ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ సంవత్సరం కొత్త తయారీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, కంపెనీల ఉత్పత్తులను పరీక్షించి అవన్నీ సంతృప్తికరమైన ఫలితాలను పొందిన తరువాత మాత్రమే ప్రొడక్షన్, మార్కెట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫార్మా కంపెనీల మెటీరియల్స్, మెషీన్లు, ప్రాసెస్ వంటివన్నీ కూడా తప్పకుండా కొత్త ప్రమాణాలను అనుకూలంగానే ఉండాలని భారత ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల నాణ్యతకు తయారీదారు బాధ్యత వహించాలని పేర్కొంది.
50 బిలియన్ల పరిశ్రమ ప్రతిష్టతను కాపాడటానికి కర్మాగారాల పరిశీలనను మోదీ ప్రభుత్వం వేగవంతం చేసింది. కంపెనీల ఉత్పత్తులు నాణ్యమైనవిగా ఉన్నప్పుడు రోగులు ప్రమాదంలో పడే అవకాశం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థల ఉత్పత్తులను నిశితంగా పరీక్షించి, సంతృప్తికరమైన ఫలితాలను పొందినప్పుడే మార్కెట్ చేసుకోవాలని ఆదేశించారు.
2022 డిసెంబర్ నుంచి సుమారు 162 ఫార్మా కంపెనీలలో ఇన్‌కమింగ్ ముడి పదార్థాల టెస్టింగ్ లేకపోవడాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశించిన అంతర్జాతీయ ఔషధాల తయారీ ప్రమాణాలను కలిగి ఉన్న కంపెనీలు భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్‌బీఐ
పెద్ద ఔషధ తయారీదారులు ఆరు నెలల్లోగా, చిన్న పరిశ్రమలు 12 నెలల్లోగా కొత్త ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ గడువు పెంచాలని, ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న కంపెనీలు ఈ కొత్త నిబంధనలను అనుసరించాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఖర్చు తీవ్రత ఎక్కువైతే దాదాపు సగం కంపెనీలు క్లోజ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment