indian govt
-
త్వరలో ప్రభుత్వ యాప్ స్టోర్..?
భారత ప్రభుత్వం తన పౌరులకు సైబర్ భద్రతను పెంచే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారిక మొబైల్ యాప్‌లను ఒకే వేదికపై ఏకీకృతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ప్రభుత్వ మద్దతుతో GOV.in అనే యాప్ స్టోర్‌ను రూపొందించాలని ప్రతిపాదించింది. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని యాప్‌లకు నెలవు కానుంది.ప్రభుత్వం భావిస్తున్న ప్రతిపాదనలను సులభతరం చేయడానికి గూగుల్, ఆపిల్ సహా ప్రధాన టెక్ కంపెనీలతో పాటు స్మార్ట్‌ఫోన్ తయారీదారులను ఎంఈఐటీవై సంప్రదించింది. ఈ యాప్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా ప్రజా సేవలను మరింత అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది. GOV.in యాప్‌స్టోర్‌ను గూగుల్ ప్లే, యాప్ స్టోర్(యాపిల్) వంటి ప్లాట్‌ఫామ్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఫోన్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీ క్రమంలోనే, వినియోగదారులకు చేరకముందే స్మార్ట్ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ స్టోర్‌ను ప్రీ-ఇన్స్టాల్ చేయాలని తెలిపింది.ప్రయోజనాలు ఇలా..ఒకవేళ ప్రభుత్వం అనుకున్న విధంగా ఈ సదుపాయాన్ని తీసుకొస్తే GOV.inయాప్ స్టోర్ దేశంలో డిజిటల్ సేవలను మరింత విస్తరించగలదని నిపుణులు భావిస్తున్నారు. పరిమిత స్థాయిలో ఉండే ప్రభుత్వ ఆమోదిత యాప్‌లకు మెరుగైన సైబర్ భద్రత అందించవచ్చని నమ్ముతున్నారు. ప్రపంచ టాప్ కంపెనీ యాపిల్ ఇప్పటికే 2021లో రష్యా నిబంధనలకు కట్టుబడి ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఆమోదించిన యాప్‌స్టోర్‌ను ఇన్స్టాల్ చేయడానికి యాపిల్ అనుమతించింది.ఇదీ చదవండి: ఉపాధికి చేయూత కావాలిసవాళ్లు ఇవే..ఈ ప్రతిపాదనకు టెక్ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తమ ఆపరేటింగ్ సిస్టమ్‌తో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న గూగుల్, యాపిల్ ప్లాట్‌ఫామ్‌ల్లోని యాప్‌లపై కఠినమైన నియంత్రణను కలిగి ఉంటాయి. డెవలపర్లు తమ స్టోర్ల ద్వారా ఆర్జించే ఆదాయంపై 30% కమీషన్ వసూలు చేస్తాయి. ప్రభుత్వ మద్దతు ఉన్న యాప్ స్టోర్ వారి నియంత్రణను, ఆదాయాన్ని తగ్గిస్తుంది. అయితే దీనిపై ఇంకా కంపెనీలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. -
ఏఐ చిప్‌లపై అమెరికా ఆంక్షల ప్రభావం
అమెరికా ఇటీవల ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. భారత్ అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఎగుమతికి సంబంధించి అమెరికా ఆంక్షలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నెల ప్రారంభంలో దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనలు చైనా, రష్యా వంటి దేశాల్లో సాంకేతిక పురోగతిని నిరోధించడమే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఇతర దేశాలపైనా వీటి ప్రభావంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఏఐ చిప్ ఎగుమతుల పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది.అమెరికా ఆంక్షల పరిధిఅమెరికా ఎగుమతులపై విధించిన ఆంక్షలకు సంబంధించి వివిధ దేశాలను భద్రత, మానవ హక్కుల ప్రమాణాల ఆధారంగా మూడు అంచెలుగా వర్గీకరించింది. టైర్ 1లో యూకే, జపాన్, ఆస్ట్రేలియా వంటి మిత్ర దేశాలు ఉన్నాయి. ఇవి ఎటువంటి ఆంక్షలను ఎదుర్కోవు. భారతదేశం, సింగపూర్, ఇజ్రాయెల్ టైర్ 2 దిగుమతులపై కొన్ని పరిమితులను ఎదుర్కొంటాయి. ఇందులో భాగంగా అధునాతన ఏఐ చిప్‌లకు లైసెన్సింగ్ అవసరం. టైర్ 3లో చైనా, రష్యా వంటి దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు తయారు చేసిన చిప్‌లను కొనుగోలు చేయకుండా పూర్తిగా నిషేధించాయి.ఇదీ చదవండి: మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరంభారత్ ఏఐ మౌలిక సదుపాయాలపై ప్రభావంసమీప భవిష్యత్తులో 10,000 జీపీయూ(Graphics Processing Unit)లతో ఏఐ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిష్టాత్మక జాతీయ ఏఐ మిషన్ ఈ ఆంక్షల కారణంగా అడ్డంకులను ఎదుర్కొనుంది. 2027 వరకు 50,000 జీపీయూలను సిద్ధం చేయాలనే భారత ప్రణాళికలు ఈ ఆంక్షల వల్ల ప్రభావితం చెందే అవకాశం ఉంది. అయితే భారత్ యూఎస్ ఆంక్షల పరంగా టైర్2 విభాగంలో ఉండడంతో ఏఐ చిప్‌ల లైసెన్సింగ్ సదుపాయాలు మరింత మెరుగుపడాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆంక్షల వల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగే ప్రమాదం ఉందని ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లకు కీలకమైన జీపీయూలకు మార్కెట్ తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన మార్గాలను అన్వేషించాలని కోరింది. -
ఎట్టకేలకు కదలిక?!
నాలుగేళ్ళ జాప్యం తరువాత ఎట్టకేలకు రథం కదులుతున్నట్టుంది. దేశంలో పదేళ్ళకు ఒకసారి చేయాల్సిన జనగణన ఎలాగైతేనేం వచ్చే 2025లో ముందడుగేసే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర సర్కార్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వినిపిస్తోంది. 2026 మార్చి నాటికి ఆ గణాంకాలు అందుబాటులోకి వస్తాయట. 2011 తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు జరగనున్న ఈ జనగణన, అది అందించే సమాచారం విధానపరమైన నిర్ణయాలు తీసుకొనేందుకు కీలకం. అందుకే, ఇప్పటికైనా ఈ బృహత్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టాలనుకోవడం ఆహ్వానించదగిన విషయం. ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనతో పాటు పలు రాజకీయ నిర్ణయాలకూ ఈ జనగణన భూమిక కానుంది. జనగణనతో పాటు పనిలో పనిగా కులగణన కూడా జరపాలనే డిమాండ్ ఊపందుకుంది. అలాగే, ఇకపై 2025ను ప్రాతిపదికగా తీసుకొని ప్రతి దశాబ్దం మొదట్లో జరపాల్సిన జనగణన తాలూకు కాలరేఖను 2035, ’45... అలా మారుస్తారనే మాటా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అవసరమైతే అఖిలపక్ష భేటీ జరపాలనే వాదన వస్తున్నది అందుకే. 1881 నుంచి నిర్వహిస్తున్న ఈ జనాభా లెక్కల ప్రక్రియ అసలు 2021లోనే జరగాల్సింది. అయితే, రాజ్యాంగ రీత్యా కేంద్రం పరిధిలోని ఈ ప్రక్రియను కోవిడ్–19 కారణంగా సర్కారు వాయిదా వేసింది. ఆ పైన కరోనా పోయినా ఈ బృహత్తర బాధ్యత నెరవేర్చడానికి మోదీ సర్కార్ ఎందుకో ఉత్సాహం చూపలేదు. పాత కాలపు జనాభా లెక్కలతో ప్రస్తుత ప్రజా అవసరాలను ఎలా తెలుసుకుంటారన్న విమర్శలకూ గురైంది. ఎందుకంటే, కేవలం తలల లెక్కగా కాక జనాభా హెచ్చు తగ్గుల ధోరణులతో పాటు, సామాజిక, ఆర్థిక పరిస్థితులను సైతం అర్థం చేసుకోవడానికి జనగణన కీలకసూచిక. ప్రభుత్వ ప్రాధాన్యాల నిర్ణయం, వనరుల కేటాయింపు, సంక్షేమ పథకాల రూపకల్ప నకు ఉపకరించే సమగ్ర సమాచార సమాహారం. దేశంలోని సంక్లిష్టమైన సామాజిక సమస్యల పరిష్కారానికి ఓ కరదీపిక. కచ్చితమైన సమాచారం ద్వారానే విద్య, వైద్యం, గృహనిర్మాణం, ప్రాథమిక వసతుల్లో అన్ని ప్రాంతాల్లో సమానాభివృద్ధికి సర్కారు జోక్యం చేసుకొనే వీలుంటుంది. అదే సమయంలో రాజకీయ పర్యవసానాలూ అనేకం. నియోజకవర్గాల పునర్విభజనకూ, జనాభా లెక్కలకూ లింకుంది. ‘‘2026 తరువాత జరిగే తొలి జనగణన’’ ఆధారంగా చట్టసభలలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని 2002లోనే అప్పటి వాజ్‌పేయి సర్కార్ నిర్ణయించింది. అందువల్ల రాజకీయాల రూపురేఖలను మార్చే జనగణన చర్చోపచర్చలకు కారణమవుతోంది. బీజేపీకి ఆది నుంచి దక్షిణాది కన్నా ఉత్తరాదిలోనే బలం, బలగం ఎక్కువ. జనగణన అనంతరం జనసంఖ్య ఆధారంగా పునర్విభజన జరిగితే... కట్టుదిట్టంగా జనాభా నియంత్రణ చర్యలు చేపట్టిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి. పార్లమెంట్ స్థానాల సంఖ్య దక్షిణాదిలో తగ్గి, ఉత్తరాదిలో పెరుగు తుంది. అది కాషాయపార్టీకి అనుకూలంగా మారుతుందనే అనుమానం ఉంది. ప్రజాస్వామ్యమంటే ప్రజాసంఖ్యకు సిసలైన రీతిలో ప్రాతినిధ్యం వహించాలన్నది నిజమే. అంత మాత్రాన కుటుంబ నియంత్రణ పాటించనందుకు గాను అధికారం ఉత్తరాది వైపు మొగ్గడమూ సమర్థనీయం కాదు. 1951 నుంచి మన జనగణనలో ఎస్సీ, ఎస్టీలు మినహా మిగతా కులాల లెక్కలు వేయడం లేదు. కానీ, కులాల వారీ జనాభా ఆధారంగా మెరుగైన ప్రాతినిధ్యం, వనరుల కేటాయింపు జరగాలన్నది దీర్ఘకాలిక డిమాండ్. ఈ న్యాయమైన ప్రజాకాంక్షను కేంద్రం ఇప్పటికైనా పట్టించుకొని తీరాలి. అలాగే, లెక్కల్లో ఆడవాళ్ళ సంఖ్య తేలడంతో చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలుకు మెరుగైన ప్రాతిపదిక సిద్ధమవుతుంది. వీటి వల్ల సామాజిక న్యాయం, సమ్మిళిత ఆర్థిక పురోగతి, స్త్రీ – పురుష సమానత్వ స్పృహతో విధాన నిర్ణయానికీ వీలు చిక్కుతుంది. పైగా, ఈ పర్యాయం జనాభా లెక్కలు తొలిసారిగా డిజిటల్ విధానంలో జరగనున్నందున వివరాలు, విశేషాలు మరింత నిక్కచ్చిగా, వేగంగా అందవచ్చు. సాధారణంగా ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ముందస్తు పరీక్షగా జనాభా లెక్కల సన్నాహక ప్రక్రియ జరుపుతారు. మరుసటేడు ఫిబ్రవరిలో అసలు లెక్కలు జరుపుతారు. 2021 జనాభా లెక్కల కోసం 2019లోనే ఆ ప్రీ–టెస్ట్ జరిపినా, జాప్యమైనందున మళ్ళీ ప్రీ–టెస్ట్ జరపవచ్చు. అధికారిక ప్రకటనతోనే ఈ సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. అత్యవసరం, అనివార్యమైనప్పటికీ, జనగణన అంశంలో దేశంలో చేపట్టాల్సిన చర్యలూ కొన్ని ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో ఒకరికి మోదం, వేరొకరికి ఖేదం కలగరాదంటే... అమెరికా ఫక్కీలో మన వద్దా వివిధ రాష్ట్రాల మధ్య విద్య, ఉపాధి నిమిత్తం అంతర్గత వలసలను ప్రోత్సహించడం జనసంఖ్య సమతుల్య పంపిణీకి ఒక మార్గమని నిపుణుల మాట. అదే సమయంలో స్థానిక భాష, సంస్కృతుల్లో వలసదారులు కలగలసిపోయేలా ఇంగ్లీషు, హిందీ, స్థానిక భాష – అనే త్రిభాషా సూత్రాన్ని దేశవ్యాప్తంగా అనుసరించాలని మరో సూచన. హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాల వారు సైతం కచ్చితంగా మరో భారతీయ భాష నేర్చుకోవాలనే నియమం ద్వారా భాష, ప్రాంతాలకు అతీతంగా అందరినీ దగ్గర చేయవచ్చు. వెరసి, సమతుల్య జనాభా పంపిణీ, సాంస్కృతిక స్నేహవారధి సాయంతో ఆర్థికంగా, సామాజికంగా సంతులిత ప్రాంతీయాభివృద్ధికి బాటలు వేయవచ్చు. ఈసారికి 2025లో చేసినా, ఇకపై మునుపటిలానే ప్రతి దశాబ్ది ఆరంభంలోనే ఈ ప్రక్రియ చేపట్టడం మేలు. ఏమైనా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రాంతీయ ప్రయోజనాల్లో సమతూకం పాటించాలి. పరస్పర విశ్వాసంతో పాటు పూర్తి చిత్తశుద్ధి అందుకు అవసరం. -
పత్తి రేటుకు విపత్తు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తికి ధరల విపత్తు వచ్చింది. సీజన్ మొదట్లోనే, మార్కెట్లోకి పత్తి రావడం మొదలవుతుండగానే రేటు తగ్గిపోయింది. వ్యాపారులు, దళారులు ధరలు బాగా తగ్గించేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521 అయితే.. సోమవారం వరంగల్ మార్కెట్లో కనిష్టంగా రూ.5 వేల నుంచి గరిష్టంగా రూ. 6,950 వరకు మాత్రమే పలికింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనూ రూ.5,500 నుంచి గరిష్టంగా రూ.7,000కు మించి చెల్లించలేదు. దీనితో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు వారాల క్రితం క్వింటాల్‌కు రూ. 8,250 వరకు ధర చెల్లించినా.. ఇప్పుడు ఒక్కసారిగా తగ్గించేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మార్కెట్లోకి పత్తి రాక పెరిగితే.. ధరలను ఇంకెంత తగ్గిస్తారోనని వాపోతున్నారు. మార్కెట్‌కు పత్తి రాక ప్రారంభమైనా ‘కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. వ్యాపారులు, దళారులు రేటు తగ్గించేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే.. రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండేళ్ల క్రితం పత్తి ధరలు రూ. 10–15 వేల వరకు పలికాయని.. ఇప్పుడు దారుణంగా పడిపోయాయని అంటున్నాయి. పత్తి విస్తీర్ణంలో రాష్ట్రం మూడో స్థానం వానాకాలం సీజన్లో దేశవ్యాప్తంగా 2.74 కోట్ల ఎకరాల్లో పత్తి సాగైంది. మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో అత్యధికంగా 98.47 లక్షల ఎకరాల్లో.. రెండో స్థానంలో ఉన్న గుజరాత్లో 56.56 లక్షల ఎకరాల్లో సాగవగా.. తెలంగాణ 43.76 లక్షల ఎకరాల సాగుతో మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 1.60 కోట్ల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. అందులో తెలంగాణలో 25.33 లక్షల మెట్రిక్ టన్నుల మేర వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ వర్గాలు అంచనా వేశాయి. నిజానికి ఖరీఫ్ సీజన్ మొదట్లో పత్తి విత్తనాలు వేసేందుకు అనువైన వర్షాలు పడలేదు. విత్తనాలు వేసినా, వర్షాల్లేక రెండు, మూడు సార్లు వేయాల్సి వచ్చింది. పత్తి పూత దశకు వచ్చిన సమయంలో భారీ వర్షాలు పడ్డాయి. చేన్లు నీట మునిగి.. పూత, కాయ నేలరాలాయి. కొమ్మలు నీటిలో నాని, తెగుళ్లు సోకి దెబ్బతిన్నాయి. అంతేకాదు.. ఈసారి పత్తి విత్తనాల ధరలు, ఎరువులు, డీజిల్, ఇతర ఖర్చులు పెరిగి.. పెట్టుబడి తడిసిమోపెడైంది. ఇలాంటి సమయంలో పత్తి ధరలు తగ్గించేస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా తేమ 8 శాతం, ఆలోపు ఉంటే పూర్తి మద్దతు ధర లభిస్తుంది. 9 శాతం నుంచి 12 శాతం మధ్యలో ఉంటే.. శాతాన్ని బట్టి అదే తరహాలో ధర తగ్గుతూ వస్తుంది. కానీ నాణ్యత బాగున్నా వ్యాపారులు, దళారులు తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రంగు మారిన పత్తికి కూడా కనీస మద్దతు ధర దక్కేలా చూడాలని కోరుతున్నారు. ఇప్పటికీ తెరుచుకోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు... ఈ నెలాఖరు నుంచి మార్కెట్లోకి పెద్ద ఎత్తున పత్తి రానుంది. ఈ ఏడాది 351 పత్తి కొనుగోలు కేంద్రాలు పెట్టాలని నిర్ణయించారు. కానీ ‘కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలేవీ ప్రారంభించలేదు. జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా పెట్టి సీసీఐ పత్తి కొనుగోళ్లు చేస్తుంది. మిల్లులు ఆ పత్తిని జిన్నింగ్ చేసి సీసీఐకు అప్పగించాల్సి ఉంటుంది. టెండర్ల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి టెండర్లు ఇటీవలే పూర్తయినా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రారంభం కాలేదు. పైగా ఏటా వ్యాపారులు, దళారులు తక్కువ ధరలకు పత్తిని కొనుగోలు చేశాక.. సీసీఐ వచ్చి ప్రైవేట్ వ్యాపారుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారిందని.. అందులో భారీగా సొమ్ము చేతులు మారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. రైతుల అవసరం.. వ్యాపారుల సాకులు.. రైతులు చేన్లలో మూడు దశల్లో పత్తిని తీస్తారు. అందులో మొదటి, రెండోసారి ఎక్కువ పత్తి వస్తుంది. రైతులు ఇందులో మొదట ఏరే పత్తిని నిల్వ చేయకుండా మొత్తంగా విక్రయిస్తారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు, ఇతర ఖర్చులకు వినియోగిస్తుంటారు. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు, దళారులు పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం తేమ శాతం అధికంగా ఉందని, ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు పంట నాణ్యత కోల్పోయిందని సాకులు చెప్తున్నారు. పలు దేశాల్లో సంక్షోభ పరిస్థితులతో పత్తికి మార్కెట్ తగ్గిందని.. టెక్స్టైల్ మిల్లులు మూతపడ్డాయని చెబుతూ తక్కువ రేటు చెల్లిస్తున్నారు. చాలాచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ సంక్షోభమూ కారణమే! మన దేశంలో పండే పత్తి అధికంగా బంగ్లాదేశ్, చైనా, వియత్నాం, టర్కీ, పాకిస్తాన్ దేశాలకు ఎగుమతి అవుతుంది. కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం, పశ్చిమాసియా దేశాల్లో అల్లకల్లోలంతో ఎగుమతులు తగ్గుతున్నాయి. దీనితో పత్తికి డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతున్నాయని మార్కెటింగ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ గుజరాత్ రాష్ట్రంలో మాత్రం మద్దతు ధర కంటే అధిక రేట్లకు పత్తి కొనుగోళ్లు జరుగుతుండటం, తెలంగాణలో తగ్గిపోవడం ఏమిటన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెటింగ్ శాఖ వర్గాలు చెప్తున్న మేరకు.. గుజరాత్లో ప్రస్తుతం పత్తి క్వింటాల్‌కు రూ.8,257 పలుకుతోంది. వచ్చే నెలలో రూ.8,321 వరకు, డిసెంబర్ నెలలో రూ.8,260 వరకు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. గుజరాత్లో వస్త్ర పరిశ్రమలు, మిల్లులు, వ్యాపారులు ఎక్కువగా ఉండటం వల్ల.. కొనుగోళ్లు ఎక్కువగా ఉండి, పత్తి ఎక్కువ రేటు పలుకుతోందనే వాదనలూ ఉన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌పై ఫోకస్ పెట్టి.. ఇతర రాష్ట్రాల రైతులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కనీస ధర కూడా ఇవ్వడం లేదు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తికి రూ.7,521 మద్దతు ధర ప్రకటించింది. కానీ మార్కెట్లో ఆ ధర దక్కడం లేదు. వ్యాపారులు రూ.6,500 నుంచి రూ.7,000కు మించి ధర పెట్టడం లేదు. అంతేకాదు నాణ్యత పేరిట మరింతగా తగ్గిస్తున్నారు. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే మద్దతు ధర లభిస్తుంది. అందుకోసమే ఎదురుచూస్తున్నాం. – బానోత్ రామా, బీసురాజుపల్లి తండా, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మంజిల్లా -
స్థానిక సంస్థల నిధులు పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణ, గ్రామాల్లో మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయం పెంచాలని స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం సోమవారం ప్రజాభవన్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్రం గ్రాంట్లు, రుణాలు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్రానికి అందిస్తున్న నిధులు, స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం అందిస్తున్న గ్రాంట్లు తదితర అంశాలను అరవింద్ పనగరియా వివరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, నాయకులు, వాణిజ్య సంస్థలతో చర్చించారు. ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లతో బృందం సమావేశమైంది. ఈ భేటీలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, పీర్జాదిగూడ మేయర్ అమర్‌సింగ్, బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కౌన్సిల్స్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజుతోపాటు 17 మున్సిపాలిటీల సభ్యులు పాల్గొన్నారు. ఈ భేటీకి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, సీడీఎంఏ గౌతం హాజరయ్యారు. అనంతరం గ్రామ పంచాయతీల మాజీ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలతో కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సభ్యులు సంకెపల్లి సు«దీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్, మల్కుడ్ రమేశ్, కార్యదర్శి స్మితా సబర్వాల్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సాయం పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం వ్యాపార వాణిజ్య సంస్థలైన అలీఫ్, ఫిక్కీ, సీఐఐ ప్రతినిధులతో ఆర్థిక సంఘం భేటీ అయింది. ఆర్థికంగా తోడ్పడాలన్న పార్టీల ప్రతినిధులు ఆర్థిక సంఘం బృందంతో వివిధ పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ నుంచి సిరిసిల్ల రాజయ్య, టి. రామ్మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ తరఫున టి. హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వివేకానంద, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాసం వెంకటేశ్వర్లు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ సహా ఇతర పార్టీల నుంచి కూడా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాలకు ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధుల గురించి సిరిసిల్ల రాజయ్య, టి. రామ్మోహన్‌రెడ్డి ఆర్థిక సంఘం బృందానికి వివరించారు. కేంద్రం గ్రాంట్ల రూపంలో విరివిగా సాయం అందించాలని కోరారు. మరోవైపు హరీశ్‌రావు ఈ భేటీలో స్పందిస్తూ కేంద్రానికి వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని సర్‌చార్జీలు, సెస్సుల రూపంలో సమకూర్చుకుంటున్నా ఆ డబ్బును వాటా ప్రకారం రాష్ట్రాలకు పంచట్లేదని పేర్కొన్నారు. పాతబస్తీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని అక్బరుద్దీన్ కోరారు. పన్నుల వాటా పెంచాలని కోరాం: హరీశ్‌రావు రాష్ట్రాలకు పన్నుల వాటా 41 శాతానికి బదులు 31 శాతమే వస్తోందని.. దీన్ని సవరించి 50 శాతం పన్నుల వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని కోరినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ప్రజాభవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్నేతర ఆదాయంలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని.. స్థానిక సంస్థల గ్రాంట్‌ను 50 శాతానికి పెంచాలని కోరామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు రూ. 40 వేల కోట్లు, పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా కోసం కూడా విజ్ఞప్తి చేశామన్నారు. పన్ను ఎక్కువగా చెల్లిస్తున్న రాష్ట్రాలకు మద్దతివ్వండి: ఈటల ఉమ్మడి ఏపీలో తెలంగాణకు 2.9 శాతం పన్నుల వాటా వస్తే.. 15వ ఆర్థిక సంఘం నాటికి 2.43 వాటా వచ్చిందని.. ఇప్పుడది 2.1 శాతంగా మారిందని 16వ ఆర్థిక సంఘానికి తెలియజేసినట్లు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజాభవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్ను ఎక్కువ చెల్లిస్తున్న రాష్ట్రాలకు మద్దతివ్వాలని కోరినట్లు చెప్పారు. కాగా, పురపాలక పనుల్లో జీఎస్టీని మినహాయించాలని కోరినట్లు రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్స్ చైర్మన్, చౌటుప్పల్ చైర్పర్సన్ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. -
దివ్యమైన రికార్డు
పది రోజుల క్రీడా సంరంభానికి తెర పడింది. ప్యారిస్‌లో వేసవి ఒలింపిక్స్ ముగిసిన వెంటనే కొద్ది రోజులకే ఆరంభమైన పారాలింపిక్స్ ఆదివారం పూర్తయ్యేసరికి భారత బృందం కొత్త చరిత్ర సృష్టించింది. కనివిని ఎరుగని రీతిలో 29 పతకాలు (7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు) సాధించి సత్తా చాటింది. వెంట్రుక వాసిలో తప్పిపోయిన పతకాలను కూడా సాధించి ఉంటే, ఈ స్కోర్ 30 దాటిపోయేది. సాధారణ ఒలింపిక్స్‌లో ఇప్పటికీ రెండంకెల స్కోరును సాధించలేకపోయిన మన దేశం, దివ్యాంగులైన క్రీడాకారులతో సాగే పారాలింపిక్స్‌లో మాత్రం వరుసగా రెండుసార్లు ఆ ఘనత సాధించడం విశేషం. త్రుటిలో తప్పిన పతకాలతో ఈ ఏటి ప్యారిస్ సాధారణ ఒలింపిక్స్ మిశ్రమ ఫలితాలు అందిస్తే, ఈ పారాలింపిక్స్ మాత్రం మరిన్ని పతకాలతో ఉత్సాహం పెంచాయి. పైగా, ఆ ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ క్రీడా మహోత్సవంలో అయిదు రెట్లు ఎక్కువ పతకాలు సాధించడం గమనార్హం. మొత్తం 549 పతకాలకు జరిగే ఈ పోటీల్లో 23 క్రీడాంశాలకు గాను 12 అంశాల్లోనే పాల్గొన్న మన బృందం ఈసారి పతకాల పట్టికలో టాప్ 20లో నిలవడం చిరస్మరణీయం.మూడేళ్ళ క్రితం 2021 టోక్యో పారాలింపిక్స్‌లో మనం 19 పతకాలు గెలిచి చరిత్ర సృష్టిస్తే, ఇప్పుడు అంతకన్నా మరో 10 ఎక్కువ సాధించి, సంచలనం రేపాం. నిజానికి, 1972లో మురళీకాంత్ పేట్కర్ భారత్ పక్షాన తొట్టతొలి పారాలింపిక్ పతక విజేత. 1984లో మాలతీ కృష్ణమూర్తి హొల్లా భారత్ పక్షాన తొలి మహిళా పారాలింపియన్. అయితే, 2016 వరకు మన మహిళలెవ్వరూ పతకాలు సాధించలేదు. అప్పటి నుంచి పారాలింపిక్స్‌లో భారత్ పక్షాన కేవలం ముగ్గురంటే ముగ్గురు మహిళలే (దీపా మాలిక్ – 2016లో రజతం, అవనీ లేఖరా – 2020లో స్వర్ణం – కాంస్యం, భావినా పటేల్ – 2020లో రజతం) విజేతలుగా నిలిచారు. అలాంటిది ఈసారి భారత్ పక్షాన పతకాలు సాధించినవారిలో 10 మంది మహిళలే. తాజాగా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో స్వర్ణంతో ఇప్పటికి 2 పారాలింపిక్ స్వర్ణాలు గెలిచిన అవని మినహా మిగతా తొమ్మిది మందీ సరికొత్త విజేతలే. మన మహిళా అథ్లెట్లకు పారాలింపిక్స్‌లో ఇది అసాధారణ విజయం. ఎవరికి వారు ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ, అంచనాల ఒత్తిడిని తట్టుకొని ఈ ఘనత సాధించారు. ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్ఫూర్తిగాథ. ముఖ్యంగా తెలుగు బిడ్డ దీప్తి జీవాంజి లాంటివారి కథ మనసుకు హత్తుకుంటుంది. దివ్యాంగురాలైన ఆమె ఆటల్లో పైకి వచ్చి, పతకాల కల నెరవేర్చేందుకు తల్లితండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆఖరికి వరంగల్‌లోని తమ భూమి కూడా అమ్మేశారు. దీప్తి తాజా పారాలింపిక్స్‌లోనూ పతకం సాధించడమే కాక, తనను వదిలేయకుండా ఇంత పైకి తీసుకొచ్చిన కన్నవారి కోసం అదే స్థలాన్ని తిరిగి కొని బహూకరించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే మానవీయ గాథ. ఇలాంటి కథలు ఇంకా అనేకం. ఇక, పేరున్న క్రీడా తారలైన జావలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్, హైజంపర్ మారియప్పన్ తంగవేలు లాంటి వారే కాక అంతగా ప్రసిద్ధులు కాని అథ్లెట్లు సైతం ఈసారి పతకాల విజేతలుగా నిలవడం విశేషం. పతకాలు సాధించడమే కాక, పలువురు భారతీయ అథ్లెట్లు సరికొత్త మైలురాళ్ళను చేరుకొని, చరిత్ర సృష్టించడం గమనార్హం. క్రీడాసంఘాలను రాజకీయ పునారావాస కేంద్రాలుగా మార్చి, వాటిని అవినీతి, ఆశ్రిత పక్షపాతాలకు నెలవుగా మారిస్తే జరిగే అనర్థాలు అనేక చోట్ల చూస్తూనే ఉన్నాం. రెజ్లింగ్ సంఘం లాంటి చోట్ల గత రెండేళ్ళలో జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. అలాంటివాటి వల్ల ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ వేదికలపై పతకాలు పోగొట్టుకున్నాం. పారాలింపిక్స్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చూపగలిగామంటే ఆ జాడ్యాలు ఇక్కడ దాకా పాకలేదని సంతోషించాలి. కేంద్రం, కార్పొరేట్ సంస్థలు అందించిన తోడ్పాటు ఈ దివ్యాంగ క్రీడాకారులకు ఊతమైందని విశ్లేషకుల మాట. గడచిన టోక్యో గేమ్స్‌కు రూ. 26 కోట్లు, 45 మంది కోచ్‌లతో సన్నాహాలు సాగించిన ప్రభుత్వం ఈసారి రూ. 74 కోట్లు ఖర్చు చేసి, 77 మంది కోచ్‌లతో తీర్చిదిద్దడం ఫలితాలిచ్చింది. వివిధ దేశాల నుంచి దాదాపు 4400 మందికి పైగా పారా అథ్లెట్లు పాల్గొన్న ఈ క్రీడా సమరంలో మన దేశం నుంచి ఎన్నడూ లేనంతగా ఈసారి 84 మంది పాల్గొన్నారు. ఈ ప్రపంచ పోటీలకు దాదాపు 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం, రోజూ ఈ జీవన విజేతల విన్యాసాలు చూసేందుకు స్టేడియమ్ నిండుగా జనం తరలిరావడం చెప్పుకోదగ్గ విషయం. మరి, చెదరని పోరాటపటిమతో శారీరక, సామాజిక అవరోధాలన్నిటినీ అధిగమిస్తున్న దివ్యాంగులకు మన దేశంలో పాలకులు చేయవలసినంత చేస్తున్నారా అన్నది మాత్రం ప్రశ్నార్థకమే. ‘దివ్యాంగుల హక్కుల చట్టం– 2016’ లాంటివి ఉన్నా, ఇవాళ్టికీ మనదేశంలో మహానగరాల్లో సైతం పాఠశాలల్లో, ప్రయాణ సాధనాల్లో, కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో వారికి కావాల్సిన కనీస వసతులు మృగ్యం. అయిదేళ్ళలో ఆ పని చేయాలని చట్టపరమైన సంకల్పం చెప్పుకున్నా, ఆచరణలో జరిగింది అతి తక్కువన్నది నిష్ఠురసత్యం. చివరకు చట్టం కింద చేపట్టాల్సిన పథకాలకూ కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోతలు పెట్టడం విషాదం. ఈ పరిస్థితి మారాలి. సమాజంలోనూ, సర్కార్పరంగానూ ఆలోచన తీరూ మారాలి. ఆ రకమైన ప్రోత్సాహంతో దివ్యాంగులు మరింత పురోగమించ గలరు. తాజా విజయాల రీత్యా మనవాళ్ళకు మరింత అండగా నిలిస్తే, విశ్వవేదికపై వారు భారత ఖ్యాతిని ఇనుమడింపజేయగలరు. అలా చూసినప్పుడు ప్యారిస్ పారాలింపిక్స్ విజయాలు ఆరంభం మాత్రమే. వచ్చే 2028 నాటి లాస్ ఏంజెల్స్ గేమ్స్‌కు అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, పారా అథ్లెట్స్ ప్రతిభ తోడై ఇదే దూకుడు కొనసాగిస్తే అద్భుతాలూ జరుగుతాయి. -
ఎట్టకేలకు ఒక కదలిక
రథం కదులుతోంది. ఎప్పుడో జరగాల్సిన పనిలో ఇప్పటికైనా అడుగులు ముందుకు పడుతున్నాయి. దేశంలో జనాభా లెక్కల పని ఎట్టకేలకు మరికొద్ది రోజుల్లోనే సెప్టెంబర్‌లో ఆరంభ మవుతోంది. ఆ మేరకు ఇటీవల వెలువడ్డ సమాచారం పెద్ద ఊరట. ప్రతి పదేళ్ళకు ఒకసారి జరగాల్సిన ఈ జనగణన యజ్ఞం నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది. కోవిడ్ సహా అనేక సాకులతో ప్రభుత్వం సాచివేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది. అయితే, భారత్ లాంటి వర్ధమాన దేశానికి జనగణన మినహా ప్రత్యామ్నాయ మార్గాలలో ఆ స్థాయి సమాచారం అందుబాటులో లేదు. ఉన్నా అది అంత నమ్మదగినదీ కాదు. అందుకే జనాభా పరంగా, సామాజిక – ఆర్థికపరంగా దేశ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించడానికి కొన్ని దశాబ్దాలుగా జనగణన అత్యంత కీలకమైనది.అలాంటి జనగణన ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కుతోంది. వచ్చే నెల (సెప్టెంబర్)లో ఆరంభ మయ్యే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు ఏణ్ణర్ధ కాలం పడుతుందని ప్రభుత్వం మాట. జనగణన అనేది పలువురు పొరబడుతున్నట్టు కేవలం గణాంకాల సేకరణ కాదు. అది సుపరి పాలనకు మూలస్తంభం. దేశం ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక సవాళ్ళకు పరిష్కారాలు కనుగొనేందుకు మార్గదర్శి. పట్టణీకరణ, ప్రాథమిక వసతుల అభివృద్ధి మొదలు సాంఘిక సంక్షేమం, ఆర్థిక ప్రణాళిక వరకు ప్రతి అంశం పైనా సరైన విధాన నిర్ణయాలకు ఈ సమాచారమే కీలకం. నిజానికి, జనాభా లెక్కల సేకరణలో కేంద్ర సర్కార్ చేసిన సుదీర్ఘ జాప్యం చాలాకాలంగా విమర్శలకు గురవుతోంది. ప్రైవేట్వారే కాదు... సర్కారీ ఆర్థిక నిపుణులు సైతం విమర్శకుల్లో ఉండడం గమనార్హం. పాత జనాభా లెక్కల ఆధారంగానే ఇప్పటికీ ఆరోగ్యం, ఆర్థిక అంశాలు, చివరకు ద్రవ్యోల్బణం రేటు, ఉపాధి లెక్కల లాంటివన్నీ గణిస్తూ ఉండడం వల్ల కచ్చితత్వం లోపిస్తోంది. డేటా లోపంతో కనీసం 15 కీలక అంశాలపై దుష్ప్రభావం పడింది. అదే ఈ నిపుణులందరి బాధ. పుష్కర కాలం క్రితపు లెక్కలపై ఆధారపడే సరికి అంతా లోపభూయిష్టమైంది. దాదాపు 10 కోట్ల మంది పౌర సరఫరా వ్యవస్థకు వెలుపలే ఆహారభద్రత లేకుండా మిగిలిపోయారు. ఇళ్ళు, శ్రామికుల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులపైనా దెబ్బ పడింది. చివరకు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వారి సర్వేల నాణ్యత కూడా దెబ్బతింది. అంతెందుకు... జనాభాలో చైనాను భారత్ దాటేసి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరించినట్టు ఐరాస నివేదిక గత ఏడాది ప్రకటించింది. దాన్ని ఖరారు చేయడానికో, కాదనడానికో, ఆ జనాభా లెక్కకు అనుగణంగా అవసరమైన చర్యలు చేపట్టాడానికో కూడా మన వద్ద నిర్దుష్టమైన గణాంకాలు లేని పరిస్థితి. అలాంటి లోపాలన్నీ సరిదిద్దుకోవడానికి ఇప్పుడిది సదవకాశం. అదే సమయంలో జనగణనలో భాగంగా మన జనాభా తాలూకు కులగణన కూడా చేయడం అత్యవసరం. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ కోరుతున్నది అదే. తద్వారా జనసంఖ్యలో ఏ సామాజిక వర్గం వంతు ఎంత, ఏయే వర్గాల స్థితిగతులు ఏమిటి, ఏ వర్గాలు ఎంతగా వెనకబడి ఉన్నాయి తదితర భోగట్టా తేటతెల్లమవుతుంది. కులాలు, ఉపకులాలతో పాటు వర్తమానంలో కనుమరుగైపోతున్న ఆశ్రిత కులాల లెక్కలూ వెలికివస్తాయి. వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చేలా పాలకులు పాలసీలు చేయడానికీ వీలవుతుంది. ప్రణాళిక, పాలన, చట్టాల రూపకల్పన సహా అనేక ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షకూ, నిర్వహణకూ ఈ సమాచారమంతా ఉపకరిస్తుంది. తాజా జనగణన రాజకీయంగానూ ప్రధానమే. దేశంలోని అన్ని స్థాయుల చట్టసభలలో నియో జక వర్గాల పునర్విభజన, రిజర్వేషన్‌కు ఈ కొత్త లెక్కలే ఆధారమవుతాయి. అంటే, అసెంబ్లీ, పార్ల మెంట్ స్థానాల సంఖ్య మారిపోనుంది. ఈ లెక్కన దక్షిణాదితో పోలిస్తే జనాభా నియంత్రణ అంతగా లేని ఉత్తరాదిలో మరిన్ని చట్టసభా స్థానాలు వస్తాయి. ఫలితంగా అధికార సమీకరణాలూ మారి పోతాయి. ఇంతటి ముఖ్యమైనది కాబట్టే... ఇలాంటి అధికారిక గణాంక వ్యవస్థను ప్రభుత్వ, రాజ కీయ జోక్యాలకు వీలైనంత దూరంగా ఉంచడం శ్రేయస్కరం. మారిన కాలానికి అనుగుణంగా కొత్త జనగణన రూపురేఖలూ మారుతున్నాయట. ప్రధానంగా డిజిటల్ పద్ధతిలో, అదీ స్వీయ నమోదు పద్ధతిలో జనగణన సాగనుంది. గతంలో స్త్రీ, పురుషుల వివరాలనే దఖలు పరిస్తే, ఇప్పుడు తొలి సారిగా ట్రాన్స్జెండర్ల వివరాలనూ ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీలే కాక ‘ఇతర వెనుకబడిన వర్గాలు’ అంటూ వివరాలు విడిగా నింపనున్నారట. ఏమైతేనేం, ఇన్నేళ్ళ తరువాతైనా జనాభా లెక్కల ప్రక్రియను మళ్ళీ చేపట్టడం హర్షణీయం. అతి ముఖ్యమైన బృహత్ యజ్ఞాన్ని ఇక నుంచైనా ఎప్పటికప్పుడు నిర్ణీత సమయానికే నిర్వహించడం అత్యవసరం. తద్వారానే కచ్చితమైన డేటా దేశంలో పాలనా యంత్రాంగానికి అందుబాటులోకి వస్తుంది. 2026 మార్చి కల్లా ఈ జనగణన ఫలితాలను సమర్పించేందుకు కేంద్ర శాఖలు ఇప్పటికే నిర్ణీత కాలవ్యవధి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. దీంతో, 2011 నుంచి అప్పటి దాకా... అంటే 15 ఏళ్ళ కాలవ్యవధిలోని సమాచారం చేతిలోకి వస్తుంది. అయితే, ఈసారి జరిగిన జాప్యం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. దేశం ముందుకు సాగడానికి దాని సమూహ స్వరూప స్వభావాలు దానికైనా తెలిసి ఉండడం ముఖ్యం. అలాంటి సమాచార సేకరణ, వినియోగంలో అంతరాయాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఊహించని ఆటంకాలు ఎదురైనా ఇబ్బంది పడకుండా ఉండేలా జనాభాపై సమగ్ర సమాచారం అందించే కట్టుదిట్టమైన వ్యవస్థలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాలు జరగడానికి ఇదే తరుణం. -
సీఎం జగన్ లేఖపై ఏం చేశారు?: హైకోర్టు
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించకపోవడం ఎంత మాత్రం సరికాదంది. ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది. సీఎం లేఖ రాస్తే దానిని పక్కన పెట్టి నిద్రపోవడానికి వీల్లేదని, సీఎం లేఖను గౌరవించాలని తేల్చి చెప్పింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్లో ఎక్కడా ముఖ్యమంత్రి రాసిన లేఖ గురించి, దానిపై తీసుకున్న చర్యల గురించి కేంద్రం ప్రస్తావించలేదని ఆక్షేపించింది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వివిధ వర్గాలు ఇచ్చిన భూమిని విక్రయించే విషయంలో పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ఏ చట్టం కింద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ప్రైవేటీకరణకు అనుమతించే చట్టం ఏదైనా ఉందా? ప్రైవేటీకరణకు ముందు ఆ కర్మాగారం ఉద్యోగులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇతర లబ్దిదారులను సంప్రదించారా? ఈ విషయాలన్నింటిపై మీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు విశాఖ ఉక్కు కర్మాగారం కొనసాగేందుకు అవసరమైన నిధులను విదేశాల నుంచి తెస్తానని, ఇందుకు ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద ప్రత్యేక ఖాతా తెరిచేందుకు అనుమతించాలన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వినతి విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటీకరణపై పలు వ్యాజ్యాలు... విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు సువర్ణరాజు తదితరులు వేర్వేరుగా ‘పిల్స్’ దాఖలు చేశారు. రేషన్‌కార్డుదారులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ కూడా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ శేషసాయి ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది. సీఎం లేఖ గురించి కేంద్రం ఏమీ చెప్పడం లేదు... విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను ఆమరణ నిరాహార దీక్ష చేశానని తొలుత కేఏ పాల్ వాదనలు వినిపించారు. కేంద్ర మంత్రి విశాఖకు వచ్చి తనను కలిశారన్నారు. కేంద్రం అనుమతిస్తే తాను ఇక్కడే కూర్చొని రూ.8 వేల కోట్ల నిధులను రప్పించి ఏ ఖాతాలో కావాలంటే అందులో జమ చేయిస్తానని చెప్పారు. లేని పక్షంలో ఏ శిక్షకైనా తాను సిద్ధమేనన్నారు. 45 ఏళ్లలో ఉక్కు కర్మాగారం పన్నుల కింద రూ.54 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. మరో పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను సూచించిందా? అని ప్రశ్నించగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని, ఆ లేఖ సంగతి ఏమిటో కేంద్రం చెప్పడం లేదని నివేదించారు. మేం కొన్న 25 ఎకరాలనే అమ్ముతున్నాం ధర్మాసనం ఈ సమయంలో జోక్యం చేసుకుని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) తరఫు న్యాయవాదిని వివరణ కోరింది. ప్రైవేటీకరణ నిజమేనా? భూములు అమ్ముతున్న మాట వాస్తవమేనా? అని ప్రశ్నించింది. ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని ఆర్ఐఎన్ఎల్ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్ నివేదించారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో వేటినీ అమ్మడం లేదన్నారు. ఆర్ఐఎన్ఎల్ తన సొంత నిధులతో కొనుగోలు చేసిన 25 ఎకరాలను మాత్రమే విక్రయించనున్నట్లు తెలిపారు. దీంతో ధర్మాసనం వివేక్ చెప్పిన వివరాలను రికార్డ్ చేసింది. మరో న్యాయవాది వై.కోటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని, యథాతథస్థితి కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్ధించారు. విశాఖ ఉక్కు చరిత్ర తెలుసా..? ఆ 25 ఎకరాలు కాకుండా సేకరించిన మిగిలిన భూముల సంగతి ఏమిటి? ఆ భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి? అసలు విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్ర తెలుసా? ఎన్ని ఉక్కు కర్మాగారాల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నారు? ఎన్ని ఆచరణలోకి వచ్చాయి? అంటూ కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ స్పందిస్తూ భూముల అమ్మకం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన లేదన్నారు. పిటిషనర్లది ఆందోళన మాత్రమేనన్నారు. ఏం చేసినా పారదర్శకంగా చేస్తామని, పత్రికా ప్రకటన ఇస్తామని చెప్పారు. దీంతో అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం సూచించగా మూడు వారాల్లో అందచేస్తామని రుద్ర నివేదించారు. నిధులు తెచ్చే విషయంలో ఏమైనా వినపతిత్రం ఇచ్చారా? అని ధర్మాసనం ప్రశ్నించగా మార్చిలో అందచేసినట్లు కేఏ పాల్ పేర్కొన్నారు. ఆ వినతిపై ఏ చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. -
శిలాజ ఇంధనాలకు రాయితీలు తగ్గితేనే...
శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరుగుతున్నందు వల్ల కాలుష్యం మరింత పెరుగుతోంది. అందుకే ప్రపంచ దేశాలు ఆ ఇంధనాలపై ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని వివిధ అంతర్జాతీయ సంస్థలూ, సదస్సులూ దశాబ్దాలుగా పిలుపునిచ్చాయి. ఉదాహరణకు కాప్– 21 సదస్సులో 40 కంటే ఎక్కువ దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడానికి ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. అయినా కూడా పారిశ్రామిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వినియో గానికి బడ్జెట్ బదిలీలు, పన్ను మినహాయింపులు, ఆర్థిక హామీలు అందజేస్తూనే ఉన్నాయి. ఈ సబ్సిడీల వలన వాతావరణానికి ప్రాథమికంగా హాని చేస్తున్న శిలాజ ఇంధనాల ఉపయోగం పెరుగుతూనే ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి తగిన చర్యలు లేకపోవడంతో వర్ధమాన దేశాలు కూడా ముందడుగు వేయడానికి సిద్ధంగా లేవు. 2023లో భారతదేశంలో మొత్తం ఇంధన సబ్సిడీలు రూ. 3.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్’ చేసిన కొత్త పరిశోధన ప్రకారం ఇవి గత తొమ్మిదేళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దేశంలో ఇంధన వనరుల డిమాండ్ పెరగడంతో పాటు, 2022లో ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో, ప్రభుత్వం 2023లో అన్ని రకాల ఇంధన వనరుల లభ్యతను విస్తరిస్తూ హైబ్రిడ్ విధా నాన్ని అవలంభించింది. పెరుగుతున్న ఇంధన వినియోగం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరువాత అంతర్జాతీయ ఇంధన ధరల సంక్షోభం ప్రభావం, అనేక దేశాలు అనుకున్న లక్ష్యాలకు వ్యతిరేకంగా శిలాజ ఇంధనాలకు మద్దతును గణనీయంగా పెంచాయి. భారతదేశం కూడా ఈ దిశ గానే అనేక చర్యలు అమలులోకి తెచ్చింది. 2022– 2023లో గరిష్ఠ స్థాయికి చేరుకున్న శిలాజ ఇంధన ధరల ప్రభావం నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ రిటైల్ ధరలను పరిమితం చేసింది. పన్నులను తగ్గించింది. వ్యాపారులు, వినియోగ దారులకు ప్రత్యక్ష నగదు బదిలీలు చేసింది. ఆయా చర్యల ఫలితంగా చమురు, గ్యాస్ సబ్సిడీలు 2022తో పోలిస్తే 2023లో 63 శాతం పెరిగాయి. అయితే, 2023లో మొత్తం ఇంధన సబ్సిడీలలో బొగ్గు, చమురు, గ్యాస్ సబ్సిడీలు దాదాపు 40 శాతం కాగా, కాలుష్య రహిత ఇంధన వనరుల (క్లీన్ ఎనర్జీ)కు సబ్సిడీలు 10 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. మిగిలిన సబ్సిడీలలో ఎక్కువ భాగం విద్యుత్ వినియోగానికీ, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినవీ ఉన్నాయి. ఇదే కాలంలో బొగ్గు సబ్సిడీలు కూడా 17 శాతం పెరిగాయి. మొత్తంగా క్లీన్ ఎనర్జీ సబ్సిడీల కంటే శిలాజ ఇంధన సబ్సిడీలు ఐదు రెట్లు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రత్యక్ష బడ్జెట్ బదిలీల ద్వారా చమురు, గ్యాస్ రంగానికి గణనీయమైన మద్దతును అందించింది. ఈ కాలంలో, మొత్తం చమురు – గ్యాస్ సబ్సిడీలు కనీసం రూ.70,692 కోట్లకు పెరి గాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ సబ్సిడీల కారణంగా వరి, గోధుమలు, మక్కలు, చెరుకు వంటి ఆహార సంబంధిత ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయ డానికి చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఒకవైపు ఆహార భద్రత సాధించటానికీ, ఆకలి తగ్గించడానికీ వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం... ఇంకొక వైపు సబ్సిడీలు ఇచ్చి అదే ఆహార పంటలను ఇతరత్రా ఉపయోగాలకు మళ్ళిస్తోంది. ఇందువల్ల కలిగే దీర్ఘకాలిక దుష్ప్రభావం ఊహించలేని విధంగా ఉండవచ్చు. 2020 ఆర్థిక సంవత్సరంలో, కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం ఇంధన ఆదాయం రూ. 6,99,565 కోట్లుగా అంచనా. ఇది మొత్తం ప్రభుత్వ ఆదాయంలో దాదాపు 17 శాతం. ఇంధన వనరుల నుంచి వచ్చే ఆదా యంలో ఎక్కువ భాగం (83శాతం) చమురు, గ్యాస్ నుండి వస్తోంది. పునరుత్పాదక ఇంధనం నుంచి 1 శాతం కంటే తక్కువే వస్తోంది. ఈ ఆదాయం కూడా ఎక్కువగా కేవలం రెండు పన్నుల నుండి వస్తోంది: కేంద్ర ఇంధన ఎక్సైజ్, రాష్ట్ర స్థాయి వ్యాట్. శిలాజ ఇంధన శక్తి వనరుల వల్ల ఆదాయం 2030 నాటికి అదనంగా రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 3,40,000 కోట్లకు పెరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయం కోల్పోవటానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. క్రమంగా ఈ ఆదాయం మీద ఆధార పడటం తగ్గించడానికి కూడా సుముఖంగా లేవు. అయితే శిలాజ ఇంధనాల వల్ల ఆదాయం మాత్రమే కాదు భారం కూడా ఉంటుంది. ఇంధనాల ధరలో ప్రతిబింబించని ఖర్చుల భారం చాల ఎక్కువ. ఒక అంచనా ప్రకారం ఈ భారం ప్రభుత్వ ఆదాయానికి ఐదు రెట్లు ఎక్కువ. ఈ భారం రకరకాలుగా ఉంటుంది. ప్రధానంగా నీరు, గాలి, ఇతర ప్రకృతి వనరుల కాలుష్యం వల్ల కలిగే మరణాలు, అనారోగ్య సమస్యలు, వాటిని అధిగమించడానికి కల్పించవలసిన మౌలిక సదుపాయాల రూపంలో ఈ భారాన్ని చూడవచ్చు. అందుకే కాలుష్య రహిత ఇంధన (క్లీన్ ఎనర్జీ) ఉత్పత్తులు పెంచడానికి చర్యలు తీసుకోవాలని అనేక అంతర్జాతీయ సంస్థలు అంటున్నాయి. ప్రపంచ వాతా వరణ సదస్సులలో కాలుష్య రహిత ఇంధనాల వైపు ఉత్పత్తి, వినియోగ రంగాలు మారాలని ఎప్పటి నుంచో ఒత్తిడి ఉంది. ‘గ్లాస్గో కాప్ 26’ సదస్సులో బొగ్గు ఆధా రిత విద్యుత్, ఇతర ఇంధన ఉపయోగాలను క్రమంగా తగ్గించాలని పెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. కేవలం బొగ్గు కాకుండా అన్ని రకాల శిలాజ ఇంధనాల ఉపయోగం క్రమంగా తగ్గించాలని వాదించింది. దుబాయి కాప్ 28 సదస్సులో ఈ దిశగా అన్ని రకాల శిలాజ ఇంధనాలను దశల వారీగా తగ్గించాలనే తీర్మానం దాదాపు ఖరారు అయినా సర్వామోదం పొందలేదు. పెరుగుతున్న కర్బన కాలుష్యం కారణంగా భూమి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకర శిలాజ ఇంధ నాలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా వాటికి రాయితీలు తగ్గించాలి. అది సాధ్యం కావాలంటే సమూల ఆర్థిక పరివర్తనం అవసరం. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తే ఆర్థిక వృద్ధి సుస్థిరం అవుతుంది. శిలాజ ఇంధన దిగుమతుల మీద ఆధారపడిన ఆర్థిక అభివృద్ధి సుస్థిరం ఎప్పటికీ కాలేదు. ప్రకృతిని కలుషితం చేస్తూ అభివృద్ధి దిశగా పయనించడం దుర్భరంగా ఉంటుంది. అందుకే కర్బన కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా అవసరమైన వాతా వరణ లక్ష్యాలను చేరుకోవడం కోసం ఒక ఆచరణాత్మక దృష్టి అవసరం. ప్రభుత్వం శిలాజ ఇంధన పన్ను ఆదా యంలో కొంత భాగాన్ని కొత్త కాలుష్య రహిత శక్తి వనరుల వైపు మళ్ళించాలి. సుస్థిర అభివృద్ధికీ, సమాన ఫలాలు అందరికీ అందించే ఆర్థిక వ్యవస్థకూ ఇంధనాల కూర్పు చాల కీలకం. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
ఇచ్చిన హామీ కోసమే ఇంత పట్టు!
వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే వారు అడుగుతున్నారని అర్థం. ఇంకోలా చెప్పాలంటే... ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాత్రమే వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వానికయ్యే ఖర్చు పది లక్షల కోట్ల వరకు ఉంటుందన్నది తప్పు. ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయలనేది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఆర్థికశాస్త్రాన్ని ఆకళింపు చేసుకోవటం దుర్ల భమనీ, అందులోని వ్యవసాయ ఉపాంగం గందరగోళ పరుస్తుందనీ భావించే వ్యక్తి మీరైతే గనుక... కనీస మద్దతు ధరకు ప్రభుత్వం చట్టపరమైన హామీ ఇవ్వాలన్న రైతుల డిమాండ్ గురించీ, అసలు కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలన్న విషయం గురించీ రెండు వైపుల నుంచి వినవస్తున్న పూర్తి భిన్నాభి ప్రాయాలను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఐసీఆర్ఐఈఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్) వ్యవసాయ సమాచార విభాగం ప్రొఫెసర్ అశోక్ గులాటీ తనకున్న వృత్తిపరమైన సౌలభ్యం ఆధారంగా కొన్ని కీలకమైన విషయాలను ప్రస్తావనలోకి తెచ్చారు. మొదటిది, భారతదేశంలోని మొత్తం వ్యవసాయ ఉత్పత్తులలో 27.8 శాతం మాత్రమే కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్ –ఎంఎస్పీ) వర్తింపు కిందికి వస్తాయి. తత్ఫలితంగా 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే ఎంఎస్పీ వల్ల లబ్ధి పొందుతున్నాయి. అత్యంత వేగంగా 8–9 శాతంతో పుంజుకుంటున్న కోళ్ల పరిశ్రమ, 7–8 శాతంతో దూకుడు మీదున్న మత్స్య పరిశ్రమ, 5–6 శాతంతో పొంగిపొర్లుతున్న పాల ఉత్పత్తి వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలు ఎంఎస్పీ పరిధిలోకి రావు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా 23 రకాల దిగుబడులకు కనీస మద్దతు ధరను చట్ట పరమైన హామీగా ఇవ్వటం అన్నది ‘రైతు వ్యతిరేక చర్య’ కావచ్చునని గులాటీ అభిప్రాయం. ఎంఎస్పీ అన్నది మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్న సందర్భాలలో ప్రైవేటు వ్యాపారులు పంట దిగు బడులను కొనుగోలు చేయటానికి నిరాకరిస్తారు. ఆ కారణంగా అమ్ముడు కాని వ్యవసాయ ఉత్పత్తులు రైతుల దగ్గర భారీగా మిగిలి పోతాయి. చివరికి ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆ మిగులును కొనుగోలు చేయక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. మొదటిది రైతుకు విపత్కరమైనది. రెండోది ప్రభుత్వానికి ఆర్థికపరమైన చిక్కులను తెచ్చిపెట్టి, బడ్జెట్‌నే తలకిందులు చేసేది. అయితే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ హిమాన్షు ఈ వాదనను అంగీకరించడం లేదు. వరి, గోధుమ, మరో 21 రకాల దిగుబడుల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ... వాస్తవానికి గోధుమ, వరికి తప్ప మిగతా వాటికి మొదటసలు ఎంఎస్పీ అమలే కావటం లేదు. అయినప్పటికీ రైతులు మొత్తం 23 రకాల దిగుబడుల ఎంఎస్పీకి చట్టపరమైన హామీని ఇవ్వాలని పట్టు పడుతున్నారూ అంటే... ప్రభుత్వం దేనికైతే కట్టుబడి ఉన్నానని గతంలో హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే అడుగుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇంకోలా చెప్పాలంటే, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం అది! ఎంఎస్పీ అమలు వల్ల కేవలం 10 శాతం వ్యవసాయ కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందటానికి కారణం... ఆచరణలోకి వచ్చే టప్పటికి గోధుమ, వరికి తప్ప మిగతా రకాల దిగుబడులకు అది అమలు కాకపోవటమేనని హిమాన్షు అంటారు. వాటికీ అమలయ్యే పనైతే అప్పుడు లబ్ధిదారుల శాతం 30 వరకు, ఇంకా చెప్పాలంటే 40 వరకు పెరగొచ్చు. రెండోది... కోళ్లు, చేపలు, పాడి వంటి కొన్ని పరిశ్రమలు కనీస మద్దతు ధర లేకున్నా అభివృద్ధి చెందుతున్నాయంటే అర్థం పంటలకు అవసరం లేదని కాదనీ, అదొక తూగని వాదన అనీ హిమాన్షు అంటారు. మరీ ముఖ్యంగా, హిమాన్షు అనడం – ఎంఎస్పీ అనేది «ధరల స్థిరీకరణకు ఒక సాధనం అని! నిజానికి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో కనీస మద్దతు ధర సదుపాయం లేని రైతులు చాలా తక్కువ. రెండోది – ఎంఎస్పీ కనుక మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వమే ప్రతిదీ కొనేస్తుందని కాదు. మొదట ఆ రెండు ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించటం వరకు మాత్రమే ప్రభుత్వం ఆ పని చేయవలసి ఉంటుంది. ఒకసారి అలా చేస్తే మార్కెట్ ధరలు వాటంతట అవే పెరుగుతాయి. ఆ దశలో ప్రభుత్వ జోక్యం నిలిచి పోతుందని అంటారు హిమాన్షు. ఎంఎస్పీ అనేది ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీగా ప్రజలలో ఒక భావన ఉందన్న దానిపైన మాత్రం గులాటీ, హిమాన్షు ఇద్దరూ అంగీకరిస్తున్నారు. కనీస మద్దతు ధరను వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీగా వారు భావిస్తున్నారు. ఉదాహరణకు, ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నప్పుడు అది ఆ ప్రజలు పొందుతున్న సబ్సిడీ అవుతుందని హిమాన్షు అంటారు. అలాగే ఇద్దరూ కూడా కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇచ్చేందుకు అయ్యే ఖర్చును అంచనా వేయటం అంత తేలికైన విషయమైతే కాదని అంగీకరిస్తున్నారు. ప్రాంతానికీ ప్రాంతానికీ అంచనాలు మారుతుండటం మాత్రమే కాదు; అప్పటికి ఉన్న మార్కెట్ ధర, ఆ మార్కెట్ ధరకూ – ఎంఎస్పీకీ మధ్య ప్రభుత్వం ఎంత భారీగా వ్యత్యాసాన్ని తగ్గించాలి, ఎంతకాలం ఆ తగ్గింపు కొనసాగాలి అనే వాటి మీద అంచనాలు ఆధారపడి ఉంటాయి. హిమాన్షు మరో అంశాన్ని కూడా లేవనెత్తారు. ప్రభుత్వం కొనుగోలు చేసే ధరకూ, ప్రభుత్వం అమ్మే ధరకూ మధ్య వ్యత్యాసమే ప్రభుత్వానికి అయ్యే అసలు ఖర్చు అని ఆయన అంటారు. అంటే కనీసం పాక్షికంగానే అయినా ఖర్చు ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. కాబట్టి ఎంఎస్పీకి చట్టపరమైన హామీ ఇచ్చేందుకు కాగల ఖర్చు పది లక్షల కోట్లు అన్న లెక్క స్పష్టంగా తప్పు. నిజానికి ‘క్రిసిల్’ అంచనా వేసిన 21,000 కోట్ల రూపాయల లెక్క వాస్తవానికి దగ్గరగా ఉంది. ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. కనీస మద్దతు ధరను ఎలా లెక్కించాలి? ఉత్పత్తి ఖర్చును, అందులో 50 శాతాన్ని లాభంగా కలిపి లెక్కించాలా? అలా చేస్తే ఆహార ద్రవ్యోల్బణం 25 నుంచి 35 శాతం పెరుగుతుందని గులాటీ అంటారు. అంతేకాక బడ్జెట్లో భారీ కేటాయింపులు అవసరమై, ప్రభుత్వ ఆహార పథకం అమలులో ఆర్థికపరమైన సంకట స్థితులు తలెత్తవచ్చు. ప్రముఖ ఆర్థికవేత్త స్వామి నాథన్ అయ్యర్ కూడా 50 శాతాన్ని లాభంగా కలిపి మద్దతు ధర ఇవ్వటం సహేతుకం కాదని అంటున్నారు. ఈ వాదనలతో హిమాన్షు విభేదిస్తున్నారు. ప్రభుత్వం చెబు తున్నట్లు ఇప్పటికే సీ2 (ఉత్పత్తి వ్యయం), అందులో 50 శాతం మొత్తాన్ని కలిపి వరికి, గోధుమలకు కనీస మద్దతు ధరలు వర్తింపజేస్తున్నారు. అయినప్పటికీ గులాటీ భయాలకు దగ్గరలో కూడా ద్రవ్యోల్బణం లాంటిదేమీ లేదని అంటున్నారు. ఇక అయ్యర్ సహేతుకం కాదన్న 50 శాతం లాభం గురించి మాత్రం, కావాలంటే అందులో మార్పులు చేసుకోవచ్చన్నారు. అయితే రైతులకు తగిన ప్రతిఫలం అవసరం. అలా పొందిన ప్రతిఫలాన్ని వారు తిరిగి ఖర్చు చేయటం అన్నది దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఆ అభివృద్ధి అక్కడితో ఆగదు అంటారు హిమాన్షు. చివరి ముఖ్య విషయం. రైతుల ఆదాయాలను పెంచడానికి ఉత్తమమైన మార్గం... అధిక విలువ గలిగిన పంటల వైవిధ్యానికి వ్యవసాయ ప్రోత్సాహకాలను అందివ్వటం అని గులాటీ అంటారు. దీనికి స్పందనగా హిమాన్షు ఎంఎస్పీని మొత్తం 23 రకాల పంటలకు వర్తింపచేస్తే చాలు వైవిధ్యాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని అంటున్నారు. ఆయన అనటం... రైతులు వ్యాపారులు కూడాననీ, అందువల్ల ప్రోత్సాహాలను పొందటానికి మొగ్గు చూపుతారనీ!ఇదేమైనా మీకు ఉపకరించిందా? ఉపకరించిందనే భావిస్తాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మోదీ ఎఫెక్ట్.. మాల్దీవుల మయిజ్జూకు కొత్త టెన్షన్!
మాలే: మాల్దీవుల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాల్దీవుల్లోని మహ్మద్ మయిజ్జూ ప్రభుత్వానికి తాజాగా మరో షాక్ తగిలింది. భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న మాల్దీవుల ప్రభుత్వంపై స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాల్దీవుల్లో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి. వివరాల ప్రకారం.. భారత వ్యతిరేక వైఖరి దేశ అభివృద్ధికి హానికరంగా పరిణమించవచ్చునని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ (ఎండీపీ), డెమోక్రాట్స్ పార్టీల నేతలు మయిజ్జూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి భాగస్వామిని దూరం చేసుకోవడటం ఏమాత్రం సబబుకాదని, మరీ ముఖ్యంగా సుదీర్ఘకాలంగా మైత్రిని కొనసాగిస్తున్న దేశాన్ని దూరం చేసుకుంటే దీర్ఘకాలిక అభివృద్ధికి హానికరమని ఎండీపీ, డెమోక్రాట్ పార్టీల నేతలు విమర్శించారు. అయితే, రెండు రోజుల క్రితం చైనాకు చెందిన గూఢాచార నౌక మాల్దీవుల నౌకాశ్రయంలో తిష్ట వేయడం ఆసక్తికరంగా మారింది. భారత్‌తో దౌత్య బంధాలు దెబ్బతినడంతో మాల్దీవుల ప్రభుత్వం చైనా సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో రాజకీయ, సైనిక మార్పులు వచ్చాయని అక్కడి ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇదే సమయంలో భారత్‌ను దీర్ఘకాల మిత్రదేశంగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. విదేశాంగ విధానంలో భాగంగా ప్రభుత్వం అన్ని అభివృద్ధి భాగస్వాములతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని విపక్ష నేతలు పేర్కొన్నారు. Two major opposition parties in the Maldives, the Maldivian Democratic Party (MDP) and The Democrats, have voiced concerns over President Mohammad Muizzu's perceived 'anti-India' stance. pic.twitter.com/Y7OlSJMets — Mohit Vijh (@vijh_mohit) January 25, 2024 మాల్దీవుల స్థిరత్వం, భద్రతకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, శాంతి, భద్రత చాలా ముఖ్యమైనదని ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు సూచించాయి. ఈ మేరకు ఎండీపీ చైర్మన్ ఫయాజ్ ఇస్మాయిల్, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అహ్మద్ సలీమ్, డెమొక్రాట్స్ పార్టీ చీఫ్ హసన్ లతీఫ్, పార్లమెంటరీ గ్రూప్ లీడర్ అలీ అజీమ్‌లు ఉమ్మడి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. భారత ప్రధాని మోదీ లక్షదీప్ పర్యటన అనంతరం.. జనవరి 8న చైనాలో నాలుగు రోజుల అధికారిక పర్యటనకు ముయిజ్జూ వెళ్లారు. అదే సందర్భంలో ఆయన ప్రభుత్వంలోని ముగ్గురు ఉప మంత్రులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించీ, మొత్తంగా భారతీయుల గురించీ అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయడంతో వివాదం చెలరేగింది. చైనాలో మయిజ్జూ కూడా భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. అయితే, కొన్ని సంవత్సరాలుగా, మాల్దీవులను సందర్శించేవారిలో భారతీయుల వాటా అత్యధికం. తాజా పరిణామంతో మాల్దీవులను సందర్శించాలనుకున్న భారతీయులు తమ హోటల్, విమాన బుకింగ్‌లను రద్దు చేసుకున్నారు. మరోవైపు.. దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో భారత్ తన దళాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవులు ప్రభుత్వం చెప్పింది. ఇందుకు మార్చి 5 గడువు తేదీగా విధించింది. -
మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఈ కంపెనీలకు కొత్త రూల్స్!
ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ సంవత్సరం కొత్త తయారీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, కంపెనీల ఉత్పత్తులను పరీక్షించి అవన్నీ సంతృప్తికరమైన ఫలితాలను పొందిన తరువాత మాత్రమే ప్రొడక్షన్, మార్కెట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫార్మా కంపెనీల మెటీరియల్స్, మెషీన్లు, ప్రాసెస్ వంటివన్నీ కూడా తప్పకుండా కొత్త ప్రమాణాలను అనుకూలంగానే ఉండాలని భారత ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల నాణ్యతకు తయారీదారు బాధ్యత వహించాలని పేర్కొంది. 50 బిలియన్ల పరిశ్రమ ప్రతిష్టతను కాపాడటానికి కర్మాగారాల పరిశీలనను మోదీ ప్రభుత్వం వేగవంతం చేసింది. కంపెనీల ఉత్పత్తులు నాణ్యమైనవిగా ఉన్నప్పుడు రోగులు ప్రమాదంలో పడే అవకాశం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థల ఉత్పత్తులను నిశితంగా పరీక్షించి, సంతృప్తికరమైన ఫలితాలను పొందినప్పుడే మార్కెట్ చేసుకోవాలని ఆదేశించారు. 2022 డిసెంబర్ నుంచి సుమారు 162 ఫార్మా కంపెనీలలో ఇన్కమింగ్ ముడి పదార్థాల టెస్టింగ్ లేకపోవడాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశించిన అంతర్జాతీయ ఔషధాల తయారీ ప్రమాణాలను కలిగి ఉన్న కంపెనీలు భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదీ చదవండి: 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ పెద్ద ఔషధ తయారీదారులు ఆరు నెలల్లోగా, చిన్న పరిశ్రమలు 12 నెలల్లోగా కొత్త ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ గడువు పెంచాలని, ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న కంపెనీలు ఈ కొత్త నిబంధనలను అనుసరించాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఖర్చు తీవ్రత ఎక్కువైతే దాదాపు సగం కంపెనీలు క్లోజ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
ఆచితూచి వ్యవహరించాల్సిందే!
కెనడాలోని ఒక సిక్కు నాయకుడి హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు ఇరుదేశాల సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. రాజకీయంగా తన ప్రాచుర్యం క్రమేపీ తగ్గిపోతున్న నేపథ్యంలో, ఖలిస్తాన్ అనుకూలురు ఉన్న ‘ఎన్డీపీ’ తన సంకీర్ణంలో కొనసాగేందుకు ట్రూడో ఈ పని చేసుండాలి. 2018 నాటి భారత పర్యటనలో తనను పట్టించుకోలేదన్న ట్రూడో అసంతృప్తి కూడా మరో కారణం కావొచ్చు. ఏమైనా ఈ వ్యవహార ప్రభావం అమెరికా, ఇతర జీ–7 దేశాల సంబంధాలపై పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా, ఖలిస్తాన్‌కు మద్దతునివ్వని ప్రపంచవ్యాప్త సిక్కుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈమధ్య పెద్ద దుమారమే లేపారు. ఈ ఏడాది జూన్ 18న కెనడాలోని గురుద్వారా వెలుపల జరిగిన కెనడా సిక్కు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందనేందుకు తమ వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉందన్న ట్రూడో ప్రకటన ఇరు దేశాల మధ్య వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. అయితే హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను భారత ప్రభుత్వం చాలా కాలం క్రితమే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలకు నగదు బహుమతి కూడా ప్రకటించింది. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉండి ఉంటే అది అసాధారణమైన విషయమే అవుతుంది. కాకపోతే పరిస్థితులను గమనించినప్పుడు నిజ్జర్ హత్య పక్కా గ్యాంగ్ వార్‌ను పోలుతుంది. నిజ్జర్ పూర్వాపరాలను గమనించినా హత్యకు గ్యాంగ్ వారే కారణమని అనిపించడం ఖాయం. సత్యం ఏమైనప్పటికీ ట్రూడో ఆరోపణల పుణ్యమా అని ఇప్పుడు భారత్ పరువుకు కొంత భంగం కలిగింది. అది కూడా జీ–20 సమావేశాలను అధ్యక్ష స్థానంలో ఉంటూ విజయవంతంగా పూర్తి చేసిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత ఇబ్బందికరమైంది. కామన్ వెల్త్ దేశమైన, భారతీయ సంతతివారు ఎక్కువ సంఖ్యలో ఉన్న, ఇండో–పసిఫిక్ వ్యూహంలో కీలకమైన కెనడాతో భారత్ సంబంధాలిప్పుడు అట్టడుగు స్థాయికి చేరాయి. అయితే ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది: చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలంటే భారత్ సాయం కచ్చితంగా అవసరమని అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, పశ్చిమ యూరప్, జపాన్ భావిస్తున్నాయి. ఈ భాగస్వామ్యానికి కొన్ని పరిమితులు లేకపోలేదు. అదే సమయంలో నాటో, జీ–7 దేశాల సభ్య దేశాలతో వ్యవహరించే సందర్భంలో వ్యవహారం మారిపోయేందుకు అవకాశా లెక్కువ. అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సుల్లివాన్ చేసిన ప్రకటనతో ఈ విషయం స్పష్టమవుతుంది: ‘‘ఇలాంటి చర్యలకు పాల్పడినప్పుడు ప్రత్యేకమైన మినహాయింపులు ఎవరికీ ఉండవు. దేశం ఏదైనా సరే, మా ప్రాథమిక నైతిక సిద్ధాంతాల రక్షణ కోసం నిలబడతాం. అలాగే దగ్గరి భాగస్వామి అయిన కెనడా లాంటి దేశాలతో సంప్రదింపులు జరిపి చట్టాన్ని పరిరక్షించేందుకు వారు చేసే ప్రయత్నాల్లోనూ, దౌత్యపరమైన ప్రక్రియల్లోనూ సహకరించుకుంటాం’’ అన్నారు ఆయన. తిరస్కరించిన భారత్ కెనడాలో ఓ సిక్కు నేత హత్య వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందన్న విషయాన్ని భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. అర్థం లేని, దురుద్దేశపూరిత ఆరోపణలుగా కొట్టి పారేసింది. అయితే ఇంతటితో కథ ముగిసిపోయిందని అనుకునేందుకు వీల్లేదు. వట్టి తిరస్కా రాలతోనో, ఉగ్రవాదంపై చర్యల విషయంలో ట్రూడో నిర్లక్ష్య వైఖరిని తప్పుపట్టడంతోనో సమస్య సమసిపోదు. కెనడాలోని కొంతమంది సిక్కులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం వెనుక చాలా చరిత్రే ఉంది. అయితే ప్రస్తుతం నిజ్జర్ లాంటివాళ్లు చేస్తున్న క్రిమినల్ కార్యకలాపాలపై భారత్ ఎక్కువగా దృష్టి పెట్టాలి. నిజ్జర్ రాజ కీయాలు, ఉగ్రవాద, హింసాత్మక కార్యక్రమాల్లో ఆయన ప్రమేయం వంటివి ఎత్తి చూపడం ఆయన హత్యను సమర్థించినట్లు కనిపించవచ్చు. మరీ ముఖ్యంగా మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వర్గాల్లో ఈ రకమైన ఆలోచన బలపడవచ్చు. కానీ నిజ్జర్ కార్యకలాపాలపై ఉన్న సమాచారం మొత్తాన్ని భారతీయ నిఘా సంస్థలు కెనడా, ఇతర పాశ్చాత్య దేశాలతో పంచుకోవడం మేలు. ట్రూడో ఆరోపణలను గట్టిగా తిరస్కరించడం ద్వారా భారత్ సరైన పనే చేసింది. భారతీయ దౌత్యవేత్తను కెనడా తిప్పి పంపడంతో భారత్ కూడా అదే పని చేయడమూ తగిన ప్రతిచర్యే. కానీ, పరిస్థి తులు మరింత దిగజారకుండా ఉండటం ఇరు దేశాలతోపాటు భారత్‌తో మరింత ఎక్కువ సంబంధాలు కోరుకుంటన్న పాశ్చాత్య మిత్రులకూ అత్యవసరం. కెనడాతో మనకున్న సంబంధాలు కాస్తా అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాల మైత్రిపై ప్రభావం చూపరాదు. అదే జరిగితే ఈ అంశాన్ని తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకునేందుకు చైనా, పాకిస్తాన్ కాచుకు కూర్చున్నాయన్న విషయం మరవరాదు. కెనడా రాజకీయాలూ చూడాలి... ప్రస్తుత దౌత్య సమస్యకు కెనడాలోని స్థానిక రాజకీయ పరి స్థితులూ కారణం కావచ్చు. ట్రూడో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కోసం ఉగ్రవాదులను సమర్థిస్తున్నారన్న నెపంపై కెనడా లోని కొంత మంది సిక్కులపై విమర్శలు చేయడం కూడా తగదు. దీనివల్ల కెనడాలోని మెజారిటీ సిక్కులు, ఇతర దేశాల వారు, మరీ ముఖ్యంగా భారతీయ సిక్కులను దూరం పెట్టినట్టుగా ఉండకూడదు. ఖలిస్థాన్ డిమాండ్‌కు వీరందరూ దూరమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖలిస్తాన్ భయాన్ని ఎత్తిచూపాలన్న ఉబలాటం ఉండొచ్చు, కానీ ఇది ఉద్దేశించని నష్టం కలిగించే ప్రమాదం ఉంది. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రూడో విమర్శలకు దిగడం వెనుక ఆయనకున్న వ్యక్తిగత ఆసక్తి ఏమిటన్నది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కెనడా రాజకీయాల్లో విదేశాల ప్రమేయంపై ఇప్పటికే విచారణ సాగుతోంది. దేశంలో చైనా కార్యకలాపాలపై చెక్ పెట్టలేకపోయారన్న అంశం ట్రూడోకు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి, ఈ అంశం దాన్ని పక్కదోవ పట్టించగలదు. ట్రూడో ప్రభుత్వం మనుగడ కోసం సిక్కు రాజకీయ పార్టీ, ఖలిస్థాన్ ఉద్యమ అనుకూలురు ఎక్కువగా ఉన్న న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) మద్దతు అవసరం. ఇందుకోసమే ట్రూడో భారత్‌పై ఈ రకమైన విమర్శలకు దిగి ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. సిక్కుల మనోభావాలు దెబ్బతినకుండా... 2018లో భారత పర్యటన సందర్భంగా తనను అంతగా పట్టించుకోలేదని ట్రూడో భావించడం కూడా ప్రస్తుత పరిస్థితికి ఒక కారణం కావచ్చు. ‘అన్ని పర్యటనలను అంతం చేసే పర్యటన’ అని ట్రూడో అప్పట్లోనే ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. వ్యక్తిగతమైన భారత వ్యతిరేక భావన ఇప్పుడు ఇలా అనాలోచిత తప్పుడు ఆరోపణలకు దారితీసి ఉండవచ్చు. వ్యక్తిగా ట్రూడోతో ఉన్న సంబంధాలు ఇరు దేశాల మధ్య సంబంధాలను నిర్ణయించే పరిస్థితి ఉండరాదు. రాజకీయంగా, వ్యూహాత్మకంగా, ఆర్థిక అంశాల పరంగానూ ఇరు దేశాల మధ్య సఖ్యత ఎంతో అవసరం. భారత్ – కెనడా సంబంధాల ప్రభావం అమెరికా, ఇతర జీ–7 దేశాలతో మనకున్న సంబంధాలపై కూడా ఉండవచ్చు. ట్రూడోతో మన గొడవ కాస్తా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలను దెబ్బతీయకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. పంజా బ్లో ఇప్పటికే ఈ అంశంపై అసంతృప్తి రగులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ట్రూడో ప్రభుత్వంపై భారత్‌కు ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కేందుకు సిక్కు కుటుంబాలు తమ స్వస్థలాలకు రావడాన్ని అడ్డుకోవడం మార్గం కాదు. ఏమైనా, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారకుండా ఉండాలని ఆశిద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సిమ్ కార్డ్స్ నిబంధనలు మరింత కఠినం - ఉల్లంఘిస్తే..
SIM Cards Rules: భారత ప్రభుత్వం సిమ్ కార్డుల విషయంలో చాలా కఠినమైన నిబంధలనలను ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే 2023 అక్టోబర్ 01 నుంచి కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దుకాణాలకు కఠినమైన నియమాలు.. సిమ్ కార్డులను విక్రయించే దుకాణాలు మునుపటి కంటే కూడా రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కొత్త రూల్స్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి టెలికామ్ ఆపరేటర్లు రిజిస్టర్డ్ డీలర్ల ద్వారా మాత్రమే సిమ్ కార్డులను విక్రయించాయి. దీనికి వ్యతిరేఖంగా ప్రవర్తిస్తే వారికి రూ. 10 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీల బాధ్యత.. ఎయిర్టెల్, జియో వంటి పెద్ద టెలికామ్ కంపెనీలు తప్పకుండా తమ సిమ్ కార్డ్‌లను విక్రయించే దుకాణాలను తనిఖీ చేయాలి. అంతే కాకుండా దుకాణాలు నిబంధనలు పాటించేలా చూసుకోవాలి. పోలీసు తనిఖీలు.. పటిష్టమైన భద్రతలను అమలుపరచడానికి పోలీసులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా అస్సాం, కాశ్మీర్ వంటి కొన్ని ప్రదేశాలలో కొత్త సిమ్ కార్డ్‌లను విక్రయించే దుకాణాలపై పోలీసు తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. కావున విక్రయదారులు ఖచ్చితంగా నియమాలను అనుసరించాలి. ధృవీకరణ.. వినియోగదారులు కొత్త సిమ్ కార్డుని కొనుగోలు చేయాలన్నా.. లేదా పాతది పోయినప్పుడు & పనిచేయనప్పుడు ఖచ్చితంగా వివరణాత్మక ధృవీకరణ అందించాల్సి ఉంది. ఈ ప్రక్రియ సరైన వ్యక్తులకు మాత్రమే సిమ్ కార్డ్ యాక్సెస్ ఉందని నిర్థారిస్తుంది. కొత్త రూల్స్ సిమ్ కార్డులను సురక్షితం చేయడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మోసగాళ్ల భారీ నుంచి కూడా కాపాడంలో సహాయపడతాయి. -
గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకున్నారా? తక్షణమే చేయండి!
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితో మీకో అలర్ట్. కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది. డెస్క్ టాప్ కంప్యూటర్లు, లాప్‌టాప్‌ల్లో పాత క్రోమ్ బ్రౌజర్లు వినియోగిస్తున్న గూగుల్ క్రోమ్ యూజర్లు అలర్ట్‌గా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. తక్షణమే అప్డేట్ చేసుకోవాలని కోరింది. గూగుల్ క్రోమ్బ్రౌజర్లో పలు లోపాలను గుర్తించినట్టు తెలిపింది. దీంతో హ్యాకర్లు చొరబడి యూజర్ల పెర్సనల్ డేటా చోరీ చేసే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. CERT-In హైలైట్ చేసినవి CVE-2023-4427 CVE-2023-4428 CVE-2023-4429 CVE-2023-4430 CVE-2023-4431 ప్రభావిత సాఫ్ట్వేర్ గూగుల్ క్రోమ్ విండో వర్షన్ 116.0.5845.110/.111 మ్యాక్, లైనక్స్ వర్షన్ 116.0.5845.110 కంటే ముందు వర్షన్ బ్రౌజర్లలో లోపాలను గుర్తించామని, వీటిని యూజర్లకు ముప్పు పొంచి ఉందని సెర్ట్-ఇన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని, అలాగే అనుమానాస్పద, నమ్మశక్యం కాగాని వెబ్సైట్ల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. Google Chromeని ఎలా అప్డేట్ చేసుకోవాలి కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి కుడివైపున టాప్‌లో క్లిక్ మోర్మీద క్లిక్ చేయాలి చేయాలి. ‘హెల్ప్ అబౌట్ గూగులో క్రోమ్’ మీద క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ క్రోమ్ బటన్ కనిపించకపోతే మీ కంప్యూటర్ ఇప్పటికే అప్డేట్ అయినట్టు అర్థం. అపుడు రీలాంచ్ అనే బటన్‌మీద క్లిక్ చేయాలి. ఇప్పటికే కొన్నింటిని అప్డేట్ చేసింది.అయితే ఆటోమేటిక్‌గా అప్ డేట్ కానిపక్షంలో ‘క్రోమ్ ఈజ్ అప్ టూ డేట్’ అనే మెసేజ్ వస్తుంది. -
మెడిసిన్ నకిలీదా.. కాదా? సింపుల్‌గా తెలుసుకోండిలా!
ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. ఆరోగ్యం కూడా అంతే వేగంగా క్షిణిస్తోంది. కావున మెడిసిన్స్ మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే ఈ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు కొంతమందికి అవి నకిలీ ముందుకు అయుండొచ్చని సందేహం వస్తుంది. అలాంటి అనుమానాలకు చెక్ పెట్టటానికి క్యూఆర్ కోడ్ విధానం అందుబాటులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. క్యూఆర్ కోడ్.. నివేదికల ప్రకారం.. సుమారు 300 మందుపైన క్యూఆర్ కోడ్ వేయాలని 'డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా' (DCJI) ఫార్మా కంపెనీలను ఆదేశించింది. కావున నిర్దేశిత మందులపైన క్యూఆర్ లేదా బార్ కోడ్ తప్పనిసరి అయింది. వీటిని స్కాన్ చేయడం ద్వారా ఆ మెడిసిన్ గురించి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. క్యూఆర్ లేదా బార్ కోడ్ కలిగిన మందుల జాబితాలో యాంటీ బయాటిక్స్, కార్డియాక్ పిల్స్, పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్లు, యాంటీ డయాబెటిక్స్, యాంటీ డయాబెటిక్స్ మిక్స్‌టార్డ్, గ్లైకోమెట్-జిపి, యాంటీబయాటిక్స్ ఆగ్మెంటిన్, మోనోసెఫ్, గ్యాస్ట్రో మెడిసిన్ వంటివి ఉన్నాయి. ఫార్మా రిటైల్ మార్కెట్లో దాదాపు రూ. 50,000 కోట్ల విలువైన అధికంగా అమ్ముడవుతున్న 300 కంటే ఎక్కువ మందులపై క్యూఆర్ కోడ్ రానుంది. ఈ క్యూఆర్ కోడ్ అమలు చేయడంలో ఏదైనా అవకతవకలు జరిగితే భారీ జరిమానా చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని డసీజేఐ ఆదేశించింది. ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ కొత్త ఇయర్‌బడ్స్ ధరెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు! మెడిసిన్ డీటెయిల్స్.. నిజానికి ఈ క్యూఆర్ కోడ్ వల్ల మనం తీసుకున్న మెడిసిన్ వివరాలను తెలుసుకోవచ్చు. అంటే దాని జనరల్ నేమ్, బ్రాండ్ నేమ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ పేరు, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, తయారీదారు లైసెన్స్ నెంబర్ వంటివి ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు.. లక్షల కోట్ల సంపద, వేల ఎకరాల భూమి ప్రభుత్వం నకిలీ మందులను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఈ విధానం మీద కృషి చేయగా ఈ రోజు (2023 ఆగష్టు 01) నుంచి అందుబాటులోకి వచ్చింది. దీన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 1940 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టాన్ని సవరించింది. -
గతంలో టెస్లాను భారత్ తిరస్కరించింది అందుకేనా?
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' (Tesla) త్వరలోనే భారతదేశంలో అడుగుపెట్టనున్నట్లు జరిగిన ప్రకటన విషయం తెలిసిందే. గతంలో భారత ప్రభుత్వం ఈ కంపెనీ అభ్యర్థనను పలుమార్లు తిరస్కరించింది. కాగా ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మన దేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి మీద ట్యాక్స్ ఉంటుందని అందరికి తెలుసు. కావున స్వదేశీ వాహనాల కంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాహనాల ధరలు భారీగా ఉంటాయి. ఈ సమయంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సుంకాలను తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని కోరాడు. మన దేశంలోని ఉత్పత్తులను ప్రోత్సహించడానికి కేంద్రం మస్క్ కోరికను తిరస్కరించింది. భారతీయ మార్కెట్లో ప్రవేశించనున్న టెస్లాకు ప్రస్తుతం ఎటువంటి సుంకం మినహాయింపులను పరిగణనలోకి తీసుకోవడం లేదని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ధృవీకరించినట్లు తాజాగా రెవిన్యూ సెక్రటరీ 'సంజయ్ మల్హోత్రా' వెల్లడించారు. మన దేశంలో గణనీయమైన పెట్టుబడులను పెంచడానికి ఈ చర్యలు తీసుకోవడం జరుగుతోంది. (ఇదీ చదవండి: రతన్ టాటా డ్రీమ్ కారుకి కొత్త హంగులు - ఈవీ విభాగంలో దూసుకెళ్తుందా?) భారతదేశంలో టెస్లా కార్లను తయారు చేయడానికి సుమారు 5,00,000 ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన కర్మాగారం ఏర్పాటు చేయడానికి మస్క్ భారత ప్రభుత్వంతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. అనుకున్న విధంగా జరిగితే మన దేశంలో టెస్లా కార్లు కేవలం రూ. 20 లక్షలకు లభించే అవకాశం ఉంది. అంతే కాకుండా మన దేశం నుంచి ఇండో పసిఫిక్ ప్రాంతంలకు కూడా ఎగుమతులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే టెస్లా కంపెనీకి భారత్ ఎగుమతి కేంద్రంగా నిలుస్తుందని తెలుస్తోంది. -
లిథియం నిల్వల వేలం ప్రక్రియకు కేంద్రం సన్నద్ధం.. దక్కించుకునే లక్ ఎవరికుందో?
2023 ఫిబ్రవరి 10న జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారీ లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఈ నిల్వలను బయటకు తీయడానికి, శుద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సుమారు 5.9 మిలియన్ టన్నుల వరకు ఉన్న లిథియం నిల్వలను బయటకు తీయడానికి వేర్వేరు లెవెల్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎక్కువగా లిథియం నిల్వలు ఉన్న దేశాల్లో భారతదేశం ఏడవ స్థానం ఆక్రమించింది. నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్ బ్యాటరీలలో ఎక్కువ శాతం లిథియం వినియోగం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం లిథియం డిపాజిట్ల వేలం ప్రక్రియను 2023 జూన్‌లో ప్రారంభించనున్నట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. లిథియం నిల్వల వేలం ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుందని, వేలం ప్రక్రియలో దీనిని సొంతం చేసుకునే సంస్థలు శుద్ధి చేసే ప్రక్రియను భారతదేశంలోనే జరపాలని, ఏ కారణం చేతనూ విదేశాలకు పంపించకూడదని సంబంధిత వర్గాలు చెబుతున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్.. కేవలం రూ. 89 మాత్రమే) భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉంది, అదే సమయంలో దేశంలో బయటపడిన లిథియం నిల్వల వల్ల 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారదేశంలో లిథియం శుద్ధి చేయడానికి కావలసిన సదుపాయాలు లేదు, భవిష్యత్తులో ఇలాంటి సదుపాయాలు దేశంలో నెలకొల్పబడతాయా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రపంచంలో ఎక్కువ లిథియం ఉన్న దేశాల్లో బొలీవియా మొదటి స్థానంలో ఉండగా, తరువాత స్థానాల్లో వరుసగా అర్జెంటీనా, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా దేశాలు ఉన్నాయి, ఇటీవల ఇండియా లిథియం అయాన్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రం ప్రభుత్వం లిథియం వేలం ప్రక్రియను పూర్తి చేసిన తరువాత జరగాల్సిన పనులు ప్రారంభమవుతాయి. -
కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే!
న్యూఢిల్లీ: ఉత్పత్తులు, సర్వీసులపై వినియోగదారులను తప్పుదోవ పట్టించే నకిలీ ఆన్లైన్ సమీక్షలకు చెక్ చెప్పే దిశగా కేంద్రం కొత్త పాలసీని రూపొందించింది. ఇది నవంబర్ 25 నుండి అమల్లోకి రానుంది. ఆయా ఆన్లైన్ పోర్టల్స్ ముందుగా వీటిని స్వచ్ఛందంగా అమలు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ తప్పుడు రివ్యూల సమస్య కొనసాగిన పక్షంలో నిబంధనలను కేంద్రం తప్పనిసరి చేయనుంది. దీని ప్రకారం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ కంపెనీలు స్వచ్ఛందంగా అన్ని పెయిడ్ రివ్యూల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఇతరుల నుండి కొనుగోలు చేసిన సమీక్షలు, అలాగే సరఫరాదారు లేదా థర్డ్ పార్టీ తమ ఉత్పత్తులు/సర్వీసుల రివ్యూ కోసం నియమించుకున్న ఉద్యోగులు రాసే సమీక్షలను ప్రచురించకూడదు. ఆన్లైన్ వినియోగదారుల రివ్యూలపై భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ‘ఐఎస్ 19000:2022’ పేరిట కొత్త ప్రమాణాన్ని రూపొందించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సోమవారం తెలిపారు. ఉత్పత్తులు .. సర్వీసుల సరఫరాదారులు, తమ సొంత కస్టమర్ల నుండి రివ్యూలను సేకరించే సంస్థలు, సరఫరాదారు నియమించుకున్న థర్డ్ పార్టీ కాంట్రాక్టరు సహా కన్జూమర్ రివ్యూలను ఆన్లైన్లో ప్రచురించే అన్ని సంస్థలకు ఇవి వర్తిస్తాయని వివరించారు. 15 రోజుల్లో సర్టిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం.. ఆన్లైన్ పోర్టల్స్ ఈ ప్రమాణాలను పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను వచ్చే 15 రోజుల్లోగా ప్రారంభించనున్నట్లు సింగ్ చెప్పారు. ఈ–కామర్స్ సంస్థలు ఈ సర్టిఫికేషన్ కోసం బీఐఎస్‌కి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. చాలా దేశాలు తప్పుడు రివ్యూలకు అడ్డుకట్ట వేసేందుకు చాలా తంటాలు పడుతున్న తరుణంలో ఈ తరహా ప్రమాణాలను ప్రవేశపెట్టిన తొలి దేశం బహుశా భారతేనని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా టూర్..ట్రావెల్, రెస్టారెంట్లు .. హోటళ్లు, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో రివ్యూలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సింగ్ తెలిపారు. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ రిటైల్, టాటా సన్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థలు కొత్త ప్రమాణాలపై సంప్రదింపుల ప్రక్రియలో పాల్గొన్నట్లు సింగ్ చెప్పారు. అలాగే ప్రమాణాల రూపకల్పనలో సీఐఐ, ఫిక్కీ తదితర పరిశ్రమ సమాఖ్యలను కూడా సంప్రదించినట్లు వివరించారు. నిబంధనల ప్రకారం .. ఏ సంస్థలోనైనా రివ్యూలను హ్యాండిల్ చేసే బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగిని రివ్యూ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తారు. సమీక్షలు చట్టబద్ధమైనవిగా, కచ్చితమైనవిగా, తప్పుదోవ పట్టించని విధంగా ఉండాలి. రివ్యూ చేసే వ్యక్తుల అనుమతి లేకుండా వారి పేర్లను వెల్లడించకూడదు. సమీక్షలసేకరణ పక్షపాతరహితంగా ఉండాలి. చదవండి: మూన్‌లైటింగ్: 81 శాతం ఉద్యోగులు స్పందన ఇదే.. సర్వేలో షాకింగ్ విషయాలు! -
ఓఎన్జీసీ లాభంలో క్షీణత
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఓఎన్జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 12,826 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 18,348 కోట్లు ఆర్జించింది. అనూహ్య(విండ్‌ఫాల్) లాభాల పై ప్రభుత్వం పన్ను విధింపు ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం మాత్రం 57%పైగా జంప్‌చేసి రూ.38,321 కోట్లకు చేరింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 6.75 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కంపెనీలో ప్రభుత్వానికి దాదాపు 59 శాతం వాటా ఉంది. విక్రయ ధరలు అప్ ఉత్పత్తి చేసిన ప్రతీ బ్యారల్ చమురుకు స్థూలంగా 95.49 డాలర్లు లభించినట్లు ఓఎన్జీసీ పేర్కొంది. గత క్యూ2లో ఇది 69.36 డాలర్లు మాత్రమే. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ధరలు భారీగా ఎగసిన విషయం విదితమే. అయితే ప్రభుత్వం పెరిగిన ధరలపై జూలై 1 నుంచీ కొత్తగా విండ్‌ఫాల్ పన్ను విధించింది. ప్రస్తుత సమీక్షా కాలంలో రూ. 6,400 కోట్లమేర ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని చెల్లించినట్లు కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ పేర్కొన్నారు. వెరసి ప్రతీ బ్యారల్‌కు 75–76 డాలర్లు లభించినట్లు తెలియజేశారు. ఇక నేచురల్ గ్యాస్‌పై ఒక్కో ఎంబీటీయూకి 6.1 డాలర్లు లభించగా.. గత క్యూ2లో కేవలం 1.79 డాలర్లు పొందింది. ఈ కాలంలో చమురు ఉత్పత్తి 5.47 మిలియన్ టన్నుల నుంచి 5.36 ఎంటీకి తగ్గింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 5.46 బిలియన్ ఘనపు మీటర్ల నుంచి 5.35 బీసీఎంకు మందగించింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో కేజీ బేసిన్లో ఆరు డిస్కవరీలకు తెరతీసింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు ఎన్ఎస్ఈలో 2.3 శాతం బలపడి రూ. 142 వద్ద ముగిసింది. -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం: విడిచి వెళ్లాలా? వద్దా?
న్యూఢిల్లీ: నగరం విడిచి, దేశ సరిహద్దులకు వెళ్దామంటే దాడుల భయం.. ఎప్పుడు ఏ క్షిపణి దాడికి బలైపోతామో తెలియదు. ఇక్కడే ఉందామంటే తినడానికి తిండిలేదు, తాగడానికి నీరులేదు. పైగా రక్తం గడ్డ కట్టించే చలి పులి భయపెడుతోంది. ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో తలదాచుకుంటున్న భారతీయుల దీనస్థితి ఇది. ఉండాలో వెళ్లిపోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. సుమీపై రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. క్షిపణుల వర్షం కురిపిస్తోంది. జనం అండర్‌గ్రౌండ్ స్టేషన్లలో, బంకర్లలో ఉం టూ బిక్కుబిక్కుమంటూ భారంగా కాలం గడుపుతున్నారు. బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదని చెబుతున్నారు. మరోవైపు ఆహారం డొక్కలు ఎండిపోతున్నాయి. ప్రాణాలు దక్కాలంటే తిండి కావాలి. ఎలాగోలా సరిహద్దులకు చేరుకుంటే తప్ప తిండి దొరకదు. కానీ, భీకర యుద్ధం సాగుతున్న ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా రిస్క్ చేయొద్దని భారత విదేశాంగ శాఖ సూచించింది. సుమీలో దాదాపు 700 మంది భారత విద్యార్థులు ఉన్నారు. వారిని బయటకు తరలించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. విద్యార్థులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. మంచు కరిగించి, నీటిగా మార్చి తాగుతున్నామని వారు చెప్పారు. ఇంకా ఇక్కడే ఉండలేమని, తమను వెంటనే రక్షించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. నేడు భారత్‌కు 2,200 మంది రాక! ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి ఆదివారం 13 విమానాలు భారత్‌కు రానున్నాయని, వీటిలో 2,200 మంది భారతీయులు స్వదేశానికి చేరుకుంటారని పౌర విమానయాన శాఖ తెలియజేసింది. శనివారం 15 విమానాల్లో 3,000 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో 12 ప్రత్యేక పౌర విమానాలు, 3 భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విమానాలు ఉన్నాయని వెల్లడించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా, స్పైస్‌జెట్ సంస్థలు పౌర విమానాలను పంపిస్తుండగా, ఐఏఎఫ్ సి–7 సైనిక రవాణా విమానాలను ఉక్రెయిన్ పొరుగు దేశాలైన హంగేరి, రొమేనియా, స్లొవేకియా, పోలండ్‌కు పంపిస్తోంది. (చదవండి: పుతిన్ సైన్యం వీళ్లే!) -
మేం కోరిన వివరాలివ్వరా?
