దేశవ్యాప్తంగా బ్రాండెడ్‌ ఔషధాల ధరలకు రెక్కలు | ACP Recommendations for Rising Prescription Drug Costs | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా బ్రాండెడ్‌ ఔషధాల ధరలకు రెక్కలు

Published Tue, Dec 24 2019 4:15 AM | Last Updated on Tue, Dec 24 2019 4:15 AM

ACP Recommendations for Rising Prescription Drug Costs - Sakshi

సాక్షి, అమరావతి:  దేశవ్యాప్తంగా బ్రాండెడ్‌ ఔషధాల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలతోనే ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో తాజాగా ధరలు పెరగడం పేదలకు భారం కానుంది. గడచిన రెండేళ్లలో ముడి సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఔషధాల ధరల పెంపునకు అనుమతి కోరుతూ ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీలన్నీ ఇప్పటికే ఎన్‌పీపీఏ (నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైజింగ్‌ అథారిటీ)కి లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా వినియోగించే ఔషధాల ధరలు పెరగనున్నట్టు ఎన్‌పీపీఏ వర్గాలు తెలిపాయి.

బీసీజీ వ్యాక్సిన్‌తో పాటు, విటమిన్‌–సీ, క్లోరోక్విన్, మెట్రొనిడజోల్‌ వంటి ప్రధానమైన 21 రకాల మందుల ధరలు మోత మోగనున్నాయి. దీంతో ఎన్‌పీపీఏ డిసెంబర్‌ మొదటి వారంలో సమావేశం నిర్వహించింది. త్వరలోనే పెరిగిన మందుల ధరలను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలకు 30 శాతం నుంచి  50 శాతం వరకూ ధర పెరగనుంది. అయితే ప్రజా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని అసాధారణంగా ధరలు పెంచబోమని ఎన్‌పీపీఏ అధికార వర్గాలు పేర్కొన్నాయి.  ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ మండలి కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి.


బీసీజీ వ్యాక్సిన్‌ ప్రభావం తీవ్రంగా..
బీసీజీ వ్యాక్సిన్‌ ధర భారీగా పెరగనుంది. బిడ్డ పుట్టగానే టీబీ లేదా క్షయ రాకుండా ఈ వ్యాక్సిన్‌ వేస్తారు. మన రాష్ట్రంలో ఏటా 6.50 లక్షల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీళ్లందరికీ బీసీజీ వ్యాక్సిన్‌ వేయాల్సిందే. దీంతోపాటు మలేరియా మందులు, యాంటీ బాక్టీరియల్‌కు వాడే మెట్రోనిడజోల్‌ వంటి మందుల ధరలు పెరగడం వల్ల దీని ప్రభావం ప్రభుత్వంపై తీవ్రంగా పడనుంది. మన రాష్ట్రంలో ఇలా పెరిగిన మందుల వల్ల ఏటా రూ.120 కోట్ల వరకూ అదనంగా రోగులపై భారం పడే అవకాశాలున్నట్టు ఔషధ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

స్టెంట్‌ రేట్లు తగ్గించినా...
గుండెకు వేసే స్టెంట్‌ రేట్లు విచ్చలవిడిగా పెరిగిన నేపథ్యంలో వీటిని కూడా ఎన్‌పీపీఏ ధరల నియంత్రణలోకి తెచ్చింది. ఒక్కో స్టెంట్‌ను రూ.30 వేలకు మించి అమ్మకూడదని నిబంధన విధించింది. ఇదివరకు స్టెంట్‌ వేస్తే రూ. 1.50 లక్షలు వ్యయం అయ్యేది. కానీ ఇప్పుడు కూడా అంతే ధరకు వేస్తున్నారు. అంటే స్టెంట్‌ రేటు తగ్గినా ప్రొసీజర్‌ రేట్లు ఎక్కువ వేసి ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. ఆస్పత్రి చార్జీలు తమ పరిధిలోకి రావని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే స్టెంట్ల ధరలు తగ్గించినా రోగులపై భారం తగ్గడం లేదు. ఇలా 870 రకాల మందులు ధరల నియంత్రణ పరిధిలో ఉన్నా వాటిని అమలు చేయడం లేదు.

అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మందులు విక్రయిస్తున్న ఉత్పత్తి సంస్థలపై ఔషధ నియంత్రణ శాఖ దాడులు చేసి ఆయా మందులను సీజ్‌ చేసింది. అలయెన్స్‌ బయోటిక్స్, డిజిటల్‌ విజన్, సెంచురీ డ్రగ్స్‌ వంటి ఉత్పత్తి సంస్థలు తయారు చేసిన మందులు నిర్ణయించిన ధరకంటే ఎక్కువకు అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో అధికారులు ఆ మందులను సీజ్‌ చేశారు. ఉత్పత్తిదారులపైనా కేసులు నమోదు చేసినట్టు ఔషధ నియంత్రణ శాఖ కృష్ణా జిల్లా అధికారి రాజభాను ‘సాక్షి’కి తెలిపారు.


ధరలు పెరిగే ఔషధాల్లో కొన్ని..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement