిధాలా బాగుపడుతుందని గ్రహించాలి. -
మందుల ధరలు భారీగా తగ్గింపు
192 రకాల మందులు తగ్గించిన ఎన్పీపీఏ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా భారీగా మందుల ధరలను తగ్గిస్తూ ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ధరలు తగ్గించిన మందుల జాబితాను పంపించింది. మందుల ధరలు ఆకాశాన్ని తాకుతుండటం, ఇప్పటి వరకూ జనరిక్ డ్రగ్స అందరికీ అందుబాటులోకి రాకపోవడం వంటి కారణాలతో పేద రోగులు విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా బ్రాండెడ్ డ్రగ్స పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో ఎన్పీపీఏ ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది. మొత్తం 192 రకాల మందుల ధరలను తగ్గించింది. ఫలానా మందు ఇంత ధరకే అమ్మాలని ధరల సీలింగ్‌ను నిర్ణయించింది. ఈ నిర్ణయం 45 రోజుల్లోగా అమల్లోకి రావాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసింది. తగ్గించిన ధరలను అందుబాటులోకి తెచ్చే బాధ్యత రాష్ట్రాల ఔషధ నియంత్రణ శాఖలదేనని సూచించింది. ఎక్కువ మందులు 20 నుంచి 30 శాతం తగ్గాయి. జాతీయ మందుల ధరల నియంత్రణ సంస్థ తగ్గించిన మందుల్లో ఎక్కువగా యాంటీబయోటిక్స్, ఐవీఫ్లూయిడ్స్ మందులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కువగా వినియోగంలో ఉన్నది కూడా ఈ మందులే. క్యాన్సర్ నివారణ, యాంటీ ఫంగల్ మందుల ధరలు కూడా భారీగా తగ్గాయి. దేశవ్యాప్తంగా డయాబెటిక్ రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో యాంటీ డయాబెటిక్ మందుల ధరలనూ తగ్గించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 వేల వరకూ మందుల షాపులున్నాయి. వీటన్నిటిలోనూ ఎన్పీపీఏ తగ్గించిన మందుల ధరలను అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల ఔషధ నియంత్రణ శాఖలే చూసుకోవాలి. -
దీపావళి నుంచి తగ్గనున్న ఔషధాల ధరలు
న్యూఢిల్లీ: దీపావళి పండుగ నుంచి మధుమేహం, హైపర్ టెన్షన్, న్యూమోనియా వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఈమేరకు 18 నూతన బ్రాండ్లకు చెందిన నిత్యావసర ఔషధాల ధరలపై జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) నియంత్రణ విధించింది. ఈ ఔషధాలు రానున్న 15 రోజుల్లో మార్కెట్లో విడుదలకానున్నాయి. ఔషధ ధరల నియంత్రణ ఆర్డర్ (డీపీసీవో)-2013లోని పారాగ్రాఫ్ 5 పరిధిలోకి ఈ నూతన ఔషధాలను తీసుకొస్తూ.. వాటి ధరలు ఇష్టానుసారం పెంచకుండా పరిమితులు విధించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఔషధాల ఎమ్మార్పీ ధరల ఆధారంగా వాటి గరిష్ఠ రిటైల్ ధరను ఎన్పీపీ నిర్ణయించింది. ప్రముఖ ఫార్మాసుటికల్ కంపెనీలు సిప్లా, మెర్క్, ఫ్రాంకో ఇండియన్, అలెబిక్ ఫార్మా, యూనిచెమ్ మొదలైన వాటి నుంచి ఈ ఔషధాలు మార్కెట్లోకి రానున్నాయి. ఎన్పీపీ నిర్దేశించిన ప్రకారం ఆయా సంస్థలు ధరలు నిర్ణయించకపోతే.. చట్టపరంగా తీసుకునే చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అంతేకాకుండా అధికంగా వసూలుచేసిన మొత్తానికి డిపాజిట్‌ను వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని ఔషధ నియంత్రణ సంస్థ తన తాజా ఆదేశంలో పేర్కొంది. -
ధరల నియంత్రణ పరిధిలోకి మరో 39 ఔషధాలు
న్యూఢిల్లీ : మధుమేహం తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మరో 39 ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలోకి చేర్చినట్లు జాతీయ ఫార్మా ధరల నిర్ణయాధికార సంస్థ (ఎన్పీపీఏ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. దీని ప్రకారం సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, సెఫోటాక్సిమ్, పారాసెటమల్, డోమ్‌పెరిడోన్ తదితర ఫార్ములేషన్ల రేట్లను సవరించినట్లు పేర్కొంది. క్యాడిలా హెల్త్‌కేర్, లుపిన్, ఇప్కా ల్యాబరేటరీస్, అబాట్ ల్యాబరేటరీస్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ తదితర ఫార్మా సంస్థలపై కేంద్రం నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎన్పీపీఏ ఇప్పటికే ధరల నియంత్రణ లిస్టులో సుమారు 500 పైచిలుకు ఔషధాలను చేర్చిన సంగతి తెలిసిందే. -
ఫార్మా కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ!
ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ ప్రతిపాదన న్యూఢిల్లీ: ఫార్మా రంగానికి ఉన్న ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో దాని కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీని గురించి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్లు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంత్ కుమార్ గురువారం తెలిపారు. కొత్త శాఖ ఫార్మా పరిశ్రమ బాగోగులు చూడటంతో పాటు నియంత్రణ సంస్థగా కూడా పనిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసినట్లే ఫార్మా కోసం కూడా ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం దేశీ ఫార్మా రంగం విలువ దాదాపు రూ. 1.8 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. కొత్త ఔషధాలు, క్లినికల్ ట్రయల్స్, ఫార్మా దిగుమతులు మొదలైన వాటిని ఆమోదించడం తదితర అంశాలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీసీఎస్‌వో), డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) పర్యవేక్షిస్తున్నాయి. ఇవి రెండూ ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్నాయి. వీటితో పాటు ఔషధాల ధరల నియంత్రణకు సంబంధించి నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ఉంది. ఈ మూడింటిని కూడా కొత్త శాఖ కిందకు చేర్చే అవకాశం ఉందని, వైద్య పరికరాల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పర్చిన పక్షంలో దాన్ని కూడా ఇందులోకే తేవొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఔషధాలపై యాప్..: ఔషధాల ధరలు, లభ్యత తదితర అంశాల గురించి సమాచారం అందించడానికి, అలాగే కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు అనంత్ కుమార్ వివరించారు. ఔషధ కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘ఫార్మా జన సమాధాన్’ వెబ్ పోర్టల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. -
ఎన్పీపీఏ అధికారాలకు కత్తెర
న్యూఢిల్లీ: జాతీయ ఔషధ ధరల నిర్ణాయక సంస్థ(ఎన్పీపీఏ) అధికారాల్లో కేంద్రం కోత విధించింది. అత్యావసరంకాని ఔషధాల(నాన్-అసెన్షియల్) ధరలపై పరిమితి విధింపునకు సంబంధించి డ్రగ్ప్రైస్ కంట్రోల్ ఆర్డర్(డీపీసీఓ)-2013లోని నిబంధనలను కొన్నింటిని ఉపసంహరించుకుంది. ఎరువులు, రసాయనాల శాఖ అధీనంలో పనిచేస్తున్న ఫార్మాసూటికల్స్ విభాగం గత శుక్రవారం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఎన్‌పీపీఓ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల 43 ఔషధాల ధరలపై పరిమితి విధింపుపై ఫార్మా కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. డీపీసీఓ 2013లోని 19వ పేరాగ్రాఫ్ ప్రకారం హెచ్ఐవీ, గుండెసంబంధ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే కొన్ని నాన్-అసెన్షియల్ డ్రగ్స్‌పై పరిమితి విధించేందుకు ఈ ఏడాది మే 29న తాము మర్గదర్శకాలను ఇచ్చామని... దీన్ని తక్షణం ఉపసంహరించుకుంటున్నట్లు సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఎన్పీపీఏ వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జూలై 10న 108 నాన్-అసెన్షియల్ ఔషధాల ధరలపై పరిమితికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలను ఇందులో ప్రస్తావించలేదు. ఫార్మా కంపెనీలకు సానుకూలం... ప్రభుత్వ ఆదేశాలమేరకు ఇకపై డీపీసీఓ ప్రకారం తమకు నాన్-అసెన్షియల్ ఔషధాల ధరలను నియంత్రించే(పరిమితి విధింపు) అధికారం పోయినట్లేనని ఎన్పీపీఏ అధికారి ఒకరు వివరించారు. ప్రాణాధార ఔషధాల జాబితా(ఎన్ఎల్ఈఎం)లో లేని కొన్ని డ్రగ్స్ ధరలను ప్రజా ప్రయోజనాలరీత్యా అసాధారణ పరిస్థితుల్లో నియంత్రించేందుకు డీపీసీఓ-2013లోని పేరాగ్రాఫ్ 19 ఎన్‌పీపీఏకి వీలు కల్పిస్తోంది. దీనిప్రకారమే కొన్ని ఔషధాల ధరలపై పరిమితులను ఇటీవలి కాలంలో ఎన్పీపీఏ విధించింది. డీపీసీఓ-2013 ప్రకారం ఎన్ఎల్ఈఎం జాబితాలో ఉన్న 348 డ్రగ్స్ ధరలను ఇప్పటికే కేంద్రం నియంత్రిస్తోంది.