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం కింద 2014 నుంచి ఇప్పటి వరకు ఏపీకి ఎన్ని నిధులు ఇచ్చారు? ఇంకెంత ఇవ్వాలి? తదితర పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించినా పట్టించుకోలేదంటూ కేంద్రంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఓ దశలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఆదేశాలిచ్చేందుకు సైతం సిద్ధమైంది. అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) హరినాథ్‌రెడ్డి పలుమార్లు అభ్యర్థించడంతో మెత్తబడిన న్యాయస్థానం.. తదుపరి విచారణకల్లా తాము కోరిన వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయకుంటే, సంబంధిత కార్యదర్శి తమ ముందు హాజరు కావాల్సి ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఉపాధి హామీ పథకం కింద తాము చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్.. ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు రాగా.. కేంద్రం ఓ మెమోను న్యాయమూర్తి ముందు ఉంచింది. అందులో తాము కోరిన వివరాలు లేకపోవడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఏఎస్జీ హరినాథ్‌రెడ్డిని పిలిపించి వివరణ కోరారు. తదుపరి విచారణ కల్లా పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, చివరి అవకాశం ఇవ్వాలని హరినాథ్‌రెడ్డి అభ్యర్థించారు. -
ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45–59 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏయే వ్యాధులు ఆ కేటగిరీలోకి వస్తాయో వెల్లడించింది. వాటిని వైద్యులు ధ్రువీకరించి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. ఆ వ్యాధులు ఏమిటంటే... 1. గుండె వైఫల్యం సమస్యకు గత ఏడాది కాలంలో ఆస్పత్రిలో చేరినవారు. 2. గుండె మార్పిడి లేదా ఒక కవాటం సమస్యకు పరికరాన్ని అమర్చుకున్నవారు. 3. గుండె ఎడమ కవాటం పనిచేయకుండా ఇబ్బంది పడుతున్నవారు. 4. గుండె పని సామర్థ్యం 40 శాతం కంటే తక్కువ ఉన్నవారు లేదా కవాటం సమస్యతో బాధపడుతున్నారు 5. పుట్టుకతో వచ్చిన వివిధ రకాల గుండె సమస్యలతో బాధపడుతున్నవారు. 6. హైపర్ టెన్షన్ (బీపీ), డయాబెటిస్ (షుగర్)తో బాధపడుతూ చికిత్స పొందుతున్నవారు. 7. సీటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ పరీక్షలో పక్షవాతం నిర్ధారణ అయి హైబీపీ లేదా డయాబెటీస్‌కు చికిత్స పొందుతున్నవారు. 8. గుండెపోటుకు గురై ఇప్పటికే బైపాస్ సర్జరీ లేదా స్టంట్ వేయించుకున్నవారు. 9. ఊపిరితిత్తుల్లో రక్తపోటు సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు. 10. పదేళ్లుగా డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు లేదా దాంతోపాటు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు. 11. కిడ్నీ, లివర్ మార్పిడి లాంటి శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు లేదా చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు, స్టెమ్ సెల్ థెరఫీ తీసుకున్నవారు. 12. తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు, ఇప్పటికే డయాలసిస్‌లో ఉన్నవారు. 13. రోగనిరోధక శక్తి తక్కువ కావడం వల్ల వచ్చే జబ్బులతో బాధపడుతున్నవారు. 14. దీర్ఘకాలిక కాలేయ సంబంధ సమస్యతో బాధపడుతున్నవారు. 15. గత రెండేళ్లలో శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు. 16. లింఫోమా, లుకేమియా, మైలోమా లాంటి కేన్సర్లతో బాధపడుతున్నవారు. 17. గతేడాది జూలై తర్వాత కేన్సర్ బారినపడినవారు లేదా ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నవారు. 18. దీర్ఘకాలిక రక్తకణాల సమస్యలతో బాధపడుతున్నవారు, స్టెరాయిడ్స్ మాత్రలు దీర్ఘకాలికంగా వాడేవారు. 19. హెచ్ఐవీతో బాధపడుతున్నవారు. 20. కండరాల బలహీనతతో బాధపడుతున్నవారు, యాసిడ్ దాడికి గురై శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, మూగ–చెవిటి–అంధత్వ సమస్యలతో బాధపడుతున్న దివ్యాంగులు. రాష్ట్రంలో 2,222 ఆస్పత్రుల్లో సీనియర్ సిటిజన్లకు నేటి నుంచి టీకా సాక్షి, అమరావతి: నేటి నుంచి రాష్ట్రంలో అతిపెద్ద కోవిడ్ టీకా ప్రక్రియ జరగనుంది. రెండు మాసాల పాటు 48 రోజులు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రమారమి 60 లక్షల మందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో 60 ఏళ్లు దాటిన వారితో పాటు 45–59 ఏళ్లలోపు వయసుండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ టీకా వేస్తారు. 28 రోజుల వ్యవధిలో తొలిడోసు, రెండో డోసు వేయడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,222 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సోమవారం ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమవుతుంది. దీనికోసం వ్యాక్సినేటర్లను నియమించారు. వ్యాక్సిన్ జిల్లాల వారీగా అవసరాన్ని బట్టి అక్కడకు చేర్చారు. కోవిన్ సాఫ్ట్వేర్ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో పేరు నమోదు చేసుకుని టీకా వేయించుకోవచ్చు. లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లి ఆయా కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకునే అవకాశమూ ఉంది. ఒకే దశలో ఇంత మందికి టీకా వేయడం అతిపెద్ద ప్రక్రియ అని వైద్యులు చెబుతున్నారు. -
వ్యక్తిగత గోప్యతకు గట్టి చర్యలు
న్యూఢిల్లీ: పౌరుల వ్యక్తిగత గోప్యతను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్న భారత్ ప్రభుత్వ వైఖరికి కట్టుబడి ఉన్నట్లు సామాజిక మాధ్యమం వాట్సాప్ తెలిపింది. ఈ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ ఎన్‌ఎన్‌వో గ్రూప్ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్‌తో భారత్‌లోని జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల సమాచారాన్ని గుర్తు తెలియని సంస్థలు తస్కరించాయంటూ వాట్సాప్ చేసిన ప్రకటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం.. ఈ వ్యవహారంతోపాటు, పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకున్న చర్యలపై 4లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్‌ను ఆదేశించింది. దీనిపై వాట్సాప్ ప్రతినిధి స్పందిస్తూ...‘పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను పరిరక్షించాల్సి ఉందన్న భారత ప్రభుత్వ ప్రకటనతో ఏకీభవిస్తున్నాం. సైబర్ దాడులపై గట్టి చర్యలు తీసుకుంటున్నాం. యూజర్ల సమాచార పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’అని తెలిపారు. అయితే, ఇటీవల పలుమార్లు జరిగిన చర్చల సందర్భంగా ఫోన్ హ్యాకింగ్ విషయాన్ని వాట్సాప్ వెల్లడించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలను మూడు నెలల్లోగా వివరించాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హమన్నారు. -
ఎన్నారై భర్తలపై కొరడా
విదేశాల్లో ఉద్యోగం.. లక్షల్లో జీతం... అక్కడ సొంత ఇల్లు, సొంత కారు–ఇలాంటి ఆకర్షణీయమైన కబుర్లు చెప్పి పెళ్లాడి, తీరా వెళ్లాక భార్యను శారీరకంగా, మాన సికంగా కష్టపెడుతున్న ప్రవాస భారతీయ (ఎన్నారై) యువకుల భరతం పట్టేందుకు భారతీయ శిక్షాస్మృతి(సీఆర్పీసీ)లో అవసరమైన నిబంధనలు చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగింది. పెళ్లి చేసుకుని దేశంగాని దేశానికి కొత్తగా వెళ్లిన యువతులు అనుభవిస్తున్న కష్టాల గురించి దశాబ్దాలుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంతక్రితం కలిగిన కుటుంబాలకే ఇలాంటి సమస్యలుండేవి. కానీ 90వ దశకం తర్వాత విదేశాల్లో లక్షలమందికి సాఫ్ట్వేర్ రంగ నిపుణులుగా ఉద్యోగావకాశాలు లభించడం పర్యవసానంగా మధ్య తరగతి ప్రజానీకాన్ని కూడా ఆ సమస్యలు తాకాయి. విదేశీ సంబంధమని మోజు పడి పెళ్లి చేసి పంపితే అక్కడ బాధల్లో కూరుకుపోతున్న కుమార్తెల విషయంలో ఏం చేయాలో తోచక వేలాదిమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. యువతుల్ని చిత్రహింసలపాలు చేయడం అర్ధాంతరంగా వెళ్లగొట్టడం రివాజైంది. మరికొందరు ఘనులు పెళ్లాడి ముచ్చట్లన్నీ తీర్చుకుని, కట్న కానుకలతో విదేశాలకు పోయి అక్కడినుంచి విడాకుల నోటీసులు పంపుతున్నారు. ఎన్నారైలకు ప్రాతినిధ్య ఓటింగ్ హక్కు కల్పించడానికి చాన్నాళ్లనుంచి మన ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. కానీ ఇలాంటి మహిళల ఇబ్బందులపై ఈ స్థాయిలో దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. తాజా నిర్ణయంతో ఆ లోటు సరిదిద్దినట్టవుతుంది. మన విదేశాంగశాఖ వెల్లడించిన గణాంకాలు విస్మయం కలిగిస్తాయి. 2015 జనవరి మొదలుకొని నిరుడు నవంబర్ వరకూ ఆ శాఖకు 3,328 ఫిర్యాదులందాయి. వాటి ఆధారంగా ప్రతి 8 గంటలకూ ఒక ఫిర్యాదు వస్తున్నదని ఆ శాఖ వివరించింది. అంటే రోజుకు మూడు ఫిర్యాదులందుతున్నాయన్నమాట. అయితే బాధిత మహిళల అసలు సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. అన్ని దారులూ మూసుకుపోయాకే ఏ యువతి అయినా ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తుంది. నిందితుల్లో 60 శాతం మంది యువకులని ఆ గణాంకాలు చెబుతున్నాయి. వివిధ రంగాల్లో ఎంతగా పురోగతి సాధించామనుకుంటున్నా మన దేశంలో మహిళలపై వేర్వేరు రూపాల్లో వివక్ష, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. విదేశాలకు పోయే యువకులు తమతోపాటు ఈ కశ్మలాన్నంతటినీ మోసుకు పోతున్నారు. కుటుంబాల్లో యధావిధిగా తమ ఆధిపత్య ధోరణులను ప్రదర్శి స్తున్నారు. ఇక్కడిలాగే మన సంప్రదాయాలు, కట్టుబాట్లు ఆ దేశాల్లో సైతం మన మహిళలకు అవరోధంగా మారుతున్నాయి. వీటిని ధిక్కరించి ఫిర్యాదు చేద్దామనుకున్నా ఎక్కడికెళ్లాలో, ఎలా వెళ్లాలో, ఎవరితో మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితి. కొత్తగా కాపురానికెళ్లినవారికి ఇవన్నీ పెను అవ రోధాలవుతున్నాయి. వీటిని అధిగమించి ఫిర్యాదు చేసినా అక్కడి పోలీస్ అధి కారులకు సమస్యేమిటో అవగాహన కావడం కష్టమవుతోంది. భర్తతో సమానంగా ఉద్యోగం చేసే మహిళ పరిస్థితి ఎంతో కొంత మెరుగు. ఆమె స్వతంత్రంగా జీవనం సాగిస్తూ సమస్యలపై పోరాడగలదు. కానీ హెచ్ 4 వీసాపై అమెరికాలో ఉంటున్న ఆడపిల్లలది దుర్భరస్థితి. వారు తప్పనిసరిగా భర్త సంపాదనపైనే ఆధారపడాలి. ఇక్కడ పెళ్లాడటం, అక్కడికెళ్లాక ఆ దేశాల్లోని విడాకుల చట్టం ప్రకారం వదుల్చు కోవడం ఈమధ్యకాలంలో బాగా పెరిగింది. అక్కడేం చేసినా అడిగే దిక్కుండదు... అత్తింటివారికి తెలియకుండా భారత్ వచ్చి దర్జాగా తిరిగి వెళ్లొచ్చునన్న భరోసా ఎన్నారై యువకుల్లో ఉంటున్నది. సీఆర్పీసీలో మార్పులు తీసుకురావాలన్న తాజా నిర్ణయం వల్ల ఇకపై ఇది అసాధ్యమవుతుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం భార్యలను విడిచిపెట్టిన కేసుల్లో న్యాయస్థానాలు జారీ చేసే సమన్లను వరసగా మూడుసార్లు బేఖాతరు చేసి నట్టయితే అలాంటివారిని ‘పరారీలో ఉన్న వ్యక్తులు’గా పరిగణించి వారి ఆస్తుల్ని, వారి తల్లిదండ్రుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు న్యాయస్థానాలు ఆదే శాలివ్వొచ్చు. దీంతోపాటు విదేశాంగ శాఖ వెబ్సైట్లో పెట్టే సమన్లకు చట్టబద్ధత కల్పించడానికి అనువుగా సీఆర్పీసీ నిబంధనలను సవరించాలని కేంద్ర హోం శాఖను విదేశాంగ శాఖ కోరింది. ఇది కూడా ఆహ్వానించదగ్గ మార్పు. సమన్లు తీసుకోవడానికి నిరాకరించినవారి ఇంటి తలుపుపైనో, గోడపైనో ఆ సమన్లను అతికిస్తే చట్టం దృష్టిలో ఆ సమన్లు వారికి అందినట్టే. ఇప్పుడు వెబ్సైట్లో ఉంచే నోటీసులకు కూడా ఇదే సూత్రం వర్తింపజేయడం మంచి ఆలోచన. అలా మూడుసార్లు వెబ్సైట్లో పెట్టాక నిందితుల ఆస్తుల స్వాధీనం ప్రక్రియ మొదలవుతుంది. చూడటానికిది మొత్తంగా ‘ఎన్నారై వధువుల’ సమస్యేగానీ ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. కేవలం భార్య ద్వారా సంక్రమించే ఆస్తిపై కన్నేసి కొందరు, ఇంట్లో ఉండే వృద్ధ తల్లిదండ్రుల అవసరాలు చూసుకోవడానికి ఇంకొందరు, జీతం ఇవ్వనవసరం లేని పనిమనిషిగా భావించి మరికొందరు యువతుల్ని పెళ్లి చేసుకుంటున్నారు. పంజాబ్ నుంచి అయ్యే పెళ్లిళ్లలో 80 శాతం ఈ బాపతేనని గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, గుజరాత్ రాష్ట్రాలున్నాయి. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం, గృహ హింసకు పాల్పడేవారిని, భార్యల్ని విడిచిపెట్టేవారిని అప్పగించేందుకు విదేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడం, అందుకొక ప్రత్యేక వెబ్సైట్ పెట్టడం వంటి చర్యలు కూడా చాలా అవసరం. సంబంధం కుదుర్చుకోవడానికి ముందు అవతలి వ్యక్తి ఇచ్చిన సమాచారంలోని నిజా నిజాలేమిటో నిర్ధారించుకోవడం అవసరమన్న చైతన్యం అమ్మాయిల తల్లిదండ్రుల్లో కలగజేయడం అన్నిటికన్నా ముఖ్యం. ఇవన్నీ సాకారమైనప్పుడే పెళ్లి చేసి పంపిన మన ఆడపిల్లలు విదేశాల్లో క్షేమంగా, హుందాగా, గౌరవప్రదంగా బతక గలుగుతారు.